ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, August 12, 2011

ఇక ‘బంద్’ చేద్దాం
‘శ్రుతిమించి రాగాన పడుతున్నది..పడనున్నది’ అని ఏదో పాటలో చరణం పాడుకుంటూ ప్రవేశించాడు సన్యాసి.

‘‘ఏదయినా శ్రుతి మించితే ‘వెగటే’ నాయనా! మంచి అయినా, చెడుఅయినా సరే, శ్రుతి మించితే అది చివరకు అందరూ ఛీత్కరించుకునే స్థితికి వస్తుంది’’ అన్నాడు ప్రసాదు.

‘‘ఇప్పుడు ‘బంద్’ల విషయంలో జరుగుతున్నది అదే కదా! నిజానికి ‘బంద్’ అనే హిందీ పదానికి ‘మూసివేయు’ అని అర్ధం. రాజకీయ పార్టీలు ‘బంద్’ పాటించమని పిలుపు ఇవ్వగానే, అందరూ స్వచ్ఛందంగా పాటించేయాలని వారి ఉద్దేశం! ‘నిరసన’కు అదొక పద్ధతి అని రాజకీయపార్టీల భావన. బలవంతంగా ‘బంద్’ చేయించడం చేస్తుంటాయి అవి! ‘బంద్’లవల్ల దైనందిన ప్రజా జీవితానికి భంగం కలుగుతుంది. వర్తక, వ్యాపారాలు చేసుకుని బతికే వారికి, వారు చిల్లరవ్యాపారస్తులైనా, పెద్ద పెద్ద మాల్స్ నిర్వాహకులయినా ‘బంద్’వల్ల, తమ రోజువారీ ఆర్థిక ఆర్జనలను కోల్పోతారు. రవాణా నిలిచిపోవడంవల్ల ప్రయాణీకులు ఇబ్బంది పడతారు’’ అన్నాడు రాంబాబు.

‘‘ ‘సమ్మె’ వేరు, ‘బంద్’ వేరు. ‘సమ్మె’ అనేది అంతర్జాతీయంగా అంగీకరింపబడిన ‘కార్మకుల హక్కు’ కూడాను! తమ పనిగంటలు కుదించాలని 1870లో అమెరికాలో జరిగిన కార్మిక సమ్మెయే ‘మేడే’గా ప్రపంచ కార్మికులందరినీ ఏకత్రితం చేసింది. ‘సమ్మె’ అనేది ప్రణాళికాబద్ధంగా చేయబడేది. ధర్నాలు, సత్యాగ్రహాలు, నిరసన దీక్షలు, ఊరేగింపులు, ర్యాలీలు ఇవన్నీ ఓకే! అవి తమ నిరసనను తెలపడానికీ, తమ న్యాయమైన కోర్కెల సాధనకూ పార్టీలు అవలంబించడంలో తప్పులేదు. కానీ ‘బంద్‌‘ పాటించమని బలవంతం చేయడం, బలవంతంగా దుకాణాలు, విద్యాసంస్థలూ,బస్సులూ మూయించడం, ప్రజాస్వామ్య విధానానికి, పౌరుల ‘స్వతంత్య్ర జీవనానికీ’ విఘాతమైన చర్యలు. ‘బంద్’ ప్రజా జీవితాన్ని భగ్నం చేస్తుంది. అలా భగ్నం చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఎక్కడుంది? ప్రజాక్షేమం చూడవలసినపార్టీలు-సమ్మెలూ, సత్యాగ్రహాలూ, నిరసన దీక్షలూ ఏవయినా చేయమనండి. మన దేశంలో 1946లో జరిగిన నావికాదళం ‘సమ్మె’, ఉత్పాదకతకనుగుణంగా ‘బోనస్’ పొందేలా ఫలితం ఇచ్చిన 1974 నాటి రైల్వేసమ్మె, ప్రయోజనం సిద్ధింప చేసాయా లేదా? కానీ ‘బంద్’లవల్ల-ఇబ్బందులు తప్పవు. లక్ష్యానికి తగిన నిరసన చర్య కాదు సరికదా, ప్రజల ఛీత్కారాన్ని పొందే ప్రమాదం పెరుగుతుంది’’ అన్నాడు సన్యాసి.
‘‘ఎన్నో అత్యవసర స్థితిగతులకు అఘాతమవుతుంది’’ అని కూడా అన్నాడు.

‘‘ కొన్ని గంటలనుండి రెండు మూడు రోజుల వరకు కూడా ‘బంద్’ పాటింపచేస్తూ, జనజీవితాన్ని స్తంభింపచేసిన పరిస్థితులు మన నగరాల్లో ఏర్పడుతున్నాయి. హైకోర్టు కూడా మన రాష్ట్రంలో ఈ మధ్య ఈ ‘బంద్’ల గురించి రాజకీయ పార్టీలకు ‘అది తగని పని’ అని హెచ్చరికలు జారీ చేసింది.’’ అన్నాడు రాంబాబు.

‘‘జనానికి ‘బంద్’ అంటేనే ‘వెగటు’ పుడుతోంది! బలవంతపు మూత వేయించడాలే తప్ప, స్వచ్ఛందంగా, ‘బంద్’ పాటించాలని ఎవరికీ లేదు! ఎందుకంటే-అది నిజానికి హేతుబద్ధమైన నిరసన కాదు. అందువల్ల ప్రజలకు ఇబ్బందే తప్ప, సమస్యకు ‘బంద్’ పరిష్కారం కానే కాదు! ‘బంద్’ అనేది నిరసన చర్యగా రాజకీయ పార్టీలు భావించడమే తప్పు! అనేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలే కానీ, ప్రజాసేవ, సంక్షేమం తమ లక్ష్యం అని కబుర్లు చెప్పే రాజకీయనాయకులు ప్రజా జీవితంలోఅల్లకల్లోలం సృష్టంచే ‘బంద్’లకు పిలువునివ్వడం తగదు’’ అన్నాడుప్రసాదు దృఢంగా.

‘‘మనదేశంలో 18వ శతాబ్దంలోనే 1729 మార్చి 8వతేదీన ఢిల్లీలో మొదటిసారిగా బంద్ జరిగింది. ఆ కాలంలో చెప్పుల దుకాణదారులు తమ షాపులను మూసివేసి, ఇతర వర్తకులుకూడ దుకాణాలు మూసేసేలా చేశారు. కారణం నిజానికి చాలా చిత్రంగానే తోచవచ్చు!‘సుఖ్ కరణ్’ అనే నగలవ్యాపారి-ఎర్రకోటలో రాజును కలుసుకుని, సాయంత్రం ఇంటికి చె ప్పుల బజారు మీదుగా వస్తుండగా, అప్పుడు పండుగ రోజులవడం వల్ల టపాకాయలు కాలుస్తుంటే ఒకటి అతని బట్టలమీద పడి కాల్చిందట! దాంతో అతను మనుషులను పంపి చెప్పుల బజారు వాళ్లను తిన్నగ ఉండమని బెదిరింపు చేశాడట. వార్త రాజుగారికి చేరింది. అతను సుఖకరణ్‌నుండి బంగారు ఆభరణాలు కానుకలుగా పొందడం, చేయించుకోవడం చేస్తుండడంవలన అతనినే సమర్ధించి కోట మనుషులను పంపడంతో, పాదరక్షల దుకాణదారులు ఆగ్రహించి మూడురోజులు తమ దుకాణాలు మూసివేశారు. వారికి మద్దతుగా ఇతర ‘ధాన్యం’ మొదలైన వ్యాపారస్తులు బంద్ చేశారు. చాందినీ చౌక్, జుమా మసీదు ప్రాంతంలో జరిగిన ఈ బంద్‌వల్ల అక్కడ రోటీ,చాయ్ కూడా దొరక్క పేదలు ఇబ్బంది పడుతున్నారని రెండోరోజే ఓ వర్తకుడు తండూరీ రోటీలు చేయించి జనానికి అమ్మడం చేయగా చెప్పుల దుకాణదారులు అతన్ని కొట్టి చంపేంత పనిచేసారు. అతగాడి భార్య, కూతురు కాళ్ల వేళ్లా పడడంతో వదిలేశారు. నిజానికి సుఖ్ కరణ్‌కు రకరకాల చెప్పుల పిచ్చి, ఏటా ఫ్యాషన్ చెప్పులు అనేకం అతను కొంటుండేవాడు. జన జీవనానికి అఘాతం కలిగించిన బంద్ అది అనీ, ఛాట్, దాల్‌సేవ్ వంటివి కూడా లభించక, ఆకలితో అలమటించారనీ ఆ బంద్ గురించి మహమ్మద్ మియన్ అక్బర్ అనే చెప్పులదుకాణదారుడే రాశాడు! అలా బంద్‌లకు మనదేశమే ఆద్యమైంది. ఇవాళ శ్రుతి మించి రాగాన కాదు ‘రోగాన’పడుతోంది’’ అన్నాడు సన్యాసి తనకు తెలిసిన వృత్తాంతం చెబుతూ.

‘‘ఇక జనం పాటించవలసింది ఒకే ఒక బంద్! అదే ‘బంద్’లకు బంద్!!’’ అన్నాడు రాంబాబు లేస్తూ.

10 comments:

Anonymous said...

కడుపు నిండిన వాడి ఆలోచనలకూ - కడుపు మండే వాడి ఆలోచనలకూ మధ్య చాలా తేడా వుంటుంది..
ఎం చేసినా స్పందించని దున్న పోతు ప్రభుత్వాలున్నంతకాలం ఈ బంద్ బాధలు తప్పవు గాక తప్పవు.

Indian Minerva said...

రాజకీయనాయకుల మాటల మత్తులో జోగుతున్న యువత, సామాన్యుల కష్టాలుపట్టని రాజకీయనాయకులు, తిరగబడటానికి అలక్ష్యించే సామాన్యులు, చవట ప్రభుత్వం, చేతగాని ముఖ్యమంత్రి ఫలితమే ఈ బందులు.

రచయిత said...

సోదరా ఒక విజ్ఞప్తి :
కడుపు నిండిన వాడి ఆలోచనలకూ - కడుపు మండే వాడి ఆలోచనలకూ మధ్య చాలా తేడా వుంటుంది..
ఎం చేసినా స్పందించని దున్న పోతు ప్రభుత్వాలున్నంతకాలం ఈ బంద్ బాధలు తప్పవు గాక తప్పవు.

నువ్వు కంప్యూటర్ వుపయోగిస్తున్నావు అంటే నీకు కడుపు నిండే వుండాలి .. అయినా కూడా మండుతున్నదంటే

ఖచ్చితంగా అజీర్ణం తో బాధపడుతున్నావు... నీకు త్వరగా ఉపశమనం కలగాలని ప్రార్ధిస్తున్నాను.

ఇకపోతే కడుపు నిండిన వారు అదే మన రా.నాలు వీరి ఆలోచనలు ఎప్పుడూ ఒకే రకంగా వుంటాయి

తమ కడుపు ఎప్పుడూ నిండుగా వుండాలని ఎందరివో కడుపులని మండిస్తూవుంటారు...

నలగని ఖద్దరు దుస్తులూ, చెదరని జుట్టూ, మెడలో పార్టీ కండువా (ఇది వారి కుంతంత్రాల హారం, ఇది చూసే తెలుసుకోవచ్చు

వారి వుద్దేశ్యాలేమిటో.. నిజానికి ఈ సంస్కృతిని ఒక కురువృద్ధ గా చెప్పు కొనే జాతీయ పార్టీ ప్రారంభించగా మిగిలిన పార్టీలు అందిపుచ్చుకోన్నాయి)

శీతల వాహనాలు, నోటి నిండుగా ద్వేషం , మనసు నిండా విషం, జేబు నిండుగా అక్రమ ధనం, నిండుగా కడుపు నింపుకునే అవకాశం కోసం అర్రులు చాచే మంది మార్బలం...

పేరు అణగారిన వర్గాలది, వూరు మాత్రం వీరిదేనండోయ్, అణిచి వుంచేది కూడా వీరేనండి !!

జెండాలు వేరైనా అజెండా ఒక్కటే .. విభేందించు, విభజించు, దూషించు, ద్వేషించు, రెచ్చగొట్టు, వీలయితే నాల్రోజులు నిరాహార దీక్ష చెయ్యి, లాభం పొందు (బెదిరింపు వసూళ్లు, పార్టీ ఫండు వగైరాలు), నష్టం పంచు (బందులు, విధ్వంసాలు, ఆత్మహత్యలు వగైరాలు)

తెలుగు సినిమా ఫార్ముల ఎలా మారదో వీరి రాజకీయ ఫార్ముల కూడా మారదు. వారు జనరంజకంగా లాభం పొందుతున్నారు, వీరు జనభంజకంగా లాభం పొందుతున్నారు.

ఇహపోతే నీవు, నేను, మన మిగిలిన సోదర సోదరీమణులు .. వారు చూపే సినిమాలు చూస్తూ, వీరి కుతంత్రాలకు బలి అవుతూ ఇలాగే పెరిగి పెద్దవాళ్ళ మవుతాము.. సినిమా కధానాయకులు, రా.నాలు వాళ్ళ బిడ్డలకి వారసత్వామిచ్చినట్లే, మన బిడ్డలకి మనం వారసత్వమిద్దాం... వారికి ఇబ్బంది కలగకుండా !!

Anonymous said...

మనం కంప్యూటర్లు వాడుతున్నాం. మన కడుపులు నిండాయి. కడుపులు మండే వాళ్ళ సంగతి మనకెందుకు? మన స్వార్థం మనం చూసుకొంటూ నోరు మూసుకొందాం. మనమేమయినా నోరు విప్పితే అది రా.నాలు రెచ్చగొడితే మాట్లాడినట్టే. మనకు స్వంత తెలివి ఎక్కడిది? మనకు మాత్రం ఏ బందులు లేకుండా మన పనులు మనం చేసుకొంటూ, పైగా వీలయితే రా.నాలను తిడుతూ, హాయిగా మన కడుపులు నింపుకొంటూ బదుకుదాం.
ఒక కవిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మొత్తానికి సీమాంధ్ర కవి అనిపించారు!

చదువరి said...

"ఒక కవిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మొత్తానికి సీమాంధ్ర కవి అనిపించారు!" - నిజం చెప్పారు -కొందరు తెవాద కవుల్లాగా బూతులు రాయలేదు, కాబట్టి వీరు సీమాంధ్ర కవే!

good said...

సమస్య జటిలతని బట్టి, "బందు" పిలుపుకు తమ నిరసన వ్యక్తం చేసేందుకు స్వచ్చందంగా
చేసేదిగాని, ఆస్తులు, ప్రాణాలు, నష్టపోతామని భయంతో చేసేది "బందు" అనిపించుకోదు.
అటువంటి "బందు"లవల్ల "బందు"ల పైన వెగటు కల్గుతుంది.సాధించదల్చుకున్న సమస్య
మీద పట్టు సడలుతుంది. ఈ విషయం ఉద్యమకారులు గ్రహించటంలేదు.

good said...
This comment has been removed by the author.
రచయిత said...

సోదరా మరో విజ్ఞప్తి: మాటకి మాట, వాదానికి ప్రతి వాదం చేయాలని ఉద్దేశ్యం తో జవాబు వ్రాయటం లేదు. మనసు లో మాట పంచుకుంటున్నాను. నేను కృష్ణాతీరంలో పుట్టినా , కనులు తెరిచింది జనగాం లో. మా తండ్రి గారి ఉద్యోగరీత్యా మన రాష్ట్రం మూడు మూలల్లో జీవించే అదృష్టం కలిగింది. శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం వల్ల రాయలసీమ లో కూడా అడుగుపెట్టే అదృష్టం కలిగింది. మూడు దశాబ్దాల కు పైగా కేవలం తెలంగాణా లో జీవించాను. మేము నివసించిన ప్రతి వూరిలో ఎప్పటికీ ప్రేమించే సన్నిహితులు , ఆప్యాయంగా పలకరించే మిత్రులు ఎందఱో వున్నారు. వాస్తవానికి, మేము ఏ ప్రాంతానికి చెందినవారము, ఏ ప్రాంతంలో నివసిస్తున్నాం, ఏ ప్రాంతానికి వెళ్తున్నాము అనే ఆలోచనలు ఎన్నడూ కలగలేదు. వాతావరణం లో వైవిధ్యం లాగానే భాష ప్రయోగాలలో, ఆదరణ లో వైవిధ్యాన్ని అనుభవించి ఆనందించాము. మా తల్లి తండ్రుల నుంచి నేర్చినది ప్రేమ భావన, శక్తి మేర సాయం చేయటం. ఎవరినీ ప్రాంతం లేక కులం లేక మతం పేరు తో దూరం చేసుకునే ఆలోచనలు ఎన్నడూ లేవు రావు. మా బిడ్డలకు తెలియ చెప్పేది భారత జాతీయత, తెలుగు భాష, సమ భావన.

మా అబ్బాయి, తన బృందం తో కలిసి నృత్య ప్రదర్శనలతో భారత గ్రామీణ నీటి వసతి కల్పన కు సాయం చేసే ఒక స్వచ్చంద సంస్థకు విరాళాలు ఇస్తూ ఉంటాడు. ఏనాడూ ఏ ప్రాంత గ్రామానికి వసతి కలిపించాలి అని ఆలోచించలేదు. లేని భావన రుద్ది తే బాధకలుగుతుంది. తిరిగి నిందిస్తే ఏమి ప్రయోజనం ?

రా.నా ల ప్రయోజనాలకు అనుగుణం గా మనమూ విద్వేష భావాలను పెంపొందిస్తే, వారి అరాచకాలకు అంతు ఎప్పటికీ వుండదు అనేది నా నిశ్చిత అభిప్రాయం. నిజమైన నాయకులు వ్యవస్థ లో లోపాలను సరిదిద్దటానికి, దేశ ఐక్యత కొరకు, సమగ్రత కొరకు, సామరస్యత కొరకు పోరాడుతారు, పోరాడాలని కూడా నా నిశ్చిత అభిప్రాయం. జన్మించిన నాటి నుండి పరిసరాల పట్ల అవగాహన కలిగే వయస్సు వచ్చేనాటికే
విద్వేష వాతావరణం ప్రజ్వరిల్లుతుంటే భావి భారతీయులకు ఎంత చేటు కలుగుతుందో అని తల్లడిల్లుతున్నాను.

ఒకప్పుడు విదేశి హస్తం అని కనిపించని శక్తి కి తప్పు అంట గట్టె వారు. అప్పుడూ ఇప్పుడూ మతం గోల తో సతమతం చేస్తూనే వున్నారు. ఆ మధ్య ఈ మధ్య అంతరాష్ట్ర వివాదాలంటారు. ఇక మిగిలింది ప్రాంతాలే కదా.... అవి కూడా మొదలు పెట్టారు. అప్పటికీ ఇప్పటికీ సమస్యలకు మూలం కొద్ది మంది (ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అని విశ్వసిస్తాను) సంకుచితమూ, స్వార్ధమే అన్నది నిత్య సత్యం. ఒకరి సమస్యకు మరొకరు మూల కారణం అని నిందించి రెచ్చ గొట్టటం పలాయనవాదం గా గుర్తిస్తాను. ప్రస్తుతానికి వారి తో పోరాడాక పోయినా.. కనీస తోడ్పాటు అందించక పోవటమే నేను చేసే సాయం. మనవారితో నాలుగు మంచి మాటలు పంచుకోవటాని నిత్యం ప్రయత్నిస్తూనే వుంటాను.

మనమందరమూ బాగుండాలి, మన వారు బాగుండాలి ..

మాగంటి వంశీ మోహన్ said...

సుధామ గారు

మీర్రాసిన పోష్టు బాగుంది....

చూశారా? రాసిందొకటి, చూసిందొకటి, కామెంటు వేసిందొకటి.

ఎవడికి ఏది కనపడాలనుకుంటే అదే కనపడుతోంది .... ఎవడికి వాడే రాజుగారైపోయి స్వంత ముద్రలు జనాల మీద వేసేస్తున్నాడు .....ఆ రోగం తగ్గేదాక ఈ బందుల గోల బ్లాగులకు కూడ వర్తింపచెయ్యటమో, మనమే సుఖ్ కరణ్ ని వీళ్ళ మీదకు వదలటమో చేస్తే సరిపోతుంది...... అయినా మీ ఐదు దశాబ్దాల జీవితంలో ఇలాటివి బోల్డు చూసి ఉంటారనుకోండి.... చూసి నవ్వుకోటమే మనం చేయగలిగింది.....ఏదేమైనా మీర్రాసిన పోష్టు బాగుంది.....

@ రచయిత సోదరా - మీ "వాదం" బాగుంది కానీ, మీ వాదం అందరికీ ఎక్కాలంటే "చిదంబర" రహస్యం అర్థం కావాలి.... అది మీకర్థమైయ్యుంటే చక్కగా విడమర్చి చెప్పి పురులు చేసి , తిరులు పెట్టి జనాల బుర్రల్లోకి ఎక్కించండి

రచయిత said...

వంశీ గారు,

మీరు అన్నట్లు ఎవడికి వాడు స్వంత అభిప్రాయాలను జనం మీద రుద్దటం జరుగుతున్నది. అది సర్వత్రా ఉన్నదే. వార్తాపత్రిక చూస్తే, సింహ భాగం వార్తల్లో అవినీతి అక్రమాలు, బంద్ లు, విధ్వంసాలు,

వేర్పాటు విషఘోషలు మాత్రమే ఉంటున్నాయి. పత్రికలు కూడా సంచలనాత్మకంగా వుండాలని అటువంటి వార్తల కే పెద్ద పీట వేస్తున్నాయి. అలాగే జీవన నేపధ్య ప్రభావం కొద్దీ రచన ఏ విషయం గురించి అయినా చదివే వారు, వర్తమాన పరిస్థితులకు అన్వయించుకోవటం, వాటికి తమ తమ వ్యావహారిక జ్ఞానం జోడించి కారణాలు, పరిష్కారాలు నిర్ణయించటం కూడా పరిపాటే.

జనులకి తెలియని చిదంబర రహస్యం అనేది ఏమి లేదని నా అభిప్రాయం. వారి వారి ప్రాధాన్యతలను బట్టి కారణాలు ఎత్తి చూపుతూ వుంటారు అనుకుంటాను.

సుధామ గారు, మీ రచన పై వ్యాఖ్య చేయక, పై వ్యాఖ్యల కు స్పందిన్చించినందుకు, క్షమించాలి. సుఖ్ కరణ్ ని వదలక్ఖర లేదు, మొదటి రెండు వ్యాఖ్యలను, వాటికి నా స్పందనలను తొలగించి, ఉచితమైన వ్యాఖ్యలు మాత్రమే ఉంచితే బ్లాగు కి వుపకరిస్తుందేమో. అది మీ ఇష్టం. వ్యాఖ్యలకు స్పందించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను.