ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, October 5, 2013

‘గిలిగింతల గీత’ల్లో.. మిఠాయి పొట్లం..!


గీతా సుబ్బారావు నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. (ఆయన నిక్కర్లేసుకున్నప్పట్నుంచీ అని కాదండి బాబూ! నేను నిక్కర్లేసుకునే రోజుల్నించీ అని) నా పధ్నాలుగో ఏట నేను 1965లో చూసిన ఒక ఏక వ్యక్తి మొట్టమొదటి కార్టూన్ల పుస్తకం - ‘చిత్రజగత్తు’. 

అప్పటికే బాపు కార్టూన్లతో, ఆ రంగం మీద మోజు పెంచేసుకున్న నాకు నవ్వుల పువ్వుల ‘చిత్రజగత్తు’ ఎంతో ఆకట్టుకుంది. తదాదిగా పత్రికల్లో సుబ్బారావుగారి గీతలు,రాతలు నేటికీ చూస్తూనే ఉన్నాను. ఏళ్లు పూళ్లుగా ఇంతలా ఆరంగాన్నిఅంటిపెట్టుకున్నపిళ్ళాసుబ్బారావు(పిళ్ళా వారింటి పేరు) కార్టూన్ల పుస్తకాలు మళ్లా సరికొత్తగా ‘గీతా నవ్వులు’ ‘గీతా జగత్’ పేర అందుకోవడం గొప్ప ఆనంద సంధాయకం. పాఠకుల్ని తన గీతలతో రాతలతో నిరంతర వార్తా స్రవంతి ‘ఛానల్’లా హాస్యంలో ‘ఛానలైజ్’ చేసిన ఘనత సుబ్బారావుగారిదే! 

ఆయనకు భగవద్గీత ఇష్టమట! అంచేత అన్న వీరాజీ సూచనను ‘జీ’ అని అంగీకరించి తన గీతా యాత్రకు ‘గీతా’ పేరెట్టుకుని ఇంటి పేరే గీతా అన్నంతగా, గీతా సుబ్బారావుగా ప్రసిద్ధి చెందారు పిళ్ళా సుబ్బారావ్! దటీజ్ సుబ్బారావ్ !అని పత్రికా ప్రపంచం మాత్రమే కాదు, సినిమా వాళ్ళందరికీ పబ్లిసిటీ కింగ్‌గా కూడా ఆయన ఆత్మీయుడు. పత్రికల్లో కుంచెతో అనుక్షణపు గిలిగింతలు పెట్టే గెంతులే కాక, గీతా ఆర్ట్స్, గీతా పబ్లిసిటీస్, గీతా చిత్ర అంటూ పబ్లిసిటీ రంగంలో తనదైన కళాకాంతులు వెదజల్లిన వాడాయన. బాల సాహిత్య రచయితగానూ అవార్డులందుకున్న మనిషి. 

తెలుగు విశ్వవిద్యాలయం ఆ మధ్య పురస్కారం అందించినప్పుడు సభలో ఆత్మీయులందరికీ తన కార్టూన్ గీతలతో కూడిన నిజమైన ‘మిఠాయి పొట్లం’ అందించిన సౌజన్యమూర్తి. 

తెలుగులో తొలి ప్యాకెట్ డైలీ కార్టూన్లు వేసిన క్రెడిట్ బహుశా పిళ్ళా సుబ్బారావ్ గారికే  దక్కుతుంది. మరో విశేషం దినపత్రికల్లో ఆయన పుంఖాను పుంఖాలుగా పొలిటికల్ కార్టూన్లు వేసినా కార్టూన్లో నాయకుల క్యారికేచర్లు లేకుండానూ, రాజకీయ వ్యవస్థపై చురకలు వేసిన కార్టూనిస్టూ, అందునిమిత్తం ఒడిదుడుకులను మాత్రం ఎదుర్కొన్న కార్టూనిస్టూ, ఈయనే అనాలి.

నూట అరవై పేజీల ‘గీతా నవ్వులు’ ,అన్నే పేజీల ‘గీతా జగత్’ రెండు సంపుటాలలో పేజీకి రెండు చొప్పున ‘గీతా’ కార్టూన్లు రాజకీయాల గురించే కాదు, నేటి వ్యవస్థలోని అనేక అవస్థల గురించి సంధించిన వ్యంగ్యాస్త్రాలు సత్యోన్ముఖంగా అలరిస్తూంటాయి. టీవీ ఛానెల్స్ మీద, వైద్య రంగం మీద వేసిన కార్టూన్లు ప్రత్యేకించి చెప్పుకోవాలి.
‘గీతా’ సుబ్బారావ్ కావడం వల్లనేమో ఈ సంకలనాల్లో ఆయన కార్టూన్ల ‘గీతలు’ తప్ప ఆ కార్టూన్ల వ్యాఖ్యలు ఆయన చేతి రాతలో కనపడవు. అదో వెరైటీ..! వ్యాఖ్యలు మాత్రం చదివితే అర్థమై పోయి హాస్య వ్యంగ్యాలు అందించగలిగేవి జోకులే కానీ, ఆయన ‘గీత’ చూడకుండా, ఆ హాస్యసారస్యం తెలియని నికార్సయిన  కార్టూన్లు ఈ సంపుటాలలో తొంగిచూసి అందరినీ అలరించి ఆనందింపజేస్తాయి.

* ‘అమ్మా! అన్నపూర్ణమ్మా! మీలాంటి తల్లుల దయ వల్ల చిన్న మెస్ నడుపుతున్నా! అన్నం, కూరా కాస్త విడివిడిగా వెయ్యండి!’

* ‘గుండె జబ్బు వచ్చాక సిగరెట్ మానేశా, కాఫీ మానేశా.. ఇంకేం మానెయ్యాలి?’ ‘గుండెపోటు వచ్చే వార్తలు వస్తున్నాయి న్యూస్ పేపర్లు చదవడం మానేసి- వీక్లీలు చదవండి’

*‘అప్పారావు అత్తారింటికి వెళ్లి.. కరువు సహాయనిధి తెచ్చాడు.. కాబోలు’ వంటి ఉదాహరణల్లో ఆయన గీతల, రాతల హాస్యమర్మాలు  అందుకోవాలంటే ఆ నవ్వుల సంపుటాలను మీ సొంతం చేసుకోవాల్సిందే మరి! ‘గీతా’ ‘భగవద్గీతా’ సదా సమాదరణీయాలే!

-సుధామ 

‘గీతా నవ్వులు’
‘గీతా జగత్’
గీతా సుబ్బారావు కార్టూన్లు
విశ్వరత్న ప్రచురణలు
కేరాఫ్ మారుతి,
పోస్ట్ బాక్స్ నెం.1857
ముషీరాబాద్, హైదరాబాద్-20
ఒక్కో పుస్తకం: రూ.100/-

2 comments:

kannaji e said...

గీతా సుబ్బారావ్ గారి గీత స్ట్రోకే వేరు :) ధన్యులము

Meraj Fathima said...

సర్, మీ విష్లేషణలో గీతామృతం ఎంత గొప్పదో తెలుస్తుంది.