ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, September 12, 2019

వ‘సుధా(స)మ’యం

పఠనీయం

సూటిదనపు వ్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ‘సుధా(స)మ’యం
రచన:సుధామ, వెల:రూ.150/-,
కాపీలకు: ఎ.ఉషారాణి, స్నేహిత స్రవంతి, జి.12, సాదత్ టవర్స్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్:9849297958
మరియు నవోదయ బుక్ హౌస్, కాచీగూడ, హైదరాబాద్-27.

==========================================================
ఒక పత్రికలో- అదీ దినపత్రికలో ‘కాలమ్’ నిర్వహించటం అంత తేలికైన వ్యవహారం కాదు. సమయ పరిమితి స్థల పరిమితులను అనుసరిస్తూ, క్లుప్తత, సారళ్యతను తోడుచేసుకుని, శైలి పట్ల జాగరూకత వహిస్తూ, ఆలోచనల్లో వైవిద్యము కనబర్చుతూ, పాఠకులను అనుక్షణం తన వెంట నడిపించుకుంటూ తీసికెళ్లగలగాలి.

కార్టూనిస్టుగా, కవిగా, సమీక్షకుడిగా, రచయితగా, చిత్రకారుడిగా, వక్తగా, ప్రహేళిక (క్విజ్)ల నిర్వాహకుడిగా, కాలమ్నిస్టుగా అల్లంరాజు వెంకటరావు (సుధామ)గారు తెలుగు పాఠకులకు మీదుమిక్కిలి ఆంధ్రభూమి పాఠకులకు చిరపరిచితులు. 4 కవితా సంపుటులు, పలు ప్రశ్నోత్తరమాలికలు, పీఠికలు కాలమ్ వ్యాసాలు రాస్తూ నిత్య నవ్యతను కనబర్చుతూ గళ్ళ నుడికట్టు నిర్వహణ లాంటి పలు ప్రక్రియలతో సుధామ తెలుగు‘వాడి’ నాడి పట్టుకోగలిగారంటే అతిశయోక్తి ఏ మాత్రమూ కాదు. 1978 నుండి 2008 వరకు ఆకాశవాణిలో, వివిధ విభాగాలలో పనిచేసి తన అనుభవాలకు సానపెట్టుకున్న సుధామగారి ‘కాలమ్’ రచనల సంకలనమిది.

ఒక దినపత్రిక వారి కోరిక మేరకు 2018 మే నుండి నలభై వారాలపాటు వీరు నిర్వహించిన ‘వసుధా(స)మయం’ అన్న కాలమ్ వ్యాసాల సంకలనాన్ని, అదే శీర్షికతో ఇప్పుడు పాఠకుల ముందుకు తెచ్చారు సుధామగారు.

సాహిత్య సంస్థలు, వాటి నిర్వహణ, సభలు సమావేశాలు, వీటిలో కనబడుతున్న వింత ధోరణులు, సభల్లోని సన్మాన ప్రహసనం, పత్రికల్లో నిర్వహించబడుతోన్న పోటీ లు తనదైన శైలిలో మెత్తగా, సుతిమెత్తగా చిన్నగా వీపుతడుతూ ఒక్కోచోట వీపు చరుస్తూ వివరించారు.

‘కలందాటుల కవుల మంద’, ‘ఓ గుడ్డముక్కా- దిమ్మచెక్కా’, ‘పూలదండ(గ)లు’, ‘సన్మానశాలు(వా)లు’, ‘(చెడ)తిట్టుకుందాం రా’, ‘మీ(రె)టూ!’ లాంటి శీర్షికలతో పాఠకులలో ఆసక్తి రేకెత్తించటంలో రచయిత కృతకృత్యులయ్యారు.

ఎత్తుగడ, నడక, నర్మగర్భత, సున్నితమైన మందలింపులు- వెరసి సంకలనం ఆదినుండి అంతంవరకు పాఠకుడిని విడవక చదివిస్తా
యి ఈ వ్యాసాలు!

ఇవాళ సాహితీ సాంస్కృతిక సంస్థలకు కొదవలేదు. ‘వాసి’ మృగ్యమైనా, ‘రాశి’ మాత్రం బానే వుంది. (పే.40). సినీగాన కచేరీలు దినమానసికాలుగా సాగిపోతూనే ఉంటాయిట (పే.42). ఇవాళ ప్రతిదీ ఒక ‘రికార్డింగ్’ డాన్సు అయిపోతోంది (పే.48). వడియాలు ఆరబెట్టుకునే గుడ్డముక్కల శాలువాలు (పే.69), ఒక్కరోజులో వాడిపోయే పుష్పగుచ్ఛాల మీద, పూలదండలమీద అంతంత ఖర్చుపెట్టుకోవటంలోని సబబును ప్రశ్నిస్తారు (పే.63) రచయిత.
పూలబదులు కూరగాయల దండలు (కీ.శే. శ్రీ గోరాగారి సూచన) పళ్ళు, మిఠారుూలు, డ్రైఫ్రూట్స్ ఇస్తే బావుంటుందనటం (పే.65)లో ఎంతో నిజాయితీ కనబడుతుంది.

సమకాలిక రచయితలలో సుధామగారికో విశిష్ట స్థానం ఉంది. ‘‘మంచి వైపు మార్పు అంత త్వరగా సమకూడదని తెలుసు. మార్పునకు సదాలోచన ప్రేరేపించకలిగినా అదొక తృప్తి’’ అనే సుధామగారి సుధామ యోక్తుల్ని విందాం. విని అలానే వదిలిపెట్టకుండా ఆలోచిద్దాం. సుధామగారి సుధాపూరితమైన వాక్కుల్ని వంటపట్టించుకుందాం. వైతాళికులెప్పుడూ ముందు నిలిచి మందకు ప్రేరేపణ అవుతారు. వ్యాసాల్లోని ‘ఆర్తి’ని అర్థం చేసుకుని అనుసరించటంలోనే విజ్ఞత వుందని తెలుసుకుందాం. 

ఇంటింటా ఉండాల్సిన సంకలనమిది. నేటి విపరీత ధోరణుల్ని ఎండగడుతున్న ఈ సంకలనం తెలుగువారం అందరం తప్పక చదవాలి.
-కూర చిదంబరం
 8639338675


0 comments: