ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 21, 2014

పొత్తులు- విపత్తులు




‘రాజమండ్రిలో అప్పారావుగారు బస్‌స్టాండ్‌కు వెళ్ళి, ఊరెడదామని టికెట్ కౌంటర్‌లో టికెట్ అడిగారట. లోపలి మనిషి ఆశగా ‘‘కాంగ్రెస్ టికెట్ ఇమ్మంటారా సార్!’’ అని అడిగాడట అని చెప్పి శంకరం భళ్ళున నవ్వాడు. ‘‘సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి- పోటీచేయడానికి అభ్యర్థి దొరకని, దారుణ పరిస్థితిలో పడిందనడానికి ఇంతకంటే వేరే జోకేం కావాలి! దిగ్గజాల్లాంటి కాంగ్రెస్ నాయకులు సీమాంధ్రలో టి.డి.పి వైపుకో, భా.జ.పా వైపుకో మరలిపోతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర వాసులు కాంగ్రెస్ మీద గొంతునిండా కోపంతో వున్నారు మరి’’ అన్నాడు.

‘‘ ‘స్వయంకృతాపరాధం’అని ఊరికే అన్నారా? సీ మాంధ్రలోనే కాదు తెలంగాణలోనూ జనం కాంగ్రెస్‌తో విలీనం గానీ పొత్తుగానీ ఉండదని కె.సి.ఆర్ తెగేసి చెప్పడంతో, ఎవరి పట్టుదలవల్ల రాష్ట్రం సాకారం అయిందని భావిస్తున్నారో- ఆ తె.రా.సకే ‘తెలంగాణ పునర్నిర్మాణం’ అప్పచెప్పడమే సబబు అని, తె.రా.స వైపు మొగ్గుచూపుతున్నట్లే కనబడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఇక్కడ తె.రా.సలోకి వలసలు జరుగుతున్నాయి. టి.డి.పి. నుంచి కూడా తెలంగాణలో తె.రా.స వైపు మొగ్గు చూపుతున్నవారు కనబడుతున్నారు. ఎవరయినా ఎక్కడయినా గెలుపు గుర్రాలని నమ్ముకోవాలనే అనుకుంటారు కదా! ఏది ఏమయినా కాంగ్రెస్ విజయావకాశాలు ఒకవైపు మోడీ గాలులతో, ఇక్కడ రాష్ట్ర విభజన తీరుతెన్నులతో చిక్కుల్లో పడ్డాయి. అమరవీరుల త్యాగఫలంగా, తె.రా.స. ఉద్యమ చైతన్యంవల్లా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితులు వచ్చాయనుకుంటున్నారే గానీ కాంగ్రెస్ దయాధర్మభిక్షగా వచ్చిందని అంగీకరించే స్థితిలో తెలంగాణీ యులు లేరు’’ అన్నాడు సన్యాసి.


‘‘రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతం చేస్తున్న దాఖలాలు కనబరిస్తేనన్నా విజయావకాశాలు మెరుగవుతాయేమోనని కేంద్రం భావిస్తున్నట్లుంది. ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ఉండేటప్పుడు శాంతిభద్రతలకు తీసుకోవలసిన చర్యలు, పోలీసుశాఖలో విభజన చేపట్టవలసిన తీరుతెన్నులు చర్చించడానికి కేంద్ర హోంశాఖ అధికారులు సచివాలయంలో సి.ఎస్.తో కూడా భేటీ అయ్యారు. జూన్ రెండులోగానే విభజన ప్రక్రియ, ఆస్తుల పంపకాలు వ్యవహారం తెమిల్చివేయాలని త్వరపడుతున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశంతోనూ, తెలంగాణలో తె.రా.సతోనూ పొత్తులకు భాజపా రెడీ అంటోంది. తెలుగుదేశం, భాజపాలు సీమాంధ్రలో పొత్తుకు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయంటున్నారు. కనీసం ఇరవై ఎం.ఎల్.ఎ సీట్లు, అయిదు ఎం.పి సీట్లు తమకు ఇచ్చేట్లయితే భాజపా ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశంతో పొత్తుకు సన్నద్ధమైపోనుంది. ఆ సీట్ల సర్దుబాటు గుంజాటనలే ప్రస్తుతం జరుగుతున్నాయి’’ అన్నాడు ప్రసాదు.


‘‘ఏమయినా వాతావరణం వేడెక్కుతోందర్రా! ఎన్నికలతోనే కాదు అప్పుడే వేసవి తీవ్రతా పెరుగుతోంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో నిజంగానే పెద్ద పరీక్షా సమయం అయి కూర్చుంది. అసలు అసెంబ్లీ రద్దేకాలేదనీ అసెంబ్లీ ఎన్నికలు వాయిదావేయాలని ఒహ రు కోర్టులో కేసు వేశారట. ఈ.సి.ని విచారణకు రమ్మనమని హైకోర్టు ఆదేశించిందట కూడాను. రాజకీయంగా జరిగిన నిర్ణయాలకు న్యాయపరంగా నిలుపుదలలు వస్తాయని ఆశపడుతున్నవారూ వున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంకా రాష్ట్రం విడిపోదనే నమ్మమంటున్నాడు. చెవిలో పువ్వులు పెట్టుకోడానికి సిద్ధంగా లేమంటున్నవారెందరో! విభజన జరిగినా రెండు ప్రాంతాలను పునర్నిర్మాణం చేయగల దీక్షా, దక్షతలు తమవేనని చంద్రబాబునాయుడు బల్లగుద్ది చెబుతున్నారు. తన హయాంలోనే హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసనీ అందువల్ల తెలంగాణలో టి.డి.పి ప్రభంజనం వుంటుందనీ, సీమాంధ్ర కొత్త రాజధాని పునర్నిర్మాణం, అభివృద్ధి తమతోనే సాధ్యం అని బాబుగారు ఉద్ఘోషిస్తున్నారు. జనసేన పవన్‌కల్యాణ్ కూడా టి.డి.పితో పొత్తుకు ‘సై’ అనగలరనే సంకేతాలు వెలువడుతున్నాయి. భాజపాతో పొత్తువల్ల తాము నష్టపోతామేమో అన్నంత గెలుపు ఆశలు తెలుగుదేశంలో వున్నాయి కానీ ‘మోడీ’ మంత్రం పొత్తును హత్తుకునే మత్తునే కలిగిస్తోంది. వామపక్షాలు కూడా అనివార్యంగా పొత్తుల దిశగా ఆలోచిస్తున్నాయి చూశారా!’’ అన్నాడు శంకరం.


‘‘మే నెలలో ఎన్నికల తుఫాను సరేగానీ నిజంగానే తుఫానులు వచ్చే అవకాశాలూ వున్నాయని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణ గూర్చి బెంబేలు పడుతోందట. ఎందుకంటే గత చరిత్ర తిరగేస్తే కోసాంధ్రలో మే నెలలో తొమ్మిది పర్యాయాలకన్నా ఎక్కువగా తుఫానులు ముం చెత్తాయని నిదర్శనాలున్నాయి. సీమాంధ్రలో మే ’7న ఎన్నికలు. ఆ తేదీన తుఫాను రాకపోయినా ఫలితాలు వెలువడే 16నాటికయినా తుఫాను రాగలదేమోననే భయం కనబడుతోందట! రెండు తుఫానులు ఒకేసారి ప్రజలు తట్టుకోవడం అంటే ఎంత కష్టం మరి!
ఇప్పటికే జెడ్.పి.టి.సి ఎన్నికలు బరిలోకి వచ్చేశాయి. ఉగాది, శ్రీరామనవమి పండుగ దినాలప్పుడు ఈ ఎన్నికల జాతరేమిటన్న చికాకు వుండనే వుంది. ఈ వేడి, ఈ తుఫాన్, విజయనామ సంవత్సరం అంతరిస్తూ జయవత్సర ఆగమనం... తెలుగు గుండెలను అలిసిపోయేలా ఒత్తిడికి గురిచేసే ప్రమాదం కలుగకుండుగాక! జయ నామ సంవత్సర జయజయ ధ్వానాలు మున్ముందు సంతోష స్వాంతులను చేయుగాక!’’ అంటూ భజం తట్టి లేచాడు ప్రసాదు.



0 comments: