ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, December 6, 2013

తెలుగులకు వెలుగెప్పుడు?








‘‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు తెలుగునాట రాజకీయ దరిద్రానికి కేంద్రం కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తూ వుందనిపిస్తోంది. విభజన విధివిధానాలకోసం సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కన్నా రాయల తెలంగాణ ఏర్పాటుకే కేంద్ర మంత్రుల బృందం సిఫార్సు చేసినట్లుంది. దానికి ఇటు తెలంగాణ నాయకులు గానీ, సీమ నాయకులు గానీ అంగీకరిస్తారన్న విశ్వాసం మటుకు లేదు. సి.డబ్ల్యు.సి.లో తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ పరమైంది. కానీ కేంద్రం దానిని తూ.చా తప్పక అమలుపరచడానికి ఎనె్నన్ని అడ్డంకులున్నాయో క్రమక్రమంగా అవగతమవుతున్నట్లుంది’’ అన్నాడు శంకరం.

‘‘మేము మేమే! మాతో ఎవరూ కలవడానికి లేదు. మేం ఎవరితోనూ కలవం అన్నట్లుగా పది జిల్లాల తెలంగాణకే పట్టుబట్టి కూర్చున్నప్పుడు రాయల తెలంగాణ అంటే ఆంధ్రోళ్ళు పోయి లుంగీలోళ్లు వస్తారు అని, ఆంధ్రావాళ్లు పెట్టుబడిపెట్టి వ్యాపారాలతో దోచుకున్నారు. కానీ రాయలసీమ వాళ్లు పైసా పెట్టుబడి పెట్టకుండానే లుంగీలతో ఇక్కడకు దిగుతారు. సెటిల్‌మెంట్లు దౌర్జన్యాలు చేస్తారు అని రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించడం చూస్తే సీమ అంటే ఫ్యాక్షనిజమూ, బాంబుల సంస్కృతి అన్న భావన ఎంత బలీయంగా వుందో అర్థమవుతోంది. నిజాం పరిపాలనలో రజాకార్ల దురాగతాలు అనుభవించిన వారికి మళ్ళీ అటువంటి పరిస్థితులు ప్రత్యేక తెలంగాణవల్ల రావన్న హామీ కలగాలి కదా! నక్సలిజం, మత ఘర్షణలు రాష్ట్ర విభజనవల్ల పెరిగే అవకాశాలున్నాయన్న భయాలకు రాయల తెలంగాణయే విరుగుడు అని జీ.వో.ఎం. భావించిందేమో తెలీదు కానీ, సీమతో కలిస్తేనే ప్రమాదం అనుకుంటున్నవారున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌గారు మటుకు రెండు జిల్లాలు అదనంగా కలిసినా ‘తెలంగాణ తెలంగాణగానే వుంటుం ది’అని వ్యాఖ్యానించారు. అంటే రాయల తెలంగాణ ప్రతిపాదనల్ని తోసిపుచ్చనట్లే కదా! ‘లుంగీల’వాళ్ళు, ఆంధ్రవాళ్ళు కాదు..అసలు విభజననే లుంగచుట్టి అవతలపారేయండి అంటున్నారు సమైక్యవాదులు. ఇనే్నళ్ళుగా ఎలా వున్నాం? ఇకపై మాత్రం వుండలేక పోవడమేమిటి? సర్దుబాట్లు అక్కర్లేదు. కాలానుగుణంగా అస్తిత్వ విలువలు పెంచుకుంటూ పోవడమే. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఎంత ప్యాకేజీ అయినా ఇవ్వండి. కావలిస్తే మరో యాభై సంవత్సరాలు తెలంగాణ నాయకులనే ముఖ్యమంత్రులుగా చేయండి. కాదనేదెవరు అని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని నిలదీస్తున్నవారున్నారు. ఇంతదాకా లాగాక విభజన కుదరదంటే ఎలా అనే రాయల తెలంగాణ వంటి సరికొత్త ఎత్తుగడలు కాంగ్రెస్ వేస్తోందనిపించడం ఎవరికయినా సహజం’’ అన్నాడు ప్రసాదు.


‘‘శీతాకాల సమావేశాల్లోనే విభజన బిల్లు అని కేంద్ర హోంమంత్రి షిండే పదే పదే ప్రకటిస్తున్నారు గానీ అది ‘ఉండే’లా కనబడ్డం లేదు కానీ అవసరమైతే డిసెంబర్ నెలాఖరునుంచి జనవరి మొదటివారం వరకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసే విషయం పరిశీలిస్తున్నట్లు ప్రధాని కార్యాలయపు అధికార వర్గాలు కూడా తెలుపుతున్నాయిట. రాష్ట్ర విభజన బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్టప్రతికి పంపించడం విధాయకం. రాష్టప్రతి ప్రణబ్ బిల్లు తనవద్దకు వస్తే ఏం చేయాలని ఇప్పటికే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారనీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌తో విభజన గురించి ఆరా తీశారనీ, రాజ్యాంగపరమైన కొన్ని అంశాల మీద లిఖిత పూర్వక వివరణలూ తెప్పించుకున్నారనీ విశ్వసనీయంగా తెలిసిందిట. గవర్నర్ ఇప్పటికే ఒక నోట్‌ను రాష్టప్రతికి పంపించారట. 371(హెచ్) కింద కూడా దాదాపు యూనియన్ టెరిటరీ మాదిరి అధికారాలు గవర్నర్‌కు ఉంటాయి కనుక ఆ బాధ్యతల నిర్వహణ తాను చేయగలనని నరసింహన్ అన్నారట. అసెంబ్లీ సమావేశ పరచడం అంటూ జరిగితే బాహాబాహీ ముష్టాముష్టి గందరగోళాలు జరిగే అవకాశాలున్నాయనీ అలాంటప్పుడు రాష్టప్రతి పాలన విధించడం తప్ప మరోదారి లేదని కూడా ఆయన వివరించారంటున్నారు. రాష్టప్రతి పాలన విధించయినా విభజనను ముందుకు తీసుకువెళ్ళాలని సోనియా అనుకునేట్లయితే పరిస్థితి ఎలా వుంటుందో మరి’’ అన్నాడు రాంబాబు.


‘‘తెలుగువాళ్లు తేరగా దొరికారు సోనియమ్మకు. ఆవిడ నల్లపోచమ్మ కాదు తెల్లపోచమ్మ. ఆవిడకు గుడి కట్టడానికి కూడా సిద్ధమైపోతున్నవారు కొందరుంటే సమాధి కట్టించుకునే సరళిలో వ్యవహరిస్తోందని ఆగ్రహిస్తున్నవారూ వున్నారు. పీవీ నరసింహారావు వంటి తెలంగాణ మేధావే ఆవిడ ఆగ్రహానికి కారణం అనీ అందుకే తెలంగాణను పెద్ద సమస్యగా ఆవిడే పెంచి పెద్ద చేసిందనీ, కె.సి.ఆర్‌ను ఆడిస్తున్నది కూడా ఆవిడేననీ అంటున్నవారున్నారు. జగన్‌కు కళ్ళెం వేయడానికే జగన్‌ను, కె.సి.ఆర్‌ను ఒక రాటకుకట్టే ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనకు మొగ్గుచూపే పరిణామాలు తెచ్చిపెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. ముందు తెలంగాణ అనీ తర్వాత రాయల తెలంగాణ అనీ రేపు సీమాంధ్ర రాయల తెలంగాణ అనీ అనదని ఏమిటి నమ్మకం అని ఆశపడుతున్నవారూ వున్నారు. తెలుగులకు వెలుగు, తెలుగుజాతికి మేలుకలుగు రోజులు ఎప్పటికోమరి’’ అన్నాడు శంకరం భ్రుకుటి ముడుస్తూ.



2 comments:

hari.S.babu said...

అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం.
అందుకే తెలంగాణా వాళ్ళు యేది అడిగితే అది – భద్రాచలం తో సహా – ఇవ్వడం. ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగ పరమయిన వెసులుబాటు. కానీ ఆంగ్రెసుని విభజనకి ఒప్పించటం అనేది – తను పెంచి పోషించిన ఉద్యమం యొక్క బలం ద్వారా కాకుండా – సొంత రాష్ట్రాల్లో దిక్కు లేని కోటరీ ప్రముఖులకి నమ్మకమయిన లోక్ సభ సీట్ల కోసం నీచమయిన లాలూచీ తో జరిగింది. అదే లాలూచీ ఇప్పుడు సీమాంధ్రులు చెయ్యగలిగీతె యేమవుతుంది?

సుధామ said...

నిజమే హరిబాబు గారూ! మీరన్నట్లు లాలూచీలకే ఈ దోబూచులాటంతా!మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు.