ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, November 23, 2013

చతురత, అధ్యయన శీలతల మేలు కలయిక





తెలుగు కథానిక అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తులలో పోరంకి దక్షిణామూర్తిగారు అగ్రశ్రేణిలోని వారే. కథలు, నవలలు రాయడం మటుకే కాదు తెలుగు కథానిక స్వరూప స్వభావాలని గురించి ఉపయుక్తమైన సిద్ధాంత గ్రంథాన్ని వెలయించిన వారాయన. తెలుగులో ప్రాంతీయ జానపద మాండలికాల్లో పూర్తిగా వెలువడిన మూడు తొలి నవలలు వెలుగువెనె్నలా గోదారీ, ముత్యాల పందిరి, రంగవల్లి ఆయన పండించిన కలం పంటలే. తెలుగు అకాడమీలో ఉపసంచాలకునిగా వృత్తి జీవితానికి స్వస్తి పలికినా నిరంతర సాహిత్య ప్రవృత్తితో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘానికి కార్య నిర్వాహక వర్గ సభ్యత్వం మాత్రమే కాక సలహా సంఘం అధ్యక్షత కూడా వహించారు. నిఘంటు నిర్మాణాలు, పద కోశాల తయారీలోనూ ఆయన హస్తవాసి మిన్ననైనది. వ్యక్తిగా ఎంతో సౌజన్యమూర్తి, సహృదయులు అయినా ఏ విషయాన్నయినా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఆయన అలవాటు. అది కచ్చితంగా ఇతరులకు మేలు కూర్చేదే! వారి మేలు కోరేదే!

పత్రికా సంపాదకుల కోరికపై పోరంకివారు నూటికి పైగా పుస్తకాలను సమీక్షించారు. వాటిలో కొన్ని పుస్తక సమీక్షలు ‘ఉన్నది ఉన్నట్టు’ పేర గ్రంథ రూపంలో వెలువరించారు. తమ పిహెచ్‌డి పర్యవేక్షకులు, అరవై ఏళ్లుగా సుపరిచితులు, అశేష విశేషణాలకు అపరిమితులు అయిన డా.సి.నారాయణరెడ్డిగారికి ఈ సమీక్షల సంపుటిని అంకితం ఇవ్వడం ఔచితీమంతంగా ఉంది.

గ్రంథస్తం చేసేందుకుగాను ఈ పుస్తక సమీక్షలను ఎంపిక చేయడంలో వెంట నిలిచి గ్రంథానికి ‘వెనుకమాట’ పేర ముందు మాట సంతరించిన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం పూర్వ సంచాలకులు డా.పి.ఎస్.గోపాలకృష్ణగారు పేర్కొన్నట్టుగా పోరంకిగారు ‘ఏది రాసినా పొందికగా రాయడం ఆయన అలవాటు. ఒక అనవసరమైన వాక్యం గానీ, ఒక అపశబ్దం కానీ లేకుండా రాయడం ఆయన ప్రత్యేకత. విమర్శించే సందర్భాల్లోనూ పరుష పదాలు వాడకపోవడం కూడా ఆయన ప్రత్యేకతే!’’ సమీక్షల్లో సమయానుకూల చతురత చూపుతూనే వట్టి మెచ్చుకోలు కబుర్లు కాక మెత్తగానే అవసరమైన చురకలూ వేయగలిగాడాయన.

నూటరెండు పుస్తకాలపై వివిధ పత్రికలలో ప్రచురితమైన పోరంకివారి సమీక్షల సంపుటి ఇది ‘ఉన్నది ఉన్నట్టు’. వీటిల్లో కథ, నవలా ప్రక్రియా గ్రంథాలే కాక కవితా గ్రంథాలు కూడా ఉండడం విశేషం. అలాగే రెంటాల నాటక సాహిత్యం, గోరాశాస్ర్తీ హాస్య నాటికలు, తెలుగు పర్యాయ పద నిఘంటువు వంటి గ్రంథాలు కూడా పోరంకి వారు సమీక్షించారు.

వేముల పెరుమాళ్లు తెలంగాణ జాతీయాలు గురించి సమీక్షిస్తూ-‘‘
భాషమీదున్న అభిమానంతో, శ్రమకు ఓర్చి లభ్యమైన పద బంధాలను గ్రంథస్తం చేసి తెలుగు జాతీయాల సంపదను కొంతవరకు పెంచినందుకు రచయిత అభినందనీయులు. పలుకు రుచి తెలిసిన వాళ్లు పనిగట్టుకుని చదవవలసిన పుస్తకమిది’’ అని మెచ్చారు. 

ఆర్.ఎ.పద్మనాభరావుగారి షాడోలైన్స్‌కు ఆయనే ‘్ఛయారేఖలు’గా చేసిన తెలుగు అనువాదాన్ని సమీక్షిస్తూ-‘‘కథా వస్తువు పట్ల రచయిత నిష్ఠ చూసి ఉన్నట్టయితే నిడివి సగానికి పైగా తగ్గి వుండేది. కాముక క్రీడల ప్రత్యక్ష వర్ణన, నామ పునశ్చరణ, అశ్లీలమైన తిట్లు, ఈ నవలకు విశిష్టత చేకూర్చిన దాఖలాలు మృగ్యం. అనుభవం పెరిగిన కొద్దీ అమితాభుల రచన మెరుగుపడుతుందని ఆశించడం ఊరట కలిగిస్తుంది’’ అంటారు. ఈ సమీక్ష ఎత్తుగడలోనే ‘పుణ్యం కొద్దీ పుస్తకం’ అనేది తిరుగులేని సత్యం. ఆ పుణ్యంలో అసలు మూల రచయితదీ, కొసరు అనువాదకుడిదీ. పిసరు పాఠకుడిదీ’ అనడంలో పోరంకి వారి సమీక్షా చమత్కార వైదుష్యం ద్యోతకమవుతోంది.

తెలుగు సాహిత్య వికాస చరిత్రలో భారతి మాసపత్రిక స్థానం గణనీయమైంది. భారతిలో 1972 వరకు వెలువడిన రచనల సమాచారం నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారు వ్యాసరచనల సూచిగా వెలువరించారు. ఆ తరువాత భారతి నిలిచిపోయే వరకూ అంటే 1991 మార్చి వరకు వెలువడిన సంచికల్లోని సమాచారం ‘
భారతి సూచి’గా ఎం.శంకరరెడ్డి ప్రధాన సంకలన కర్తగా వెలువడింది. ఆ గ్రంథాన్ని సమీక్షిస్తు పోరంకివారు ఆరోపాల పొరపాట్లను నిశితంగా చెప్పడం విశేషం. ‘ప్రవాసి, కనక్’ అంటూ సంచికలో పేర్కొనడాన్ని ఉదహరిస్తూ ఆరోపం ’బాదు, సికిందరా’ అన్నట్లు సరియైనది కాదు. సుమారు అర్ధశతాబ్దంగా సాహిత్య రంగంలో ప్రమేయమున్న డా.చామర్తి కనకయ్య మారుపేరు ‘కనక్ ప్రవాసి’. ఇటువంటివి మలి ముద్రణ దాకా గుర్తుండాలి’’ అని చైతన్యపరుస్తూ ‘నేలనూతల వారి సూచికలో భారతి సంచికలు కొన్ని చేరలేదని సంకలన కర్తలు అన్నారు. వాటిని గురించి సేకరించి వాటి సమాచారాన్ని కనీసం ఈ సంపుటిలోనైనా ఒక ప్రత్యేక అనుబంధంగా కూర్చివుంటే బాగుండేది’’ అని వినాయకమైన సహేతుక సూచన చేసారు పోరంకి వారు ఈ సమీక్షలో.

సినీ దర్శకులు, కవి, చిత్రకారులు అయిన బి.నరసింగరావుగారి రంగులూ-రాగాలూ పుస్తకం గురించి పేర్కొంటూ ‘మంచి కాయితం మీద ఒకవైపున ముద్రించిన గట్టి అట్టకట్టుతో అందించిన ఈ పుస్తకంలో ‘ధృవాల మధ్య’, ‘అస్థిత్వాన్ని’, ‘ప్రదక్షిణాలు’, ‘స్థబ్ధత’ వంటి మాటల వర్ణక్రమ విషయంలో రచయిత కాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. ప్రశంసలు, పురస్కారాలు అందుకున్న సినిమా దర్శకులుగా పేరు పొందిన నరసింగరావుగారి ప్రతిభకు మచ్చు తునకలను పదిల పరుచుకోదలచిన వారికి ఈ పుస్తకం బాగా ఉపకరిస్తుంది’’ అని పేర్కొన్నారు.

ఇలా సమీక్షల్లో గుణ దోష వివరణం ఏదయినా రచయితకు, పాఠకునికీ కూడా ఉపయుక్తంగా అందించారు పోరంకి వారు. అపారమైన ఆయన అనుభవం, అద్భుతమైన అధ్యయన శీలత, పరిశీలనా దృక్పథం ఇవన్నీ ఈ సమీక్షలకు గొప్ప న్యాయం చేకూర్చాయి. ‘ఉన్నది ఉన్నట్టు’ చెప్పాలంటే పోరంకివారి సమీక్షకు నోచుకోవడం ఆయా గ్రంథ రచయితల, గ్రంథాల అదృష్టమే అనాలి. సమీక్షకులకు కూడా పుస్తక సమీక్షలు ఎలా చేయాలో దిశా నిర్దేశం చేయగల మంచి పుస్తకం ఇది

  • -సుధామ
  •  

ఉన్నది ఉన్నట్టు
(కొన్ని పుస్తక సమీక్షలు)
పోరంకి దక్షిణామూర్తి
వెల: రూ. 150/-
నవోదయ డిస్ట్రిబ్యూటర్స్,
ఆర్య సమాజ్ రోడ్,
హైదరాబాద్ 27
  • Andhrabhoomi: Akshara: 23/11/2013

.

0 comments: