ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 1, 2013

కల‘వరం’




‘స్వప్నసుందరి’ అంటే- బయట అందగత్తెగా వుండి కలలోకి వచ్చేది అనా? లేకపోతే కలలోనే కనబడే అందగత్తె అనా?’’ అడిగాడు సన్యాసి శంకరం ముందు చిటికె వేస్తూ.

‘‘నేనేం నిద్రపోతూ కలగనడం లేదు లేవోయ్! అయినా ఇప్పుడు కలల్లోకి అందగత్తెలు వచ్చే రోజులా? వరదలు, రాజకీయాలు, విభజన సమస్యలు ముప్పిరిగొన్నప్పుడు అందమైన కలలు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కడివి? దీపావళి అంటే ‘వెలుగులు’కాక, నిజంగా ‘అమావాస్య’కదా అనిపించేలానే వుంది. పిల్లలు కాల్చుకునే టపాకాయల మోతల కన్నా పాట్నా బాంబుల మ్రోతలే అన్నట్లుంది స్థితి. ‘కల’కాదు అంతా ‘కలవరమే’ అన్నాడు శంకరం కళ్ళు నులుముకుంటూ.


‘‘కలకు కాళ్ళా చేతులా అన్నారు. ‘కల’కు లాజిక్కు ఏమీ వుండదోయ్! ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా అందమైన కలలు రావచ్చు. సుఖంగా, హాయిగా వున్నామనుకుంటున్నప్పుడు పీడ కలలూ రావచ్చు. కలలన్నీ నిజాలు కావు. అలాగని కలలన్నీ ‘కల్లలూ’కావు. ఎవరు ఏ కల ఎందుకు కంటారో చెప్పలేం!’’ అన్నాడు ప్రసాదు.


‘‘ఇంతకూ నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు’’ అన్నాడు సన్యాసి.


‘స్వప్నసుందరి అన్నది కూడా కర్మధారయమూ కావచ్చు షష్ఠీతత్పురుషమూ కావచ్చు. స్వప్నముయొక్క సుందరి వేరు, స్వప్నమైన సుందరి వేరు. ‘వెధవ సైకిలు’అంటే వెధవ యొక్క సైకిలా? లేక వెధవదైన సైకిలా? అన్నట్లే ఇదీను. కానీ సుందరి స్వప్నగతమైనప్పుడే హృదయాహ్లాది.


‘‘ఏల కాళ్లు నొచ్చె బాలామణికి
రాత్రి ఎవని స్వప్నసీమకేగి వచ్చె’’


అని గాలిబ్ భావాన్ని దాశరథి వ్యక్తీకరించినట్లు కలల సౌకుమార్యం మరీ కమనీయమైనది. తమాషా ఏమిటంటే ‘కల’అంటే నిజంగా అందంగా, వరంగా భావించే దృష్టే ఎక్కువ. ‘కలలు కనండి- సాకారం చేసుకోండి’ అన్నారంటే కల గొప్పదని భావించడమే కదా! ‘మేరె స్వప్నోంకెరాణి కబు ఆయెగ తూ’అని కలలో రాకుమారిని ఇలలో సాక్షాత్కరింపచేసుకోవాలన్న ఆశే కుర్రాళ్ళది. అలాగే అమ్మాయిలకూ ‘కలల రాకుమారుడు’ వుంటాడు. ఆపరేషన్ టేబుల్ మీద ఇడ్లీ సాంబార్ తిన్నట్లు వచ్చే కలలు వేరు. పెళ్ళీడు పిల్లల కలలు వేరు’’అన్నాడు ప్రసాదు.


‘‘మంచి మాటన్నావ్! కానీ చూసావ్! కలలు అందరికీ వస్తాయి. అంధులైనా కలలు కంటారని విన్నాను. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని కొందరి నమ్మిక. ఇలలో సాధించలేనిది కలలో సాధించవచ్చు. గాలిలో ఎగిరిపోతున్నట్లు, ఈత రాకున్నా సముద్రాలు ఈదుతున్నట్లు, పర్వత శిఖరాలు చేరినట్లు, అగాధాల్లోకి దూకినట్లు ఇలా ఎలాంటి కలలయినా రావచ్చు. ‘పగటి కలలు’ మళ్ళీ వేరు. సరే! ‘పీడకలలు’ మాత్రమే వస్తాయిట కొందరికి ‘కలగంటి కలగంటి’అని లేవగానే ఆ కల గురించి చెప్పేలా గుర్తుండిపోయే కలలు కొన్ని. కొన్ని కలలు లేవడంతోనే కరిగి ఫేడౌటైపోతాయి. ఇలలో పిరికివాడయినా కలలో వీరాధివీరుడైపోతాడు. అసలు సాకారం కాని కోరికలు కలలుగా అభివ్యక్తవౌతాయి అనే వాళ్ళూ వున్నారు.’’ అన్నాడు శంకరం.


‘‘కవులూ, రచయితలూ మామూలు వాళ్ళకన్నా ఏమయినా ఎక్కువ కలలు కంటారా ఏమిటి? మన ప్రాచీన కవుల్లో స్వప్నవృత్తాంతాలు రాసిన వాళ్లున్నారు. శ్రీరామచంద్రుడు కలలోకి వచ్చి తనకు అంకితంగా కావ్యరచన చేయమన్నాడంటాడు ఓ కవి. ఫలానా రాజుగారి కలలోకి ఎవరో వచ్చి ఫలానావాళ్ళచేత ఫలానా రచన చేయించమని ఆదేశించాడంటారు ఒకరు. అసంపూర్తిగా వున్న రచనను కలలోకి సరస్వతి వచ్చి పూర్తిచేసినట్లుగా కలగనే వాడొకడు. కలలోకి వచ్చిన సుందరరూపుని బొమ్మగా చిత్రించి లోకంలో అందుకై అనే్వషించేదొకరు. కల అబద్ధం అని ఒకరంటే, ‘కలకానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు’ అంటూ శ్రీశ్రీ పాట రాసాడు’’ అన్నాడు సన్యాసి.


‘‘స్వప్నసుందరుల సంగతేమో కానీ ఇప్పుడు కలల్లోకి సంపదలు వస్తున్నాయి. ఫలానాచోట తవ్వితే ఇంత ధనరాశులుంటాయని ఓ సాధువుగారు ఓ మంత్రివర్యునికి చెబితే ఆయన ఆఘమేఘాల మీద అక్కడ తవ్వకాలకు పురమాయించేసే వైఖరులు రాజకీయ రాంఢోళ్లుగా సాగడం విచిత్రం కాకమరేమిటి? కలల్ని నమ్ముకుని కార్యరంగంలోకి దూకడం కావ్యరచనల్లోకాదు ఇవాళ రాజకీయ కార్యరంగంలోనూ బయల్పడుతోంది. కలల ఆదేశాలు ఏవయినా కార్యాచరణలోకి తేవడం వివేకం అయేట్లయితే రేపు ఏ రాహుల్‌గాంధీ గారికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనవద్దు అని కలవచ్చిందనుకోండి. అది ఆయన తన మాతృమూర్తిగారి చెవిన వేస్తే ఆవిడ మా అబ్బాయి కల కనుక నెరవేరుస్తానని తప్పించేసుకుంటుందేమో అని మన శంకరానికి పీడకల రావచ్చు. అంచేత కలలన్నీ వరాలు కావు.
కలవరాలన్నీ శాపాలు కావు. అసలు ‘స్వప్నశాస్త్రం’ కూడా వుంది. ‘కలలు-వాటి ‘ఫలితాలు’అని శోధించి గ్రంథాలు రాసిన వారున్నారు. కలలన్నీ కల్లలైన సందర్భాలు వున్నాయి. కలలోనివి ఇలలో సాక్షాత్కరించిన సన్నివేశాలూ వున్నాయి. కలకీ నిద్రకీ, కలకీ కళ్ళకే కాదు, కలకీ మనస్సుకీ కలకీ బుద్ధికీ కూడా అనుసంధానం వుంది. దుస్స్వప్నాలు కాక మంచి కలలు నెరవేరి నిజంగా కల ‘వర’మైతే మంచిదే! లోకం మనోజ్ఞంగా భాసిస్తుంది’అంటూ లేచాడు ప్రసాదు.





0 comments: