‘‘హైదరాబాదా మజాకానా మరి! అందరి దృష్టీ ఈ నగరంమీదే మరి! రాష్ట్రంలో మరే నగరమూ లేనట్లు ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా ఈ నగరాభివృద్ధి మీదే అందరూ దృష్టిపెట్టారు. మరి సహజంగానే- ‘రాజధాని’ అన్నాక అన్ని హంగులు పొంగులు వుండాలని అభిలషిస్తారు కదా! అందుకు తగిన అవకాశాలు, వనరులు కూడా ఇక్కడ వున్నాయి మరి. అందుకే అనూహ్యంగా నగరం ఇంతలా విస్తరించింది. అనేక విధాల అభివృద్ధి చెందింది.’’ అన్నాడు ప్రసాదు.
‘‘ఏం అభివృద్ధో ఏం పాడో! నగరం భయంకరంగా మటుకు తయారయింది. క్రిక్కిరిసిన జనాభా, పెరిగిపోయిన అపార్ట్‌మెంట్లు, వాహనాలు అధికమవుతూ కాలు ష్యం, మంచినీళ్ల సమస్యలు, అస్తవ్యస్తమైన రహదారులు, కూలిపోయే పాత బిల్డింగులు- ఒక విధంగా నగర జీవికి ఊపిరాడని పరిస్థితులు సంక్రమిస్తున్నాయి. ప్రశాంతత అనేదే లోపిస్తోంది. ప్రకృతితో సంబంధం కనుమరుగవుతోంది. ఉదయాస్తమయాల సూర్యుడిని చూసేందుకే నగర వాసి నోచుకోవడం లేదు. పచ్చదనం క్రమేపీ తగ్గుతోంది. పిచ్చుకల లాంటి పక్షులే కనబడకుండా పోతున్నాయి. హోటళ్ళలో, సినిమా హాల్స్‌లో, షాపింగ్ మాల్స్‌లో, హాస్పటల్స్‌లో ఎక్కడ చూసినా జనమే’’ అన్నా డు శంకరం మళ్ళీ అదే విసుగుతో.
‘‘నగర జనాభా తొంభై లక్షలు దాటేసిందిట! అన్నిరకాల వాహనాలూ కలిపి, ఇంకో రెండేళ్లలో జనాభాలో సరిగ్గా సగం- అంటే నలభై అయిదు లక్షలకు చేరుతున్నాయట! నగరంలో ‘ట్రాఫిక్ సెన్స్’ లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా వుంది. నిలపకూడని చోటల్లా వాహనాలు నిలపడం, వాహనాలు నిలిపే ప్రదేశాలు ఇతరత్రా ఆక్రమించడం, ఫుట్‌పాత్‌ల దురాక్రమణం, రోడ్లమధ్య గుడులూ, మసీదులు, ఇంత మంది జనాభావున్న నగరానికి ట్రాఫిక్ పోలీసులు కేవలం వేల సంఖ్యలోనే పరిమితమై వుండడం, సరియైన ప్రణాళిక లేకుండా వివిధ శాఖల వారిచే రోడ్లు త్రవ్వివేయబడుతూండడం, నగరానికి మాటిమాటికీ వచ్చే ప్రముఖుల రాకల తాకిడి, మరోవైపు ఊరేగింపులు, ధర్నాలు, ఒక క్రమపద్ధతి లేకుండా సంచరించే మూడువేల అయిదువందలకు పైగా ఆర్.టి.సి. బస్సులూ, డబ్భై అయిదువేలకు పైబడిన ఆటోలూ- నిజంగా పరిస్థితి పిచ్చెక్కేట్లుగానే వుంది మరి!..’’అన్నాడు రాంబాబు సంభాషణలో జోక్యం చేసుకుంటూ.
‘‘బావుందయ్యా! రాష్ట్ర రాజధాని అనేసరికి ఇన్నేళ్లుగా దృష్టి ఇక్కడ అంతలాగా కేంద్రీకృతమైంది మరి! ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించాలన్నా, హైదరాబాద్ విషయమే ఏమవుతుందన్నది అందరికీ ఉత్కంఠ భరితం! అసలు అందుకే గత కొద్దికాలంగా హైదరాబాద్ జనాభా తగ్గించే ధోరణులు అనుకోకుండానే నేటి ప్రభుత్వంలో ‘కిరణజన్య సంహారక్రియ’అన్నట్లుగా తలలెత్తుతున్నట్లు తోస్తోంది!
రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. విభజన పేరుతో నగరాన్ని అంటిపెట్టుకు వుండాలన్న భావనలు చాలామందిలో క్రమేపీ తగ్గుతున్నాయి. తమ తమ స్వస్థలాల మీద మోజుకలుగుతోంది. పాత భవనాలు కూలి మరణించేవారూ, యాక్సిడెంట్స్‌లో మరణించేవారూ, పెరుగుతున్న కొత్త కొత్త వ్యాధులతో బాటు, వున్న రోగాలు పెరిగి నగరం హాస్పటల్స్‌లో మరణిస్తున్నవారూ, బాంబు ప్రేలుళ్ళని కొందరూ, ఉద్యమ స్ఫూర్తి ఆత్మహత్యలుగా కొందరూ బానే కనుమరుగవుతున్నారు.
నగరంలో- యాత్రలు నిర్వహించే ఏజెన్సీలు పెరిగిపోయాయి. వారుకూడా శాయశక్తులా నగరవాసులను ‘చార్‌ధామ్’వంటి యాత్రలకు ఉత్సాహపరచి తీసుకువెళ్ళి, అట్నించటే నేరుగా ‘కైలాసయాత్ర’ చేసేలా, ప్రకృతి బీభత్సాలవంటి వాటి సహకారంతో నిర్విఘ్నంగానే చేస్తున్నారు! ఊళ్లల్లోనే కాదు, నగరంలోనూ వానలకు వరదలు వస్తాయి. జనం వరదలా వస్తూంటే-వరద ఓ చిరుప్రభంజనంగానయినా రాకపోతే ఎలా? అనుకుంటున్నట్లుంది.
ఇలా నగరం- పలు రకాలుగా జనాభా తగ్గించడానికి పాపం! పాటుపడుతూనే వుంది. కానీ ఏం లాభం?’ ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు’అన్న చందాన, నగరంలో ఎంత దారుణ పరిస్థితులు వుంటున్నా, జనం నగరం ‘మోజు’లో- ఆవాస నయగారాలుపోతూనే వున్నారు. హైదరా‘బాధ’అయినా, అ‘భాగ్య’నగరం అంటున్నా, జంటనగరాలు- గంట గంటకూ జనం రాలుతున్నట్లుగా పెరుగుతూనే వున్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్‌లను సమైక్యంగా చేసి, ఇప్పుడు రాష్ట్ర విభజనకూ జంటనగరాలనే సమస్యాత్మకంగా చేసుకున్నది మనమే! నగర జీవనం, వాతావరణం ఎంత ప్రాణాంతకం అవుతున్నా- నగరం అంటే ప్రాణం. ప్రాణంలో ప్రాణంగా భావిస్తున్న జనాభా వుంది. మరి జనాభా తగ్గి మళ్ళీ పాత హైదరాబాద్ కావాలనుకోవడం- గడియారం ముల్లును వెనక్కి తిప్పగలమేగానీ, గడచిపోయిన కాలాన్ని మళ్ళీ వచ్చేలా వెనక్కు తిప్పలేం’’అంటూ సుందరయ్య శంకరం భుజం తట్టి లేచాడు.
3 comments:
ఇది చాలదు అన్నట్లు శివారు గ్రామాలని నగరం లో కలపటానికి మునిసిపాలిటీ విలీనం నాటకం ఆడి నిరుద్యొగ రియల్ ఎస్టేట్ రాబందుల పాలు చేస్తున్నారు అన్ని గ్రామాలనీ.....పంట భూముల విస్తీర్ణం క్రమేపీ తగ్గి అన్నీ కాంక్రీటు -సిమెంటు మయం అవుతున్నాయి!
మీరన్నది కటిక వాస్తవం నరసింహ గారూ!
మీ బ్లాగుని పూదండ తో అనుసంధానించండి.
www.poodanDa.blogspot.com
Post a Comment