ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 26, 2012

యువ భారతి.. చైతన్య దీప్తి!

‘‘ ఇప్పటికీ వాళ్ళకో సొంత బిల్డింగ్ అంటూ లేదు. కార్యవర్గ సమావేశం చేసుకోవడానికి తమదంటూ ఓ శాశ్వత చిరునామా లేదు. కానీ తెలుగు సాహిత్య సంస్థల చరిత్రలో వారి కృషి అనుపమానం. యాభై సంవత్సరాలు తన ఉనికిని ఒక సాహిత్య సంస్థ, అందునా ఎటువంటి గొప్ప ఆర్థిక వనరులూ లేకుండా నిలుపుకోగలగడమే ఒక విశేషం! నూట యనభై అయిదు ప్రచురణలు వెలువరించడం అసాధారణం. వ్యాపార ధోరణులూ, ప్రచారార్భటులూ మిక్కుటమైన ఈరోజుల్లో- ఒకప్పటి ఆ చిత్తశుద్ధితో, నిజాయితీతో, వున్న మానవ వనరులతోనే కొనసాగించగలగడం అభినందనీయం’’ అన్నాడు సుందరయ్య ప్రవేశిస్తూ.

‘‘దేని గురించి నాయనా నీ మనసు దోచిన ఈ ప్రశంసా వాక్యాలు. అన్ని ప్రచురణలు వెలువరించిందీ, అంతలా సాహిత్యానికి కట్టుబడిందీ అయిన సంస్థ ఏమిటో గుర్తుచెయ్యి మరి’’ అన్నాడు శంకరం నవ్వుతూ.

‘‘జంట నగరాల సాహితీ సాంస్కృతిక సంస్థ యువ భారతి ఇవాళ స్వర్ణోత్సవాల ప్రారంభ సభ జరుపుకుంటోంది. 1963 దసరాలలో మొదలైన యువభారతి తొలి రోజుల్లోనే నాటి యువతరాన్ని బాగా ఆకట్టుకుంది. ప్రతినెలా శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో పక్ష సమావేశాలు క్రమం తప్పకుండా ఆ రోజుల్లో నిర్వహించి, యువభారతి సమయపాలనకు పెట్టింది పేరుగా, నాడు పేరు తెచ్చుకుంది. ‘లహరి’ సమావేశాల పేరిట పెద్దఎత్తున ఏటేటా సభలు జరిపి, ప్రాచీన, నవీన సాహిత్యాలు రెండింటికీ పెద్దపీట వేసింది. సరస్వతి బొమ్మ చిహ్నంగా వుండడంలోనూ, ప్రాచీన సాహిత్య పఠనావశ్యకత భాష మీద, భావాభివ్యక్తి మీద పట్టు నిలుపుకోవడానికి ఆవశ్యకమని ఆనాడు ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారిచే ‘కావ్యలహరి’ ఉపన్యాసాలు ఇప్పించడంలోనూ - కొత్తపాతల మేలు కలయికగా ‘సమ్యక్ దృష్టి’తో యువభారతి పురోగమిస్తూ వచ్చింది. ‘‘మారుతున్న విలువలు- రచయితల బాధ్యతలు’’ అంటూ నలభై ఏళ్ల క్రితమే సెమినార్ నిర్వహించి, ‘రచన’గా వెలువరించి, అందరికీ భోజనాలూ వడ్డించిన ‘సాహిత్యస్మృతి’ ఇంకా ఎందరో సాహిత్యాభిమానుల్లో దీపిస్తూనే వుంది. అంతెందుకు! ‘మహతి’ పేర నూటొక్క వ్యాసాలతో 1972లో భారత స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా కేవలం ఏడు రూపాయల ప్రచురణ పూర్వ విరాళంతో తెలుగువారికి యువ భారతి అందించిన ఉద్గ్రంథం నేటికీ ఎందరికో గొప్ప రిఫరెన్స్ గ్రంథం. ‘‘1930 వరకూ తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. 1930ల నుండి తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తున్నాను’’ అన్న శ్రీశ్రీ మాట- మహతిలో ‘‘నేను - నా పాతికేళ్ల సాహిత్యం’’ - యువ భారతి రాయించిన వ్యాసంలోనిదే. ఒకప్రక్క విశ్వనాథ మరోప్రక్క శ్రీశ్రీ ఇద్దరి వ్యాసాలూ మహతిలో ప్రత్యేక అధ్యాయంగా రాణించాయి’’ అన్నాడు సుందరయ్య.

‘‘నిజం! హోరున వానపడుతున్నా ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాంగణంలో ‘లహరి’ సభలను సాహితీప్రియులైన శ్రోతలు గొడుగులు వేసుకుని మరీ విన్న ఘట్టాలున్నాయి. నేడు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చి- రాజకీయ పలుకుబడులతో, ఆర్థిక వనరుల పుష్ఠితో, సాహిత్య సంస్థలుగా రొడ్డకొట్టుడు కార్యక్రమాలతో, ముందు సినీ సంగీత విభావరులుంటే తప్ప సాహిత్య సమావేశానికి పట్టుమని పాతికమంది శ్రోతలయినా వుండడం లేని దశలోనూ గొప్పగా వెలిగిపోతున్న సంస్థలతో పోలిస్తే, ‘యువభారతి’ ఇప్పుడసలు ఉందా అనే సందేహాస్పదులైన వారున్నమాట నిజమే గానీ, నేటికీ సంస్థ తనదైన పరిధిలో కొనసాగుతూనే వుంది. నలభై యాభై ఏళ్లు పైబడినవారు తప్ప సాహిత్య సభల్లో ప్రేక్షకులుగా కానరారన్న మాటను పరాస్తంచేస్తూ, గురజాడ 150వ జయంతిని కళాశాల విద్యార్థుల ప్రాతినిధ్యంతో, ‘యువభారతి’ సెప్టెంబర్‌లో రవీంద్రభారతి సమావేశ మందిరంలో నిర్వహించినప్పుడు, యువతీ యువకులతోనే సభలో నిండైన ప్రేక్షకులతో సమావేశం విజయవంతం కావడం- ముఖ్యఅతిథులుగా వచ్చిన పెద్దలనే ఆశ్చర్యపరిచింది.’’ అన్నాడు రాంబాబు చెమర్చిన కనులతో.

కాలం మారుతున్నప్పుడు అభిరుచులూ మారుతూంటాయి. యువత ఆలోచనాధోరణులు పరివర్తనం చెందుతూంటాయి. ఎన్ని అంతస్థుల భవనానికయినా పునాది ఒకటుంటుంది. పునాదులను కాదని, మూలాలను విస్మరించి, ఎదిగితే- అది సరియైన ఎదుగుదలకాక, ఎప్పుడో కూలిపోవచ్చు! శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఎంత జరిగినా, ఆధునిక యంత్ర సౌకర్యాలు ఎన్ని సమకూడినా, మనిషి మనస్సు, హృదయం, మానవీయ విలువల జీవన వికాసానికి - సాహిత్యమే మూలాధార నాడి. ఎన్ని వాదాలు, ఇజాలు, ఉద్యమాలు చెలరేగినా - అవన్నీ మనుషులను పడగొట్టేవిగా కాక, నిలబెట్టేవిగా, కలిపి కుట్టేవిగా వుండాలి. ‘‘విశ్వశ్రేయః కావ్యమ్’’ అంటూ సాహిత్య పరమ ప్రయోజనం మానవాభ్యుదయమే.. జీవన వికాసమే! సంప్రదాయాన్ని త్రోసిరాజని ఆధునికంగా ఎంత ఎదిగినా, అది పునాదిలేని నిర్మాణమే అవుతుంది. అసలే భాష అంతరించిపోతోందనీ, మన సంస్కృతి పెనుప్రమాదంలో పడిందనీ, అందరిలో ఒక ‘ఆర్తి’ చెలరేగుతోంది. చిరుదీపపు కాంతిలా చిన్న స్థాయిలోనే అస్తిత్వంతో వున్నటువంటి ‘యువభారతి’ వంటి సంస్థను సమాదరించి, గుండెల్లో నిలుపుకోవడం నిజమైన సాహిత్యాభిమానుల వంతు. స్వర్ణోత్సవ యువభారతికి శుభాకాంక్షలందిద్దాం’’ అంటూ కదిలాడు శంకరం. *

1 comments:

Unknown said...

I too was a member of this great Organisation initially formed,groomed/nurtured and developed by Sri Vangapalli Vishwanatham with the active & supportive hand of late Sri IrivenTi Krishna Murthy,but unfortunately it has now become a "VRuddhabharati" thanks to the impairment suffered in the hands of one of the earlier secretaries. But Sri Vishwanatham garu still takes active part in the Organisation & if at all it is still alive in atleast moribund condition, it is due to him.Even today,on every 2nd Saturday of each month,he holds some sort of "Sahitya GoashTi" in the Asok nagar City Central library premises.The Organisation saw its glory to its zenith during his days of 1963 to almost 1980 when annual literary meetings used to be held with a very large attendance in the premises of Andhra Saraswatha Parishat BoggulakunTa.