‘‘మూడొచ్చింది’’ అన్నాడు సన్యాసి ప్రవేశిస్తూ.
‘‘దేనికి నాయనా? 2014 ఎన్నికల సంవత్సరం అని ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’ స్ఫూర్తితో నీకూ బరిలోకి దిగాలనా? ఢిల్లీ అసెంబ్లీ గెలుపుతో ఇప్పుడు ఆమ్‌ఆద్మీ లోక్‌సభ ఎన్నికల మీద దృష్టిపెట్టే మూడ్‌తో దేశవ్యాప్త విస్తరణ అభిలషిస్తోందిట! అమేథీలో రాహుల్‌గాంధీ మీదనే పోటీకి పెట్టాలనే ‘మూడ్’లో వుందిట. అంతేకాదు దమ్ముంటే నరేంద్రమోడీని కూడా అక్కడనుండే పోటీచేయమని సవాలు చేస్తోందిట’’ అన్నాడు ప్రసాదు.
‘‘నేను మూడొచ్చింది అన్నది...’’ అని సన్యాసి ఏదో చెప్పబోతూండగానే శంకరం అందుకున్నాడు.
‘‘సి.ఎం. కిరణ్‌కుమార్‌రెడ్డికి సడన్‌గా శాఖలు మార్పు పై ‘మూడ్’ రావడం గురించేనా ఏమిటి? శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీ్ధర్‌బాబు నుంచి తొలగించి మంత్రి శైలజానాథ్‌కు అప్పగించడం నిజంగా సంచలనమే అయింది. జానారెడ్డి వంటి నేత ఇది ‘వినాశకాలే విపరీతబుద్ధి’వంటిదనీ, శ్రీ్ధర్‌బాబును ఆ శాఖనుంచి తప్పించడం అప్రజాస్వామికమనీ అంటూంటే అదేం పట్టించుకోవలసిన అవసరం లేదని తెరాస అధినేత కె.సి.ఆర్ కొట్టిపారేసారు. సభను ప్రోరోగ్ చేయించాలన్న సి.ఎం. భావనకు వ్యతిరేకంగా శ్రీ్ధర్‌బాబు వ్యవహరించినందువల్లనే అదీకాక సభలో తెలంగాణ బిల్లుపై చర్చ మొదలైందని ప్రకటించడంపై శ్రీ్ధర్‌బాబుపై గుస్సాతోనే సి.ఎం. ఈ పనిచేసి వుంటారనుకుంటున్నారు. పైగా సమైక్యపోరుకు సారథ్యం వహిస్తున్న శైలజానాథ్‌కు శాసనసభా వ్యవహారాలను అప్పగించడం కొందరికి అచ్చెరువును కలిగిస్తే కొందరికి ఆగ్రహం కలిగించింది. మంత్రివర్గం పోర్ట్ఫోలియోలు మార్చే స్వేచ్ఛ ముఖ్యమంత్రిగారికి వుందన్నమాట ఎవరూ కాదనలేనిది. అదీకాక మొన్నటిదాకా తనదగ్గరున్న కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను శ్రీ్ధర్‌బాబుకు అప్పగించడం నిజానికి ఆషామాషీ సంగతేమీ కాదు’’ అన్నాడు శంకరం.
‘‘నేను మూడొచ్చింది అనడం...’’అని సన్యాసి మళ్ళీ ఏదో అనబోతూండగానే మళ్ళీ ప్రసాదు.
‘‘ఓహో! ముఖ్యమంత్రికి మంచి ‘మూడ్’వచ్చి గతంలో తిరుపతి తెలుగు మహాసభల్లో అన్నట్లుగా భాషా, సాంస్కృతిక వ్యవహారాలకు ప్రత్యేకశాఖను ఏర్పాటుచేయడం గురించేనా? నిజంగా ఇది ఆహ్వానించదగిన పరిణామమోయ్! తెలుగుభాషా సాంస్కృతిక వికాస సంవత్సరంగా 2013ను నిర్వహించుకుని కొత్త ఏడాది 2014 ముంగిట అడుగుపెడుతూనే ఈ ప్రకటన చేయడం, తెలుగు వసంతం ‘వట్టి’పోదన్న నమ్మకం కలిగిస్తూ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి వట్టి వసంతకుమార్‌గారికి ఈ శాఖను అప్పగించడం జరిగింది. భాషా ఉద్యమకారుల చిరకాల వాంఛను సాకారం చేసే ‘మూడ్’తో ముఖ్యమంత్రి సాంస్కృతికశాఖను ‘్భషా సాంస్కృతిక శాఖగా’ మారుస్తూ ఉత్తర్వులు జారీచేసి సాధారణ పరిపాలనశాఖకు అనుబంధంగా ఈ శాఖ పనిచేస్తుందనీ అధికార భాషాసంఘం, సాహిత్య అకాడమీ, లలితకళా అకాడమీ, సంగీత నాటక జానపద అకాడమీ, యువజనాభ్యుదయం, రంగస్థలం, తెలుగు అకాడమీ, నైపుణ్య అధ్యయన కేంద్రం, భారతీయ భాషలు, తదితర విభాగాలే కాకుండా రాష్ట్రంలో రెండవ అధికార భాష అయిన ‘ఉర్దూ’ వ్యవహరాలు కూడా ఈ శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావడం అభినందించదగిందే మరి! కొత్త సంవత్సరారంభంలో ఆయనకింత ‘మంచి మూడ్’రావడం బావుంది’’ అన్నాడు.
‘‘ఎవరికయినా దేనికయినా ‘మూడ్’ రావాలోయ్! వస్తేనే మంచి పనులు జరుగుతాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అసాధ్యం అనుకున్న పనులుగా ఢిల్లీలో విద్యుత్ ఛార్జీలు తగ్గించడం, ఇంటింటికీ 700 లీటర్ల మంచినీరు సప్లయ్ చేయడం వెంటనే అమలుపరిచేసారు. అసెంబ్లీలో తన ప్రభుత్వం బల నిరూపణలో నెగ్గుతుందా ఓడిపోతుందా అన్న అనుమానాలు పక్కనబెట్టి 48 గంటల్లోనే ప్రజలకు వీలైనంత మంచి చేయాలని భావించడం నిజంగా గొప్ప ‘మూడ్’! తన అనారోగ్యాన్ని కూడ లెక్కచేయకుండా వాగ్దానం చేసిన మంచికి తాత్సారం చేయకుండా శ్రీకారం చుట్టడం కేవలం ప్రచార పటాటోపం అనలేం. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే వుండటంతో లోక్‌సభపైనే ఆమ్‌ఆద్మీ ఫోకస్ పెడుతూ మూడువందల స్థానాల్లోనూ పోటీచేయాలన్న ‘మూడ్’తో వుండడం కాంగ్రెస్, బి.జె.పిలకు మింగుడు పడకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక రాహుల్ శకం అని కాంగ్రెస్, నరేంద్రమోడీయే భావి దేశాధినేత అని బి.జె.పి. భావిస్తూంటే ఇక్కడ రాష్ట్రంలో తె.రా.స. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఖాయమనీ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయినట్లేనన్న ‘మూడ్’లో వుంది. ‘మూడ్’లవల్ల- ‘మూడేది’ ఎవరికో, ఏమిటో అన్న భావనలు ఇంకొందరివి. మొత్తానికి ఏదో మూడిందన్న భయం సాంప్రదాయక పార్టీలలో పెరుగుతోంది. మరి నువ్వన్నట్లు ‘మూడొచ్చింది’అంటే రాక మానుతుందా’’ అన్నాడు రాంబాబు సన్యాసి భుజం తడుతూ.
‘‘కొత్త సంవత్సరం 2014 ప్రవేశించి ఇవాళ అప్పుడే మూడవరోజు. కేంద్రంలో సంగతో, కేజ్రీవాల్ సంగతో, ఇవాళ రాష్ట్రంలో మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాల గురించో దృష్టిలో పెట్టుకునేనేమీ అనలేదు. అప్పుడే ‘మూడొచ్చింది’ అంటే మూడవ తేదీ వచ్చేసింది అని నేనన్నది అంతే!’’అని చేతులు దులుపుకుంటూ నవ్వుతూ లేచాడు సన్యాసి.
0 comments:
Post a Comment