ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, August 19, 2012

అక్షరాల్లో ఒదిగిన అమ్మపై అభిమానం





ముప్పైఅయిదు కవితల అనుభూతి సుమాల సమాహారం తెన్నేటి సుధాదేవి ‘అమ్మ’ కవితా సంపుటి. పేరుకు తగినట్లే సుధాదేవి అమృత హృదయ.

తన తల్లి అహల్యాదేవి స్మృతికి అంకితంగా వెలువరించిన ఈ సంపుటిలోని కవితలు ఆమె వివిధ కవిసమ్మేళనాలలో, ఆకాశవాణిలో వినిపించినవి.

వంశీ సంస్థ రామరాజుకు సహధర్మచారిణిగా, కార్యకర్తగా, కావ్యకర్తగా కూడా రాజిల్లుతున్న సుధాదేవి కవితల్లో ఎక్కడా భాషాడంబరం, అస్పష్టత, అయోమయం కానరావు. నిసర్గ సుందర పదాలతో ఆమె అభివ్యక్తి వుంటుంది.

అనురాగం ఎక్కడ వర్షిస్తున్నా
ఆత్మీయత ఎప్పుడు దర్శిస్తున్నా
ఆ అంతటా అమ్మా నీవే వుంటావు
నా మదిని సదా కొలువై వుంటావు

అని ‘అమ్మ’ కవితలో కనుల ‘చెమ్మ’తో చెబుతారు.
‘‘భావాలు అనంతం
పదాలు పరిమితం
ఏది చెప్తున్నా అని కాదు
ఎలా చెప్తున్నామో చూడాలి
ఎందుకు చెప్తున్నామో కావాలి’’
అంటారు ‘భావర్ణవం’ అనే కవితలో.

‘‘దారిలోని రాయి తగిలి- బోర్లా పడటం అనుభవం- మరునాడదే రాతిని- తప్పుకు నడవటం- అనుభవ పాఠం’’ అంటారు. ఉగాది గురించీ, ప్రకృతి గురించీ, సమాజ స్థితిగతుల గురించీ రాసిన కవితలే కాక బాల సాహిత్యంగా చెప్పుకోదగిన ‘మాకిష్టం’ లాంటి రచనలూ వున్నాయి.
వెలుగుతున్న దీపం కవిత
మరోదాన్ని వెలిగించేదే కవిత
అక్షరాల గొలుసు కాదు కవిత
పదాల కూర్పు కాదు కవిత


అని తెలిసిన కవయిత్రి స్పందించే హృదయంతో, అంతరంగ ఉద్వేగంతో మరిన్ని రసాత్మక కవితలను
రచించి పాఠక ప్రపంచానికి అందించాలని ఆకాంక్ష .

- సుధామ

అమ్మ (కవితా సంపుటి)
‍ తెన్నేటి సుధాదేవి-
వంశీకల్చరల్ అండ్
ఎడ్యుకేషనల్ ట్రస్ట్,
సత్యసాయిపురం, కుంట్లూరు, హయత్‌నగర్,
రంగారెడ్డి జిల్లా- 501505,

0 comments: