‘‘ఎటువైపు ముఖం చేసివుందో అటే ప్రయాణించేదీ, దిశ మార్చి వచ్చేందుకు ఓ పట్టాన అంగీకరించినది ఏమిటో చెప్పుకో’’ అన్నాడు రాంబాబు.
‘‘ఏమిటి పొడుపుకథా? అయితే దీని ‘విడుపు’- పొద్దుతిరుగుడు పువ్వు అనుకుంటాను’’ అన్నాడు సన్యాసి.
కాదన్నట్లు తల అడ్డంగా ఆడించాడు రాంబాబు.
‘‘మరేమిటి చెప్మా!’’ అని సాలోచనలో పడ్డాడు సన్యాసి.
‘‘నాకు తెలుసుగా?’’ అన్నాడు శంకరం నవ్వుతూ.
‘‘ఏమిటేమిటి?’’ అడిగాడు సన్యాసి.
‘‘నగర ఆటో’’ అన్నాడు శంకరం.
‘‘ఆటోనా?’’ ఆశ్చర్యంగా’’ అన్నాడు సన్యాసి.
‘‘అవును నాయనా! పొద్దస్తమానూ తిరుగుడు దాని ధర్మం అయినా, ప్రయాణీకులకు అవసరం తీర్చేదిగా సేవ చేయాల్సిందే అయినా, ఏ ‘ఆటో’ కూడా కొందరు ఆటోవాలాల ధర్మమా అని, తమ చిత్తం వచ్చిన చోటికి నచ్చితే వెడతాయిగానీ, ఎంత అత్యవసరమన్నా ప్రయాణీకుడికి కావలసిన దిశలో- తాము వెడుతున్న దిశ మార్చుకుని, ఎక్కించుకోవడానికి, ఓ పట్టాన ఒప్పుకోవు. పైగా పేరుకి మీటర్ వుంటుంది కానీ, మీటర్ మీద అదనంగా ఎంత ఇస్తావ్ అనో, మీటర్ మాట మర్చిపోయి టోకు ధర మాట్లాడుకోవడమో అలవాటైపోయింది కానీ, ఆటోడ్రైవర్ల ఇష్టారాజ్యం చెల్లినట్లుగా, నగరవాసి సుఖప్రయాణ అభీష్టం నెరవేరట్లేదు’’ అన్నాడు శంకరం.
‘‘అవును శంకరం! రేపు రంజాన్ రోజునుంచీ మన హైదరాబాద్ నగరంలోనే కాదు, విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో కూడా ఆటోల కనీస చార్జీ పదహారు రూపాయలకు పెంచేసారు. అలాగే కిలోమీటర్‌కు ఎనిమిది రూపాయలుగా వున్న చార్జీ, తొమ్మిది రూపాయలకు పెంపుచేసారు. ఆగస్టు 20నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తాయని రవాణాశాఖ కమీషనర్ ప్రకటించేసారు కూడాను.’’ అన్నాడు రాంబాబు.
‘‘నిత్యావసర ధరలు పెరిగిపోతున్న సమయంలో ఆటోడ్రైవర్ల జీవనం కూడా దృష్టిలో వుంచుకుని, చార్జీలు పెంచడంలో తప్పేంలేదోయ్! కానీ చూసావ్! నగర పౌరుల్లో ఆటోవాలాల మీద రానురాను సదభిప్రాయం బాగా సన్నగిల్లిపోతోంది! దానికి కొందరు ఆటోవాలాల వ్యవహార సరళియే కారణం. మినిమమ్ చార్జీ తిరిగే దూరానికి ఆ చార్జీకి రారు. పాపం ముసలివారూ, జబ్బుచేసినవారూ దగ్గర దూరానికయినా- నడవలేక ఆటోని ఆశ్రయిస్తే, దానిని ఆసరాగాతీసుకుని, కనీసచార్జీ కంటే ఎక్కువ వసూలుచేస్తారు. లేదా అసలు రాను పొమ్మంటారు. అలాగే మరీ దూరాభార ప్రయాణం చేయాల్సివచ్చినా, రావడానికి ఒప్పుకోరు. పైగా తాము ఏవైపు వెడుతున్నారో- ఆ మార్గంలో వెళ్లే ప్రయాణీకులనే ఎక్కించుకుంటారు గానీ, కావలసిన చోటికి రావడానికి ఒప్పుకోరు. మీటర్ చార్జీలు పెంచారుకదా ఇప్పుడు ఆ రేట్స్ ప్రకారం మీటర్‌ను సవరించడానికి రెండు నెలలు గడువు ఇచ్చారా! మీరు చూస్తూండండి... ఆరునెలలు గడచినా పాత మీటర్లు పెట్టుకుని, రేట్‌కార్డు సవరించిన ధరలది అందుబాటులో పెట్టక, తమ ఇష్టానుసారం ప్రయాణికుల నుండి చార్జీలు వసూలుచేసే వైఖరి సాగుతూనే వుంటుంది! ఎవరైనా ఊరునుంచి వచ్చారనుకోండి రైలుస్టేషన్లో, బస్సుస్టాండ్‌లో అందుబాటులో వున్న ఆటో ఎక్కి నగరంలో గమ్యస్థానం వెంటనే చేరుకోగలమన్న భరోసా ఇప్పటికీ లేనేలేదు. రైలో, బస్సో దిగిన ప్రయాణీకులతో అధిక ధరల బేరాలే సాగిస్తారు. నగరానికి కొత్తగా వచ్చాడంటే మరీను! ఆ విషయం పసిగడితే ఇక కొందరు ఆటోవాలాలు ఆ కొత్తవారిని గమ్యస్థానం- మీటర్ మరింత తిరిగేలా చేసి మరీ చేరుస్తూంటారు. వారికి అదో సరదా! దురుసుగా నడిపేవారూ, ఆటో నడుపుతూ మాటలతో నసపెట్టేవారూ తారసపడుతూనే వుంటారు’’ అన్నాడు ప్రసాదు కల్పించుకుంటూ.
‘‘కనీస చార్జీ ఇరవై రూపాయలు చేయలేదనీ, కిలోమీటర్ చార్జీ పది రూపాయలైనా చేయలేదనీ, ఇంకా అసంతృప్తితో వున్న కొన్ని ఆటో సంఘాలున్నాయిట!
ఈ లెక్కన పెంచిన చార్జీల అమలులో వారి వ్యవహార సరళి ఎలా వుంటుందో వేరే చెప్పాలా? అదీకాక ఈ ‘మీటర్లు’వున్నాయి చూసారూ! అవో తమాషా పదార్థాలు. గిర్రున తిరిగిపోయేవి కొన్ని, జంపింగ్‌లు చేసేవి కొన్ని, కుదుపులో అదుపు తప్పేవి కొన్ని. ఒక ఆటోమీటర్‌కూ మరో ఆటోమీటర్‌కూ- ఒకే దూరమయినా,‘ధరల సూచి’ ఏకాభిప్రాయంతో వుండదు! రెండు గడియారాలు ఎప్పుడూ ఒకే టైమ్ చూపించవన్నట్లు, ఆటోమీటర్ల మధ్యా వైరుధ్యమే! తూనికలూ కొలతలశాఖ వారి నిర్ధారిత ప్రమాణాల ప్రకారం కాకుండా, తమ ప్రమాణాల ప్రకారం ఆటోమీటర్స్‌ను ‘సెట్’చేసుకునే విద్య, కొందరు ఆటోడ్రైవర్లకు మహ బాగా తెలుసు! అంచేత కనీసఛార్జీ ఎంతవున్నా, కిలోమీటర్ ఛార్జీ ఎంతవున్నా, తమ లాభాపేక్షకనుగుణంగా- అదనపుఛార్జీ చూపించేలా- ‘ఆటోమీటర్’ను సవరించగల దక్షత వారిది. ఆటోమేటిక్‌గా- ఆటోమీటర్‌ను అదనంగా గెంతువేయించగల వైఖరి కొందరికి వెన్నతో పెట్టిన విద్య’’ అన్నాడు రాంబాబు.
‘‘అప్పుడు దానిని ‘ఆటోమేటిక్’ అనలేం రాంబాబూ! ‘ఆటో మే-ట్రిక్’ అనాలి. అదనపు చార్జీలు వసూలుచేస్తే కఠిన చర్యలు తప్పవనీ, ఎవరయినా ఆటోడ్రైవర్లు అదనపు చార్జీలు డిమాండ్ చేస్తే ఫిర్యాదుచేయవలసిన రవాణాశాఖ అధికారుల ఫోన్ నెంబర్లు ఆటోలోపై స్పష్టంగా ప్రకటించాలనీ, ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఆటోలు విధి నిర్వహణ చేయాలని ఆదేశాలు ‘ఆటోమేటిక్’గా జారీచేసారు గానీ, ‘ఆటోమే‘ట్రిక్’’లు లేకుండా మేటి ఆటోలు- నగరవాసుల అవసరాలు తీర్చగలిగితే నిజంగా లక్కే!’’ అంటూ లేచాడు సన్యాసి.
2 comments:
sudhaama gaaroo!
haidraabaad aaToawaalaapai manchi viSleashaNa. kaani mana vaama paksha rachayitalu maatram, vaarini doapiDeeki gurayyea vaarilaagaanea chitristaaru. vaaru idi chaduvitea kanuvippukaagaladeamoa
-amballa janaardan
ఆటోవాలాలు అందరినీ తప్పుపట్టలేము.వారిలో నిజాయితీపరులూ,సేవా తత్పరులూ వున్నారు.కానీ అధీకశాతం ప్రయాణీకుల అనుభవం ఇది.మీ స్పందనకు కృతజ్ఞతలు జనార్ధన్ గారూ!
Post a Comment