ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, July 8, 2012

నిండైన శైలి, నికార్సయన విలువలు










ఒక ప్రాంతాన్నో, ప్రదేశాన్నో, ఊరునో నేపథ్యంగా తీసుకుని రాసే కథలు అనేకం వచ్చాయి. పలువురు రచయితలు అలాంటి రచనలు చేశారు. నిశాపతి రాసిన ‘నాగులగుట్ట కథలు’ కూడా ఆ ఒరవడిలోనివే. నిశాపతి స్వతహాగా మంచి కవి. పద్యంమీద మంచి పట్టు ఉన్న వాడు. ప్రధానంగా హృదయవాది అని చెప్పాలి. ఈ కథలన్నింటా సుమారు అర్ధ శతాబ్ది క్రితపు గుంటూరు ఒంగోలు జిల్లాల సరిహద్దుల్లో ప్రకాశం జిల్లా వలపర్ల గ్రామపు వాతావరణం, సంఘటనలు, సన్నివేశాలు కొంత కల్పనా రమణీయంగా కానవస్తాయి. ఇంత చిన్న పరిధిలో అనుభూతి రమ్యమైన కథలు చెప్పడం నిజంగా ప్రజ్ఞయే! ‘డొంకచేను’ కథ కథనమంతా కవితాత్మకంగానే సాగుతుంది. నలభై అయిదు కథలూ ఒక రసోచిత అభివ్యక్తితో సాగుతూ పఠితను అలరింపజేస్తాయి.
నిర్మాల్యం, ప్రహేళిక, ఫోటో, కలశం కళకళలాడింది, జననాంతర సౌహృదం, దొరపాప, ఊర పిచ్చుక, బ్రతికి చెడినవాళ్లు వంటి కథలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. కథ ఎత్తుగడ, ముగింపు అనే వాటిని ఇంత చిన్న కథల్లో సైతం వైవిధ్యంగా, ప్రభావోపేతంగా, రసమంచితంగా చెప్పగలగడం నిశాపతి ప్రతిభే! దేవుడి నిర్మల్యాన్ని ఎవరూ తొక్కకుండా ఏ తులసి కోటలోనో వేస్తాం అన్న సందేశాన్ని అలివేలు జీవితానికి అనుసంధానం చేసిన వైఖరి ‘నిర్మాల్యం’ కథలో కదిలిస్తుంది. అనుకున్న పని ఆలస్యం చేయడంవల్ల బ్రతుకు ప్రహేళిక కావడం ‘ప్రహేళిక’ కథలో గమనిస్తాం.
‘బతికి చెడినవాళ్లు’ కథలో లాంటి వదినను ఏ పఠిత మరిచిపోగలడు. నిశాపతిగారిది ఒక ప్రవాహ శైలి. కథనంలోని ఆ శైలిలో నైర్మల్యమే ఉంటుంది.
మధ్యతరగతి మందహాసాలను గ్రామీణ నేపథ్యంలో మానవీయ విలువలు మూలకందంగా అందించిన కథలు ఈ నాగులగుట్ట కథలు. రచయిత నిశాపతి అనబడే ముటుకూరు హనుమద్వేంకట సుబ్బారావు బహుదా అభినందనీయులు.




నాగుల గుట్ట కథలు
నిశాపతి
వెల: రూ.100/-
స్వీట్ స్మైల్ పబ్లికేషన్స్
48/101 హుడా కాంప్లెక్స్, సరూర్‌నగర్,
హైదరాబాద్-35.






2 comments:

RAMPS said...

Where that values in present days

సుధామ said...

it's true ePass!