ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, March 30, 2014

జయ జయ జయ జయహే!

కాలం అఖండంగా సాగిపోతూ ఉంటుంది. 
కానీ తమాషాగా ఒక్కోసారి చరిత్ర పునరావృత్తమవుతూంటుంది. 

అఖండమైన కాలాన్ని అరవై సంవత్సరాలుగా విభజించుకుని ‘గణన’ చేసుకుంటున్నాం. అందువల్ల సంవత్సరాది పేరు అరవై ఏళ్లకోసారి పునరావృతమవుతుంది. తాను పుట్టిన పేరిటి వత్సరాన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే మళ్లీ చూసే అవకాశం ఉంటుంది. నూట ఇరవై ఏళ్లు ఎవరు బ్రతకగలరు? అరవై ఏళ్లు జీవించి - పుట్టిన ఏడాది సంవత్సరం పేరును కలిగిన ఏడాది మళ్లీ రావడమే - షష్టిపూర్తి వేడుక! సంవత్సరం పేరు పునరావృతం కావడం కాక అప్పటి కాల పరిస్థితుల వంటివే మళ్లీ రావడం అంటే చరిత్ర పునరావృతం కావడమే కదా! 

మునుపు 1954లో ‘జయ’ నామ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు 2014లో మళ్లీ ‘జయ ఉగాది’ ప్రవేశించింది. 1953 శ్రీవిజయ నామ సంవత్సరంలో - మద్రాసు నుండి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, 1954లో విశాలాంధ్ర దిశగా పురోగమనం సాగితే- ఇప్పుడు శ్రీవిజయలో ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజింపబడి, ‘జయ’లో ఒకే జాతి - రెండు రాష్ట్రాల దిశగా చరిత్ర నడుస్తోంది. ‘విభజన - పురోగతి’ అప్పుడూ ఇప్పుడూ కాలచరిత్రలోని అంశాలే! 

‘ఆంధ్రపత్రిక’లో అప్పట్లో దాసు వామనరావుగారు ‘కాలక్షేపం’ అనే శీర్షికను నిర్వహించేవారు. ఆ వారపత్రిక 7.4.1954 జయ ఉగాది సంచికలో తన ‘కాలక్షేపం’ రచన మధ్యలో ఇలా రాశారు- 

‘ప్రజా స్వాతంత్య్రం అంటే ఇదేనంటారా? ధర్మమార్గం చూపించగల పీఠం ఏది? అన్ని పక్షాల వారూ దేశక్షేమం, లోక క్షేమం కోరేవారే. అన్ని పక్షులూ అంతరిక్షంలో ఎగిరి, స్వేచ్ఛ విహార నినాదాలు చేస్తాయి. ఈ సర్వపక్ష సమావేశంలో ధర్మ నిర్ణయం చేయడం ఎట్లా? ఏదో ఒక తీర్మానం ప్రతిపాదించడం, అనుకూలురెందరో, ప్రతికూలురెందరో కాకులను లెక్కపెట్టినట్లుగా లెక్కపెట్టడం, కాకులెక్కువైతే కాకుల మాట నెగ్గుతుంది. కోయిల లెక్కువైతే కోయిలల మాట నెగ్గుతుంది. ఒక్కొక్కప్పుడు కాకి గూట్లో పెరిగిన కోకిల, కాకి అండను చేరి పైకి వచ్చిన కోకిల, సమయం వచ్చేసరికి ‘నీ కూత వేరు, నా కూత వేరు’ అంటుంది. నీకు మద్యనిషేధం కావాలంటే నాకు మద్యనిషేధం అక్కరలేదు అని కూత కూస్తుంది. 

‘పీత్వా పీత్వా పునః పీత్వా’ అంటుంది ఒక పక్షి. ‘న సురామ్ పిబేత్’ (మద్యము సేవించవద్దు) అంటుంది ఇంకో పక్షి. వసంతకాలం సంప్రాప్తించినపుడు ‘కాకః కాకః పికః పికః’ కాకికాకే కోయిల కోయిలే అవుతుంది. 

ఇటువంటిది  పరీక్షా సమయం. ఇది ఎవరికి పరీక్షా సమయం? కాకితత్వం తెలియడానికిన్నీ, కోయిల తత్వం తెలియడానికిన్నీ పరీక్షా సమయం కాదు. అసలు వసంతకాల ప్రభావాన్ని పరీక్షించడానికే ఇది పరీక్షా సమయం. వ్యక్తి స్వాతంత్య్రం యొక్క సత్తాను, ప్రజా స్వాతంత్య్ర విధానం యొక్క సత్తాను పరీక్షించే సమయం ఇది’ - 

అరవై ఏళ్ల క్రితం ‘జయ’లో రాసిన మాటలు ఈ జయ ఉగాది వేళ - అందునా దేశంలో 16వ లోక్‌సభ ఎన్నికల వేళ, మన రాష్ట్ర విభజన నేపథ్య వేళ, గమనించినప్పుడు ఎంత సమయోచితంగా ఇప్పుడూ భాసిస్తున్నాయో అర్థం అవుతుంది. అరవై ఏళ్ల జయ ఉగాదుల మధ్య సారూప్యం ఇది. అరవై ఏళ్ల క్రితం జయ నామ సంవత్సరానికి రాజు, అధిపతి సూర్యుడు. కానీ ఈ జయ ఉగాదికి - రాజు, మంత్రి కూడా చంద్రుడే. అందువల్ల ఈ ఏటి పంచాంగకర్తలు ప్రజలకు సుఖాలు శుభాలు కూరుస్తామని చెప్పే డాంబికాల పలుకుల నాయకులెక్కువనీ, కేంద్ర, రాష్ట్ర అధికార పీఠంపై కొత్త ముఖాలు ఎన్నో వెలుగు చూస్తాయనీ చెబుతున్నారు. కోయిల కూతలకు, చిలుక పలుకులకు, మామిడి చిగుళ్లకు ఆనందిస్తే చాలదు. వాటిని కళకళలాడించే శక్తి తేజాన్ని భజించి, ధరించగలిగాలి. వెన్నెలలు ఎంతగా కాసినా చంద్రుడు కూడా అసలుకి సూర్యతేజంతోనే ప్రకాశిస్తాడనీ, అందుకే ప్రత్యక్ష భగవానుడే సూర్యుడనీ చెప్పుకుంటాం! చాంద్రమానం’ లెక్కించినా, కాలగణనానికి సూర్యుడే ప్రధానం. పన్నెoడు రాశులలో సూర్యుడు వరుసగా ప్రవేశించడమే కాలగమనానికి నిదర్శనంగా గ్రహిస్తూంటాం. 

‘యుగాది’ అనే సంస్కృత పదానికి వికృతి ఉగాది అనీ, వేదాలలో కాలనిర్ణయ ప్రస్తావనలో-సృష్టి జరిగిన తొలిరోజు ఉగాది అనీ చెప్పారు. యుగపు చైత్రమాసంలో, తొలిరోజు పాడ్యమి తిథి నాడు, మొదటి వారమైన ఆదివారంనాడు, మొదటి నక్షత్రం అశ్విని ఉన్న సమయంలో, బ్రహ్మ సృష్టిని ప్రారంభించినట్లు వేదాలు పేర్కొంటున్నాయి. కాల గణనం అక్కడే మొదలు. 

చతుర్వర్గ చింతామణి వ్రత ఖండంలో ఇలా ఉంది- 

చైత్ర మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రద మేహాని 
శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి 
ప్రవర్తయా మాస తథాకాలస్య గణనామపిః 
గ్రహన్నగా నృతూన్మాసా న్వత్సరాధివాన్ 

అంటే చైత్రమాస శుక్ల పక్షం మొదటి రోజు సూర్యోదయ వేళ బ్రహ్మదేవుడు ఈ జగత్తును సమగ్రంగా సృష్టించడంతోబాటు, కాలగమనంలో గ్రహ, నక్షత్ర, ఋతు మాస వర్ష వారాధిపులను ప్రవర్తింపజేశాడు. సృష్ట్యాది దినం కనుకనే ‘యుగాది’ అయి, అదే ‘ఉగాది’గా వ్యవహారంలోకి వచ్చింది. అనంతమైన కాలం అలా యుగం, సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, వారం, దినం అనే విభాగాలతో ఏర్పడింది. ఈ జయనామ సంవత్సరం 2014 నాటికి ఈ సృష్టి జరిగి 195,58,25,114 సంవత్సరాలైందని ఒక సిద్ధాంతం. కలియుగ సంవత్సరాలు 4,32,004. ప్రపంచ దేశాలన్నింటికన్నా ముందుగా మన భారతీయులే కాల నిర్ణయం చేసి ‘పంచాంగం’ రూపంలో మనకు అందించారు. తిథి, వార, పక్షత్ర, యోగ, కరణాలు చూడడం మన సంప్రదాయం. వీటి బలాబలాలను ఋషులు ఏనాడో నిర్ణయించి, శాస్త్రాలు వ్రాశారు. ఎంతకాలం క్రితం అంటే మాత్రం చెప్పలేం. అయిదువేల పైచిలుకు పూర్వం వాడయిన ‘వ్యాసుడే’ తనకంటే పూర్వం వున్న ఋషులను వేల మందిని చెప్పాడు. పంచాంగకర్తలు సంవత్సరాలను ఆధారంగా తీసుకుని కాక సృష్ట్యాదిగా గతించిన దినములను తీసుకుని గణిస్తారట! లెక్కలలో అంకెలు చాలా దీర్ఘం అవుతాయని, కలియుగాదిగా కాక, ‘విక్రమార్క’ శకాదిగాను, ‘శాలివాహన’ శకాదిగాను లెక్కిస్తారు. అందువల్ల కాల గణనంలో తప్పులు రావనీ, మోసం జరగదనీ చెబుతారు. 

పండ్రెండు రాశులలో సూర్యుడు ప్రవేశించడం ద్వారా కాలగణన అనేది జరుగుతుందనీ, ఈ రాశులకు  మొట్టమొదట పేర్లు పెట్టింది ఈజిప్టు వారనీ ఒక భావన ఉంది. ఈజిప్టు వాళ్ళకు ఆ రోజుల్లో పూజనీయమైంది ఎద్దు. వారు పశుపతిగా కొలిచేవారు. అందువల్ల ఒక రాశిని ‘వృషభ’ రాశి అన్నారు. ఏప్రిల్ నెలలో మేకలు ఈనుతాయని ‘మేష’రాశి అన్నారట. మే నెలలో మేకలు రెండేసి పిల్లలను ఈనుతాయని ‘మిథున’ రాశిలో సూర్యుడు ప్రవేశించాడన్నారట. సూర్యుడు తన వేడిమిని కొద్దిగా తిరోగమనం చేసి ఎండ్రకాయ లాగా వెనక్కి నడిచినపుడు ‘కర్కాటక’ రాశి అనీ, అత్యధిక తేజస్సు ‘సింహ’ రాశి అనీ, పంట కోతల కాలాన్ని ‘కన్యారాశి’ ప్రవేశమనీ, దివారాత్రాలు సరిసమానంగా ఉన్న కాలం ‘తులారాశి’ అనీ, రోగాలు ప్రబలమైనపుడు ‘వృశ్చిక’ రాశి అనీ, వేటకు అనుకూల కాలాన్ని ‘నూరాశి’ అనీ, మొసళ్లు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టే కాలాన్ని ‘మకర’ రాశి అనీ, కుంభవృష్టి దినాలు ‘కుంభరాశి’ అనీ, చేపలు సమృద్ధిగా లభించే కాలం ‘మీన రాశి’ అనీ నామకరణం చేసి ఉంటారని ఈజిప్షియన్ల గురించి వ్యాఖ్యానించిన వారున్నారు. 

సరే! విజయ నిర్గమనం, జయ ఆగమనం ఇవాళ దేశంలో ఎన్నికల కాలం అయి, పెను మార్పుల గురించి ఆలోచనలను రేకెత్తిస్తూ వుంది. అరవై ఏళ్ల క్రితం విజయలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, జయలో ఆంధ్ర జాతి దిగ్విజయ సాధనకు ఉపక్రమించగా, ఇప్పుడు ఆంధ్ర జాతి జయలో రెండు రాష్ట్రాలు- ఒకే జాతిగా పురోగమనానికి ఉపక్రమించవలసి వస్తోంది! వర్తమానం కొంత నిరుత్సాహంగా వున్నా - భవిష్యత్తు ఉజ్వలం కాగలదన్న ఆశ ఉగాది కొత్త చిగురులు తొడిగిస్తోంది. 

విజయాబ్దము చనగా, భా 
వి జయాప్తిని నాంధ్రతతికి వెలయింపగా శ్రీ 
విజయాబ్దము వచ్చెను శ్రీ 
విజయాప్తు ముకుందు కరుణ విస్తరిలగాన్ 

జయ సంవత్సర మిదె ‘జయ’ 
‘జయ’ యనుచున్ వచ్చె విజయ చనగా నిర్వ్యా 
జ యపర్ణ్ధాశ్వరు కృప 
జయ మొసగు మనకు సంతసమున సతంబున్ 

అని అరవై ఏళ్ల క్రితం శ్రీ శ్రీరామ వీరబ్రహ్మ కవి ఆంధ్ర వారపత్రికలో.. శుభాశంస పలుకగా, 4.4.1954 ఆదివారం విశాలాంధ్ర దినపత్రికలో ‘శశవిషాణం’ పేరిట కవి (కీ.శే.గజ్జెల మల్లారెడ్డిగారి కలం పేరు కావచ్చు!) ఒక హాస్య ప్రస్తావనం రాద్ధాంత శిరోమణిగా వెలువరించారు. వర్తమానానికి అద్దం పట్టేలా వున్న దానిని కొంత ఇక్కడ పునరావృతం చేయడం సబబేనేమో! 

‘ఈ సంవత్సరం పేరు జయ నామ సంవత్సరం. కాంగ్రేసు మంత్రుల సిఫారసు మేరకు గౌరవనీయులైన బ్రహ్మగారు సదరు సంవత్సరానికి ‘యజమాన’ సంవత్సరమని నామకరణం చేసి ,స్వకీయ ముద్రారాక్షస శాలయందు అచ్చుకివ్వగా, అక్షరాలు తారుమారై ‘జయ నామ’ సంవత్సరమైనట్లు శాస్త్ర వాక్యం’ 

అధ: పంచాంగ ప్రశంస 

పొలిటీషియనుల కన్న 
పంచాంగాలే నయం 
కొత్తది వస్తే పాతది 
గద్దె దిగుట, నిశ్చయం 

సంవత్సర నిరూపణ 

వయసుడిగిన విజయాబ్దం 
హయామింక అంతరించె 
నవయుగాది యువ యుగాది 
జయ వత్సర మవతరించె 

రాజపూజ్యావమానాలు 

రంగులు మార్చేవారికి 
రాజపూజ్యమైదు పాళ్ళు  
ప్రజల్లోకి వేంచేస్తే 
పది బిందెల పేడనీళ్లు 

ఆదాయ వ్యయాలు 

ప్రయాణాలవల్ల మంత్రి 
కయిదురెట్లు ఆదాయం 
మారుమూల రాజధాని 
అందరికీ అధిక వ్యయం 

వృద్ధిక్షయాలు 

మంత్రులకీ ఏడాదిలో 
ఉద్రేకం ఏడుపాళ్లు 
ఉడుకుమోతుతనం వల్ల 
ఉక్రోషం మూడు పాళ్లు 
నిజాయితీ రెండు పాళ్లు 
తన్నాశం ఐదుపాళ్లు 
ఐకమత్య మర్ధపాలు 
ఆర్భాటం నూరుపాళ్లు 

కొత్త సంవత్సరాన్ని గురించి శశవిషాణం గారి అభిప్రాయం. నిరుడు విజయ ఈ ఏడు జయ 

నిరుడు కంపోజైన దాన్నే
తిరిగి ఈ యేడచ్చు వేస్తే 
అరిగిపోయిన మొదటి అక్షర 
మంట లేదంతే! 

ఫలశ్రుతి 

జయలో ప్రజలకు విజయం 
పాలకులకు గుండె భయం 
గతం కన్న భవిష్యత్తు 
సహజంగా కొంత నయం -

లా వర్తమాన రాజకీయ సామాజిక రంగానికి కూడా అనువర్తించే, అరవై ఏళ్ల క్రితం ‘జయ ఉగాది’ భావజాలం కాలగమనంలోని చరిత్ర పునరావృతానికే కాదు, మానవ స్వభావ నిరంతరాయతకు కూడా నిదర్శనం అనాలి. 

ఆంధ్ర ప్రభుత్వం 'తొలి ఏడాదిలో అభివృద్ధి' అని - అక్టోబర్ 1, 1953 - అక్టోబర్ 1, 1954 అని ఒక వార్షిక సంచిక జయ నామ సంవత్సరంలో వెలువరించింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రిగా - నాడు ఐకమత్యానికి పిలుపు ఇస్తూ పదకొండు జిల్లాల్లోనే కాక ఇంకెక్కువ ప్రాంతాలలో ఆంధ్రుల పరిపాలనా దక్షత ఆదర్శప్రాయం అయ్యే విశాలాంధ్ర సిద్ధికి కాంక్షించగా, ప్రధాని నెహ్రూ సందేశం పంపుతూ - 'ఆదిలో అంతరాయాలు ఎక్కువగానే ఉంటవి. ఈ కష్టాల్లోంచి తెప్పరిల్లుకుని, రాష్ట్రం స్థిరపడి ఆంధ్ర ప్రజలకు ఆయురైశ్వర్యాలను చేకూర్చి, దేశ ఐక్యతను బలపరచగలదని ఆశిస్తున్నాను. ఈ శుభ సమయాన నా హృదయ పూర్వక అభినందనలు' అని రాశారు. అయితే సందేశంలోని మొదటి వాక్యంగా ‘సుమారు ఒక సంవత్సరం క్రితం ఆంధ్ర రాష్ట్ర ప్రారంభానికి పాటు పడగలిగిన అదృష్టం నాకు లభించింది’ అని రాస్తే, అచ్చులో ‘పాటుపడగలిగిన’ అనేది ‘పాడుపడగలిగిన’ అని పడింది. భాషాప్రయుక్త రాష్ట్రాలకు ప్రాతిపదికలు వేసింది నెహ్రూగారే కదా! నేటికి తొలి భాషాప్రయుక్త రాష్ట్రానికి సంబంధించిన స్థితి ఇది. 

జయ ఉగాది ఎన్నికల సంరంభంతో ప్రవేశిస్తోంది. పాత మురికి వదిలించుకునే కొత్త తలంట్లు పోసుకుందాం. ఓటు అనే పవిత్ర దర్భ మన చేతిలోనే ఉంది. ధర్మమనే హవిస్సుకు ఉపయుక్తమైన సమిధ కాగలగాలి అది. ఉగాదికి అందరూ కొత్త బట్టలు ధరిస్తారు. ఇళ్లను శుభ్రం చేసుకుని వెల్లవేస్తారు. ద్వారబంధాలకు తలుపులకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తారు. వాకిలికి మామిడి, వేపాకులతో తోరణాలు కడతారు. రాబోయే తీర్చిదిద్దుకోబోయే వ్యవస్థకు ఈ ఉగాదినాడే మనం సమాయత్తం కావాలి. పునర్నిర్మాణం, పునర్మూల్యాంకనం ఎప్పటికప్పుడు ప్రగతిపథగాములు చేస్తూండవలసిందే. 

ఈ జయ నామ ఉగాదికి రాజు, మంత్రి కూడా చంద్రుడే కావడంవల్ల ఒక విధంగా మేలే అనుకోవాలి. చంద్రుడు మనకు దగ్గరగా వుండే గ్రహం కనుక నిజానికి మన అన్ని వ్యవహారాలలో చంద్ర ప్రభావమే ఎక్కువ. తెలంగాణలో ‘చంద్ర’శేఖరరావు, సీమాంధ్రలో ‘చంద్ర’బాబు ప్రభావోపేతులు కాగలరని కొందరు ఊహిస్తున్నారు. నిజానికి చంద్రుడు స్ఫటికం లాంటివాడు. స్ఫటికం దగ్గర ఏ రంగు పువ్వు పెడితే స్ఫటికం ఆ రంగులో కనబడినట్లు నక్షత్ర గుణ స్వభావాలను బట్టి చంద్ర ప్రభావాలు మారినట్లు పొత్తుల తీరునిబట్టి రాజకీయ చంద్రులూ మారుతూంటారనుకోవచ్చన్నమాట! చంద్రుడు శుద్ధ సప్తమి నుంచి కృష్ణపక్ష సప్తమి వరకు పూర్ణ బలవంతుడై ఉంటాడనీ ,కనుక ఆ మధ్య కాలంలోని - ముహూర్తాలకే బలమెక్కువ అనీ పంచాంగకర్తలు చెప్పే విషయం. 

తిథి వార నక్షత్రాలలో తారాబలం గొప్పది. 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రం సరళ రేఖలో చంద్రుడు ఎంతసేపు ఉంటాడో అంతవరకూ ఆ నక్షత్రం, దాని ప్రభావం ఉంటాయని ఋషుల నిర్ణయం. ఒక్కో తారకూ ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటారు. ఆ దేవతల స్వభావాన్నిబట్టి తారల ఫలితాలను నిర్ణయించాలి. తిథి 24 గంటల్లో ఎప్పుడైనా మారిపోతుంది గానీ ఒక్కొక్క తిథి మరునాడు కూడా కొంతసేపటి వరకూ ఉంటుంది గానీ, వారం ఈ దినం సూర్యోదయం మొదలు మరునాడు సూర్యోదయం వరకు మారదు. అందుకే అర్ధరాత్రి దాటిన పెళ్లి ముహూర్తాల శుభలేఖల్లో తెల్లవారితే అని ప్రత్యేకంగా పేర్కొంటూ ఉంటాం. తిథి అనేది కూడా చంద్రగమనం వల్ల ఏర్పడేదే! వారాల విషయానికి వస్తే సోమ, బుధ, గురు శుక్రవారాలు అన్ని శుభకార్యాలకూ అభివృద్ధి కార్యాలకూ మంచివి. ఆదివారం సరికాదనీ, శనివారం పనికిరాదనీ, మంగళవారం అస్సలు పనికిరాదనీ ఋషిప్రోక్తంగా విధాయకంగా భావించి అనుసరించే వారున్నారు. 

ఈ జయ ఉగాది సోమవారం అయింది. తెలంగాణలో పోలింగ్ జరుగబోతున్న ఏప్రిల్ 30, సీమాంధ్రలో ఎన్నికలు జరగబోతున్న మే 7వ తేదీలు రెండూ బుధవారాలయ్యాయి. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 16 శుక్రవారం అయ్యింది. తెలుగుజాతి రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వస్తాయి అంటున్న జూన్ రెండు కూడా సోమవారం అయ్యింది. సోమ, బుధ, గురు శుక్రవారాలు శుభానికీ, అభివృద్ధికీ ఆలవాలం అంటున్నారు కనుక నిజంగానే జయ నామ సంవత్సరం ఈ తెలుగు ఉగాది సకల శుభాలనూ మనకు సమకూర్చగలదని ఆకాంక్షిద్దాం. ఈ ఉగాది శుభ జీవన ఆశలకు పునాది కావాలని అభిలషిద్దాం. రాష్టమ్రూ, దేశమూ సకల సంత్సమేతం కావాలని ప్రార్థిద్దాం. 

‘జయ’ ‘జయ’ ‘జయ’ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి 
జయహే! జయహే ‘జయ’ ‘జయ’ ‘జయ’ జయహే! 

-సుధామ 
*

0 comments: