ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, June 24, 2012

ఓ గీతాచార్యుడి సువర్ణ శోభిత జీవనయానంఈరోజు ఆదివారం
ఆంధ్రభూమి దినపత్రిక;
అక్షర పేజీ లో
నేను చేసిన
గ్రంథ సమీక్షరేఖా చిత్రం అంటే బాపు. వర్ణ చిత్రం అంటే వపా (వడ్డాది పాపయ్య) అనేది ఓ ఎస్టాబ్లిష్‌డ్ ఫార్ములా. చందమామ పిల్లల మాసపత్రిక, యువ మాస పత్రిక ముఖ్యంగా దీపావళి ప్రత్యేక సంచికలు వడ్డాది పాపయ్యగారి వర్ణ చిత్రాలతో ఓ తరం పాఠకులను అమితంగా పెంచి మనసు దోచుకున్నాయి. వపా కార్టూన్లు, రేఖాచిత్రాలు గీయడమే కాదు, కొన్ని కథలూ రాసారు. కానీ వర్ణ చిత్రం అనగానే ఆయనే గుర్తొస్తారు.


ఆయన రంగుల చిత్రాలు ఒక అద్భుత ప్రపంచాన్ని పాఠకుల మదిలో ఆవిష్కరించేవి. నీటి రంగులతో పౌరాణిక చిత్రాలను మేటిగా సంతరించిన కుంచె ఆయనది. సంప్రదాయం పాటిస్తూనే ఎక్కడో ఓ ప్రయోగరేఖలతో తనదైన ముద్ర ఆ బొమ్మలకు అమరించేవారు. ఒక స్వచ్ఛంద పద్ధతిని అనుసరించి ఆయన గీసిన బొమ్మలు, ఆ రంగుల కలయిక అందాలను ఆరబోస్తూంటాయి. కరుణశ్రీ పద్యంలా కమనీయంగా భాసిస్తూంటాయి.

తమాషాగా ఆయన చిత్రాల గురించి తెలిసినంతగా ఆయన గురించి చాలామందికి తెలియదు. ఆ మహనీయ చిత్రకారుడిని గురించి సుంకర చలపతిరావుసి.పి.బ్రౌన్ అకాడమీవారి పుణ్యమా అని ఒక గ్రంథమే రాయడం తెలుగుజాతి రత్నాలు పరంపరలో అది వెలువడటం ఎంతో సంతోషదాయకమైన విషయం.


తనమీద రాయడం ఆయనకి ఇష్టం వుండదట .తన పనేదో తాను చేసుకోవడమే. ఆయన మీద మొదటి పరిచయ వ్యాసం సుంకర చలపతిరావు కొన్నే
ళ్ల క్రితం రాసి విశాలాంధ్రలో అచ్చయిన దానిని వ.పా కి ప్రతి పంపగా ఎందుకు వ్రాశారు అని మండిపడ్డారట. అయినా ఆయన షష్టిపూర్తికి రెండు వ్యాసాలు రాసిన చలపతిరావే ఇప్పుడు ఆయన మరణానంతరమైనా సాహసించి ఈ పుస్తకం రాసారనాలి. నిజానికి ఈ వివరాలు తెలియకపోతే ఒక ప్రసిద్ధ చిత్రకారుడిని గురించిన అనేక ఆసక్తికర అంశాలు అజ్ఞాతంగానే వుండిపోయేవి.విశాఖ జిల్లా అనకాపల్లి దగ్గర కశింకోటలో శారదా నదీ తీరంలో వేణుగోపాలస్వామి ఆలయానికి దగ్గరలో ఊరి చివర రెండంతస్తుల మేడ ఆయన ఇల్లు. దానిని దర్శించుకునే అవకాశం దక్కినవారు ఈ పుస్తక రచయిత వంటి ఏ కొద్దిమంది మాత్రమేననీ చెప్పవచ్చు.


1921 సెప్టెంబర్ 10 వడ్డాది పాపయ్య జననం. 1926లో అంటే తన అయిదవ ఏట మొట్టమొదట వేసిన బొమ్మ హనుమంతుడిది. 1938నాటికి ఆయనకు ఆర్టిస్టుగా గుర్తింపు వచ్చింది. రవివర్మ, దామెర్ల చిత్రాలతోబాటు తండ్రి రామమూర్తి కూడా చిత్రకళలో పాపయ్యకి స్ఫూర్తియే. కాశీనాథుని నాగేశ్వరరావు ప్రోత్సాహం ఆ తరువాత చక్రపాణి ఆదరణ ఆయనను చిత్రకారునిగా సుప్రతిష్ఠితుడిని చేసాయి. చిత్రకారునిగా ఎంత గొప్పవారో వ్యక్తిగా అంత నిరాడంబరంగా, ప్రచారార్భటులకు దూరంగా వుండి ఇంట్లో కూడా ముభావంగా తన పని తానుగా మిగతా ఎవ్వరూ పట్టనట్లు మెలిగేవారుట. వపా తండ్రి శ్రీకాకుళం స్థానిక పాఠశాలలో డ్రాయింగ్, డ్రిల్ మాస్టరుగా పనిచేసేవారుట.

రేరాణి, మంజూష, అభిసారిక, నవ్వులు పువ్వులు, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికల్లో సమకాలీన భావచిత్రాల్ని వడ్డాది పాపయ్య తరుచు గీస్తూండేవారన్న సుంకరవారు ‘ఆనందవాణి’ పత్రికను ఎందుకో ఉదాహరించినట్లు లేదు. వపా కార్టూన్లు 1949, 50లలో ఆనందవాణిలో ఎన్నో వచ్చాయి.ధనికొండ హనుమంతరావు వడ్డాది పాపయ్యని చక్రపాణికి పరిచయం చేసాక యువ, చందమామలకు వ.పా కేరాఫ్ అడ్రస్ అయ్యారు. కానీ ఆయన కశింకోటలోని తన ఇంటినుండే, మేడమీద గదిలో కూర్చుని రెండు నెలలకు ముందే బొమ్మలుగీసి ఆ పత్రికలకు పోస్టులో పంపేవారట. చందమామ కార్యాలయంలో ఆయన బొమ్మలు భద్రపరచబడేవి గానీ యువకు గీసిన చిత్రాల ఒరిజినల్స్ ఆయనకే ఇచ్చేసేవారట. తన డ్రాయింగ్ రూమ్‌ని ఆర్టుగ్యాలరీగా మార్చాలన్న ఆయన అభిలాష నెరవేరనే లేదట. పికాసో ఆధునికత వపా అందిపుచ్చుకున్నా దానికి తనదైన శైలిని అద్దారు.


‘‘ఏ కళ అయినా అర్థవంతంగా వుంటేనే ప్రయోజనం. అసలు కళల్ని డాంబికానికో, గారడీలు ప్రదర్శించడానికో ఉపయోగిస్తే అది తాత్కాలికం, నిష్ప్రయోజనం. చిత్ర రచన ఇంచుమించు కవిత్వ రచనతో సమంగా పయనించడానికే నేను ప్రయత్నించానని’’అన్నారట వడ్డాది పాపయ్య. కవిత్వంలో జంధ్యాల పాపయ్య లాగా వర్ణ చిత్రంలో వడ్డాది పాపయ్య ఒక అద్భుత లలిత సంప్రదాయ ఫణితిని వ్యవస్థీకృతం చేశారనక తప్పదు. తన బొమ్మలకు పురుగులు పట్టకుండా వడకట్టిన చిక్కటి గంజిని స్ప్రేతో బొమ్మపై ఊదేవారనీ దానివల్ల రంగులు కరిగిపోకుండా, పట్టి వుంచి మెరుపును, సొబగును ఇచ్చేవి అని గ్రహించినప్పుడు అచ్చెరువు కల్గుతుంది.

బొంబాయికి చెందిన దీనానాధ్ దలాల్ హిందీ, గుజరాతీ పత్రికల ప్రత్యేక సంచికలకు బొమ్మలు సంతరించిన తరహాలోనే వడ్డాది పాపయ్య చిత్రాలూ వుంటూ కొంచెం దగ్గర పోలికలు కనిపిస్తాయంటారు గ్రంథ రచయిత. తననుతాను మొండివాడు, గర్విష్టి, కూపస్థమండూకం అన్నా అనవచ్చు అని వడ్డాది పాపయ్య పేర్కొన్నారట ఓ లేఖలో.


21.6.1982న గ్రంథ రచయిత సుంకర చలపతిరావుకి రాసిన లేఖలో (పుస్తకంలో వపా స్వదస్తూరీతో చూడగలం) ‘‘నా మట్టుకు చెప్పాలంటే- మనుగడకోసం సాంప్రదాయికంగానే బొమ్మలు వేస్తున్నా (ఈ దేశంలో ఆధునిక చిత్రకళకు పైసా సంపాదించే యోగం లేదు కాబట్టి) అత్యంత ఆధునిక చిత్రకళ పట్ల పరిపూర్ణమైన అభిమానమూ, ఆసక్తి కలవాణ్ణి! నమ్మండి మానండి! రోజులు గడవడానికి యిబ్బంది లేని ఆర్థిక స్థోమత నిలవలు ఉంటే నేను చిత్రరచన జీవనోపాధిగా పెట్టుకోకుండా ఒకటో రకం ఆధునిక చిత్రకారుడిగా ఉండేవాడిని’’ అంటారు వడ్డాది పాపయ్య.ఒక చిత్రకారుడి గురించి వడ్డాది పాపయ్య రాసిన కథ ‘ఆషాఢ రమణీయం’ ఈ గ్రంథంలో చేర్చడం చాలా బాగుంది. ఆ కథకు వేసిన బొమ్మల్లో ‘వపా’ అనిగాక ఆషాఢ అని ఆయన సంతకం చేయడం చూస్తాం. పాతిక పైగా వడ్డాది పాపయ్య వర్ణచిత్రాలను ఈ పుస్తకంలో ముద్రించినందుకయినా, ఆ నిధిని అందుకుని భద్రపరుచుకునేందుకయినా కొని దాచుకోవాల్సిన కొనియాడదగిన పుస్తకం ఇది. 


‘నా గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ వ్రాయలేరు కూడా’’ అన్న వడ్డాది పాపయ్య మాటను పరాస్తం చేస్తూ 1992 డిసెంబర్ 30న అస్తమించిన ఆ మహాచిత్రకారుడి జీవనరేఖల స్మృతికిరణాంకంగా ఈ గ్రంథం వెలయించిన చలపతిరావు, ముద్రించిన సి.పి.బ్రౌన్ అకాడమీవారూ బహుదా అభినందనీయులు.వడ్డాది పాపయ్య
(1921-92)
సుంకర చలపతిరావు
వెల: రూ.95 /-
సి.పి.బ్రౌన్ అకాడమీ
53, నాగార్జున హిల్స్,
పంజగుట్ట,
హైదరాబాద్-82.


6 comments:

జ్యోతిర్మయి said...

ఆయన బొమ్మలు లేని చందమామ అందమే పోయిందిప్పుడు..ఎంత చూసినా తనివితీరేది కాదు ఆ బొమ్మల్ని. పుస్తకం గురించి పరిచయం చేసి మంచి పని చేశారు. ధన్యవాదాలు.

the tree said...

manchi manishini parichayam chesaru, thank you.

శ్రీ said...

అటు సున్నా , ఇటు సున్నా , ఆ మధ్యన నేనున్నా...
( olo ) అంటూ ఆయన వేసే చిత్రాలు అద్భుతం..
యువ, చందమామ , స్వాతి వీటికి ఆయన వేసిన చిత్రాలను కట్ చేసి
పోలితిన్ తో కవర్ చేసి నోట్ బుక్స్ కి అట్టలుగా వేసుకునేవాడిని...
ఆయన చిత్రాలకి ఆయన పెట్టే పేర్లు ఎంత చక్కగా ఉండేవో?
ఆయన కోసం వెళ్లి ,ఆయన దర్శనం చేసుకున్నాను నేను చదువుకునే రోజుల్లో...
బాపు గారి చిత్రాల్లో....రేఖల్లో అందాన్ని చూపిస్తే...
వ పా గారు రంగుల్లో అందం చూపే వారు...స్త్రీ మూర్తులని అంత అందంగా చిత్రీకరించేవారు మళ్ళీ
నాకు కనిపించలేదంటే అతిశయోక్తి కాదేమో...
మీకు అభినందనలు...మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు...
ఆయన మీద అభిమానంతో నా వ్యాఖ్య కొంచెం పెద్దది అయినట్లుంది... మన్నించాలి...
అన్నట్లు మీ ప్రొఫైల్ ఇపుడే చూసాను...నేను దూరదర్శన్ కేంద్రం భోపాల్ లో పని చేస్తున్నానండి.
@శ్రీ

రాకుమార said...

ఇంటర్ తెలుగు పుస్తకం లో కళ పాఠం లో "పోట బంటునై అచ్చటి కేల పోయితి మహాగుణ భూషణు గోలు పొయితిన్" అభిమన్యుని కోల్పోయిన అర్జునుని బాధను తెలిపే పద్యం కొంత భాగం ఇచ్చారు. దానిపూర్తి పాఠం కావాలి తిక్కన భారతం అందుబాటులో లేదు. తెలిసినవాళ్ళు దయచేసి సహకరించండి

రాకుమార said...

సందర్భం ఇది కాదేమో... ఐనా తీరుస్తారనే ఆశతో..ఇంటర్ తెలుగు పుస్తకం లో కళ పాఠం లో "పోట బంటునై అచ్చటి కేల పోయితి మహాగుణ భూషణు గోలు పొయితిన్" అభిమన్యుని కోల్పోయిన అర్జునుని బాధను తెలిపే పద్యం కొంత భాగం ఇచ్చారు. దానిపూర్తి పాఠం కావాలి తిక్కన భారతం అందుబాటులో లేదు. తెలిసినవాళ్ళు దయచేసి సహకరించండి

సుధామ said...

ధన్యవాదాలు జ్యోతిర్మయిగారు,ది ట్రీ గారు,"అటు సున్నా , ఇటు సున్నా , ఆ మధ్యన నేనున్నా...
( olo ) అంటూ ఆయన వేసే చిత్రాలు అద్భుతం."...
అన్న మీరన్నమాట యథార్థం శ్రీ గారూ!భోపాల్ దూరదర్శన్ లో ఏ పోస్ట్ లో ఉన్నారు.
రాకుమార గారూ! మీరడిగిన పద్యం పూర్తి పాఠం ఇది:
ఉ. అక్కట మందభాగ్యునకు నట్టి తనూభవరత్న మెవ్విధిన్
డక్కు విధాత నిర్దయు డొడంబడు నే కడు మేలి వస్తువుల్
పెక్కు దినంబు లుంకి యరిబృందము పిల్చిన బోటుబంట నై
యక్కడ కేల పోయితి మహాగుణభూషణు గోలుపోయితిన్.(ద్రోణ పర్వం 2-240)