‘‘కవిత్వంలో ‘కమిట్‌మెంట్’ వుండాలన్న సూత్రం నాకెప్పుడూ రుచించలేదు. ‘అందమూ ఆనందమే’ పరమావధి కాకపోయినా సంకలనంలోని అధిక శాతం కవితలు ‘మట్టివాసన’కొట్టాలని కాంక్షించాను. కొంతమేర మాత్రమే అది సాధ్యమైందనుకుంటాను’’ అంటాడు టి.హెచ్.నటరాజారావ్. సహకారశాఖలో పనిచేస్తున్నందువల్లనేమో తన కవిత్వానికి అన్నివైపుల గాలినీ సహకారంగా పీల్చుకుంటాడు.
‘‘మాండలిక భాష కవిత్వానికి వనె్నతెస్తుందని నేను నమ్మను. లేదా మాండలిక భాష ఆయా ప్రాంతాల ప్రత్యేక స్థితికి అద్దంపడుతుందనడం కూడా అత్యాశే అవుతుంది. ఆకలికి, కన్నీటికి ప్రాంతభేదం కానీ స్థాయి,తారతమ్యం కానీ వుండదన్నది అందరూ అంగీకరించే వాస్తవం’’ అంటాడు నిష్కర్షగా. అలాగని అనంతపుర ప్రాంత మాండలికం వీటిల్లోని కొన్ని కవితల్లో ద్యోతకం కావడం లేదా అని అడిగితే ‘‘కొన్ని కవితల్లో కన్పించే మా ప్రాంత మాండలికాలు సందర్భ వివశతతో వాడినవే. అసౌకర్యానికి పాఠకులు మన్నించెదరుగాక!’’ అని క్షమాపణగా పేర్కొంటాడు.
ఒక వైరుధ్యం, వైలక్ష్యం మూడు భాగాలుగా విస్తరించిన ఈ అరవై తొమ్మిది కవితల్లోనూ కొట్టొచ్చినట్లు కనబడతాయి. పద్యం, గేయం వచన కవిత అన్న ఇతనికి ఇష్టమే. అయితే ‘మట్టివాసన’ సంపుటిలో బ్లాంక్‌చెక్‌గా భావించే వచన కవితావిన్యాసమే ఎక్కువ.
‘‘ఈ సంకలనంలో సంప్రదాయ సాహిత్య ఛాయలు వచన కవితల్లో అక్కడక్కడ తమ ఉనికిని రాజసంగా ప్రదర్శించడం వున్నా రైలింజన్ పట్టాలు మారుతున్న వైనంలో ఇవన్నీ సహజ విన్యాసాలుగానే గ్రహించడం సబబు’అని ప్రస్ఫుటించిన భావనా బలంగా పేర్కొంటారు ఆచార్య కె.సర్వోత్తమరావు.
తామర తంపరగా సంకలనం నిండా మానవీకరించిన ఎన్నో అందాలు అంటూ వేంపల్లి అబ్దుల్‌ఖాదర్, ‘‘చాలా సామాన్యులనుకున్న వారిని ఈ కవి అసామాన్యులుగా కీర్తిస్తారు. పాఠకులు సైతం వారికి నమస్కరించేలా చేస్తారు. తాముచేసిన తప్పులో, పొరపాట్లో ఏమయినా వుంటే మన్నించమని కోరేలా చేస్తారు’’అంటూ రంజని చీకోలు సుందరయ్య కవిని గూర్చి పేర్కొంటారు.
అమ్మ జ్ఞాపకం
చిరిగిన మేఘవస్త్రం కట్టుకున్నవెన్నెలప్రోవు
ఆకాశం కొమ్మకు పూచే చందమామ పూవు
అని ‘మట్టివాసన’ కవితలో అన్నందుకయినా నటరాజారావ్‌ను కవిగా అంగీకరించి తీరాల్సిందే.
‘పద దీపికలు’లో క్లుప్తాక్షరాల్లో అనుభూతి అభివ్యక్తికీ తలపడ్డాడు.
తీరిన కోరిక
కళ్లముందరి చెత్తకుండీ
తబ్బిబ్బై ఊడిపడిన గుండీ.
- సుధామ
మట్టివాసన (కవిత్వం)
టి.హెచ్.నటరాజారావ్, ప్లాట్ నెం.90, 91
శుభంరాయల్
అపార్ట్‌మెంట్స్,
జి-2, ఫ్రెండ్స్‌కాలనీ,
మణికొండ, పుప్పాలగూడ మెయిన్‌రోడ్,
హైదరాబాద్-75
వెల: రూ.100/-
టి.హెచ్.నటరాజారావ్, ప్లాట్ నెం.90, 91
శుభంరాయల్
అపార్ట్‌మెంట్స్,
జి-2, ఫ్రెండ్స్‌కాలనీ,
మణికొండ, పుప్పాలగూడ మెయిన్‌రోడ్,
హైదరాబాద్-75
వెల: రూ.100/-
0 comments:
Post a Comment