ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 27, 2012

పొడి పిడచలు


‘‘నాకు పొడి పిడచలు దిగవు’’ అన్నాడు రాంబాబు.


‘‘మా అమ్మా ఈమాటే అంటూ వుంటుంది. పెద్దవాళ్లు ఆ మాట అన్నారంటే అర్థం వుంది. కుర్రాడివి నీకేం వచ్చింది. ‘ఘనం’గొంతు దిగదంటావేంటి’’ అన్నాడు శంకరం.


‘‘ఎవరికయినా ఒక్కోసారి అంతేనయ్యా! పొద్దునే్న బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ కారప్పొడితోనో ఇడ్లీముక్క తిన్నావనుకో! ఒక్కోసారి అలాంటప్పుడు ‘డెక్కు’తుంది! మంచినీళ్లు త్రాగితే కానీ, అది గొంతు దిగి, గుండెదిటవు పడదు. అందుకే మన పెద్దవాళ్లు- ఏదయినా తినేటప్పుడు, ముందుగా మంచినీళ్లు దగ్గరపెట్టుకుని మరీ భోజనానికి ఉపక్రమించమంటారు. భోంచేస్తూ మధ్యమధ్యలో నీళ్లు త్రాగకుండా, అంతా తిన్నాక మంచినీళ్లు త్రాగాలని ఇప్పటివాళ్ల చాలామంది సిద్ధాంతం! కానీ ‘మధ్యేమధ్యే పానీయం’లో సుఖం వుంది. సుళువుంది. కొంతమంది ఏవో మాత్రలు తమ ఆరోగ్యంకోసం మింగవలసి వుంటుంది. ఏ నీళ్లూ లేకుండానే కొందరు గొంతులో పెట్టుకుని మింగేస్తూంటారు. కానీ గొంతుకు అడ్డంపడకుండా మంచినీళ్ళతో మాత్రవేసుకుంటే మంచిదికదా! ఏదయినా ‘పొడి’కన్నా ‘తడి’లో మేలు వుంది. ‘మంచినీళ్లే మంచిమందు’అన్న సూత్రం కూడా వుంది. రోజుకి కనీసం నాలుగైదు లీటర్ల నీళ్లు త్రాగితే మంచిదన్నారు కానీ, ముప్పూటలా ‘కుంభం’తో అన్నం లాగించేయమని చెప్పలేదు.’’ అన్నాడు ప్రసాదు.


‘‘నువ్వన్నది నిజమే ప్రసాదూ! ‘తడి’అంటేనే ఆర్ద్రత. ‘కంటి తడి’, ‘గుండె తడి’ వున్నవాడే మనిషి. కానీ పొడిబారిన హృదయాలు కఠినమై శిలాసదృశ్యం కావచ్చు. అందుకే కళలూ, సాహిత్యం వంటివన్నీ- మనిషిని ఆర్ద్రంగా వుంచి మానవీయ విలువల పరిరక్షణకు తోడ్పడతాయి.
మనిషికి హింసాప్రవృత్తివేపు పోకుండా ‘కంచె’లా కాపాడుతాయనిపిస్తుంది. ‘పొడి’ అంటేనే కరువుకూ, క్షామానికీ ప్రతీక అనిపిస్తుంది. ‘చినుకు’లేకపోతే భూమి నెర్రలు వారుతుంది. చాన్నాళ్ళ క్రితమే శ్రీశ్రీ-
పొడి రాష్ట్రాలనన్నింటినీ
తడి చేస్తామన్న కాంగ్రేస్‌వారు
తడి రాష్ట్రాలన్నింటినీ
‘పొడిచేస్తున్నారు’
అంటూ చమత్కరించాడు. రాజకీయంగా కూడా ఇవాళ ‘పొడి’బారుతున్న వ్యవహారాలే ఎక్కువైపోతున్నాయి.’’అన్నాడు సుందరయ్య.


‘‘అమ్మమ్మా! అలా అనకు. ‘తడి’చేయందే ఏ పనులూ జరగడం లేదుకదా! ప్రభుత్వ కార్యాలయాల్లో చేతులు ‘తడపందే’ పనులు కావడం కష్టం అని- సిద్ధాంతమై కూచుంది. ‘తడి’అనేది అవినీతికి ముడిపడుతూంటే, దానిని ఆర్ద్రం, ఆదరణీయం ఎలా అనుకోవాలి చెప్పు? పొడి పిడచలు నాకు కాదు; రాజకీయాల్లో, పదవీ అధికారాల్లో దిగనివాళ్లు ఎక్కువై పోయారు. కొన్ని ‘పొడి’గా వుంటేనే బాగుంటుంది అనుకుంటాను. ప్రసాదు అన్నట్లు అన్నంలో కారప్పొడులు, కందిపొడులు, కూరపొడులు, చారుపొడులు, సాంబారు పొడుల ప్రాముఖ్యతను కాదనలేం కదా! కానీ ‘పొడి’గొంతు దిగడంలో- గుండెలో ‘డెక్కినట్లు’ కాకుండా, ద్రవ సహాయం అవసరమైపోతోందన్నమాట!’’అన్నాడు రాంబాబు నవ్వుతూ.


‘‘ ద్రవ్యం యావత్తు లోపిస్తే ద్రవం’అని పఠాభి ‘పన్’చేసాడు. ఎంతో ఘనమైనదైనా ‘ద్రవం’తోడుంటేనే హరాయించుకోవడం సులువవుతోంది. జీవ ఎరువులు అనేకం ఇప్పటిదాకా పొడి రూపంలోనే తయారవుతున్నాయి. దీంతో ఎరువు ఎక్కువగా వృధా అవుతోందనీ, పైగా లిగ్నైట్‌ను స్టెరిలైజ్ కావించకపోవడం వల్లనో, లేక ఆ ఎరువుల్లో ఇతర సూక్ష్మజీవులు వచ్చి చేరడంతోనో, అసలు ‘ఎరువు’ప్రభావం తగ్గిపోతోందట! దానివల్ల ప్యాకెట్‌లోని ఎరువు జీవితకాలం- తరిగిపోతోందట. ఈ సంగతి గ్రహించిన అమరావతి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్తలు పలు జీవ ఎరువులను ద్రవరూపంలో తయారుచేసారట! వీటిలో సేంద్రీయ రసాయన పదార్థాలు మిళితం చేసి, ఎక్కువ కాలం నిల్వ వుండేలా చేసారు. గాలిలోని నైట్రోజన్‌ని సంగ్రహించి మొక్కలకు అందించే అజటోబాక్టర్, రైజోబియం భూమిలోని ఫాస్పరస్- అంటే భాస్వరంను కరిగించే పీఎస్‌బీ... భాస్వరంతోబాటు మొక్కలకు సూక్ష్మధాతువులను అందించే మైకోరాజా (వేమ్)... తదితర సూక్ష్మజీవులను ‘లిగ్నైట్’అనే రసాయన పదార్థాలతో కలిపి రూపొందించేవే జీవ ఎరువులనీ, వాటిని ఇప్పుడు ద్రవరూపంలో రూపొందించడం నిజంగా ప్రయోజనదాయకమైన పరిణామమనీ, మా మైక్రోబయాలజీ మిత్రుడు గోపాలం చెప్పాడు’’అన్నాడు సుందరయ్య.

‘‘నేల తల్లికీ తడే కావాలి. అంతనయ్యా! భూమి సారానికి కూడా ద్రవరూప పదార్థాలే ఎక్కువ మేలని దీనివల్ల తెలియడంలేదూ! ‘తడి’ అన్నదానిని ఎటొచ్చీ మనం సవ్యమైన అర్థంలో గ్రహించాలి. అవినీతి ‘తడి’తో ఎదిగేవేవీ మనకు వద్దు! అవి విలువలనూ, మానవ ధర్మాన్నీ ‘పొడిచేసేవే’అవుతాయి. నిజానికి ఆర్ద్ర హృదయం, అర్థంచేసుకునే మనసుగలవారెవరూ తమ విద్యుక్త్ధర్మ నిర్వహణలోగానీ, పరోపకార పరాయణత్వంలో కానీ స్వార్థానికి ప్రలోభాలకూ, బలహీనతలకూ చోటివ్వరు. అవినీతిగా వ్యవహరించడానికి గానీ, అవినీతిని ప్రోత్సహించడానికి గానీ సిద్ధపడరు. ఘన, ద్రవ, వాయు పదార్థాలు మూడింటికే ప్రాముఖ్యం వుంది. ఏది ఎలా వుండాలో, ఎలా వినియోగించాలో, ఎలా ఉపయుక్తమవ్వాలో అలాగే జరగాలే తప్ప, ఏ విధమైన ‘కల్తీ’ఏ రంగంలోనూ పనికిరాదు. ఆర్ద్ర హృదయంతో శ్వాసించే మానవ జీవనమే ఎప్పటికయినా ఘనం.’’అన్నాడు శంకరం రాంబాబు భుజం తట్టి లేస్తూ.

0 comments: