ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 29, 2012

అబ్బ. ఛా!





‘‘వ్యక్తుల ప్రైవేట్ బ్రతుకులు
వారి వారి సొంతం
పబ్లికులో నిలబడితే
ఏమయినా అంటాం’’


‘‘అబ్బ. ఛా! సి.బి.ఐ. జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, లీడ్ ఇండియా ప్రతినిధి చంద్రబాల పబ్లిక్‌లో ఏం నిలబడలేదు, వారి కాల్ లిస్టులను అక్రమంగా, అనధికారంగా సేకరించడం, తమ నేత జగన్‌ను సి.బి.ఐ. అన్యాయంగా అరెస్ట్‌చేసిందన్న భ్రమల్లో, వ్యక్తి పూజలో మునిగిన సాక్షి విలేకరి నాచారం ఇనస్పెక్టర్‌తో కలిసి చేసి, జె.డి పరువును రచ్చకీడ్చే కుట్రలో కట్టుకథలు సృష్టించబోయి, తప్పుడు మార్గంలో పోయినందువల్ల పట్టుతప్పి, ఇప్పుడు ‘కాల్’ వ్యవహారం అడ్డం తిరిగి, వారి గొంతుకే చుట్టుకుంటోందా లేదా.’’


‘‘భస్మాసుర కథనం అంటే ఇదే! ఎవరి నెత్తినో చేతులుపెట్టి వారిని బుగ్గి చేయబోయి- తానే బుగ్గి అవడం. తమ సెల్‌ఫోన్ కాల్స్ లిస్టును బయటపెట్టడంపై జెడి లక్ష్మీనారాయణ, లీడ్ ఇండియా సంస్థ చంద్రబాల పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదుచేయడంలో ఎంతో ఔచిత్యం వుంది! ఎమ్మార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పారిశ్రామికవేత్త- నాగపూర్‌కు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా, జె.డి కాల్‌లిస్ట్‌ను సంపాదించడం నిజంగా హేయమైన చర్య! తమపై కేసులు తప్పుడువయితే, న్యాయమార్గంలో ఎదుర్కోవాలే గానీ, తమ విధిని నిజాయితీగా, చిత్తశుద్ధితో, నిర్భయంగా నిర్వర్తిస్తున్న వారిపై బురదచల్లి, అప్రతిష్ఠపాలుచేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. పిరికి చర్య. పైగా దానికి ‘జర్నలిజం’ ముసుగువేసుకోవడం మరీ దారుణం! జగన్ మీద అభిమానం వుండచ్చు గానీ- అందుకోసం ఆయన పార్టీ నేతలుగానీ, ఆయన పత్రికా విలేఖరులు గానీ ఇంతలా బరితెగించడం అనైతికం.’’


‘‘అది సరే! ఇప్పుడు వై.ఎస్సార్ కాంగ్రెస్ పక్షాన గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలూ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది కదా! ప్రభుత్వం స్థిరంగా వుంటుందని ఎలా చెప్పగలం? రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగానే వున్నప్పుడు- ఈ ముఖ్యమంత్రిని 2014ను దృష్టిలో పెట్టుకునయినా అధిష్ఠానం మార్చేయచ్చుకదా!’’


‘‘అబ్బ.ఛ! ఇప్పుడు ముఖ్యమంత్రిని మారిస్తే మాత్రం మైనారిటీలో పడిన ప్రభుత్వానికి ఒరిగేదేమిటి? స్థిరత్వం ఏమీ వచ్చిపడదు కదా! అయినా గవర్నర్ నరసింహన్ గారన్నట్లు- ‘‘ఆకాశం కింద పడితే మనం ఉండం. అంతేకదా! అది ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పగలరు’’. అంచేత ఇప్పుడు సర్కారుకు ఢోకా వుందని అనలేం! కానీ గవర్నర్‌గారే ఢిల్లీలో అధిష్టానంతో నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోదలుచుకుంటే రాష్టప్రతి ఎన్నికల వరకూ వేచి వుండాల్సిన అవసరంలేదని అభిప్రాయం వెలిబుచ్చినట్లున్నూ తెలుస్తోంది.’’


శంకరానికీ, సన్యాసికీ మధ్య సంభాషణ ఇలా సాగుతూంటే సుందరయ్య నవ్వుతూ కల్పించుకుంటూ- ‘‘సన్యాసీ! ఇప్పుడు' అబ్బ.ఛ!' అని ఎన్నింటికి అంటావు చెప్పు? అసలు రాష్టప్రతి ఎన్నికల వ్యవహారం కూడా రసకందాయనంలో పడుతోంది! ఒకప్పుడు వి.వి.గిరికీ, సంజీవరెడ్డికి మధ్య పోటీ జరిగి- ‘అంతరాత్మ ప్రబోధం’పేర, ఇందిరాగాంధీ హయాంలో గిరిగారు గెలిచిన చందం- ఇప్పట్లో గుర్తుకొస్తోంది! ‘సంగ్మా’గారు చాలా ఆశగా వున్నారు. ఏదో ‘మిరకిల్’ జరిగి, తాను రాష్టప్రతి కాకపోతానా అన్న ఆశతో వున్నారు’’ అన్నాడు.


‘‘అబ్బ. ఛ! తను రాష్టప్రతి ‘అభ్యర్థి’అయినంత మాత్రాననే- మొన్న హైదరాబాద్‌కు వచ్చినప్పుడు, జగన్ పార్టీ ఓట్లు అడగడానికి- అతనిని చంచల్‌గూడా జైలులో కలుసుకోవడానికి వెడితే అధికారులు అందుకు ఏర్పాట్లుచేయాలని భావించి, కలుసుకోవడానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో భంగపడ్డాడు! తమకు ఎలాంటి ఓట్లుపడినా- గెలవడమే ధ్యేయంగా, ‘రాష్టప్రతి’అంతటి పదవి ఎన్నికలు కుంచించుకుపోవడం అంత విషాదం మరొకటి లేదు’’ అన్నాడు సన్యాసి.


‘‘సరే! ప్రణబ్‌ముఖర్జీగారు ఎంతో సచ్ఛీలుడూ, సమర్థుడూ, నిజాయితీపరుడైన అభ్యర్థి అనుకుంటే- ఏకగ్రీవంగానే అందరూ అంగీకరించేవారు కదా! ‘అనుజ్‌ధార్’అనే మాజీ జర్నలిస్టు- ‘యాన్ ఎలాబరేట్ కవరప్’ అని ఇటీవల విడుదలచేసిన పుస్తకంలో - ఆయన బండారం బయటపెట్టాడు.


పి.వి. ప్రధానిగా వున్న హయాంలో విదేశాంగశాఖ అధిపతిగా వున్న ప్రణబ్‌కూ, హోంశాఖ శివరాజ్‌పాటిల్‌కూ అభిప్రాయ భేదాలు వచ్చాయిట. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమానప్రమాదంలో మన భారతనేత, అజాద్ హింద్ ఫౌజ్ అధినాయకుడు అయిన సుభాష్‌చంద్రబోస్ మరణించారని చెబుతారు. కానీ అధికారికంగా ఇప్పటికీ మన ప్రభుత్వం దానిని ధృవీకరించలేదు. జపాన్‌కు చెందిన కొందరు మాత్రం ఆయన అస్థికలు తమవద్ద వున్నాయనీ, వచ్చి తీసుకువెళ్లండనీ భారత్‌ను కోరారు. నేతాజీ మరణంపై సందేహాలకు తెరదించేందుకు ప్రణబ్‌ముఖర్జీ నేతాజీ అస్థికలుగా చెబుతున్న వాటిని భారత్‌కు తేవద్దని, అప్పట్లో కేబినట్ నిర్ణయించినా- తాను మాత్రం జపాన్ వెళ్లి, అట్నుంచి జర్మనీలో బోస్ భార్య ఎలీనీ, కూతురు అనితలను కలసి, అవి నేతాజీ అస్థికలని అంగీకరించమనీ, వాటిని భారత్‌కు తీసుకువెళ్లేందుకు ఎంత డబ్బయినా తీసుకొమ్మనీ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారట! ఎలీ ఆగ్రహంతో ఊగిపోయి, ఆ చెక్కును ముక్కలుముక్కలు చేసారట. జపాన్‌లో వున్నవి నేతాజీ అస్థికలు కావని ‘ఎలీ’ ప్రణబ్‌కు స్పష్టంచేసినా- ఇవాళ రాష్టప్రతి పదవికి దాదాపు ఖరారనుకుంటున్న ప్రణబ్‌గారు- ఆనాడు నేతాజీ మరణ వివాదం మూసివేయాలనే లక్ష్యంకోసం, ఎలీను వేదనకు గురిచేసి, లంచం ఎరచూపి, ఆమె మరణానికి కూడా హేతువయ్యారట.’’ అన్నాడు సుందరయ్య. 



అది విని దిగ్భ్రాంతితో ముక్కున వేలేసుకుంటూ ‘‘అబ్బ..ఛా’’ అన్నాడు మళ్ళీ సన్యాసి.

2 comments:

శ్రీ said...

చాలా బాగుంది సుధామ గారూ!
:-)
@శ్రీ...

సుధామ said...

కృతజ్ఞుడిని శ్రీ గారూ!