ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, June 10, 2012

తనివి తీరని‘రజని’ ఆత్మకథా విభావరి





‘రజని’ అంటే ఒక అనన్వయాలంకారం.ఆయన - ఆయన చేసినవన్నీ ఆయన మాత్రమే చేయగలిగినవిగా,అందరిచేతా అనిపింపచేసుకున్న మహనీయగుణాత్ముడు. అది యధార్థం కూడాను.


తొంభై ఏళ్ల పైబడిన వయసులో మొన్నఉగాదికి తన ‘ఆత్మకథా విభావరి’ గ్రంథం వెలయించడమూ ఆయనకే చెల్లింది. ఇదేపుస్తకం ఓపదేళ్లు ముందుగా రాస్తే ఇంకెంత బాగుండేదో అనిపింపచేస్తూనే, ఇప్పటికీ ఆయన మాత్రమే చెప్పగల విషయాలలో,ఆయన గురించిన విషయాలను మాత్రమే అధికంగా ఆయన ఇందులోచెప్పారు .


ఆకాశవాణి ప్రముఖుల్లోనివాడూ, ఆకాశవాణికి ప్రముఖతను కూర్చినవాడూ అయిన- రెండోతరం ఘనాపాఠి, సంగీతసాహిత్య సమలంకృతుడైన ప్రతిభామతి-‘రజని’.


తనకు స్ఫూర్తినిచ్చిన మొదటితరం పెద్దలుగా ఆచంట జానకిరాం,అయ్యగారి వీరభద్రరావు, శ్రీ సూరి నారాయణమూ ర్తిగార్లను ‘తెలుగుత్రిమూర్తులుగా’ ఆయనే ఉటంకించారు.ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం ప్రారంభించిన 1938జూన్ నుంచీ  కూడా ప్రసారవ్యవస్థ తెలుగుదీధితుల బాటవేసినవారు ఆ త్రిమూర్తులయితే, ఆ బాటలో తనదైన ‘బావుటా’నెగురవేసి, రేడియోని జనమమేకం చేసిన జగజెట్టి 'రజని' అనబడే బాలాంత్రపు రజనీకాంత రావు గారు.


తెలుగు సాహిత్యంలో వేంకట పార్వతీశ్వరకవులుగా సుప్రసిద్ధులైన జంటలోని బాలాంత్రపు వేంకటరావుగారికీ, వారి ధర్మపత్ని వేంకట రమణమ్మగారికి ద్వితీయ సంతానంగా (రెండో కుమారునిగా) 1920
జనవరి, 29వ తేదీన జన్మించిన రజనీకాంతరావు గారికి ఒక చెల్లెల్ని ఇచ్చి,రెండున్నర సంవత్సరాల వయసుకేకనుమరుగైంది ఆ తల్లి. రజనికి యాభై ఒక్కసంవత్సరాల వయసువరకూ ఆ ఒంటరితండ్రి స్ఫూర్తి ఆయనను సాహిత్యపథంలోనడిపించడానికి ప్రేరణగానూ నిలిచింది.


బాలాంత్రపు వేంకటరావుగారు 1971లోఅస్తమించారు. వసారా గదిలో తండ్రి భౌతికకాయంవున్న సమయంలోనే- ఆకాశవాణి విజయవాడ కేంద్రంనుండి ‘కొండనుంచికడలిదాకా’అని రజని రూపొందించిన కార్యక్రమానికి జపాన్‌వారి ముప్ఫైవేల ఎన్స్ పారితోషికంఅంతర్జాతీయ అవార్డు లభించిందన్న వార్త రావడం, ఆ శుభవార్తను తండ్రి చెవిన వేయలేకపోయాననీ రజనిరోదించడం, ఒకవిధి విలాస హాసమే మరి!


‘ఓహోహో పావురమా!’ అంటూ స్వర్గసీమ చిత్రానికి నవ్య సంగీతం బాణీలు కూర్చిన రజని, తలుచుకుంటే అప్పట్లోనే చలనచిత్ర సీమలో స్థిరపడి వుండగలిగేవారే. కానీ శ్రవణ మాధ్యమమైన ఆకాశవాణిపుణ్యాలప్రోవుగా రజని సేవతో వినుతికెక్కింది. ముఖ్యంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి
వన్నెవాసి తెచ్చినది రజనిగారే! మద్రాసు,విజయవాడ, హైదరాబాదు, బెంగుళూరు,ఢిల్లీ కేంద్రాలలో ఆయన పనిచేసినా-ఆయన సాహిత్య సంగీత సృజనలకు ప్రధానభిత్తికగా నిలిచింది విజయవాడ కేంద్రమే.రేడియోడైరెక్టర్‌గా ఆయన ప్రసారమాధ్యమాన్ని సాహిత్య సంగీత సంస్కృతీమంతంగా, జనహృదయాకర్షకంగా ‘వ్యవస్థీకృతం’ చేశారు.


కృష్ణశాస్ర్తీ గారి చేత రేడియోకి బోలెడురాయించిందీ, భక్తిరంజని కార్యక్రమాన్నిబహుధా అశేష శ్రోతల మన్ననలకు పాత్రమొనరించిందీ, సంస్కృత పాఠం,సంగీత శిక్షణ, ధర్మసందేహాలు వంటికార్యక్రమాలన్నీ ప్రసిద్ధమవడానికిహేతువయ్యిందీ, రజనియే! అలాగే ‘లలితసంగీతం’ విభాగానికి ప్రాతిపదికలు వేసిందీ ఆయనే.


ఆంధ్రవాగ్గేయకార చరిత్ర, విశ్వవీణ, శతపత్రసుందరి, క్షేత్రయ్య, రామదాసు, మువ్వగోపాల పదావళి, జేజి మామయ్యపాటలు, అలాగే ఇంగ్లీషులోకి'ఎలోన్ విత్ ది స్పౌస్ డివైన్ 'పేర ‘ఏకాంతసేవ’కావ్యానువాదం - ఆయన సాహితీ కృషికిసాక్షర గ్రంథాలు. ఆయన చేసిన సంగీతరూపకాలు లెక్కకు మిక్కిలి. ‘‘సంగీతగంగోత్రి, హాలశాతవాహన చివరి రెండూనేమో’’అంటారు.


కనకాంగి రాగంలా అనిపించే ‘దేవసాలగం’, అలాగేఅన్నమయ్య కూర్చిన దేశాళిలా ధ్వనించే‘దేశవరాళి’ రజని సృజించిన రాగాలే! వెంపటి చినసత్యం, శోభానాయుడు వంటి సుప్రసిద్ధ నాట్యరంగ ప్రముఖులు ప్రదర్శించిన- క్షీర సాగరమథనం,విప్రనారాయణ, కల్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణం మమ, మహిషాసుర మర్దని వంటి నృత్యగేయనాటకాలను రాసినది రజనిగారే. రవీంద్రుని 150వ జయంతి సందర్భంగాకేంద్రస్థాయిలో ‘ఠాగూర్అకాడమీ రత్న’అవార్డు ఇటీవలే ఆయనకు ప్రకటితం కావడం- ఆకాశవాణిలో రవీంద్ర సంగీతానికిఆయన కల్పించిన ప్రాచుర్యానికి దక్కిన సముచిత గౌరవంగా భావించవచ్చు.


రజని ‘ఆత్మకథా విభావరి’ పుస్తకం రజనీకాంతరావుగారి ఆత్మకథే!కుటుంబపరమైన, రేడియోపరమైన అనేకముచ్చట్లను ఆయన ఇందులో అందించారుగానీ- ఆయన సాహిత్య, సంగీత సాంస్కృతికవిషయాల అనేక నేపథ్యాలూ, స్ఫూర్తి,ప్రేరణా, అలాగే వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యాఆయనకు ఎదురైన వ్యక్తులు, సంఘటనలు గురించి ఇంకా ఎన్నో సంగతులు ఆయన
చెప్పగల అవకాశం వుంది.ఓ పదేళ్లముందే ఈ రచనకు ఆయన పూనుకుని వుంటే- ఇంకా ఎంత బాగుండేదో కదా అనిపించడానికి హేతువదే!


7.1.1941న మద్రాసు రేడియోలోబాలాంత్రపు రజనీకాంతరావుగారు పాల్గొన్నమొదటి కార్యక్రమం శ్రీశ్రీ రచించిన ‘మోహినీరుక్మాంగద’ సంగీత నాటకంలో బ్రహ్మపాత్రధారణ కావడం ఓ విశేషం! శ్రీశ్రీ చేత రేడియోకి పలు రచనలు చేయించినా-తనది మటుకు భావ, అభ్యుదయ, విప్లవ వంటి పరిసీమిత పంథాకాదనీ,తనది ‘రజనీకవిత్వం’అనీ అంటారాయన.


‘చండీదాసు’- బెంగాలీ సంగీతం కూర్చి1941 ఫిబ్రవరిలో ఆయన ప్రసారంచేసిన మొట్టమొదటి ఆయన రచన.రజని గారు పెంపుడు కుక్క ‘సీజర్’గురించి కూడా ఇందులో రాసారు.మకాలతో సహా మంద్రస్థాయిలో అది ఆలాపనలు చేసేదనీ, బాలమురళిలాగా రసానుభవంతో స్థాయి
నిలుపుతూ పాడే ఏ ఆలాపననైనా వినగానే తన గొంతు శ్రుతి కలిపి పాడేదనీ ఆయనపేర్కొనడం ఆ జంతు నేస్తంతో ఆయనకుగల అనుబంధాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఆ భావన వారి వైయక్తికానుభూతిగా హేతువాదులు సరిపెట్టుకోవచ్చు.


- ఏమయినా ‘రజనీ ఆత్మకథా విభావరి’ లోరజని మాత్రమే చెప్పగల విషయాలు అనేకంవున్నాయి. ఇంకా ఆయన ఎంతోచెప్పగలరనీ, ఆయన నుండి తెలుసుకోదగిన అంశాలు ఇంకా అనేకంవున్నాయనీ అనిపిస్తుంది. కొన్నిఅంశాలను, మరింత లోతుగా, గాఢంగా,విశే్లషణాత్మకంగా ఆయననుంచి పొందగలిగి వుంటే బాగుండుననిపిస్తుంది .‘కవిత్వమొక తీరని దాహం’అన్నట్లు, రజనిఆత్మకథా విభావరి కూడా ఒక తీరనిదాహమే! ఘంటసాల వంటి గాయకుడిని సమాదరించి, ఆకాశవాణిద్వారా పాడించి, సంగీత ప్రపంచానికి అందించిన కీర్తి రజనిగారికే దక్కుతుంది.ఆకాశవాణినీ, రజనినీ విడదీసి చూడడం అసాధ్యం కూడాను!


అంత గొప్పసాహిత్యసంగీతవేత్తా- ‘జేజిమామయ్య’గా బాలసాహిత్యంతో, పిల్లల పాటలతో పసిహృదయాలలో కూడా పాదుకోవడం నిజంగా అద్భుతమూ; అనితర సాధ్యమూనూ! రజని వంటి ప్రతిభామతి ‘నభూతోనభవిష్యతి’ అనాల్సిందే! ఆయన కాలంలోజీవించి వున్నందుకు సంతోష స్వాంతులం కావలసిందే! ఆ అనన్వయాలంకారంముందు- వినమ్రంగా అవనతలమై,అభినందన మందార మాలలుఅర్పించాల్సిందే.


అసమగ్రమనీ,ఇంకా ఎంతో విస్తారంగా ఆయన ఆత్మకథావిభావరి నందుకోవాలనీ అనిపించడమే ఈరచన వైశిష్ట్యం. ‘‘తనివి తీరలేదే... నామనసు నిండలేదే’’అన్న అతృప్తియే- ఈగ్రంధ విజయ దర్పణం.


- సుధామ



(రజనీ ఆత్మకథా విభావరి-
బాలాంత్రపు రజనీకాంతరావు
ఆత్మకథనం
ప్రతులకు: సత్యం ఆఫ్‌సెట్ ఇంప్రింట్స్,
బృందావనం, డో.నెం.49-28-5,
మధురానగర్,
విశాఖపట్నం-16.
వెల: రూ. 200/-)






4 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

రజనిగారు ఇంత వయసులో ఆత్మకధావిభావరి రచించిన విషయాలు, ఆయన గురించి మీరు తెలియజేసినందుకు
ధన్యవాదాలు. రజని గీతాలు సీడీ( ఆకశవాణి వారి విడుదల) నేను తరచు వింటుంటాను.

యమ్వీ అప్పారావు (సురేఖ) said...
This comment has been removed by the author.
phaneendra said...

రజని గారు ఆకాశవాణికీ, తెలుగు భాషకూ చేసిన సేవ చాలా గొప్పది. మంచి పుస్తకం పరిచయం చేసారు.

సుధామ said...

కృతజ్ఞతలు అప్పారావ్(సురేఖ)గారు,ఫణీంద్ర గారూ!