‘‘పొ త్తు అనగానేమి?’’ అని ప్రశ్నించాడు శంకరం.

 ‘‘నిఘంటువు అర్థాల సంగతి చెప్పుకోగలంగానీ ఇవాల్టి రాజకీయ వాతావరణంలో ‘అనగానేమి’అంటే చెప్పడం కష్టమే. ఇద్దరి ఇష్టంతో పొత్తు ఏర్పడుతుందనుకుంటాం గానీ ఇష్టంలేని బలవంతపు పొత్తులూ వుండవచ్చు అనిపిస్తోంది మరి’’ అన్నాడు సన్యాసి

.‘‘అదే మరి నా ప్రశ్న కూడానూ. బలవంతపు అన్నాక ఇంక పొత్తు అనేది ఎలా సంగతమవుతోంది, సంభవమవుతుంది అనేదే నా డౌటు. పొత్తు అంటే స్నేహము, చెలిమి అయితే ఇద్దరి ఇష్టంతో ఏర్పడాలి కదా! రాష్ట్రంలో టి.డి.పితో బి.జె.పి పొత్తు, బి.జె.పి. అధిష్ఠానపు బలవంతంతో ఏర్పడింది అంటున్నారు గానీ మనస్ఫూర్తిగా కానేకాదుట కదా! అందుకే తెలంగాణలో తె.రా.స. ఆధిపత్యాన్ని దెబ్బతీసే కుట్ర అంటున్నారు కొందరు. పొత్తు కుట్రగా మారిపోవడం చిత్రంగా లేదూ’’ అన్నాడు శంకరం.

‘‘పొత్తు అంటే సహస్థితి, కూడియుండుట అనే అర్థంకూడా ఉందోయ్. రెండు పార్టీలూ ఒకే స్థితిలో వున్నప్పుడు అలా కూడియుండుట కూడా పొత్తు అనే అనిపించుకుంటోంది. నిజానికి పొత్తు అంటే సమష్టి, అవిభక్తత, ఉమ్మడి అని అర్థాలున్నాయి. ఇప్పుడు అవిభక్తతకు చోటెక్కడిదీ! జూన్ రెండు తరువాత రాష్టమ్రే రెండు ముక్కలవుతోంది. అక్కడితో ఇన్నాళ్ళ ‘పొత్తు’ఇక సరి! ఇక సమష్టి, ఉమ్మడి అనే మాట లేక ఎవరికివారే కదా! అంచేత అసలు తెలుగుల ‘పొత్తు’కే విఘాతం ఏర్పడ్డాక ఈ తాత్కాలిక పొత్తులు సాధించేదేమిటి చెప్పు’’ అన్నాడు సన్యాసి.

‘‘పొత్తు అంటే ‘సంబంధం’అనే అర్థం కూడా వుందర్రా! అందుకే బి.జె.పి. జవదేకర్‌గారు పొత్తు అంటే పెళ్ళిలాంటిది అన్నారు’’ అన్నాడు ప్రసాదు.

‘‘అది మరీ డేంజర్ కదా! పొత్తు అంటే పెళ్ళి అయితే, బలవంతపు పెళ్ళి జరగడం ఎప్పటికైనా విడాకులకు దారితీసే ప్రమాదం వుంటుంది. అసలు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కలిసి విశాలాంధ్ర ఏర్పడడం గడుసు భర్తతో అమాయకపు పెళ్ళికూతురుకు పెళ్ళిచేసినట్లేనని నెహ్రూగారు ఆనాడే అన్నారంటారు కదా! ఇప్పుడు పెళ్ళికూతురు అమాయకంది ఏంకాదు. భర్తతో విడిపోయేలా పోరాడి మొత్తానికి గెలిచింది. ఇంక ఎవరి బ్రతుకు వారిదే. అయితే ఇప్పుడు బంధువర్గమే భర్త చెంత చేరేవారు భార్య చెంత చేరేవారు ఎవరు ఎవరిని సమర్ధించి ఎవరితో పొత్తుపెట్టుకుని సంచరిస్తారు అన్న స్థితిలో వున్నారు. ఆస్తులు పంపకాలు, విడాకుల మంజూరీ జరిగిపోతున్నాయి. వారిద్దరిమధ్యా ‘పొత్తు’అనే దాని గురించి కాకుండా ఎవరితో వారితో పొత్తుపెట్టుకోవాలన్న జన సంచలనం జరుగుతోందిప్పుడు. భార్యాభర్తలు విడిపోయినా ఇద్దరూ తమకు మిత్రులే అని పార్టీలవారు ఘోషిస్తున్నారు. వారిద్దరూ కలవకుండా చూస్తూనే తాము వారితో నెయ్యం నెరపాలని చూస్తున్నారు.

ఉత్తమమగు ద్రవ్యంబును
విత్తంబును నగ్రజునికి వింశాంశంబున్
బొత్తున నిచ్చి సహోదరు
లత్తి సమాంశంబుగొనుట యర్హంబెందున్

అని కేతన విజ్ఞానేశ్వరీయములో చెప్పిన వ్యవహార సూత్రం. కానీ పొత్తు ఛేదనం అనేది అన్నదమ్ముల వ్యవహారంలా చూస్తున్నామా భార్యాభర్తల విడాకుల్లా చూస్తున్నామా అన్నది అసలు నన్నడిగితే ఇప్పుడు కచ్చితంగా తేలవలసిన అంశం. అన్నదమ్ములు విడిపోతే జరిగే పంపకాలకీ, పొత్తు చెడి సంబంధం వద్దనుకుని భార్యాభర్తలు విడిపోతే జరిగే పంపకాలకీ తేడా వుంది. ‘మనోవర్తి’ వ్యవహారం వేరుకదా! అసలు మనసే విరిగిపోతే మనసుననుసరించి వర్తించడం ఎక్కడేడ్చింది’’అన్నాడు సన్యాసి.

‘‘పొత్తు అంటే పెళ్ళిలాంటిది అనకపోవడమే మంచిదనిపిస్తుంది ఆ లెక్కన చూస్తే! ఇప్పటికే బలవంతంగా అంటకట్టిన సంబంధం అనేకదా ‘పొత్తు’లేని తనంతో, ‘విభజన’పేర ‘విడాకులు’దాకా వచ్చింది. ఇకనైనా ‘పొత్తు’అంటే ‘సంబంధం’అని కాక, నిజంగా పార్టీల మధ్య ‘సమష్టి’, ‘స్నేహము’అనేది ముడిపడితేనే మంచిది. ఇప్పుడు ఎన్నికలవేళ పొత్తులు అధికారాల వేళ మళ్ళీ విభేదాలుగా, విడాకులుగా మారకుండా ‘బంతికుడుపు’గా నిజమైన ‘అవిభక్తత’గా నిలవడం అభిలషణీయం’’ అన్నాడు శంకరం.

‘‘అవసరాల సరాలు కూర్చుకోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికే ‘పొత్తు’లైతే ఏరుదాటేదాకా వుంటే ‘పొత్తు’ ఏరుదాటాక ‘చిత్తు’అయిపోయి, తెప్పను తగలేయడం జరుగుతుంది. ‘పొత్తు’అనేది తర్వాతెప్పుడో దూయడానికి దాచుకునే ‘కత్తిఒర’లా భావించడంగానే వుంటూ పైకి మాత్రం ‘‘కడుపులో లేనిది కావలించుకుంటే వస్తుం దా?’’అన్న చందాల వ్యవహరించడమే అవుతుంది. ‘పొత్తు’ ఏర్పరుచుకోవడం అంటే ఒక అభిప్రాయాన్ని స్థిరీకరించుకోవడం కాగలగాలి. పార్టీ కండువా మార్చడం అనేది కేవలం తన స్వార్థంకోసం, అధికార లాలసతోనే తప్ప ‘సిద్ధాంతపరమైన ఆలోచనాత్మక మార్పు’వల్ల కానప్పుడు అది పరిహాసాస్పదమే కానీ వేరుకాదు. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌లో టిక్కెట్టు ఎవరిస్తే ఆ పార్టీకి వలసపోవడమేలా వుంది వ్యవహారం. టిడిపికి చెందిన మెదక్ ఎంఎల్‌ఏ మైనంపల్లి హనుమంతరావు మూడురోజుల్లో మూడు పార్టీలు మారారు. మల్కాజ్‌గిరి సీటు చంద్రబాబు ఇవ్వలేదని కాంగ్రెస్‌లో చేరారు. తీరా కాంగ్రెస్ ఆ స్థానం టిక్కెట్టు వేరొకరికి కేటాయించడంతో ఇప్పుడు కె.సి.ఆర్. టి.ఆర్.ఎస్.లో చేరిపోయారు. సీట్ల కేటాయింపులకోసమే పార్టీలమధ్య పొత్తులు సాగుతున్నదీను. రాజకీయం అంటే ఒక రొచ్చు అనిపించేదిందుకే. ‘పాలిటిక్స్ ఆర్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్క్రౌండ్రల్స్’ అన్నమాట ఊరికే పుట్టలేదు. పుట్టలేనప్పుడు పుట్టగతులూ వుండవు. పువ్వు పుట్టగానే పరిమళించాలి అంటారు గానీ పువ్వు ‘పుట్ట’గా కాక, పువ్వుగానే పరీమళించడం అవసరం’’ అన్నాడు ప్రసాదు.