ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, April 5, 2014

ఫ్యామిలీ డ్రామా


‘ఎన్నికల్లో ఎవరయినా పోటీ చేయవచ్చుకదా! మరి రాజకీయాల మీద ఆసక్తితో యువత ఎవరయినా రంగంలోకి దిగచ్చు కదా! ఉద్యోగానే్వషణకు బదులు రాజకీయ రంగప్రవేశం చేయవచ్చుగా’’ అన్నాడు సన్యాసి.

‘‘
లేవాడివే! ఎవరయినా పోటీ చేయవచ్చు అనడంలోనే ‘పోటీ’అనే దానిని సరిగా అర్థం చేసుకోవాలి. ఉద్యోగానికి కోరే క్వాలిఫికేషన్స్ మాత్రమే రాజకీయాలకు వర్తిస్తే ఎప్పుడో ఎందరో పోటీపడేవారు కానీ ఎన్నికల్లో నిల్చోవాలంటే బియ్యేలు, ఎమ్మేలు లేదా డాక్టరేట్లు కాదుకదా కావలసింది. పరోపకారం, సంఘసేవా నైజం వుంటే చాలుననుకుంటే అదీ వెర్రియే! కావలసింది మందీ, మార్బలం. బోలెడు ఫాలోయింగ్ వుండాలి. ఫేస్‌బుక్ అకౌంట్ వుంది అందులో వేల మంది ఫ్రెండ్స్ వున్నారు. నేనన్నదానికి బోలెడు లైకింగ్‌లు, సపోర్టింగ్ కామెంట్‌లూ వస్తూంటాయి. అంచేత నాకు బోలెడు ఫాలోయింగ్ వుందని ఎన్నికల అభ్యర్థిత్వం కోరుకుంటే అమాయకత్వమే అవుతుంది. ఎంత ఫాన్ ఫాలోయింగ్ వున్నా, అనుచరగణం వున్నా అది ఓట్ల రూపంలో ప్రతిఫలించక కాకలుదీరిన రాజకీయ నేతలే డిపాజిట్లు గల్లంతై బోర్లాపడిన సందర్భాలున్నాయి. అంచేత ఎన్నికల్లో నామినేషన్ వేయడం కూడా ఈజీ కాదు సుమా!’’ అన్నాడు నవ్వుతూ ప్రసాదు.

‘రాజకీయం అంటే ఎవరుపడితేవారు దిగిపోగలిగిందే అయితే మార్పు ఎప్పుడో వచ్చేది. ప్రజాస్వామ్యం అన్నది పేరుకే గానీ ధనస్వామ్యం లేని ఎన్నికలు ఊహించలేవు. ఏ పార్టీలోనో చేరి దాని దన్నుతో టికెట్ సంపాదించి ఎన్నికలకు నిలబడగలిగితే అది వేరు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలంటే కూడా సుళువేమీ కాదు. నువ్వో స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేయదలుచుకున్నావ్ అనుకో! నువ్వు నామినేషన్ దాఖలుచేయదలచిన నియోజకవర్గం పరిధిలోని కనీసం పది మంది ఓటర్లు నీ పేరును ప్రతిపాదించాలి. అదే ఏ గుర్తింపుపొందిన పార్టీ అభ్యర్థిగానో నామినేషన్ వారి సపోర్ట్‌తో వేయదలచినపుడు ఒకరు ప్రతిపాదిస్తే చాలు. నువ్వు అసెంబ్లీకి పోటీచేయదలిస్తే పదివేల రూపాయలు, పార్లమెంట్‌కు పోటీ చేయదలుచుకుంటే ఇరవై అయిదువేల రూపాయలు డిపాజిట్టుగా చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే అందులో సగం చెల్లిస్తే చాలు. ఇంకో విషయం రంగంలోకి దిగితే మరి ప్రచారం చేసుకోక తప్పదుగా. అసెంబ్లీ అభ్యర్థిగా 28 లక్షల రూపాయల వరకూ, పార్లమెంట్ అభ్యర్థిగా 70 లక్షల వరకూ ఖర్చుచేయచ్చు’’ అన్నాడు రాంబాబు.


‘‘ఓర్నీ! అదా సంగతి! అన్ని లక్షల రూపాయలు మనదగ్గరుంటే, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో వేసి, దానిమీద వచ్చే వడ్డీతో నెలనెలా కడుపులో చల్ల కదలకుండా తిని తొంగుంటే చాలుననుకునే మధ్యతరగతి మనస్తత్వం మనది. గెలుస్తామో, ఓడుతామో, మన వెంట వుండి ఓటువేయగల మందీ మార్బలం ఎవరో తెలియనప్పుడు ఉన్న డబ్బు రాజకీయానికి ఖర్చుపెట్టేసేంత రాజకీయం పిచ్చి, అధికార వ్యామోహం సామాన్య జనానికి ఎందరికుంటుంది? ఓకే! అదే నిజంగా ఓ జాతీయ పార్టీ మద్దు, దన్ను వుంటే- ఆ పార్టీని అభిమానించే ఓటర్లు ఆ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మనమైతే గెలిపిస్తారేమోనని కొంతయినా ఆశించాలి. అందుకే పార్టీలు కూడా బడాబడా వ్యాపారులకీ, జనం భయంతోనో, భక్తితోనో వెన్నంటి వుండే ఓ రౌడీకో, గూండాకో మద్దతునిచ్చి టికెట్ ఇస్తాయి గానీ ‘‘నాకు రాజకీయాలంటే బోలెడు ఇష్టం, నేను పొలిటికల్ సైన్స్‌లో డాక్టరేట్ చేశాను. నేను అభ్యర్థిగా నించుంటా మద్దతివ్వండి’’ అంటే- ‘చాల్లేపోవోయ్!’ అనే అంటాయి కామోసు’’ అన్నాడు సన్యాసి.


‘అదేకదా మరి! అందుకే రాజకీయాలంటే అధిక డబ్బు, వ్యాపార లావాదేవీల ఘనకృత్యాలు, భయపెట్టగలిగే రౌడీయిజం, గూండాయిజం, కేరేఔట్‌గా వుండే నేర మనస్తత్వం ముఖ్యం. లేదా ఆ కుటుంబం కుటుంబం రాజకీయాల్లోనే వుందా అని ప్రధానంగా చూస్తున్నారు కానీ- సేవాభావం, పరోపకార పరాయణత్వం, నిజాయితీ, చిత్తశుద్ధి, పాలనాదక్షత అనేవి గుర్తింపబడడం లేదు. ‘రాజకీయం’వ్యాపారంగా భావించే పెట్టుబడీ, తద్వారా వీలైనంత త్వరగా, పెట్టుబడి తిరిగి తెచ్చుకోవడమేకాక, వీలున్నంత ‘అధిక సంపాదన’అన్నది ముఖ్యమై కూర్చుంటోంది. అందుకే ఎంతవద్దనుకున్నా రాజకీయాల్లో ‘వంశపారంపర్యం’అన్నది కనిపిస్తూనే వుంటుంది’’అన్నాడు ప్రసాదు. ‘‘అంతా ఫ్యామిలీ డ్రామా యే!’’ అని కూడా అన్నాడు.


‘‘పాపం! కాదులేవోయ్! ‘ఒక కుటుంబానికి- ఒకే టికెట్’అనే సూత్రం పాటించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందిట! మొన్న సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వార్‌రూమ్‌లో, సోనియాగాంధీ సమక్షంతో అభ్యర్థుల జాబితా సమీక్ష జరిగిందిట! ఒక కుటుంబంనుంచి ఒకరికి టికెట్ ఇచ్చినప్పుడు, అదే కుటుంబానికి చెందిన వేరొకరికి పార్టీ టికెట్ ఇచ్చే ప్రశే్నలేదని సోనియాయే స్పష్టం చేశారట!.. అసలు నన్నడిగితే ఒక కుటుంబం నుంచి ఒక్కరే రాజకీయాలలో ఉండాలనీ, వారు స్వచ్ఛందంగా రాజకీయాలలో విరమించాకే, వేరొకరు రంగంలోకి దిగాలనే నిబంధన ఉంటే బాగుంటుంది. కానీ మన దేశంలో అలా ఉండదుగా! ఒకే కుటుంబంలోని సభ్యులు- ఒకే పార్టీలో ఉండడం అనేదే చేయరు!! గాంధీ, నెహ్రూ కుటుంబ వారసులే కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతూ వస్తారనుకుంటాం. కానీ వారి కుటుంబంనుంచీ పక్క పార్టీల్లోకి వెళ్ళిన మేనకాగాంధీ లాంటి వాళ్ళున్నారు. అధికారంలోకి ఏ పార్టీవచ్చినా తమ కుటుంబ సభ్యులొకరు అందులో కీలకంగా వుండేలాగా కుటుంబంలోని తలా ఒకరూ తలా ఓ పార్టీలో చేరి ‘ప్రజాసేవ’అని ఊదరగొట్టడం, పైకి మాత్రం భర్తమీద భార్యయో, అన్నమీద తమ్ముడో రాజకీయ ప్రత్యర్థిగా వేర్వేరు పార్టీల్లో వుండి కత్తులు దూసుకుంటున్నట్లు కనబడడం ఇదంతా ఓ డ్రామా! అందుకే రాజకీయం, సినిమా రంగం కూడా అవిభక్త కవలలై పోతున్నాయి. ఈ దేశానికి దేవుడేదిక్కు అనుకుంటాను’’ అంటూ పెదవి విరిచి లేచాడు రాంబాబు.

0 comments: