‘‘పొ త్తు అనగానేమి?’’ అని ప్రశ్నించాడు శంకరం.
‘‘నిఘంటువు అర్థాల సంగతి చెప్పుకోగలంగానీ ఇవాల్టి రాజకీయ వాతావరణంలో ‘అనగానేమి’అంటే చెప్పడం కష్టమే. ఇద్దరి ఇష్టంతో పొత్తు ఏర్పడుతుందనుకుంటాం గానీ ఇష్టంలేని బలవంతపు పొత్తులూ వుండవచ్చు అనిపిస్తోంది మరి’’ అన్నాడు సన్యాసి
.‘‘అదే మరి నా ప్రశ్న కూడానూ. బలవంతపు అన్నాక ఇంక పొత్తు అనేది ఎలా సంగతమవుతోంది, సంభవమవుతుంది అనేదే నా డౌటు. పొత్తు అంటే స్నేహము, చెలిమి అయితే ఇద్దరి ఇష్టంతో ఏర్పడాలి కదా! రాష్ట్రంలో టి.డి.పితో బి.జె.పి పొత్తు, బి.జె.పి. అధిష్ఠానపు బలవంతంతో ఏర్పడింది అంటున్నారు గానీ మనస్ఫూర్తిగా కానేకాదుట కదా! అందుకే తెలంగాణలో తె.రా.స. ఆధిపత్యాన్ని దెబ్బతీసే కుట్ర అంటున్నారు కొందరు. పొత్తు కుట్రగా మారిపోవడం చిత్రంగా లేదూ’’ అన్నాడు శంకరం.
‘‘పొత్తు అంటే సహస్థితి, కూడియుండుట అనే అర్థంకూడా ఉందోయ్. రెండు పార్టీలూ ఒకే స్థితిలో వున్నప్పుడు అలా కూడియుండుట కూడా పొత్తు అనే అనిపించుకుంటోంది. నిజానికి పొత్తు అంటే సమష్టి, అవిభక్తత, ఉమ్మడి అని అర్థాలున్నాయి. ఇప్పుడు అవిభక్తతకు చోటెక్కడిదీ! జూన్ రెండు తరువాత రాష్టమ్రే రెండు ముక్కలవుతోంది. అక్కడితో ఇన్నాళ్ళ ‘పొత్తు’ఇక సరి! ఇక సమష్టి, ఉమ్మడి అనే మాట లేక ఎవరికివారే కదా! అంచేత అసలు తెలుగుల ‘పొత్తు’కే విఘాతం ఏర్పడ్డాక ఈ తాత్కాలిక పొత్తులు సాధించేదేమిటి చెప్పు’’ అన్నాడు సన్యాసి.‘‘పొత్తు అంటే ‘సంబంధం’అనే అర్థం కూడా వుందర్రా! అందుకే బి.జె.పి. జవదేకర్గారు పొత్తు అంటే పెళ్ళిలాంటిది అన్నారు’’ అన్నాడు ప్రసాదు.
‘‘అది మరీ డేంజర్ కదా! పొత్తు అంటే పెళ్ళి అయితే, బలవంతపు పెళ్ళి జరగడం ఎప్పటికైనా విడాకులకు దారితీసే ప్రమాదం వుంటుంది. అసలు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ కలిసి విశాలాంధ్ర ఏర్పడడం గడుసు భర్తతో అమాయకపు పెళ్ళికూతురుకు పెళ్ళిచేసినట్లేనని నెహ్రూగారు ఆనాడే అన్నారంటారు కదా! ఇప్పుడు పెళ్ళికూతురు అమాయకంది ఏంకాదు. భర్తతో విడిపోయేలా పోరాడి మొత్తానికి గెలిచింది. ఇంక ఎవరి బ్రతుకు వారిదే. అయితే ఇప్పుడు బంధువర్గమే భర్త చెంత చేరేవారు భార్య చెంత చేరేవారు ఎవరు ఎవరిని సమర్ధించి ఎవరితో పొత్తుపెట్టుకుని సంచరిస్తారు అన్న స్థితిలో వున్నారు. ఆస్తులు పంపకాలు, విడాకుల మంజూరీ జరిగిపోతున్నాయి. వారిద్దరిమధ్యా ‘పొత్తు’అనే దాని గురించి కాకుండా ఎవరితో వారితో పొత్తుపెట్టుకోవాలన్న జన సంచలనం జరుగుతోందిప్పుడు. భార్యాభర్తలు విడిపోయినా ఇద్దరూ తమకు మిత్రులే అని పార్టీలవారు ఘోషిస్తున్నారు. వారిద్దరూ కలవకుండా చూస్తూనే తాము వారితో నెయ్యం నెరపాలని చూస్తున్నారు.
ఉత్తమమగు ద్రవ్యంబునువిత్తంబును నగ్రజునికి వింశాంశంబున్
బొత్తున నిచ్చి సహోదరు
లత్తి సమాంశంబుగొనుట యర్హంబెందున్
అని కేతన విజ్ఞానేశ్వరీయములో చెప్పిన వ్యవహార సూత్రం. కానీ పొత్తు ఛేదనం అనేది అన్నదమ్ముల వ్యవహారంలా చూస్తున్నామా భార్యాభర్తల విడాకుల్లా చూస్తున్నామా అన్నది అసలు నన్నడిగితే ఇప్పుడు కచ్చితంగా తేలవలసిన అంశం. అన్నదమ్ములు విడిపోతే జరిగే పంపకాలకీ, పొత్తు చెడి సంబంధం వద్దనుకుని భార్యాభర్తలు విడిపోతే జరిగే పంపకాలకీ తేడా వుంది. ‘మనోవర్తి’ వ్యవహారం వేరుకదా! అసలు మనసే విరిగిపోతే మనసుననుసరించి వర్తించడం ఎక్కడేడ్చింది’’అన్నాడు సన్యాసి.
2 comments:
కొన్ని పువ్వులు పుట్టగానే పరిమళించినట్టు కొన్ని పొత్తులు కట్టగానే విచ్చిపోతుంటాయి,కట్టుబాటు బలంగా లేక:-)
భలేమాటన్నారు హరిబాబు గారూ!మీ స్పందనకు ధన్యవాదాలు
Post a Comment