విషయం కన్నా వైవిధ్యం మిన్న
బొల్లిముంత వెంకటరమణరావు ‘విభిన్న భూమికలు’ పాంటమ్ కవిత్వంగా వెలువరించారు. ఇది కూడా లఘు కవితా ప్రక్రియే. ఈ పాంటమ్ కవితా ప్రక్రియ మలేషియాకు చెందినది. 15వ శతాబ్దానికి చెందిన ఈ ప్రక్రియలో కవిత నాలుగు భాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క భాగం నాలుగు వరసలు కలిగి ఉంటుంది. ప్రతి భాగంలోని రెండవ వాక్యం మలి భాగంలో మొదటి వాక్యంగా మొదలవుతుంది. అలాగే ప్రతి భాగంలోని నాలుగవ వాక్యం మలి భాగంలో మూడవ వాక్యంగా వస్తుంది. కవి భావనాశక్తి అనుగుణంగా పాంటమ్ ప్రక్రియ ద్వారా దీర్ఘ కవిత కూడా వ్రాయవచ్చుననే వెంకటరమణరావు నలభై నాలుగు కవితా ఖండికలను పాంటమ్‌గా తెలుగులో అందించారు. బహుశా తెలుగులో ఇదే తొలి యత్నం కావచ్చు.
అలాగే ‘సెవెన్ లింగ్’ అనే ఏడు పంక్తుల ప్రక్రియ మూడు భాగాల విభజనతో మొదటి రెండు భాగాలు మూడేసి పంక్తులు గాను చివరి భాగం ఒక పంక్తితో ముగింపు వాక్యంగానూ కవిత్వ సారాంశంతో వుంటుంది. మొదటి మూడు పంక్తులు ఒకే విషయం లేదా అందుకు విరుద్ధమైన భావం కలిగి వుండవచ్చు.
నాలుగునుండి ఆరు పంక్తుల వరకు వస్తువుకు అనుగుణంగా దానితో సంబంధం కలిగి ఉండాలి. వస్తువులోని విషయం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విషయం వ్యక్తపరచాలి. చివరి వాక్యం అంటే ఏడవ పంక్తి పూర్తి సారాంశాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. ఇక వేరే ఎలాంటి నియమ నిబంధనలూ సెవెన్‌లింగ్ ప్రక్రియలో లేవు. అలాంటి ఆరు కవితా ఖండికలు ఇందులో రాసారు.
అలాగే ‘త్రోలాన్’ అనే ప్రక్రియలో మూడు కవితలు ఉన్నాయి. ఇది నాలుగు భాగాలుగా ఒక్కో భాగం నాలుగు వరసలతో వుంటుంది. ఇందులో ప్రాస విధానం ఉన్నదిట గానీ తెలుగులో భావ సౌలభ్యం కోసం ఉపయోగించలేదట
ఇక ‘త్రిటిన’ అనే ప్రక్రియలో నాలుగు కవితా ఖండికలున్నాయి. ఈ ‘త్రిటిన’ పది వాక్యాలు కలిగిన నాలుగు భాగాల కవిత. మొదటి మూడు భాగాలు మూడు వరసలు కలిగి వుంటుంది. నాలుగో భాగం ఒకే వాక్యంలో కవితలో వాడిన మూడు పదాలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో ముఖ్యంగా మూడు పదాల చుట్టు కవిత అల్లిక ఉంటుంది. ప్రాస ఏమీ ఉండదు.
పాంటమ్-త్రోలాన్-సెవెన్‌లింగ్స్-త్రిటిన అనే నాలుగు ప్రక్రియలను తెలుగులో పరిచయం చేస్తూ మొత్తం 57 కవితలను ‘విభిన్న భూమికలు’గా వెలువరించిన ఈ కవిత్వం చూస్తే ప్రక్రియా నవ్యతను మించి పరమ ప్రయోజనం మరేం వుందన్నది అర్థం కాదు. వాహిక ఏదయినా కవిత్వం కావాలి కవిత్వం అన్నమాట నిజం. ప్రక్రియ కోసం ప్రక్రియ అన్న భావన ఏదో ప్రయోగతౌల్యంగానూ నవ్య సంచలనా భావనగానూ స్ఫురిస్తుంది తప్ప మరోలా తోచదు
‘కీర్తి దుప్పటి!’ అనే ఖండిక ‘పాంటమ్’గా రాసిందే-
గుర్తింపు వీసా ఆలస్యమైందని చిరాకు పడతారు
సన్మానితుని కళ్లలో ఖర్చుతో పండిన ఆనంద బాష్పాలు
లోకం సోకు సొమ్ములలోనే ఉందనే తిరకాసు తెలిస్తే సరి
ముఖ్య అతిథిగా పెద్ద ముత్తయిదువ పేరంటం పిలుపు అంటారు అందులోని ఓ భాగంలో.
సిరి చుక్కల సందడిలో ఆయనే అన్నట్లు-
పైత్యం కాస్త గొప్ప కవిత్వంగా మారుతుంది
పదాలకు కాస్తంత భావుకత దట్టించిన తర్వాత
భావ గాంభీర్యత లేని అహం నర నరాన ఆవహిస్తుంది
తెల్లకాగితం మీద మరకల్లా అక్షర రేణువులు
వర్తమాన కాలపు సాహిత్య కవిత్వపు ఆర్భాట విభిన్న భూమికలలో ప్రక్రియా వైవిధ్య ప్రయోగా తౌల్యంగా తప్ప మరేవిధంగానూ కవిత్వ పిపాసుల దాహం తీరదు.
కవిత్వం ఒక ఆల్కెమీ. దాని రహస్యం ప్రక్రియలో ఉండదు. కవితలలో, కవి ‘తలలో’ ఉంటుంది. జపనీస్, మలేషియన్ కవిత్వం అంటూ కొత్తదనం పరుగులు పెట్టాల్సిన అగత్యం లేదు. వేలాది ఛందో రీతులు మన సొంతం. పంచెకట్టు మాని ప్యాంటు ధరించడం ఫ్యాషనుగానూ అలవాటుగాను మారిపోయాక ఈ ముచ్చట్ల షోకులు ఒక రకం మురిపాలే మరి!
విభిన్న భూమికలు
(పాంటమ్ కవిత్వం)
-బొల్లిముంత వెంకటరమణారావు
వివిధ బుక్ సర్కిల్
3-1-116, విద్యానగర్ కాలనీ,
చెంచుపల్లి పోస్ట్,
కొత్తగూడెం 507101.
వెల: రూ.65/-
సజీవన చిత్రణ
రచయిత్రి కన్నెగంటి అనసూయ జీవన శిల్పం బాగా పట్టుకున్నారు. అందుకే ఆవిడ కథానికల్లో శిల్పం, శైలి అంటూ ప్రాకులాడక మానవ జీవన సంవేదనలకు ఆలోచనాత్మకమైన అక్షరాకృతి నివ్వడమే ప్రధానంగా రచన చేసారు.
జీవితాన్ని జీవించడం తప్ప నటించడం సరికాదని ప్రగాఢంగా విశ్వసించిన కలం తనది. కథలు కథలకోసమే కాదు సాటివారి జీవన వ్యధలు సాధ్యమైనంత మేరకు తీర్చగలిగే సేవా దృక్పథానికి ప్రోది కావాలన్న సంకల్పం గల రచయిత్రి కనుకనే మానవ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి తన రచనలే కాక మాటలూ, చేతలూ కూడా సాటివారి సహకారంతో తదనుగుణంగా నిర్వర్తిస్తున్న సేవాపరాయణ అనసూయ. అమ్మగారి స్ఫూర్తితోనే కమ్మని కథలు రాయడం అలవడిందంటారు.
ఇరవై కథల ఈ సంకలనంలోని కథలన్నీ అనురాగాలకు, ఆర్ద్రతలకు, మానవీయతకూ అద్దం పట్టేవిగా ఉన్నాయి.
‘బియ్యపు రవ్వ ఉప్మా’ అనే కథలో అమ్మ ఆప్యాయతకే కాదు, మాతృభూమి మమకారానికీ ‘ఉపమ’గా వృద్ధాప్యపు రాజారావు జ్ఞాపకాల మనుగడను మనోజ్ఞంగా చిత్రించారు. మనసుకు మనసు పరంబగునప్పుడు కంటికి నీరు ఆదేశంబగునని చాటుతూ రాసిన చిన్న కథే అయినా ‘ఏ సంధి’ అంతరంగపు సందులోకి చొరబడకుండా వుండదు. పినతల్లే తల్లిగా పసివాడి వసివాడని విశ్వాసాన్ని కథనం చేసిన తీరు బాగుంది.
మోసం, వంచన అనే వాటికి ‘జెండర్’ అంటూ ఏమీ లేదు. మోసం చేయడానికైనా, మోసపోవడానికైనా. రచయిత్రి తాను స్ర్తి అయివుండీ కొందరు సంఘంలో స్ర్తిలే ఎలాంటి వంచనలు చేస్తుంటారో ‘రెండొందలు’ కథలో చిత్రించారు. అంతేకాదు మహిళా సంఘాలు, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ల వంటివి కూడా అలాంటి వారిని వెనకేసుకు రాకూడదని ధ్వనింపచేసారు.
‘పడమటి సంధ్యారాగం’ అనే కథ పేరు ఆ కథకి ఎలా నప్పిందో తెలియదుగానీ, సాహిత్యాభిలాష ఉన్న ఓ పంజాబీ సైకియాట్రిస్ట్ రైల్వే స్టేషన్‌లో పిచ్చిదానిగా పుస్తకాల మూటతో నలుగురితో చీత్కరింపబడుతూ కనబడే విషాద సంఘటనను కథగా చిత్రించారు. కానీ ఆవిడ అలా మారడానికి గల కారణం కథలో ఎక్కడా చిత్రించబడలేదు.
అంత విద్యాధికురాలు పిచ్చిదవడానికి గల హేతువు వివరించకుండా చెప్పడంవల్ల ఆ పాత్రమీద సానుభూతికి సాంద్రత గాఢత సమకూడినట్టు తోచదు.
వయోజన విద్య గూర్చిన అక్షర దీక్షా చైతన్యాన్ని ‘చైతన్యం’ వంటి కథలో చూపించి ప్రభుత్వ పథకాలని త్రోసిరాజనక ప్రజాప్రయోజన అంశాలు అందరూ అందిపుచ్చుకుని ప్రచులితం కావించవలసినవేనని అనిపించారు.
‘‘ఒక్క చిరునవ్వుతో సగం రోగాన్ని డాక్టరు నయం చెయ్యగలడు. మిగతా సగం రోగానికే డాక్టరు మందిచ్చేది. ఆ ఒక్క చిరునవ్వు ఆ రోగిలో ఎంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందో అంతే నమ్మకాన్ని డాక్టరుపట్ల పెంచుతుంది’’
‘‘మాటలూ భావాలూ ఏమీ లేని మొక్క కూడా ఒక చోట పీకి ఇంకోచోట వేస్తే మట్టీనీరూ రెండూ ఉన్నా, సరిగ్గా నిలబడడానికి వారం పైనే పడుతుంది. తర్వాత ఏ ఆటంకం లేకుండా అది ఎదుగుతూనే ఉంటుంది. ఇక మనుష్యుల సంగతి వేర్వేరు చోట్ల పెరిగొచ్చిన ఇరువురు వ్యక్తుల అభిప్రాయాలు కలవటానికి, ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి వారం, నెల లేదా సంవత్సరం పట్టవచ్చు. అచ్చంగా మట్టిలో బతకడానికి ప్రయత్నించే మొక్కలు. కాకపోతే ఈలోపు కాస్త ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి అంతే!’’
రెండు విభిన్న పాత్రల ద్వారా ఈ సందేశాలను సంకలించిన కథ ‘చిరునవ్వు’.
అదృష్టం మనతోనే మనని వెన్నంటి ఉంటుందట. మనం కష్టపడితే అదృష్టమూ కష్టపడుతుందట. మనం నిద్రపోతే అదీ నిద్రపోతుందట అన్న అంశంతో చిత్రించిన కథ' ప్రోత్సాహం.'
అనసూయ కథల నిండా ఇలా జీవన సారస్యాన్ని వివరించే మంచి పంక్తులు సంభాషణలుగా, వ్యాఖ్యానాలుగా ఔచిత్యంతో తొణికిసలాడుతుంటాయి. అందుకే జీవన శిల్పం అంటే ఉదాత్త ఆశయాల విలవల శిల్పీకరణమే అనిపింపచేస్తారు. చదివించే మంచి శైలి అలవాటే ఈ యలమాటి పుట్టింటి పడతికి. కనె్నగంటి అనసూయగారి వెన్నవంటి మృదుభావాల మానవీయ కథానికల సంపుటి ‘జీవన శిల్పం’.
-సుధామ
జీవన శిల్పం (కథానికలు)
- కనె్నగంటి (యలమాటి) అనసూయ
వెల: రూ.100/-
శ్రీ రవి పవన్ పబ్లికేషన్స్
406, వింధ్య-4
జయభారతి గార్డెన్స్
కుక్కట్‌పల్లి ‘వై’ జంక్షన్
హైదరాబాద్ 18.
0 comments:
Post a Comment