ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, February 22, 2014

తీపి జ్ఞాపకాల మిఠాయి పొట్లం..



‘‘బార్ బార్ ఆతీ హై ముఝకో
మధుర్‌యాద్ బచపన్ తేరీ
గయాలేగయా తూనే
జీవన్‌కే సబ్‌సె బడీ ఖుషీమేరీ’’

అన్న సుభద్రకుమారి చౌహాన్ బాల్యం గురించి రాసిన, చిన్నప్పుడు చదువుకున్న హిందీ కవిత గుర్తుకువచ్చింది. గోవిందరాజు మాధురి ‘మధురిమలు’ చదువుతుంటే. ఇవి నిజంగానే బాల్యపు మధురిమలు కథలంటారో, గల్పికలంటారో, వాక్చిత్రాలంటారో పేరేమిపెట్టినా, పసితనపు పిల్లల మనోరథాలు, బడి ముచ్చట్లు, అల్లర్లు, ఉమ్మడి కుటుంబపు ఇంట్లో అన్నలు, అక్కయ్యలు తోటి సరదాలు సహజంగా, మనసును తాకేలా ఇందులోని పదింటిలోనూ పదిలంగా అందించారు. అన్నింటిలోనూ మాధురియే రచయిత్రి మాధురి. ఈ అనుభూతులుగా మలచి అందించారనిపిస్తుంది. హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌లో ఆఫీసర్‌గా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణానంతరం స్వస్థలంలో స్థిరపడిన రచయిత్రి బాల్య జ్ఞాపకాల రిసోర్స్‌ను ఈ రచనలుగా డెవలప్‌చేస్తూ స్వచ్ఛంద మానసంతో అక్షరీకరించిన అందమైన ఆనందమైన అనుభూతి కథనాలివి. అన్నల అనురాగం, అమ్మానాన్నలతోబాటు వంటచేసే రావులమ్మగారూ చూపే ఆప్యాయతలు, స్నేహితురాండ్ర చెలిమి ముచ్చట్లు వీటన్నింటినీ హాయిగా రాయడమేకాదు వీటికి స్నేహితురాళ్ళ అభిప్రాయాలే అట్టవెనుక సంతరించడం రచయిత్రి హృదయంగమత్వానికి దర్పణం.

తమ బాల్యాన్ని, అందులోని మధుర జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునేలా పాఠకులను అలరించగల ఈ రచన నిజానికి ఉత్తమ బాలసాహిత్య గ్రంథం అనాలి. బాల సాహిత్యం అంటే బాలలకోసం రాసిన సాహిత్యమే అని కాదు, బాలభావనలతో రాసిన సాహిత్యం అని చెప్పాలంటే ‘మధురిమలు’ ఒక మంచి నిదర్శనం. ‘ఘంటసాల మా అన్నయ్యలో’ బడి ప్రార్థనాగీతం గురించీ, ‘లైన్‌లో నుంచుంటే లైసెన్సులు’లో చిన్నపిల్ల రికమండేషన్ పనులు సానుకూలం చేయడం గురించీ ముగ్ధమనోహరంగా చెబుతే ‘క’్భష చిన్నప్పటి రోజుల్లో ఎంత విరళంగా, నాటి పిల్లల్లో ప్రాచుర్యంతో వుండిందో ‘కపె-కళ్ళి-కచూ -కపు-కలు’ చెబుతుంది. నిజంగా సంకలనంలో ఆ రచన కచాకలాకబా కగుం కది చిన్నప్పటి ఆ సీక్రెట్‌లలోని మధురిమలే వేరు మరి! ‘దేముడూ! నీవు ఎక్కడ’ బస్సు ప్రయాణపు కబుర్లతో, పుణ్యప్రదేశ సందర్శనంతోబాటు ‘దేముడు’ మనిషిని గూర్చిన వెతుకులాట ఘటనని రసరమ్యంగా వివరిస్తుంది.

బాల్యపు మధురిమలను మిఠాయి పొట్లంగా చుట్టి ఇచ్చినట్లున్న ఈ ‘మధురిమలు’ అందించిన గోవిందరాజు మాధురి అభినందనీయులు. ఇలాం టి ‘మధురిమలు’ను మరిన్ని వారు అందించి బాల సాహిత్య దీధితులను విస్తరింపచేయగలరని ఆకాంక్షిద్దాం. తమ మొదటి రచనను ఇలా మనముందుకు తీసుకువచ్చినందుకు మిక్కిలి సంతోషంగా ఉన్నది.
  • - సుధామ

మధురిమలు (కథలు)
- గోవిందరాజు మాధురి
వెల: రూ.100/-
- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్‌భవన్, రాజీవ్ స్వగృహ ఎదురు,జి.ఎస్.ఇ.పోస్ట్
బండ్లగూడ,

హైదరాబాద్- 500068.

Andhrabhoomi (Daily) Akshara 22.2.2014

0 comments: