'ఏమిటోయ్ సుబ్బారావూ ఏం చేస్తున్నావూ
పనిచేస్తేగానీ నువ్వు తగ్గవోయ్ లావూ
వేరేచోటికి తప్పదు బదిలీ ...
వొళ్లొంచి సరిగా పనిచేయకపోతే నీవు'
అంటూ
ఓ ఆఫీసర్‌గారు తన క్రింది ఉద్యోగితో అన్నారట. సరిగా పనిచేయకపోతే నీకు ట్రాన్సఫర్
తప్పదు అన్న హెచ్చరికనే ఆయన చేసినా సుబ్బారావుతో ఆయనలా మాటాడుతున్నప్పుడు అందరూ
నవ్వేస్తారు. సుబ్బారావుకు కూడా తగలాల్సినచోట ఆ హెచ్చరిక తగుల్తుంది కానీ మామూలుగా
తిడితే వచ్చే కోపమో, ఉక్రోషమో అంతగా రాకపోవచ్చు. మన భాషలో సొగసులో ప్రాస భాషణం
ఒకటి.
అంత్యాను ప్రాసతో మాట్లాడడం కొందరికి అలవాటు. అందులో ఓ అందం వుంది. ప్రాస అతి అయితే, ఆ కుతికి మతిపోయినట్లయి, వెగటూ కలిగించవచ్చనుకోండి. అది వేరు రీతి.
ప్రాస అనేది ఒక ఆలంకారిక ధోరణి. ఛందోబద్ద పద్య రచన చేయడానికి అనివార్యంగా యతి, ప్రాసల గురించి తెలిసి వుండాలి. పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాసస్థానంగా, నాలుగుపాదాల్లోనూ నియతిగల రచనా విధానం కావ్యాల్లోనూ కనిపిస్తుంది.
ప్రబంధకాలం గతించి ఆధునిక యుగంలోనూ గేయ కవిత్వంలో ప్రాస సంవిధానం సొబగులున్నాయి.
వచన కవిత్వం వచ్చాక కూడా వచన కవితా పితామహుడు అనిపించుకున్న కుందుర్తి ప్రాసలకు ముఖ్యంగా అంత్యప్రాసలకు చోటిచ్చారు.
అసలు కవిత్వం అంటే ప్రాసయుక్తంగా వుండడమనే భావన వున్నవారూ వున్నారు. అలా ప్రాసలతో సంభాషణల్లో అలవోకగా మాట్లాడేవారిని ‘కవిత్వం చెపుతున్నాడు రోయ్’ అనుకోవడమూ వుంది. ఆగ్డన్‌నేష్ అనే ఆంగ్ల కవి ప్రభావంతో ఆరుద్రరాసిన ఇంటింటి పజ్యాలు అందులోని హాస్య చమత్కారాల వల్లనే కాదు, ప్రాస పలుకులవల్లా మనోజ్ఞంగా భావించాయి.
కుందేలు తాబేలు వేసుకున్నాయి పందెం
గుట్టుగా చెబుతా తాబేలు గెలిచిన చందం
కుందేలు మారింది రెండు రైళ్లు
తాబేలు నడిచింది వందమైళ్లు
అంటూ ఆరుద్ర భారతీయ రైల్వేల సమయపాలన లేకపోవడాన్ని పరిహాసం చేస్తూ ఇంటింటి పజ్యాల్లో రాసాడు. పందెం, చందం, రైళ్లు, మైళ్లు అనే ప్రాస పదాలు ఎంత భావస్ఫూర్తిని కలిగించాయో తెలుస్తూనే వుంది కదా!
ప్రాసల ప్రయుక్తం ఉపన్యాస కళలో ప్రేక్షక జనరంజకత్వానికి ఎంతగానో ఉపకరిస్తుంది. డా.సి.నారాయణరెడ్డి ప్రసంగాలలో ఒకప్పుడు ఈ ఝరి బాగా వుండేది. క్లాసులో విజయవిలాసం పాఠం చెబుతూ కూడా' వేచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబుగన్...' అంటూ కవి పద్యపాదంచెప్పి 'ఆరు‘చి’లతో ఆర్చికట్టా'డు అంటూ పాఠం చెప్పి, అలరించేవారు ఆయన.
తిరుపతిలో అనుకుంటా ఒకాయన పేరే ప్రాసమణి. ఆయన మాట్లాడుతూంటే ఆశువుగా ప్రాస పదాలు అలా ఔచితీమంతంగా, అర్థవంతంగా దొర్లుకుంటూ వస్తాయి.
సినిమాలలో పాత్రలకుకూడా ఈ సంభాషణా ధోరణి పెట్టి హాస్యం పండించిన సన్నివేశ కల్పనలు అనేకం కానవస్తాయి. ‘మళ్ళీ మళ్ళీ జరగాలి చెల్లి పెళ్ళి’ అంటూ తనికెళ్ళ భరణి, అలాగే జంధ్యాల చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, శ్రీలక్ష్మి వంటి పాత్రధారుల చేత ఇలాంటి ప్రాసభాషణలు హాస్య సన్నివేశాలుగా రాణకెక్కాయి.
మాట్లాడుతున్నప్పుడు వాక్యాల చివరి అక్షరాలు ప్రాస పదాలుగా భాసించే తీరు ఒకటయితే, ఒకటే అక్షరాన్ని చివరనగల పదాలను వరుసగా అర్థవంతంగా ప్రయోగిస్తూ మాట్లాడటం ఒక పద్ధతి.' కిట్టు బెట్టు చేయక విట్టువేసినా రట్టు కాకూడదని ఆ పట్టున పెసరట్టు తింటూ ఒట్టు పెట్టుకు మరీ గట్టున కూర్చుని చెట్టు చుట్టూ చీమల్ని మట్టుపెడుతూ తిట్టుకున్నా పట్టుదలతో సంభాషణ చుట్టుకున్నాడు' అంటూ మాట్లాడటం ఓ తరహా అయితే,' కాకీక కాకికి కాక కేకికా; అనో,' నానీనానీ నీ నాను నూనెను నానెనని నేనన్ననా' అంటూ ఏకాక్షర ప్రయుక్తంగా మాట్లాడడం మరో తరహా! వీటి తీరులో భాసించేది ప్రాసలహాసమే!
ఈ ప్రాస భాషణా సంవిధానం యాంకరింగ్ అనబడే వ్యాఖ్యానాల్లో జనరంజనం చేయగలుగుతుంది. అయితే దానికి సద్యః స్ఫూర్తి, సమయోచితం ఉండాలి.'సాలూరు రాజేశ్వర్రావ్ రసాలూరు రాజేశ్వర్రావ్',' ప్రజ్ఞామతి భానుమతి' వంటి సరస ప్రయోగాలు వ్యాఖ్యానంలో అందాన్ని తెచ్చినవే.
ప్రాసకు అలంకార శాస్త్రంలో శబ్దాలంకారంగానే గుర్తింపు ఎక్కువ. ప్రాసలో అనుప్రాసము అంటూ ఛేకానుప్రాసము, వృత్త్యానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము అంటూ భేదాలు చెప్పబడ్డాయి. 'రసానుగతమగు ప్రకృష్టమగు వర్ణవిన్యాసము అనుప్రాసము' అని నిర్వచింపబడింది. రెండేసి హల్లుల జంటలను అనేక పర్యాయాలు పద్యంలో చెప్పటం ఛేకానుప్రాసమనీ ,ఆ రెండేసి హల్లుల జంటలో స్వరసాదృశ్య నియమము అనుషంగికమేననీ నిర్వచింపబడింది.
'ఒక్క వర్ణంబు కడదాకా నుద్ధరింపసరస జృంభణ వృత్త్వనుప్రాసమయ్యె' అనీ'సుమద విపక్ష శిక్షణ విచక్షణ! దక్షిణ దోరనుక్షణ' అంటూ ఉదాహరణగా ‘క్ష’కార ఆవృత్తిపద్యం చూస్తాం. సాహిత్య దర్పణంలో అనుప్రాసము- ఛేక, వృత్తి, శ్రుతి, అంత్య,లాటానుప్రాస అని అయిదు విధాలుగా చెప్పబడింది. యమకము, ముక్తపదగ్రస్తము అనే అలంకారాలుకూడా ఇలాంటి అందంతో కూడినవే. అనుప్రాస, యమకాలను కావ్యంలో ప్రయోగించే విషయంలో ధ్వనికారుడైన ఆనందవర్థనుడు' ప్రయత్న సాధ్యమగు ననుప్రాసము కాక అయత్నకృతమగు అనుప్రాసము' రసపుష్టినిస్తుందని చెప్పాడు.
‘‘ప్రాసకోసంకూసుకున్నా పాసిదానా!’’ అన్నట్లుగా కాక ప్రజ్ఞతో ఆయత్నంగా జరిగే ప్రాసభాషణం సహృదయ హృదయైకవేద్యమై రాణిస్తుంది. రసహాస భాసమానం ప్రాస. రసాభాస కాకుండా ప్రాసభాషణం భాషలోని సొగసే. అదొక విన్నాణం.

3 comments:
చక్కగా చెప్పారు, మరిన్ని ఉదాహరణలు జోడిస్తే కొత్త తరానికి మరింత ఉపయుక్తంగా ఉండేది.
Vaastavam Panthula jogaa Rao gari maate naa maata. Chaala baagundi sir.
ప్రసాక్షరాల గురించి బాగా చెప్పారు.
Post a Comment