ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, February 21, 2014

నిగ్రహారాధన

‘‘‘శిల్పం’ అంటే ‘విగ్రహం’ అనే సాధారణంగా మనం అనుకుంటాం. కానీ ‘నైపుణ్యము’ ఏదయినా శిల్పమే అనుకోవచ్చు. ‘అమలోదాత్త మనీష నేను భయకావ్య ప్రౌఢి బాటించు శిల్పమును బారగుడన్’ అని కవి అన్నాడంటే అక్కడిది సంస్కృతాంధ్ర రచనంలో అతని నైపుణ్యానికి ఉటంకింపే! నిజానికి శిల్పం అనేది చేతి పని. అది మూర్తిమందిరాది నిర్మాణం కానీయండి కావ్యరచనా నిర్మాణం కానీయండి. ‘కావ్యశిల్పం’ అనే మాట కూడా అంటూంటారు అందుకే’’ అన్నాడు రాంబాబు పుస్తకం టేబుల్ మీద పెడుతూ.

‘‘నిజానికి శిల్పకళ అంటే సింధూ నాగరికతా కాలంనాటి నుంచి చెప్పుకుంటూంటాం మనం! శిల, మట్టీ,  కoచు వంటి వాటితో చేసిన ప్రతిమలు ఎప్పటినుంచో వున్నాయి. ప్రతిమగా మలిచే నైపుణ్యం శిల నుంచయితే శిల్పి అన్నాం. విగ్రహాలు అంటే దేవీ, దేవతావిగ్రహాలు, దేవాలయ శిల్పాలు వీటి గురించే ఒక పవిత్ర భావన వుంది. కాళ్ళతో తొక్కేసే రాయియే ఒక విగ్రహంగా చెక్కబడినప్పుడు పూజలందుకుంటోంది. అంటే ఆ రాయికి ఆ భావనను ఆపాదించిన నైపుణ్యం గొప్పది కదా! శిల శిల్పంగా మారినప్పుడే దాని విలువ అనల్పం. మనిషయినా అంతే!


చిత్తంలో ప్రతి దెబ్బా
సుత్తిదెబ్బగా మలిచిన
మానవమూర్తిని మించిన
మహిత శిల్పమేమున్నది


అన్నారు బోయిభీమన్నగారు. ఆటుపోటులకు తట్టుకున్నప్పుడే విలువ. ఒక మామూలు మనిషే మహితాత్ముడిగా ద్యోతకమవుతున్నాడంటే తనను తాను తనలా తీర్చిదిద్దుకున్న నైపుణ్యమే కదా కారణం’’ అన్నాడు ప్రసాదు.


‘‘సమయ సందర్భాలనుబట్టి ఒక్కోసారి నైపుణ్యాలు రాణింపులు బహిర్గతమవుతూంటాయి. అదీ కాక ఒకరికి నైపుణ్యంగా, గొప్ప కార్యంగా తోచింది మరొకరికి అలా తోచకపోవచ్చు సరికదా! హేయంగానూ అనిపించవచ్చు. పార్లమెంట్‌లో టీబిల్లు సమయంలో రెచ్చిపోయి పెప్పర్ స్ప్రే చల్లిన లగడపాటిని ఒకరు భగత్‌సింగ్‌తో పోల్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే తలవంపుల చర్య దానికి మించినది ఇంతవరకూ తటస్థించలేదని ఇంకొకరు సంభావించారు. అంచేత నైపుణ్యం చూసే కంట్లో వుంది. ఈ శిలలకు శిల్పి ఎవరు అన్న ఆశ్చర్యానందాలు కలగడానికినీ, అవాక్కయ్యే ప్రతిమల దర్శనానికీ తేడా లేదా’’ అన్నాడు శంకరం.


‘‘దేవీ దేవతలకు యక్షులకు, అప్సరసలకు, నాగులకే కాదు రాజులు, అధికారులు, మత ప్రచారకులైన విశిష్ఠమూర్తులకు కూడా విగ్రహాలు నెలకొల్పడం అనుచానంగా వస్తున్నదే. విగ్రహారాధన అంటే దేవతామూర్తులకే అనుకోనక్కర్లేదు. రాజకీయ నేతలకు కూడాను. మాయావతి బ్రతికుండగానే తన విగ్రహాలను బి.ఎస్.పి గుర్తయిన ఏనుగుల విగ్రహాలను తామరతంపరగా నెలకొల్పింది. ట్యాంక్‌బండ్ మీద తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కొన్ని విగ్రహాలు కూలగొట్టబడడం, కొందరి విగ్రహాలు నెలకొల్పకపోవడం పక్షపాత ధోరణులని నిరసించడం మనమెరిగిన సంగతే! అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పిన విగ్రహానికి అంబేద్కర్ పోలికలు లేనేలేవన్న వివాదమూ తెలుసు. ఇలా శిల్పాలు, విగ్రహాలు అనేవి గౌరవ అగౌరవాలకు రెంటికీ కేంద్ర బిందువులుగా వుంటున్నాయి. కోపం వస్తే ఆ కోపం వచ్చిన వారి విగ్రహం ధ్వంసం చేయడమో, కూలగొట్టడమో జరుగుతూండడమూ తెలుసు మనకు. రాతి బొమ్మలకు ఒక్కోసారి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చేస్తూంటారు. ‘కొయ్యబొమ్మలు మెచ్చుకళ్ళకు కోమలుల సారెక్కునా!’ అని గురజాడ వారన్నట్లు అసలు మనుషులకన్నా శిలలకూ, విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వడం చిత్రమే మరి’’ అన్నాడు ప్రసాదు.


‘విగ్రహాలు కాదర్రా! నిగ్రహాలు ముఖ్యం. విగ్రహం కోల్పోతే పునర్నిర్మించుకోగలం. కానీ నిగ్రహం కోల్పోతే కో ల్పోయిన వ్యక్తిత్వ పునర్నిర్మాణం అంత సులభ సాధ్యంకాదు. నిజమే! పార్లమెంట్‌లో అనుకోని అనూహ్య పరిణామాలే చోటుచేసుకున్నాయి. అంత మాత్రాన నిజానికి ప్రజలకు ఆదర్శవంతంగానూ, నేతృత్వం వహించే వారిగానూ వుండవలసిన పెద్దలే పెడబుద్ధులతో వ్యవహరించడం శోచనీయం! భారతదేశ ప్రజాస్వామ్యం ఒక డొల్ల లాంటిదని పొరుగునవున్న చైనా లాంటి దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జనానికి కూడా జరుగుతున్న సంఘటనల్లో ఔచిత్యం గానీ, ప్రజాస్వామ్య శిల్పం అనదగిన నైపుణ్యంగానీ ఏమీ కనబడడం లేదు. ఓటు రాజకీయాలకోసం చెక్కుతున్న ఘటనా ప్రతిమలే అన్నీను. ‘ఉద్ధండ పండితులే కానీ ఉండవలసిన బుద్ధులు లేవు’ అని మాయాబజార్ సినిమాలో డైలాగ్‌లాగా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గొప్ప ప్రజాప్రతినిధులు అనుకుంటున్న వాళ్ళు అతి లేకిగానూ, బజారు రౌడీలకన్నా నేలబారుగా అత్యున్నత పార్లమెంట్‌లో ప్రవర్తించడమూ నామోషీకా
దా. ప్రతి దానికీ రెచ్చిపోవడం, నిగ్రహాన్ని కోల్పోవడం ఎక్కువైపోతోంది. అదే ఘనకార్యమనీ, గొప్ప ప్రవర్తన అనీ అనుకుంటున్నారు వాళ్ళు. సమస్యలు ఏవయినా సావధానంగా, సంయమనంతో సానుకూల వాతవారణంలో చర్చించి పరిష్కారాలు కనుగొనగలగాలే గానీ ఉట్టినే రెచ్చిపోవడం, బాహాబాహీ ముష్ఠాముష్ఠీలలోకి దిగి విధ్వంసానికీ, హింసా ధోరణులకు సమకట్టడం సిగ్గుచేటయిన వ్యవహారమే! ఆగ్రహోద్రేకాలను అదుపులో పెట్టుకోలేకపోవడం సంస్కారం అనిపించుకోదు ఎవరికైనాను. విగ్రహారాధనను ఒప్పుకోనివాళ్ళయినా నిగ్రహారాధనను ఒప్పుకుంటారు. ఒప్పుకోవాలి. నెలకొల్పవలసింది మహనీయుల విగ్రహాలను కాదు. వారి ఆదర్శాలను మననం చేసుకుంటూ మనలోని విలువల నిగ్రహాలను. ప్రజాస్వామ్య పరిరక్షణకు విగ్రహారాధనలు కాదు నిగ్రహారాధనలు, సమగ్ర సంయమనాలు అవసరం’’ అంటూ రాంబాబు భుజం తట్టాడు సుందరయ్య లేస్తూ.

0 comments: