ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 6, 2012

‘బట్ట’బయలు విషయం
"'పుట్టినప్పుడూ బట్ట కట్టలేదు
పోయేటప్పుడు అది వెంటరాదు
నడుమబట్ట కడితే నగుబాటు
నాగరీకం ముదిరితే గ్రహపాటు'


అంటూ ఓ సినిమా పాట వుంది. బట్ట, వస్త్రం అంటే కప్పి వుంచడానికి! నిజానికి కప్పి వుంచడానికి- ఓ ‘అర్థం’, ‘పరమార్థం’ వుంది. కప్పి వుంచడంలో ఓ ‘అందం’ వుంది. ‘రక్షణకోసం’ కప్పి వుంచడం ఉపయుక్తమవుతుంది. కానీ ఉండీ లేనట్లు, లేనట్లు ఉండడంలోనే ఇబ్బంది ఉంటుంది.’’ అన్నాడు సన్యాసి రుమాలు మడతబెట్టి జేబులో పెట్టుకుంటూ.


‘‘ఏం నాయనా! డి.జి.పి. దినేష్‌రెడ్డిగారు గుర్తొచ్చారా ఏమిటి? వస్త్రోపాఖ్యానం మొదలెట్టావ్’’ అన్నాడు రాంబాబు నవ్వుతూ.

‘‘స్త్రీల వస్తధ్రారణ కారణంగానే అత్యాచారాలు జరుగుతున్నాయనీ, రెచ్చగొట్టే దుస్తులు ధరించిన స్త్రీలు అందుకు హేతువవుతున్నారనీ ఆయన అన్నారు గానీ, నిజానికి- ఆ రెచ్చగొట్టిన స్త్రీల కారణంగా, వారి వస్తధ్రారణతో నిమిత్తం లేని వేరే అమాయకులైన యువతులూ, స్త్రీలూ కాముకుల బారిన పడుతున్నారు! నిజానికి అత్యాచారాలకు గురి అవుతున్న ఆడవాళ్లు మామూలువాళ్లే! వాళ్లేమీ దుస్తుల విషయంలో అతిశయాలకూ, ఆడంబరాలకూ పోతున్న వాళ్లనుకోలేం. ఎందుకంటే అలాంటి ‘రెచ్చగొట్టే దుస్తులు’ చాలా ఖరీదైనవి! వాటిని ధరించేవారూ ‘ఖరీదైన’వారే. అంతెందుకు? సెలబ్రీటీలు అనబడే ‘సినిమా హీరోయిన్లు’ - సినిమాల్లోనే కాదు, ఫంక్షన్లకు కూడా ‘గ్లామరస్’గా కనిపించడానికి అలాంటి ‘అరకొర దుస్తులు’ వేసుకు వస్తూంటారు. వాళ్లమీద అత్యాచారాలు జరుగుతున్నాయని నిర్ధారించలేం కదా!’’ అన్నాడు ప్రసాదు.

‘‘అసలు నాగరికత వల్ల వచ్చినదే- ‘వస్తధ్రారణం’అనేది. అంతకుముందు ఆదిమ మానవులు ఆకులు, అలములు కట్టుకు తిరిగారు. అప్పుడు కొన్ని ‘కట్టుబాట్లూ’లేవు. కానీ;స్త్రీ పురుష సంబంధాల మధ్య ఒక ‘వ్యవస్థ’ రూపొందిన తరువాతే, తన స్త్రీని తను రక్షించుకునే క్రమంలో వచ్చిన కట్టుబాట్లలో- ‘కట్టు’కూడా వచ్చి ప్రధానమయ్యింది. భారతీయ స్త్రీకి ‘చీర’అనేది ఒక పెద్ద అలంకారమే కాదు, శరీరానికి అనువుగా ఒక రక్షణ కవచంగా కూడా అమిరింది. ‘పైట’అనేది ఒక నిండుదనాన్ని కలిగించింది’’ అన్నాడు సన్యాసి.

‘‘ఈమాట ఇక్కడ అంటే అన్నావుగానీ, ఇంకెక్కడా అనబోకు! ‘పైటను తగలెయ్యాలి’ అంటూ స్త్రీవాద జెండా గతంలో ఎగరేసిన విషయం మరిచిపోయావా? అది ‘పురుషాధిక్యత’తో కట్టబెట్టినట్లుగా స్త్రీవాదం భావించింది కదా!’’ అన్నాడు రాంబాబు.

‘‘కానీ- కవయిత్రి జూపాక సుభద్ర అనుకుంటాను- ఆ ‘పైట’ గురించే అద్భుతమైన సమాధాన ‘కవిత’రాసింది. పైట తగలేసుకోవడానికి కాదనీ, ఆ ‘పైటే’ ఒక దళిత స్త్రీకి ఎన్ని రకాలుగా ఆసరాగా నిలిచి, అనేక అంశాలలో ఉపయుక్తమై, ఆదుకుంటుందో, ఆ కవితలో వివరించింది! ‘పైట’ గొప్పదనాన్నీ, స్త్రీకి దానివల్ల ఒనగూడే సౌకర్యాలనూ, ప్రయోజనాలనూ విశదపరిచింది. స్త్రీవాదం కూడా - ‘ఉమెన్స్‌లిబ్’ అంటూ స్వేచ్ఛ పేరిట విశృంఖలత్వంకోసం విర్రవీగే అగ్ర వనితల దృక్కోణంలో చూడబడరాదనీ, అణగారిన స్త్రీల దృక్కోణాన్నీ, వారి సామాజిక స్థితిగతులనూ సానుకూలంగా దర్శించే రీతిలోనే ప్రతిఫలింపచేయాలనీ చెప్పింది! అందువల్ల హేతువు ఎక్కడో పెట్టుకుని, నిర్హేతుకంగా ఏ ‘వస్త్రధారణ’నో కేవల అత్యాచార ప్రేరక కారకంగా ప్రవచించడం సరికాదు’’ అన్నాడు ప్రసాదు.

‘‘గుప్పిట మూసి వున్నంతవరకే ‘రహస్యం’, ‘ఆతృత’, ‘అందం’ అంతాను! విప్పితే ఏముంది? వేమన- వదినగారి ఆభరణం ‘బులాకీ’ని వేశ్యకోసం ఎత్తుకుపోతూంటే, ‘‘ఆ ఆభరణం ధరించి ఆమె నగ్నంగా నీకు దర్శనమిచ్చే షరతు మీదే అది ఆమెకివ్వు. పట్టుకెళ్ళూ’’ అందిట వదినగారు. నగలు ధరించి నగ్నంగా కనిపించినంతనే వేమనకు విరక్తి కలిగి, కామి కాస్తా మోక్షగామిగా మారిపోయాడు. ‘దిగంబరత్వం’ వెగటు కలిగిస్తుంది. విరక్తి రేపుతుంది. కప్పి వుంచడంలోనే ‘‘అందం’’ వుందనడం అందుకే! అయితే-వస్త్రధారణ నిండుగా వున్నప్పుడు స్త్రీల పట్ల గౌరవభావం కలుగుతుందనీ, అరకొర దుస్తులు ఉద్రిక్తతలు కలిగించి కామ వికారాలు కలిగిస్తాయనీ నిర్ధారించలేం. చూసే ‘దృష్టి’ ఒకటుంటుంది! అయితే ఒక్కటి మాత్రం నిజం! ‘అరకొర దుస్తులు’ ధరించినవారిని చూసినప్పుడు కలిగిన వికారాలు- ఆ స్త్రీల మీదే ప్రతిబింబించకపోవచ్చు. అలాంటి వారిని చూసిన ప్రభావంతో, అందుబాటులో వున్న అవకాశం అంది వచ్చిన ఆడవారి మీద ‘కాముకులు’ రెచ్చిపోవడానికి హేతువు కావచ్చు! నేడు వస్త్ర ప్రపంచంలో అనేక కొత్త కొత్త ‘ఫ్యాషన్లు’వస్తున్నాయి. వాటినన్నింటినీ మనమెలాగూ నిషేధించలేం! పైగా తాహతునుబట్టే దుస్తులు కొనుక్కుంటారు ఎవ్వరయినా. వస్త్రధారణ అనేది వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా శీతావాతాతపాల నుండి రక్షణకు ప్రధానంగా ధరిస్తారు ఎవ్వరయినాను. కప్పుకున్నా- ‘విప్పుకునే’, ‘తప్పు’ జరుగుతుంటుంది! ‘రేప్’లకు అనేక కారణాలు. స్త్రీల రెచ్చగొట్టే ‘వస్త్రధారణ ’ అందులో ఒకటి. నాగరీకం పేరుతో నగుబాటువస్త్రధారణ కన్నా- దిగంబరత్వంలోనే కనీసం, కామిని మోక్షగామిని చేయగల పార్శ్వం వుందేమో! అందం, ఆనందం, రక్షణ కలిగిస్తూ- స్త్రీలవస్త్రధారణ - వారినే కాదు, మగవారిని కూడా సజావుగా వ్యక్తిత్వంలో నిలబెట్టగలగాలి.’’ అంటూ లేచాడు సన్యాసి.

13 comments:

Varsha Bhargavi said...

మీ అభిప్రాయం తో నేను ఏకీభవించలేక పోతున్నాను. స్త్రీల దుస్తులు విషయం పై చేసిన వ్యాఖ్య చాల అసంజసమైనది. పసి పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి ఆ పిల్లల దుస్తులమూలంగా జరుతున్నాయని అనలేం కదా... నాగరికత పేరున అరకొర దుస్తులతో దర్శనమిచ్చే కార్యక్రమాలతో టీవీ చానెళ్ళు సినిమాలు హోరేత్తిపోతున్నాయి. మరి అలాటి కార్యక్రమాలను కట్టుదిట్టం చెయ్యకుండా 'మీరు సరిగ్గా బట్టలు వేసుకోండి, మీఋ వేసుకునే దుస్తులను చూసి మగవారు చలిస్తారు" అని బోధించడం చాల చిత్రంగా ఉంది. అసలు ఇలాంటి మాటలకి మగవారికి ఇంకా కోపం రావాలి. మరీ అంత దిగజారే అబ్బాయిలు ఉంటారని నేను అనుకోను. మనకి రోజూ దర్సనమిచ్చే టీవీ, సినిమాల్లో అసభ్యకరమైన కార్యక్రమాలు, మాటలు, భంగిమలు సరిగ్గా సెన్సార్ చేస్తే, మూల కారణం మీద చర్య తీసుకున్నట్టు ఉంటుంది. ఆరు గజాల చీరను ఎంత పొందిగ్గా కట్టచ్చో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది, కాని ఈనాటి సినిమాల్లో అదే ఆరు గజాల చీరను ఎంత అశ్లీలంగా కట్టచ్చో చూడొచ్చు. సమాజం మీద సినిమా మరియు టీవీల ప్రభావం ఇంకా చాలా ఉంది. భాష ఎలాగూ మట్టికొట్టుకు పోతోంది, ఆ కాస్త మిగిలిన మన సంస్కృతీ, సంస్కారం కూడా అధోగతి పాలయ్యే లోపు విపరీతార్ధాలు తియ్యకుండా, అధికారులు ఎమన్నా గట్టి చర్యలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం.

प्रवीण् शर्मा said...

DGP గాడు చూడీదార్-సల్వార్‌లు కూడా అశ్లీల దుస్తులే అన్నాడు. ఇంకా నయం, ఆడవాళ్ళందరూ బురఖాలు వేసుకోవాలనలేదు.

సుధామ said...

వర్ష గారూ! నేను కూడా కేవలం దుస్తులే కారణమని అనలేదు.మీరు గ్రహించి వుంటారు.మీ అబిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను

@ప్రవీణ్ శర్మ గారూ ! అశ్లీలం దుస్తులలో లేదు.చూసే చూపులో వుంది.

Anonymous said...

@Blog Owner

I sincerely request you to block this Praveen Sarma.
He has no moral rights to response on this issue, he is well known for the filty language especailly on ladies in the blog world.

प्रवीण् शर्मा said...

రేప్ చేసేవాడు స్త్రీ చీరకట్టుకుందా లేదా బురఖా వేసుకుందా అనేది చూడడు. అతనికి కుతి తీర్చుకోవడమే ముఖ్యం. చూడీదార్-సల్వార్‌లు ఒళ్ళంతా కప్పే దుస్తులే కదా. అందులో చూడడానికి అశ్లీలం ఏముంటుంది?

సుధామ said...

@Praveen sarma! కుతి వల్లే చూసే చూపు అశ్లీలం అవుతుంది.

प्रवीण् शर्मा said...

ఆ కుతి ఉన్నవాడు చీర కట్టుకున్న స్త్రీని కూడా అశ్లీలంగా చూస్తాడు. సిటీ బస్‌లలో ఉద్యోగాలు చేసే స్త్రీలని అశ్లీలంగా చూడడానికి కారణం ఇదే కదా.

సుధామ said...

అదేగా నేన్నదీను.ఏమైనా మీ స్పందనలకు సంతోషం.

సుధామ said...

'ఆరు గజాల చీరను ఎంత పొందిగ్గా కట్టచ్చో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది, కాని ఈనాటి సినిమాల్లో అదే ఆరు గజాల చీరను ఎంత అశ్లీలంగా కట్టచ్చో చూడొచ్చు. సమాజం మీద సినిమా మరియు టీవీలప్రభావం ఇంకా చాలా ఉంది.' అని వర్షా భార్గవి గారన్నది యధార్థం.ధాంక్యూ వర్ష గారూ!

శ్యామలీయం said...

ఆరుగజాల చీర అంటున్నారు!

పాత సినిమాల కాలంలోవి యేడు గజాల చీరలు!
ఒకసారి మా అమ్మగారికి బట్టలకొట్టువాడు కొన్ని ఆరుగజాల చీరలు పంపితే చాలా చిరాకుపడి తిట్టి తిరగ్గొట్టారు -యేమిటీ చిన్న చీరలూ అని!

సుధామ said...

ఇప్పటి ఆరు గజాల చీరలు పైగా 'విత్ బ్లౌజ్ ' కూడానేమో!

प्रवीण् शर्मा said...

ఆ కుతి ఉన్నవాడు చీర కట్టుకున్న స్త్రీని కూడా అశ్లీలంగా చూస్తాడు అని ఒప్పుకున్నప్పుడు స్త్రీ చీరకట్టుకుంటే ఏమిటి, చూడీదార్-సల్వార్ వేసుకుంటే ఏమిటి?

సుధామ said...

Chudiidaar,selavaar la gurinchi tappu ani annadi DIG kaavachhu.Nenu kaadugaa