చీరకట్టు సొగసులపై గమ్మత్తు పద్యాలు
భారతీయ స్త్రీ కట్టు అనగానే ‘చీర’ అనే అంటాం! చీరలోని ‘అందం’ గుర్తించాక, ఇప్పటి రోజుల తీరు చూశాక మేము మీకు అలా ‘అందం’ అని ఇవాళ వస్తధ్రారణలు మారిపోతున్నాయంటే నిజమే కానీ, విదేశీ వనితలే ‘చీర’ కట్టులోని సొగసులకు కట్టుబడుతూండగా, భారతీయ స్త్రీ కట్టినా కట్టకపోయినా, పెట్టినా పెట్టకపోయినా చీరలను, నగలను వదులుకోలేదన్న మాట మాత్రం నిజం. ఎన్ని చీరలున్నా ఇంకొకటి కావాలనే అభిలాష వారి సొంతం.
‘చీర’ అనే అంశం చుట్టూతా ‘బ్నిం’గారు చుట్టిన ‘చీరపజ్యాలు’ - మకుటం లేకున్నా, ‘మకుటాయమానం’గా పేర్కొనదగిన సరదా పద్యాల వంద. ఈ పజ్యాల అంచులు, పల్లూ మనం పల్లెత్తు మాట అనకుండా అందంగా, భావబంధురంగా ‘ఇంద’ అంటూ అందించారాయన.
శ్రీమతి జ్యోతి వలబోజు అందించిన స్ఫూర్తితో, కృష్ణపరమాత్మ ద్రౌపదికి - దుశ్శాసనులు అపహరణం చేయబోయిన సమయంలో ప్రసాదించినట్లుగా ‘బ్నిం’గారు ఫ్యాషన్లు మారిపోతూ భారతీయకట్టే అపహరణమవుతున్నదన్న ఆర్తితో ఈ చీర పజ్యాల వస్త్ర/వస్తుదానం చేసినట్లుంది.
శారీ నారీన్ గాంచిన
ఫారిన్ వారంత వంగి వందన మిడుచున్
భారతదేశపు సంస్కృతి
నోరారా పొగుడుచుండ్రు న్యూనత మనకే!
అని ‘బ్నిం’గారు ‘చీరకు జై’ అంటూ ఈ పెట్టెడు పెట్టుడు చూపెట్టారు.
అసలే కోపిస్టులు, రేపిస్టులు పెరిగి పోతున్నప్పుడు అందునా స్త్రీలు ఉద్యోగినులుగా మారవలసి వచ్చిన నేటికాలాన
సంఘంలో వారి ఉరుకుల పరుగుల జీవితానికి చీరల కన్న పంజాబీడ్రెస్సులు, ప్యాంట్లూ షర్టులూ సౌకర్యమూ, సౌలభ్యమూ అయితే కావచ్చునేమోగానీ చీరను శాశ్వతంగా త్యజించడం తగదని హితవు-
ఇంటన్ బైటన్ సైతము
కంటికి ఒక లాగె స్త్రీలు కన్పడుచున్నన్
వంటికి వలపెటుకలుగును
ఇంటిల్లాల్ చీర నుండ ఇంపగు పతికిన్
ఇవాళ సినిమాల్లో హీరోయిన్లు చీరకట్టడాలు, పాటల్లో పైట చెంగు రెపరెపలు మాయమయ్యాయి. కానీ సినిమా హిట్టు సూత్రంలో చీర ప్రాధాన్యత అవిస్మరణీయం అని గుర్తుచేస్తాడీయన
సినిమాకు హిట్టు సూత్రం
బనునది ఒక ‘వానపాట!’ కద - అందున్
ఘనమగు తెల్లటి చీరయె
అనుకూలము! పచ్చి నిజము !! హండ్రెడ్ పర్సెంట్
చీరల పట్ల స్త్రీల మోజు, చీరల షాపులో బేరాల తీరు, పెట్టుడుచీరలు, కట్టుడు చీరలకువున్న తేడా, ఆలుమగల మధ్య చీర పోషించే పాత్ర, చీరకు మాచింగ్ బ్లౌజ్‌కై అన్వేషణలు, చీర ఉపయోగాలు ఇలా ‘బ్నిం’ గారు ఈ పజ్యాలులో అనేకానేక అంశాలు రసనిష్యందంగా చూపెట్టారు
శారీ బ్లౌజుల నడుమన
వేరే ఆచ్ఛాదనము వేయక, మెరిసే
నారీ నడుముల మడతల్
వారెవ్వా చూపుచుండు వరములె చీరల్
అని తన ‘కొంటె’ మగ చూపునూ నిర్భయంగా వెల్లడించారు.
‘‘నాకు స్త్రీత్వం మీద విపరీతమైన ఇష్టం. గౌరవం - అంతకుమించిన ప్రేమ. నేను అందాన్ని ఇష్టపడతాను (తప్పేం లేదు. అది ఈస్తటిక్ సెన్స్ అంతే!) భయపడకుండా... మరో దురుద్దేశం లేకుండా వాళ్ళని మెచ్చుకోడానికి జంకను’’ అంటూ బ్నిం అందించిన ఈ ‘చీర పజ్యాలు’ ఫెమినిస్టులైనా సరే ఇష్టపడగలరని ఆకాంక్ష.
- -సుధామ
చీరపజ్యాలు
(సరదా శతకం) - బ్నిం 12-11-448, వారాసిగూడ, సికిందరాబాద్-500061,
వెల రూ.30/-
వందకి అయిదు పుస్తకాలు రిబేటు రేటు
(సరదా శతకం) - బ్నిం 12-11-448, వారాసిగూడ, సికిందరాబాద్-500061,
వెల రూ.30/-
వందకి అయిదు పుస్తకాలు రిబేటు రేటు
0 comments:
Post a Comment