‘‘సామాన్యుడు అంటే కూరలు అమ్ముకునేవాడో, పాలవాడో, మిర్చీబండివాడో, రోజువారీ కూలీ పనివాడో మాత్రమే కాదు. ఉద్యోగం చేసుకుంటూ నెల జీతం మీదే ఇంటి అద్దె, కరెంటు బిల్లు కట్టుకుంటూ పనిమనిషికి, పాలకి, చాకలికి చెల్లించుకుంటూ నెలసరి బియ్యం, పప్పులూ, ఉప్పులూ కొనుక్కుని కాలంగడిపే మధ్యతరగతివాడు కూడాను. రేషన్ కార్డో, ఆధార్ కార్డో ఇబ్బంది పడకుండా పొందాలనీ, గ్యాసుకు ఇబ్బంది కాకూడదనీ, చదువుకో, ఉద్యోగానికో బయటకెళ్ళిన పిల్లలు సురక్షితంగా ఇల్లు చేరాలనీ ఆకాంక్షించేవాడు. ఓ సినిమాయో, హోటల్ భోజనమో నెలకోసారి కుటుంబం అంతటితో పొందగలగడమే గొప్ప వినోదంగా సంతృప్తిపడేవాడు. అలాంటి సామాన్యుడి కనీస కోర్కెలు కూడా తీరకపోతేనూ, వాటిని పొందడానికి కూడా అడుగడుగునా ఇబ్బందులెదురవుతూంటేనూ పాలకుల మీదా, ప్రభుత్వం మీదా అతనికి విసుగు, కోపం కలగడం సహజం. రాజకీయాలు తనకు అందనివిగా వుంటూ తనని తన బ్రతుకునీ శాసించేవిగా మారడమే అతనికి ఆగ్రహం కలిగించే విషయాలు’’ అన్నాడు రాంబాబు.
‘‘నువ్వన్నది నిజం. గత కొంతకాలంగా రాజకీయాలు సామాన్యుడు పాల్గొనే స్థాయికి అందరానివిగా తయారయ్యాయి. పాల్గోవడం అంటే ఓటువెయ్యడం మటుకే అనే స్థితి సామాన్యుడి పాలబడింది. డబ్బూ, అధికారం, గూండాయిజం పుష్కలంగా కలిగినవాడిదే రాజకీయమై కూర్చుంది. తాము కట్టే పన్నులతోనే సంపన్నులు తయారవుతున్నారనీ, అవినీతి అక్రమాలతో తమపై పెత్తనం చేస్తున్నారనీ సామాన్యుల కడుపు రగిలిపోతోంది.
ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ గెలుపుకు ఆ భావనే కారణం. కేజ్రీవాల్ తమవాడిగా వారికి కనబడ్డాడు. అందుకు కారణం అతని వ్యవహార శైలి. అతడెక్కడా రాజకీయ నాయకుడి వేషధారణలో, హావభావాలలో లేడు. మన అపార్ట్‌మెంట్‌లోనే పక్కింటివాడు క్యారేజీ తీసుకుని పొద్దునే్న తన ఆఫీసుకు వెడుతూంటే ఎలావుంటాడో అలా కనపడతాడు. మన మనిషి మనతో ఆప్యాయంగా మాట్లాడుతూ మనకోసం ఎంతటి డబ్బున్న మనిషినయినా, అధికారం వున్న వాడినయినా ఎదిరించి మాట్లాడుతుంటే మనకు ఎలా అనిపిస్తుందో అలా అనిపించాడు ఢిల్లీవాసులుకి. అందుకే ఆమ్‌ఆద్మీపార్టీ ఆకట్టుకోగలిగింది. కేవలం ఉపన్యాసాలు దంచడంలా కాక ఆలోచించే ఆచరణాత్మక విధానాలు కనబడడం ముఖ్యం. అలాంటి రాజకీయం సామాన్యుడు కోరుకుంటున్నాడు. అవినీతి లేని మనుషులు, నిరాడంబరంగా ఉండేవారు ఇవాళ కేజ్రీవాల్‌తోనో ఏమీ మొదలుకాలేదు. అలాంటివారు మునుపూ వున్నారు. నేతల్లోనూ వుండి గతంలో ఆదరణ పొందారు. సామాన్యుల్లో రాజకీయం చేయగల సత్తా అంటే డబ్బూ మద్యం పంచిపెట్టి ఎన్నికల్లో గెలవడం, అధికారపీఠం అధిష్ఠించి అవినీతితో బతకడం కాదుకదా అందుకు భిన్నమైన సేవాదృక్పథం, పాలనా సామర్థ్యం వున్నాయని సరికొత్త రాజకీయాలు రూపొంది స్థిరపడాలి. అన్నాహజారేలు, కేజ్రీవాలాలు, లోక్‌సత్తాలు ఆ ఆశలను చిగురింప చేస్తున్నారు కనుకనే సామాన్యులు అటుగా మంచి మార్పుకోసం ఆలోచిస్తున్నారు’’ అన్నాడు ప్రసాదు.
‘‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము - నరుడు నరుడౌట ఎంతొ దుష్కరము సుమ్ము’’ అని దాశరథిగారు గాలిబ్ భావాన్ని చెప్పినట్లుగా సామాన్యుడు అసామాన్యుడు కావడం అంటే తన విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా ప్రభుత నెరపగలగడం. ఒకప్పటి మధ్యతరగతినే నేటికీ తేడా వుంది. నిజానికి మన రాష్ట్రంలో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే మొదటిసారిగా చదువుకున్నవారు మామూలు మధ్యతరగతి వారూ కొంత రాజకీయాల్లోకి చేరారు. మధ్యతరగతి మధ్యతరగతిగానే వుండిపోక ఎదిగే క్రమం గురించి ఆరాటపడడం సహజమే. అయితే రాజకీయం అండతో, రాజకీయాల్లో చేరే వారూ భ్రష్టుపట్టిపోతే వాళ్ళు సామాన్యులు కారుకదా అసామాన్యులూ కాక అవినీతి కూపంలో పడ్డ భ్రష్టులే అవుతారు. గాంధీ, నెహ్రూల కాలం కాంగ్రెస్‌లో వున్నవారికీ, నేటి కాంగ్రెస్‌లో వున్న వారికీ తేడా స్పష్టంగా కనిపించడం లేదా? వారసత్వ రాజకీయాలతో అప్పనపు అధికారాలతో ఎదిగినవారిని సామాన్యులు తమలోనివారిగా ఎలా భావించగలుగుతారు. వారు కూడా తాము యజమానులమనీ, ప్రజలు తమక్రింద తాము చెప్పినట్లు నడుచుకునేవారనీ అనుకుని ప్రవర్తిస్తూంటే ప్రజలకు వారిపట్ల విశ్వాసం ఎలా ఏర్పడుతుంది. ప్రస్తుతం సోనియాగాంధీ గురించి తెలుగువారు అనుకుంటున్నది అదే. తమను రెండు రాష్ట్రాలుగా విడగొట్టే అధికారం తమ అందరి సమ్మతి లేకుండా ఆవిడకు ఎవరిచ్చారనేదే వారి ప్రశ్న? 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరిగితే వచ్చే ఫలితాలకూ ముందే విడగొట్టి ఎన్నికలు జరిపితే వచ్చే ఫలితాలకూ బోలెడు తేడా వుంటుందనీ, విభజనతో రాజకీయంగా తాము లాభపడగలమనే సోనియా దురాశే ఈ పరిస్థితికి కారణమని ప్రజలలో ఒక భావన. తెలంగాణలో కూడా బలీయంగానే వుంది. అందుకే తె.రా.స కాంగ్రెస్‌లో విలీనం గురించి ఎడంగానే ప్రవర్తిస్తోంది’’ అన్నాడు రాంబాబు.
‘‘నాయనలారా! ‘సామాన్య’శాస్త్రం మీరు బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఏ పార్టీ మానిఫెస్టో అయినా చూడండి. అద్భుతంగా ప్రజాస్వామ్య పరిరక్షకంగానే వుంటుంది. అంతెందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏదో ఒక పార్టీ ఓ మామూలు చిన్నాచితకా పార్టీ అనే దాని మానిఫెస్టోనయినాసరే తూచా తప్పకుండా పాటించితే చాలు ఈ దేశం కచ్చితంగా బాగుపడుతుంది. కానీ అమలుచేసే చిత్తశుద్ధి అవసరం. ఆమ్‌ఆద్మీ పార్టీ వేపు లోక్‌సభ ఎన్నికల బరిలోకి దేశవ్యాప్తంగా దిగుతానంటోంది. మంచిదే! కానీ అందువల్ల అది మూస రాజకీయ ధోరణులకు అధికారం చేజిక్కించుకునేందుకు పాల్పడితే మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయినట్లే. సామాన్యంలోని మాన్యతను నిలబెట్టుకుని రాజకీయశాస్త్రం ఆచరణాత్మకంగా రూపొందడం కాలపు అవసరం’’ అంటూ లేచాడు సుందరయ్య.
0 comments:
Post a Comment