ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Thursday, November 14, 2013

అత్తగారికి ‘ఇల్లే’దీ!

8 నవంబర్ '2013' ఆంధ్రభూమి దినపత్రికలో  కాలమ్‌




‘ఆవిడకి ఇప్పుడు అంతా అత్తిల్లే. అత్తగారూ, భర్తా లేకపోయినా పుట్టింటికెళ్లే పరిస్థితి లేదు. అన్నదమ్ముల అనుబంధం అనేది అసలు తెలియదు. అలాంటప్పుడు కలిసికట్టుతనంలోని గొప్పదనం ఎలా తెల్తుంది. పిల్లలు పరస్పరం కలహించుకున్నా తల్లి చెరోదెబ్బావేసి ఇద్దరినీ కలపాలని చూస్తుంది గానీ, వారిమధ్య ప్రేమాభిమానాలు పటిష్టపరిచి ఉంచాలని చూస్తుంది గానీ, లెక్కలుకట్టి పంచి, విడగొట్టాలని చూస్తుందా? అసలు భారతీయ కుటుంబ జీవన విలువలకు పట్టుగొమ్మల వంటివారు తెలుగువారు. అలాంటి తెలుగువారిని విడదీయాలనుకున్నందుకే ఆమె ఆరో గ్యం కూడా దెబ్బతింది అసలు అంటూ మొన్న మా మామయ్య చెప్పుకొస్తూంటే నాకు దిమ్మతిరిగిపోయిందనుకో’’ అన్నాడు సుందరయ్య.



‘‘మీ మామయ్య ఆర్.ఎస్.ఎస్. మనిషా ఏమిటి? ఆవిడ విదేశీయత మీద ఇప్పటికీ గుర్రుగా వుంటూ అభాసుపాలు చేయచూస్తూండేది వారేకదా.’’ అన్నాడు ప్రసాదు.


‘‘వాస్తవాలు గ్రహించడానికి పార్టీలు, వ్యక్తిగత సంస్థాగత బంధాలు అవరోధం కావాలా ఏమిటి? మా మామయ్య చెప్పిన విషయాలు ఆవిడ గురించి కొన్ని వింటూంటే అవి నిజమే కావచ్చునేమో అనిపించింది నాకు’’ అన్నాడు సుందరయ్య.


‘‘ఇంతకీ ఏమిటంటాడు మీ మామయ్య’’ కుతూహలంగా అడిగాడు ప్రసాదు.


‘‘సోనియాగాంధీ అసలు పేరు సోనియా కాదు ఆవిడకు గాంధీయంతో యధార్థ సంబంధమూ లేదు అన్నాడు. ఇటలీ వెనెటోలోని విసెంజాకు ముప్ఫైకిలోమీటర్ల దూరంలోని చిన్న గ్రామం లూసియానాలో స్టీఫెనో, పౌలోమైనో దంపతులకు 1946 డిసెంబర్ 9న ‘ఎడ్విగే ఆంటోనియా అల్బినా మైనో’గా పుట్టింది ఆవిడ. ‘మైనో’అన్నది వంశనామం. వంశపారంపర్యంగా మైనో వంశీయులు నివసించిన స్థలం అది. రోమన్ కేథలిక్ సంప్రదాయ కుటుంబంలో పుట్టి కేథలిక్ స్కూల్లోనే చదువుకుంది. తండ్రి భవన నిర్మాణ తాపీమేస్ర్తిగా జీవించేవాడు. రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసిన అతను ఇటలీ నేషనల్ ఫాసిస్టు పార్టీకి, ముస్సోలినీకి విధేయుడినైన మద్దతుదారుగా తననుతాను చెప్పుకునేవాడట. 1983లో ఆయన మరణించాడు. మిగతా ఇద్దరి కూతుళ్ళతో తల్లి ఇటలీలోని అర్బస్సనో (ORBASSANO) లోనే జీవిక సాగించింది. నిజానికి అర్బస్సనోలోనే సోనియా కౌమారం గడిచింది. 1964లో ఇంగ్లీష్ చదువుకోడానికి కేంబ్రిడ్జిలోని బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌లోచేరి అక్కడి గ్రీక్ రెస్టోరెంట్‌లో ‘వైట్రస్’ అంటే వడ్డన చేసే స్ర్తిగా ఆర్జనకై పనిచేస్తున్న రోజుల్లో అక్కడే రాజీవ్‌గాంధీతో పరిచయం అయిందిట. అప్పుడు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ట్రినిటీ కాలేజీలో రాజీవ్ చదువుతూండేవాడు. వారి పరిచయం పరిణయానికి దారితీసి 1968లో వివాహం కావడంతో ఆవిడ ‘అత్తారింటికి దారేది’ అనుకుంటూ మన ఇండియాకి వచ్చిందిట. బాల్య, యవ్వనాలు ప్రధానంగా వ్యక్తిత్వంపై చూపే ప్రభావాలెక్కువ కనుక ఆవిడది ఇటలీ హృదయమే అంటాడు మామ య్య’’ అన్నాడు సుందరయ్య.


‘‘ఆ మాట నేను ఒప్పుకోను. ఆవిడ అత్త ఇందిరాగాంధీ మనస్సును చూరగొంది. రాజీవ్‌గాంధీని పెళ్లాడాక ఆవిడ భారతీయురాలే అవుతుంది. ఇండియా పౌరసత్వాన్ని ఆవిడ 1983లో గానీ తీసుకోలేదంటారు. అందుకే ఓటర్ల లిస్టులో పేరు నమోదుచేయించుకున్నా 1982లో ఆ పేరు మొదట్లో తొలగించారని కూడా చెప్పుకున్నారు. ఏమయినా ఇప్పుడావిడ ఒక పవర్‌ఫుల్ ‘లేడీ’. ప్రధాని పదవిని ఏ కారణంతో త్రోసి రాజన్న, పదవులకాశించని ‘త్యాగధని’గా, అత్తా, భర్తా దేశంకోసం ఘోరంగా బలిదానమైపోయినా- నిబ్బరంగా నిలిచి, నూటపాతిక సంవత్సరాల పై చరిత్రకలిగిన కాంగ్రెస్ పార్టీకి- స్వాతంత్య్రానంతరం అధ్యక్షత వహించిన తొలి ‘విదేశీయంలో జన్మించిన వ్యక్తురాలి’గానూ ఘనతకెక్కారు. 1983 ఏప్రిల్ 27న యూనియన్ హోం మినిస్టరీకి రాసిన లేఖలో న్యూఢిల్లీలోని ఇటాలియన్ అంబాసిడర్ చెప్పేంతవరకూ సోనియా అసలు పేరు ‘ఆంటోనియా’ అనేది కూడా చాలామందికి తెలీదు. అయితే ఆ లేఖను కూడా ప్రభుత్వం బహిరంగ పరచలేదు. ఏమయినా ఇప్పుడదంతా ఎందుకు? ఈ దేశానికి దిశానిర్దేశం చేయగల దక్షత, కాంగ్రెస్‌కు మిగిలిన పెద్దదిక్కూ ఆవిడే! ఆవిడ ఒక మహారాణి. ఆవిడ ఏం చెబితే ఇప్పుడదే. నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికయిన ఘనత దేశంలో ఆవిడదే. బలీయమైన శక్తి తాను. కూతురు ప్రియాంకకు పెళ్ళిచేసి ‘వధేరా’కు అత్తగారు అయ్యింది గానీ, ఇంకా రాహుల్‌గాంధీకి పెళ్ళికానందువల్ల అసలు సిసలు ‘అత్తగారు’కాలేదు ఆవిడ. అంచేత మున్ముందు ఎలా వుంటుందో చెప్పలేం! ఇందిరాగాంధీ తీసుకుని నిలబడ్డ నిర్ణయాల దారిలో సోనియా నేడు లేదు. అత్తదారికి తాను భిన్నమనేది తన నిర్ణయాలవల్లనా ద్యోతకం చేస్తోందావిడ. ఇంతకీ తన ఇల్లుతాను చక్కబెట్టుకునే పనిలో- అంటే కాంగ్రెస్ గృహసంరక్షణలో తలమున్కలుగా వుందావిడ ఇప్పుడు. రాష్ట్రంలో అసలు ‘కాంగ్రెస్ ఇల్లేదీ’అని వెతుకులాడే పరిస్థితులున్నాయంటున్నారు. రాజకీయంగా అంతా ఇప్పుడు అనారోగ్యమే! మరి స్వాస్థ్యత ఎప్పటికి, ఎలా చిక్కుతుందో’’ అంటూ లేచాడు ప్రసాదు.







0 comments: