ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 4, 2013

ఇప్పుడిదే (ద)సరా!‘‘రేపటి నుంచి దసరా నవరాత్రులు మొదలు. రాష్ట్రంలో పరిస్థితులు ‘రాత్రులు’గా ‘నవనవ’లాడుతూ కనిపిస్తున్నాయే గానీ, ‘సరదా’గా మాత్రం గోచరించడం లేదు. రోజుకో ‘అలంకారం’మాటేమో గానీ, రోజుకో ‘అహంకారం’ మాత్రం రూపుకట్టడం సహజం! మహిషాసుర రాజకీయాలు చెలరేగిపోతున్నాయి కానీ, ‘మర్ధని’మాత్రం కనిపించడం లేదు’’అన్నాడు ప్రసాదు.

‘‘నిజమే! అసలు ‘విజయదశమి’అంటే ‘చెడు’మీద ‘మంచి’ సాధించిన ‘విజయం’. రావణుడిని రాముడు సంహరించిందీ, మహిషాసురుడిని దుర్గ పీచమడిచిందీ- అనే కాదు, కౌత్సముని రఘు మహారాజుని తన గురువుకి దక్షిణగా సమర్పించుకోడానికని అడిగిన బంగారు నాణేలను, రఘువు ఇంద్రుడిని అడగగా, ఇంద్రుడు కుబేరుని ద్వారా అయోధ్యపై వర్షింపచేసిందీ ఈరోజేననీ ఐతిహ్యం! దుర్గాదేవిని నవాలంకార శోభితగా అలంకరించి, రేపు పాడ్యమినుంచి విజయదశమి వరకూ ప్రత్యేక పూజలతో అర్చిస్తారు. కానీ ఇప్పుడు ‘అర్చన’ లందుకోవాల్సిన దేవత, కరుణించాల్సిన దేవత వేరే అన్నట్లుగా, రాజకీయ పర్వం కొనసాగుతోంది మరి’’ అన్నాడు నవ్వుతూ శంకరం.


‘‘రోజుకో ‘అలంకారం’కాదు, రోజుకో ‘అహంకారం’ పొడగడుతోంది’’అని నువ్వన్నమాట నిజమోయ్ ప్రసాదూ! తెలంగాణ సాధనే ‘విజయదశమి’అని ఒకరూ, ‘సమైక్య ప్రకటనే’ విజయదశమి అని ఒకరూ, ఇవాళ ద్విధావిభక్తమై- దివారాత్రాలు సాగుతున్నాయి.
సమైక్య ఉద్యమకారులు ప్రదర్శిస్తున్న ‘అలంకారాలు’వేరు, విభజనవాదుల ‘అలంకారాలు’వేరు. కానీ ఎవరి అహంకారాలు మాత్ర
o వారివే! ఇప్పుడు ‘సోనియాగాంధీ’యే ‘అమ్మ’వారుగా భావింపబడుతోంది! ఒకప్పుడు ఇందిరాగాంధీని ‘విజయేందిర’గా ‘శక్తి’గా రూపిణిగా భావించినవారున్నారు. ఇప్పుడు ‘శక్తిస్థల్’గా మారిపోయింది. ‘అన్నపూర్ణ’వంటి ఆంధ్ర దేశం, రాజ్యం విషయంలో ‘లలితా త్రిపుర సుందరి’గా కనబడడం లేదు. ఇప్పుడు ‘త్రిపుర’అంటే- సీమ, ఆంధ్ర, తెలంగాణ అంటున్నారు. మూడింటిదీ కలిపిన ఏకైక శక్తిగా ‘ముగురమ్మల మూలపుటమ్మ’ వ్యవహారం, పోయింది. ‘విభజన అనివార్యం’ అంటున్న గళాలు కొన్నయితే, ‘సమైక్యం విధాయకం’ అంటున్న గళాలు కొన్ని. ఇన్నాళ్ళ నిగళాలు త్రెంచుకుని, మా స్వయం పాలనాధికారం మాకిమ్మని, ‘స్వర్ణకవచాలంకృత’ హైదరాబాద్ మాదనీ ఉద్యమిస్తున్నవారు- ఈ దసరాల చివరకయినా తమ ఆకాంక్ష సరదాతీరుతుందని అనుకుంటూంటే, అది ‘జమ్మిచెట్టు’మీద ‘శవసదృశ’ ఉద్యమమేననీ, అసలు ‘వీర’విహారం చేసే విజయుడు ‘పేడి’రూపువదలి, సమైక్య‘పైడి’తోనే- ‘సమర విజయం’ పొందుతాడనీ అంటున్నవారున్నారు.’’అన్నాడు సన్యాసి.

‘‘అభిమతాన్నీ, మతాన్నీ ఇలా కలిపేయడం కొందరికి నచ్చదు కానీ, రాజకీయాలు కూడా మతాతీతాలుగా ఏమీలేవు మరి! తెలుగువారిలోనే హైందవులు అధిక శాతం అనీ, అయితే వారిలోని కొందరి వెనకబాటుతనాన్నీ, దైన్యాన్నీ ఆధారంచేసుకుని మత మార్పిడీ స్థాయిల- విజృంభించ చూస్తున్న ఇతరేతర శక్తులున్నాయనీ, తెలుగుజాతి ఐక్యతలో విచ్ఛిన్నతికి ఆ ప్రతీప శక్తులూ హేతువై ఏకమవ చూస్తున్నాయనీ, అందుకే ‘దుర్మార్గ భావనలు’ పెచ్చరిల్లుతున్నాయనీ, వాటిని అణచే ‘శక్తి దుర్గ’ అవతరించాలనీ అంటున్నవారున్నారు. కాంగ్రెస్ అవినీతి అక్రమాలకూ, విచ్ఛిన్నకర విధానాలకూ కొమ్ముకాస్తోందనీ, దానితో ‘
డీ'’కొట్టే ‘మోడీ’నేటి అగత్యమనీ, మార్పుకోసం సరదాపడుతున్నవారున్నారు. జమ్మి ఆకే ‘బంగారం’గా పంచుకుని, అభివృద్ధిని ఆకాంక్షించే అమాయకులనీ, ‘పాలపిట్ట’ స్వచ్ఛ హృదయులనీ ‘కలుషితం’ చేసిందెవరో, ఇంతటి కలకలానికి కారణమైందెవరో ప్రజలు గ్రహించలేని వారేమీకాదు! కానీ ‘దొంగోడే’ ‘దొంగ దొంగ’అని అరచినట్లుగా, కష్టనష్టాల కారకులే- ఇష్టపూర్తి ఇచ్చకపు మాట్లాడుతూ, తమ స్వార్థరాజకీయమే దిగ్విజయంగా నెరవేర్చుకునే పథక రచన చేస్తున్నారనిపిస్తోంది. అది సహజం! పాడ్యమినుంచి’ మౌడ్యమే 'అలంకరించుకుంటూ పోతే- ‘ఆయుధ పూజ’-వట్టి కాగితం పులుల అధిరోహణమై, ‘నోట్’మట్టికొట్టేదిగానే పరిణమించే అవకాశాలే ఎక్కువట! సమ్మెలతో, నిరసనలతో, గళగర్జనలతో, జనభేరులతో, అధిష్ఠానపు తప్పెట గుళ్ళతోనే- కాలం గడచిపోతూంటే, మహర్నవమి ఎప్పటికి? విజయదశమి ఎన్నటికి? మంచికి ‘శిలువ’వేసే సంస్కృతే పెరుగుతుంది కానీ, రాక్షస రాజకీయం పీచమడిచే ‘దుర్గ’ రూపుకట్టదు. విజయదశమి ‘దసరా’ సాక్షాత్కరించదు. అంతా సాగతీతల అయోమయమేగానీ, సారవంతమైన ఫలప్రద ‘దృశ్యం’ కనుచూపుమేరకయినా రాదు. ‘సర్వం’ ‘గర్వం’గానే చెలరేగుతుంది గానీ, ‘పర్వం’గా సెలబ్రేట్ చేసుకోవడం ఎలా?’’ అన్నాడు గంభీరంగా రాంబాబు.


2 comments:

Meraj Fathima said...

సర్వం మర్మం గానే సాగుతుందేమో..? మీరన్నట్లు పర్వం లేదెక్కడా.

సుధామ said...

మంచి మాటన్నారు మీరజ్ ఫ్హతిమా గారూ! ధన్యవాదాలు