ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, October 25, 2013

భయరహితం



‘‘ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో
.......
ఆ స్వేచ్ఛా స్వర్గానికి
తండ్రీ! నా దేశాన్ని మేల్కొలుపు’’

అంటూ రవీంద్రుడు గీతాంజలిలో ఆర్తి నివేదనం చేసాడు గానీ, ఈ దేశంలో స్ర్తిల మనసుకు అనుక్షణ భయాలే తప్ప నిర్భయం మాటే లేదు. నేరస్తులు, రేపిస్టులు లాంటి మనుషులు మాత్రం స్వేచ్ఛగా తలలెత్తి తిరుగుతున్నారు. జ్ఞానం దిశగా ఈ దేశం మేల్కొనే ఛాయలు మాత్రం కనబడడం లేదు’’ అన్నాడు రాంబాబు కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటూ.

‘ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా, క్షణాలమీద ఎలాంటి సమాచారమైనా విరివిగా విస్తరించే వీలున్నా హైటెక్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై కీచక పర్వం కొనసాగిందంటే నిజంగా దారుణమే! ఢిల్లీలో ‘నిర్భయ’ కేసు ఉదంతం, అనంతర పరిణామాలు కూడా హైద్రాబాద్ నగరంలో ‘అభయ’ను ఆదుకోలేకపోయాయంటే దేశం ఎటుపోతున్నట్టు. హైటెక్ సిటీలో భద్రత పేరుతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు నామమాత్రంగా తయారవడం, నిఘా లోపించడం, ఎంతటి కఠినమైన చట్టాలు రూపొందించినప్పటికీ ముష్కర మూకల దుష్కృత్యాలు అంతరించకపోవడం ఎంత వైఫల్యం’’ అన్నాడు శంకరం.

‘‘చట్టాలను చేసి లాభమేమి? దినం దినం శాసనాలు వేసి లాభమేమి... అని సినీ కవి అన్నట్లుగా మానవుల మనస్సులలో మార్పురావాలి గానీ కేవలం కాగితాల మీద వుండే కఠిన శిక్షలు అమలులోకి వచ్చి నేర బుద్ధుల బుర్రల్లో భయవిస్ఫోటనాలు కలిగిస్తే గానీ ప్రయోజనం ఏమీలేదు. వరంగల్ జిల్లా తుమ్మలకుంటకు చెందిన డ్రైవర్ సతీష్, నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం భక్తులపురం గ్రామానికి చెందిన సతీష్ మిత్రుడయిన వెంకటేశ్వర్లు విలాసవంతమైన వోల్వో కారులో ‘ఐటీ ఏరియాలో మంచి అమ్మాయిలుంటారు’అని పథకం ప్రకారమే సతీష్ కారు నడుపుతూండగా, వెంకటేశ్వర్లు ప్రయాణీకుడిలా నటిస్తూ క్వాలిటీ ఇన్ మాల్‌వద్ద క్యాబ్‌కోసం ఎదురుచూస్తున్న ‘అభయ’ను ఆమె వెళ్లాల్సిన ‘విప్రోజంక్షన్’వద్ద దింపుతామని ఎక్కించుకుని దారి మళ్ళించి కొల్లూరు సర్వీస్‌రోడ్ మీదుగా పటాన్‌చెరువు శివార్లకు తీసుకెళ్ళి నిర్మానుష్య ప్రదేశంలో కారులోనే అత్యాచారం చేసి, విషయం చెబితే చంపేస్తామని బెదిరించి అర్ధరాత్రి ఆమెను హాస్టల్ దగ్గర దింపి మరీ చక్కాపోయారట! ఇంత ‘నిర్భయ’త్వం ఆ కాముకులకు ఒనగూడడం, పెచ్చరిల్లుతున్న ‘మగమదం’కు, మహిళలకు భద్రత కల్పించలేని ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంకాక మరేమిటి? రాత్రి ఎనిమిదింటికి ‘షాపింగ్’చేసుకుని గూడు చేరుకోలేని అభద్రత హైటెక్ నగరంలో విలసిల్లుతోందంటే మన ‘హైటెక్’ గురించి ఏం గర్వపడాలి. బెంగుళూర్‌లోని ఫ్రెండ్‌తో సెల్‌ఫోన్‌లో ఛాటింగ్ చేస్తున్న ‘అభయ’నుండి దాన్ని లాక్కుని స్విచ్ ఆఫ్‌చేసి మరీ దారుణానికి ఒడిగట్టారట. సతీశ్ ఒత్తిడివల్లే నేనూ రేప్ చేశానని వెంకటేశ్వర్లు పోలీసుల ముందు చెప్పాడట. నిందితులు ఇద్దరూ పట్టుబడిన మాట వాస్తవమేగానీ కేసు నీరుకారకుండా వారికి కఠినశిక్షలు పడతాయని విశ్వసించగలమా? పైగా ఢిల్లీలో నిర్భయలాగా అభయ రేప్ చేయబడిందే కానీ హత్య చేయబడలేదు. నిందితులే స్వయంగా ఆమెను అదే కార్లో ఆమె హాస్టల్ దగ్గర దింపారు. కేసు పకడ్బందీగా ముందుకెళ్లక తేలిపోవడానికి ఇలాంటివి కూడా హేతువవుతాయేమోనని నాబోటివారి భయం’’ అన్నాడు ప్రసాదు.

‘‘నిజమే! నేరం ఎంత తీవ్రమైనదయితే శిక్షలు అంత కఠినంగా వుంటాయని, వుండాలని అనుకుంటాం. నిజానికి కనీసం అభయ కేసులో నిందితులను పట్టుకోవడానికి క్రైమ్స్ అదనపు ఉప కమీషనర్ జానకీ షర్మిల ఒక రోజంతా అభయతో గడిపి, ఆమెను ఒప్పించి ఘటనా స్థలానికి తీసుకెళ్ళి నేరస్తులను పట్టుకోడానికి తగిన ఆధారాలు పట్టుకోవడంలో కీలక భూమిక వహించి వుండకపోతే అసలు ఈ విషయం తెలిసేదే కాదు. అభయ నుండి ఫోన్ అందుకున్న బెంగుళూర్ మిత్రుడికి ఆ ఫోన్‌లోనే ఆమె కేకలు వినిపించడంవల్ల అతను బాలానగర్‌లోని మిత్రులకు విషయం చెప్పడం, వారు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేయడం జరిగాయి. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడం కనీసం హర్షణీయం’’ అన్నాడు శంకరం.

‘‘వాహనం ఎక్కేముందు వాటి నెంబర్లను రాసుకోవడం, అవసరమైతే తమవారికి ఆ నెంబర్లను మెసేజ్ చేయడం, ఒంటరి అమ్మాయిలు- అందునా ప్రయాణ సమయాల్లో, ముఖ్యంగా రాత్రివేళల్లో అలవాటు చేసుకోవడం విధాయకం అనిపిస్తోంది. నామమాత్రావశిష్టంగా కాకుండా సిసి కెమేరాలు ఎల్లవేళలా సమర్ధవంతంగా పనిచేసేలా నిఘా విభాగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపాలుంటే సరిచేసి తీరాలి. అసలు నన్నడిగితే నేరాలు-ఘోరాలను ‘గ్లోరిఫై’చేయడం ‘మీడియా’కూడా తగ్గిస్తే మంచిది. ‘వద్దన్న పనిచేయడం’ పట్ల మానవ బలహీనతలు బలీయంగా పనిచేస్తూంటాయి. ‘‘నేరం చేసి వాడయితే దొరికిపోయాడు గానీ నేనెందుకు దొరుకుతాను’’అనే తెంపరి నైజం, నేరస్తులలో పెరుగుతున్న హేతువులేమిటో గుర్తించి వాటిని తుదకంటా అంతరింపచేయాలి. శిక్షలు కఠినాతి కఠినంగా సత్వరమే ఇలాంటి నేరాల విషయంలో అమలుపరచబడి, వాటికి విస్తృత ప్రచారం జరగాలే కానీ, కేవలం నేర కథనాలకు కాకూడదు. అప్పుడే మరి భయరహిత సమాజపు స్వేచ్ఛా స్వర్గం ఆవిర్భవిస్తుంది. మానవత్వం మేల్కొంటుంది’’ అన్నాడు రాంబాబు.





0 comments: