ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, March 22, 2013

ద్వ్యర్థిసూత్రం










‘‘అంతా సజావుగా సాగిపోతున్నట్టున్నప్పుడు - ఏ ఇబ్బందీ లేదు. పరస్పర అంగీకారంతో జరిగితే సరేసరి! అలా కాకున్న, ఒకరి పెత్తనాన్నో, ఒత్తిడినో భరించి, మనసు చంపుకు అంగీకరించి సర్దుకుపోయినా, పేచీ వుండ దు. అలాకాక - అవతలివారి ఆధిక్యతను పడగొట్టాలనుకున్నా, తమకు నచ్చని వ్యవహార సరళిలో వర్తించినందుకు - ఎదుటివారిపై కోపగించి కక్ష తీర్చుకోవాలనుకున్నా, ధిక్కరించి నిలదీయడమో, నలుగురిలో యాగీ చేయడమో జరుగుతుంది. అసలు బాధితులు ఎవరన్నది కూడా కొన్ని సందర్భాలలో అనుమానాస్పదమవుతూంటుంది. అకారణంగా పరువు పోగొట్టుకునే వారూ వుంటారు. అసలు దోషులు ఒ క్కసారి తప్పించుకుపోతూనూ వుంటారు’’ అన్నాడు రాంబాబు పేపర్ మడిచి టీపాయ్ మీద పడేస్తూ.

‘‘నాన్నా రాంబాబూ! నువ్వు ప్రస్తావిస్తున్న అంశం ఏమిటో ఇదమిద్ధంగా తెలియకుండా తెలివిగా ముందుంచుతే ఎలాగోయ్? ప్రస్తుత రాజకీయాల గురించి ఉద్దేశించావో, సెక్స్ విషయానికి సంబంధించి మహిళల రక్షణబిల్లు నేపథ్యంలో ఉటంకించావో అర్థం కాలేదు. నీ వాక్యాలు మరీ ద్వ్యర్థికావ్యంలా రెండింటికీ అన్వర్తింపచేసుకోవాలంటా వా?’’ అన్నాడు శంకరం నవ్వుతూ.
‘‘సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కూడా ఎప్పుడూ పరస్పర అంగీకారాల మీదా, సర్దుకుపోవడం మీదే వుంటుంది. కలసి కాపురం చేసినట్టూ, పరస్పరాంగీకారంతో - శృంగారం నడిపినట్టూ వున్నంతకాలం బానే వుంటుంది కానీ, తమ ఆత్మాభిమానం దెబ్బతీసినట్టూ, ఏదో విషయంలో బలవంతం చేసినట్టూ, తమకునచ్చని పని చేసినప్పుడు అత్యాచారం చేసినట్టూ భావించడం జరిగిందా? ఇక సంక్షోభం తప్పదు మరి!’’ అన్నాడు ప్రసాదు
.


‘‘ఐక్యరాజ్య సమితి వారి మానవ హక్కుల కౌన్సిల్ సమావేశంలో అమెరికా శ్రీలంకకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టబోయే తీర్మానం భారత్ సమర్థించాలని తమిళ సంఘాలూ, రాజకీయ పక్షాలు గత కొంతకాలంగా కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాయ్. అయితే తాజాగా శ్రీలంకలోని తమిళులపై అకృత్యాల మానవహక్కుల హననంపై దర్యాప్తును - శ్రీలంకకే కట్టబెట్టే విధంగా తీర్మానాన్ని సవరించి, అమెరికా ప్రవేశపెట్టబోతోంది. ఆ తీర్మానానికి భారత్ సవరణలు ప్రవేశపెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంది. శ్రీలంక సైన్యం ఎల్‌టిటిఈ పులి ప్రభాకర్ కుమారుడైన పనె్నండేళ్ల బాలచంద్రన్‌ను కిరాతకంగా కాల్చి చంపడం తమిళ సమాజాన్ని భగ్గున మండించింది.
తమిళ ఈలం ఉద్యమకారులపై శ్రీలంక సైన్యం నిర్మూలన యుద్ధం చేస్తూ, తమిళ ప్రజలపై జరిపిన అమానుషాలను నిలువరించేందుకు - అప్పట్లో కేంద్రాన్ని డి.ఏం.కే. ఒత్తిడి చేయలేదు. కరుణానిధి అప్పుడు అంత ఘోరం జరుగుతున్నా - అపార ‘కరుణానిధి’గానే నిలిచారు! ముఖ్యమంత్రిత్వాన్ని శాసనసభ ఎన్నికల్లో ఓడి, పోగొట్టుకుని దెబ్బతినడం, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూండడం, తమిళనాట పరిస్థితులను ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే - ఇప్పుడు కేంద్రంలో యు.పి.ఏ. ప్రభుత్వం నుంచి వైదొలగే ఎత్తుగడ వేయడం జరిగింది. ఇది మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడంలాంటిదే! 2009లో శ్రీలంక సైన్యం అరాచకాలు సృష్టిస్తుంటే - పెత్తనంలో వుండీ, యుద్ధం ముగిసిందని, అజ్ఞాతంలోకి వెళ్లిన అమాయక తమిళులు బయటకు వచ్చి శ్రీలంకలో బలి అయిపోయేలా చేసింది ఈయనకాదా? శ్రీలంకకు కేంద్రం సహాయ నిరాకరణం చేయాలని జయలలిత ప్రభుత్వం తమిళనాట అసెంబ్లీలో తీర్మానం పెట్టినా మద్దతు ఇవ్వకుండా, భద్రతా మండలి సమావేశంలో గత ఏడాది శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయేలా కేంద్రం వ్యవహరించినప్పుడు - మంత్రి పదవులకు శృంగారానికి ఆశపడినట్లు వౌనంగా ఔదలదాల్చడం తప్పుకాదా? ఇప్పుడు జనంలో వ్యతిరేకత పెరుగుతున్నందునే డి.ఎం.కె. కరుణానిధి - యు.పి.ఏ. నుండి వైదొలగే చర్యతో, ఆరోపణలతో యాగీ చేయడం జరుగుతోందని జయలలిత అనడంలో ఔచిత్యం కనబడటం లేదా?’’ అన్నాడు రాంబాబు కొంచెం ఆవేశంగానే.


‘‘అదేనయ్యా! సమ్మతితో జరిగే వ్యవహారాలు అయితే నియమనిబంధనలూ, తప్పొప్పులూ చూసుకోవు. సంబంధాలు చెడినప్పుడేగా యాగీ జరిగేది! రాజకీయాలైనా, లైంగిక వ్యవహారాలైనా అంతే! మంగళవారం అత్యాచార నిరోధక బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు - సెక్స్‌కు సమ్మతి వయస్సు కూడా పదహారేళ్లు చేయాలన్న ఆలోచన విడనాడి, పద్దెనిమిదేళ్లుగానే కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అత్యాచార దోషులకు 20 ఏళ్ళ శిక్ష, రెండోసారి నేరం చేస్తే ఉరిశిక్ష, బిల్లులో ఆమోదించబడ్డాయి. లైంగిక వేధింపులు, యాసిడ్‌దాడులు, రహస్యంగా గమనించడం వంటి వాటికీ శిక్షలు వర్తించేలా పరిధిని పెంచారు. ఒక ప్రక్క చట్టాలు, శాసనాలు రూపొందింపబడుతున్నా - అదే సమయంలో అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. సినిమాల్లో ప్రకటనల్లో చూపే అశ్లీలాన్ని కూడా మహిళలపై లైంగిక వేధింపులుగానే పరిగణించాలనీ, ఐటమ్‌సాంగ్స్ సంగతేమిటనీ బిల్లుపై చర్చలో జె.డి.యూ అధినేత శరద్‌యాదవ్ అన్నారు. ‘‘మనమంతా ఆడవాళ్ళను చాటుమాటుగా చూసినవాళ్ళమే. అమ్మాయిలతో మాటకలపాలనీ, చొరవ తీసుకోవాలనీ ప్రయత్నించని వారెవరున్నారు’’ అని ఆయన అన్నప్పుడు సభ్యులంతా పెద్దపెట్టున నవ్వారటగానీ, వాస్తవాలు కాదనగలవారెవరు! నేరాలు ఘోరాలు ఒక ఘనతగా, ప్రచారయోగ్యమైన గొప్ప విస్తృత వార్తాంశాలుగా రాణిస్తున్నాయి. గుర్తింపుకోసం ఆరాటపడేవారికి మంచికన్న చెడే ఆసరాగా నిలుస్తోంది. గవర్నర్లు, మంత్రులు ఎందరు ఈ సెక్స్‌నేరాలు, హత్యానేరాలతో ముడిపడి ద్యోతకం కాలేదు? నేతృత్వ దరిద్రమైన జాతిలో - ప్రజలూ భ్రష్టులే అవుతారు. మానవీయ విలువలతో కూడిన మానవ హక్కుల రక్షణ ఎప్పటికోమరి?’’ అంటూ లేచాడు శంకరం.

4 comments:

rammohan thummuri said...

సుధామ గారూ,
మీ విశ్లేషణ బాగుంది.
వాధులస

Sent from http://bit.ly/f02wSy

సుధామ said...

మీకు నచ్చినందుకు ఎంతో సంతోషం వాధూలస గారూ!

kannaji e said...

ఏ ఎండకు ఆ గొడుగు ఏ వానకు ఆ కోటు...ఏ చలికి ఆ స్వెట్టరూ...ఇదే ప్రస్తుత రాజకీయ విష సిద్ధాంతం

సుధామ said...

బాగా చెప్పారు కన్నాజి గారూ!