‘‘అప్పడే ఎండలు మండిపోతున్నాయి. ‘మే’నెలలో మునుపు వుండే ఎండ తీవ్రత, ఇప్పుడు ‘మార్చి’ లోనే పొడగడుతోంది! దానికితోడు నీటి ఎద్దడి మొదలైంది. చాలా కాలనీలకు నీరు నల్లాల ద్వారా లోప్రెషర్‌తో, అదికూడా కేవలం ఓ గంట మాత్రమే వస్తూండడంతో, తీవ్ర నీటి ఎద్దడి మొదలైంది. చాలా అపార్ట్‌మెంట్స్‌లో అప్పుడే మంచినీరు పట్టిపెట్టుకోవడానికి కూడా, రోజువిడిచి రోజు, అదీ ఓ అరగంట- ఫ్లాట్స్‌కు వదలడం చేస్తున్నారు! మంచినీటి ఎద్దడి కారణంగా- నీటికి డిమాం డ్ పెరిగిపోతోంది.’’ అన్నాడు సన్యాసి వస్తూవస్తూనే.
‘‘అవున్నాయనా! ‘నీరే ప్రాణాధారం’ అన్నారు. అందునా వేసవి కాలం తిండి లేకపోయినా బ్రతగ్గలం కానీ, నీళ్ళు త్రాగకుండా బ్రతకలేం! సహజ ప్రకృతి వనరు అయిన నీటిని కొనుక్కోవడమనే వైఖరి దాపురించడమే- అసలు గొప్ప ‘అమానుషం’ అనాలి!’’ అన్నాడు ప్రసాదు.
‘‘ఇవాల్టి స్థితి అదే మరి! నీటికోసం ‘కన్నీటి’ పర్యంతమయ్యే ఘట్టాలు వేసవి కాలపు శాపాలే మరి! ముందస్తు ఎండలు, ముందస్తు నీటి సమస్యలను మనముందుకు తెస్తున్నాయి’’ అన్నాడు సన్యాసి.
ఇదంతా వింటూ వింటూ రాంబాబు నవ్వాడు.
‘‘ఏమిటి రాంబాబూ! అలా నవ్వుతావేమిటి? నీటి సమస్య అంటే నీకు ఎగతాళిగా వుందా?’’ ఒక్కసారిగా అడిగారు సన్యాసి, ప్రసాదు.
‘‘అబ్బే! అదేం లేదు. మొన్న శంకరం తమాషాగా చెప్పిన సంగతి గుర్తొచ్చి నవ్వొచ్చిందర్రా! ‘‘పరమేశా గంగ విడుము- పార్వతి చాలున్’’ అని కవి వాక్కు వుంది. పార్వతిని వుంచుకుని గంగను ఇమ్మని అడిగాడంటే- పాపం! ఆ భక్తుడి ‘నీటి ఎద్దడి వ్యవహారం’ తెలియడం లేదా?- అన్నాడు శంకరం. ఆవేళ భగీరథుడూ గంగ కోసమే పట్టుబట్టాడు. అప్పుడు శంకరుడు- గంగను వదిలాడేమోగానీ, ఇవాళ శంకరుడయినా గంగను వదలడట! కావలిస్తే పార్వతిని పట్టుకుపొమ్మంటాడట! అలా అంటూ శంకరం కార్టూన్ ఐడియాలు కూడా రెండిచ్చాడర్రా! పార్వతి శంకరుడితో నిష్ఠురంగా అంటుందట- ‘‘్భగీరథుడు అడిగాడని ఆ ‘ఓవర్ హెడ్ ట్యాంక్’ ఇచ్చేసారు. ఇప్పుడు ఎండాకాలంలో మన నీటి ఎద్దడి ఎవరు తీరుస్తారు’’ అని. శివుడి ‘ఓవర్‌హెడ్ ట్యాంక్’ అంటే గంగనే కదా! ‘‘గంగకిద్దరి మేలు ఇద్దరి కీడునున్ గలదె’’ అనడానికీ వీల్లేదట ఇవాళ! ఏవైపు నీరు ఎక్కువ వుంటుందో అది మేలయిన తటము. ఏ ‘దరి’న నీరు లేదో- ఆ దరి ‘కీడే’మరి! హిమాలయాల్లో వుండే శంకరుడికయినా ‘గంగ’ లేకపోతే కష్టమేనట! ఆ మంచు కరిగించుకుని నీరు చేసుకు త్రాగే ‘ప్రాసెస్’ ఆయనా పడలేడు! గంగను భగీరథుడికి వదిలేసాక శివుడు సూర్యభగవానుడిని ప్రార్థించాట్ట!’’ అన్నాడు రాంబాబు నవ్వుతూనే.
.‘‘నవ్వుతాలేమీ కాదులే! నిజంగా వ్యవహారం అలానే వుంది. శంకరుడయినా నెత్తిన ‘గంగ’నుంచుకుంటేనే విలు వ! అర్థనారీశ్వరుడనో, ఉమాపతి అనో కాకుండా, గంగాధరుడనీ, గొప్ప ‘ఓవర్‌హెడ్ ట్యాంక్’ వున్నవాడనే- గౌరవం ఎక్కువ! ‘గంగావతరణ’ ఘట్టానికున్న వైశిష్ట్యం, మరోదానికి లేదేమో; శివలీలల్లోనయినా! ఎంత ‘సవతి’ అనుకున్నా- పార్వతికి కూడా ‘గంగ’ కావల్సిందే! నలుగుబిండితో వినాయకుడిని చేసే తలంటు స్నానానికయినా, ముందుగా కావల్సిందే గంగకదా!’’ అన్నాడు ప్రసాద్ కూడా నవ్వుతూ
‘‘వేసవిలో నీటి సమస్యలు అధికం కావడంవల్లే- ఎంత డబ్బయినా చెల్లించి, మంచినీటి నిల్వలకోసం జనం ఆరాటపడుతూంటారు. ఇది అదనుగా వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సిబ్బందిలో కొందరు, చేతివాటం చూపుతూ వుంటారు. పంపించవలసిన ప్రాంతానికి ఉచిత మంచినీటి ట్యాంకర్ పంపకుండా- ఆ ట్యాంకర్‌ని మరెవరికో డబ్బుకు అమ్ముకుంటూండే ఘటనలూ జరుగుతూంటాయి.’’ అన్నాడు సన్యాసి.
‘‘ఇప్పుడు ఆ పప్పులేం వుడకవులెండర్రా! ఇలాంటి అక్రమాల నివారణకే- ప్రత్యేకంగా ఒక ‘మానిటరింగ్ సెల్’ ఏర్పాటుచేస్తున్నారట! ఈ సెల్ రోజూ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి బయలుదేరిన వాటర్ ట్యాంకర్- అసలు గమ్యానికి చేరిందా? లేదా? అన్నది తెలుసుకుంటూంటుంది. ‘ఉచిత వాటర్ ట్యాంకర్’ వెళ్ళాల్సిన ప్రాంతానికి సంబంధించి, అక్కడి స్థానికుల్లో ఎవరి ఫోన్ నెంబరయినా నమోదుచేసుకుంటారట! ట్యాంకర్ సదరు ప్రాంతానికి వచ్చిందా లేదా అనేది, సదరు వ్యక్తికి ఫోన్‌చేసి కనుక్కుంటారు. అలాగే-నగదు చెల్లించి నీటి ట్యాంకర్ కొనుక్కోవడానకి బుక్ చేసిన వారికి, ఒక రహస్య ‘కోడ్ నెంబర్’ యిస్తారు. ఈ నెంబర్ తీసుకున్నాక సదరు ట్యాంకర్- వ్యక్తికి చేరగానే, నీటి ట్యాంకర్ డ్రైవర్ యిచ్చే రశీదు మీద, ఆ కోడ్ నెంబర్ వేసి సంతకం చేసి ఇవ్వాల్సి వుంటుంది. ఈ ‘కోడ్ నెంబర్’ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌కు తెలియనివ్వరు. ట్యాంకర్‌ను బుక్‌చేసిన వారికే ఇస్తారు. ట్యాంకర్ డ్రైవర్- కస్టమర్ ఇచ్చిన నెంబర్‌ను, మళ్ళీ కార్యాలయంలో ఇవ్వాల్సి వుంటుందన్నమాట! అంటే సదరు వాటర్ ట్యాంకర్- చేరాల్సిన వ్యక్తికే చేరిందని నిర్ధారించుకున్నారన్నమాట! వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నీటి సమస్యల పరిష్కారంలో భాగంగా, నీటి పంపిణీ విషయంలో- అవినీతి, అక్రమాలు చోటుచేసుకోకూడదన్న సత్సంకల్పంతో, ఇలాంటి ‘స్పెషల్ డ్రైవ్‌లు’ నిర్వర్తిస్తోంది! ఈ వేసవిలో ఇలాంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధవహించనున్నారట! ఒకందుకు అది మరి మంచిదేగా!’’ అన్నాడు రాంబాబు.
‘‘బిందువు- బిందువును చేరి సింధువగును’’ అన్నట్లు, ప్రజలు నీటి పొదుపు పాటించాలి. వృథాగా నీరు పారబోయడం, పని అయిపోయినా కుళాయిలు కట్టకపోవడం, ఓవర్‌హెడ్ ట్యాంకర్లు నిండి నీరు పొంగిపొర్లిపోయేంతవరకు కట్టకపోవడం వంటి పనులు చేయకూడదు. మొక్కలకు, పక్షులకు, పశువులకు కూడా నీరు అవసరం! వృథాగా నీటిని ఖర్చుచేయకుండా వుండాలని, ముని పుంగవుడు ఒకాయన- కమండలంలోని నీళ్లు జల్లాల్సి వస్తుందని శాపాలివ్వడం కూడా మానుకున్నాడట ఎండాకాలంలో! అలాంటి మంచి పనులే బెస్ట్.’’ అన్నాడు శంకరం చాటునుండి ముందుకొచ్చి నవ్వుతూ.
*
0 comments:
Post a Comment