ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 23, 2012

ఎగిరిపాటు


‘‘మనకు ప్రయోజనం లేనప్పుడు, మనవాడైతేనేమిటి తొక్క మరొకడయితేనేమిటి? వదిలేయడమే! వదిలేసి వేరే పక్షంలో చేరిపోవడమే! మనం ఏ పార్టీలో ఎప్పుడుంటామో- అదే, అసలుసిసలు ధర్మబద్ధమైన పార్టీ అనే సిద్ధాంతం రాజకీయంగా ఓ రాద్ధాంతం అనుకోవడం సరికాదు. అవశ్యమనుసరణీయం’’అన్నాడు శంకరం సన్యాసితో గీతోపదేశం ఫోజులో.

‘‘స్వజనులని, వారినే అంటిపెట్టుకు కూర్చోకుండా ఆ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాక, ఆ అధికార పీఠం తనకేదక్కాలంటే, సరియైన పొత్తు వెదుక్కోవాలి. ఏ పక్షాన చేరితే తనకుమాలిన ధర్మంకాక, తన ధర్మం కూడా నెరవేరుతుందో అటు వెళ్లిపోవడమే ధర్మం అని అల రామాయణ కాలంనాడు విభీషణుడిని ఆదర్శంగా తీసుకోవడం బెటర్! విభీషణుడూ రాక్షసుడే! అన్నగారి ప్రభుత్వం పనితీరు, ఆయన తీరు నచ్చలేదు. చెబితే వినే రకంగా కూడా లేడు కాబట్టి అన్నను కాదని రాముని పక్షాన చేరాడు విభీషణుడు. అన్న మరణానంతరం లంకాధిపత్యం తనకే లభిస్తుందని విభీషణుడికి తెలీదనుకోలేం. అయితే విభీషణుడి రామాశ్రయం వెనుక అధికార లాలస వుందనలేం గానీ ఇవాళ పార్టీల్లో వలసలుపోతున్నవారు ధర్మంపక్షాన చేరుతున్నామంటున్నా రాక్షసాంశ గలవారని మాత్రం మరిచిపోకూడదు. నాటి వలసలకూ నేటి వలసలకూ అదీ తేడా’’ అన్నాడు సన్యాసి.

‘‘్ధర్మం ధర్మంగానే చెలామణీ అవుతూ వచ్చేట్లయితే ‘రామాయణం రంకు- భారతం బొంకు’ వంటి మాటలు ఎందుకు పుట్టుకొస్తాయి? దేంట్లోనయినా దోషానే్వషణం చేసి, తమ పచ్చకామెర్ల దృష్టిదోషపు ఆరోపణలు చేసి సంచరించేవారు ఎప్పుడూ వుంటూనే వుంటారు. అసలు అలాంటివారిని చూసే ‘తావలచింది రంభ- తాను మునిగింది గంగ’ అన్న ఉక్తి పుట్టుకొచ్చి వుంటుందర్రా! ‘‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడు’’అని కన్యాశుల్కం నాటకంలో గురజాడవారు గిరీశం పాత్ర చేత చెప్పించిన సుముహూర్తం ఏదోగానీ అదే నేటి కాలానికి నిర్ధారణఅయి కూర్చుంది. ‘ఒకేమాట- ఒకే బాణం’ అనే రాముడు పాపం పొలిటీషియన్ కాడు. అన్నగారి పార్టీ వదలి రాముడితో చేరిన విభీషణుడూ పాపం పొలిటీషియన్ కాడు. రాజకీయాలకు మాత్రం ‘కృష్ణం వందే జగద్గురుం’. అయితే కృష్ణుడినే మించిన రాజకీయ భారత రథసారధులు ఇవాల్టి పొలిటీషియన్స్. అప్పుడప్పుడు కాదు ఎప్పుడు కావలిస్తే అప్పుడు అభిప్రాయాలు మార్చేసుకుంటూండడమే. పైగా ఏమైనా అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ వుండరు అని కంఠోక్తిగా పలుకుతూంటారు. ‘నదీనాం సాగరోగతిః’ అన్నట్లు చిన్న చితకా పార్టీలు అనేకం పుట్టుకొచ్చినా ఆఖరికి నూట పాతికేళ్లపై చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో విలీనమవుతూ పోవడం, చూస్తూనే వచ్చాం కదర్రా!’’అన్నాడు ప్రసాదు సంభాషణలో చొరబడుతూ.

‘‘ప్రజలకు నేతల మీద నమ్మకం పోతుందంటే పోదూ మరి! సామాజిక న్యాయం అంటూ రాజకీయ అరంగేట్రం చేసి ఒకప్పుడు ఎన్.టి.రామారావు గారి ‘తెలుగుదేశం’ ప్రభంజనం స్థాయిలో ఎదిగిరావడం జరుగుతుందనుకున్న చిరంజీవీ, ఆయన పార్టీ ప్రజారాజ్యం కాంగ్రెస్ తీర్థంలో కలిసిపోయాయి. ముఖ్యమంత్రి అవుదామనుకున్నవాడు కేంద్రంలో పర్యాటక మంత్రి అయ్యాడు. కాంగ్రెస్‌లో కలసిపోయినందుకు గాను 2014లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే గిలిస్తే అప్పడయినా సి.ఎం. పోస్ట్‌కు చిరంజీవి దరఖాస్తు ఇప్పుడే పరుచుకున్న ‘దస్తీ’లా వుంటుందన్న ఆశా వుంటుంది. ‘‘నేను మంత్రి పదవి ఇచ్చి వుంటే కె.సి.ఆర్ తె.రా.స పెట్టకుండా తన తెలుగుదేశంలోనే వుండిపోయేవాడు కదా’’అని చంద్రబాబుగారు ప్రస్తుత పాదయాత్ర అను‘యానం’లో పదే పదే తలుచుకుంటున్నారు. కప్పల తక్కెడ లోంచి ఏ కప్ప ఎప్పుడు ఏ పక్కకు ఎగురుతుందో ఎవరూ చెప్పలేనట్లు ఇప్పుడు ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి ఎవరు ఎందుకు ఎప్పుడు వలస గెంతుగెంతుతారో చెప్పలేకపోతున్నారు. ‘అవతలి పార్టీనుంచి ఫలానావాళ్లు మా పార్టీలోకి వచ్చేస్తున్నారహోయ్!’ అని టాంటాం వేసుకోవడాలూ కొన్ని పార్టీలు పధకం ప్రకారం చేస్తున్నాయి. అందువల్ల పాపం ఆ ఫలానావాళ్లు ఇబ్బందిపడుతున్న సందర్భాలూ, కంట నీరు పెడుతున్న కాలమాన పరిస్థితులూ కన్పిస్తున్నాయి. పనిగట్టుకుని ఒకరిని తమ పార్టీనుంచి వెళ్లగొట్టాలని అనుకునే వారికంటే పనిపెట్టుకుని ఒకరిని తమ పార్టీలోకి రప్పిచేసుకోవాలని ఆత్రపడేవారే ఎక్కువ. అందునా మధ్యంతర ఎన్నికలు రాగలవన్న సూచనలు కనబడుతూండడంతో నీలం తుఫాన్‌లాగా కొన్ని పార్టీల్లో గాలి దుమారాలు చెలరేగుతున్నాయి. ఏ పార్టీనుంచి ఏ పార్టీలోకి ఎవరు ఎప్పుడో కొట్టుకుపోతారో తెలీడంలేదు. కానీ ఫిరాయింపులు, వలసలు మాత్రం ఇంపు నింపు విషయాలుగా నేటి రాజకీయం దింపుకుంటోంది. అందులోంచే ప్రయోజనాలు ఒంపుకుంటోంది’’ అన్నాడు సన్యాసి.

‘‘ఇప్పుడు ఇంక స్థిరత్వం అనే మాటకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అవిశ్వాస తీర్మానం ఎవరు ప్రవేశపెడతారో పిల్లిమెడకు గంట ఎవరు కడతారో ఇంకా తేలడం లేదు. ‘‘నువ్వు రెడీకా! నేను మద్దతునిస్తా’’ అని అవతలి వారిని ముందుకు నెట్టి, పరిస్థితినిబట్టి వెనక నిలవాలని చూసేవారే కానీ తెగించి ముందుకు రాగల తెంపరులూ కనబడడం లేదు. ఎటొచ్చి ఏది తమ మెడకు చుట్టుకుని ప్రజలముందు దోషిగా నిలబెడుతుందోనని ప్రతి పార్టీకీ భయమే! కణుగూ మిణుగూ తేల్చరు. కాంగ్రెస్‌ని తిడతారు గానీ అవసరమైతే వారినే నెడతారు. తిరగబడతారు గానీ కొందరు, మళ్లీ ఆ పార్టీలోనే తిరగమోత పెడతారు. బొమ్మబొమ్మే! బొరుసు బొరుసే! కానీ ఏది పడుతుందోనని నాణెం విసిరే వారికీ, విసిరించుకునే వారికీ కూడా ఉత్కంఠే! ఉన్న నాణెం చెల్లేదో, చెల్లనిదో తెలియకుండానే ‘‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’’అంటూ పైకి ఎగరేస్తూండడమే ప్రస్తుత రాజకీయం అని లేచాడు శంకరం.

0 comments: