ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 16, 2012

దోస్త్ కటీఫ్’




దోస్త్ కటీఫ్’ అనడానికి మూడు కారణాలుండచ్చు. ఒకటి- బ్రతిమాలించుకోవడానికి, రెండు- బ్లాక్‌మెయిల్ చేయడానికి, మూడోది- నిజంగానే కోపంవచ్చి తెగతెంపులు చేసుకోవడానికి. ఈ మూడింటిలో అసదుద్దీన్ అసలు ఉద్దేశించింది ఏమిటో, కాంగ్రెస్‌తో ఎం.ఐ.ఎం మద్దతు ఉపసంహరణ ఎందుకో, స్పష్టంగా తెలియడంలేదు’’ అన్నాడు శంకరం.

‘‘ ‘స్నేహం చేయడం సులభమే! నిలబెట్టుకోవడమే కష్టం’ అని వూరికే అనలేదు పెద్దలు. కాంగ్రెస్‌తో చెలిమివల్ల ఇన్నాళ్లుగా లేనిది, ఇప్పుడు కొత్తగా హఠాత్తుగా ముంచుకొచ్చిన ముప్పు ఏమిటో తెలియడంలేదు. రెండేళ్లలోనే, మధ్యంతరంగానో ఎన్నికలు రాబోతున్నవేళ- ఇదేదో ఎత్తుగడ అనిపించక మానదుకదా!’’ అన్నాడు ప్రసాదు.

‘‘కాంగ్రెస్ మతతత్త్వ పార్టీలతో కుమ్మక్కు అవుతోందనీ, మత సామరస్యాన్ని కాపాడలేకపోతోందనీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కానీ ఆయన వాదన కేంద్రంలోని ప్రభుత్వంమీద కన్నా, రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ వైఖరి గురించేననిపిస్తోంది! మహావీర్ హాస్పిటల్ స్థలం గురించీ, చార్మినార్‌ను ఆనుకుని వున్న భాగ్యలక్ష్మి దేవాలయం అస్తిత్వం గురించీ అసదుద్దీన్‌కు అనుకూల దిశగా రాష్ట్ర సర్కారు ప్రవర్తించలేదన్న ‘కినుకే’ ఈ మద్దతు ఉపసంహరణమనే ‘దోస్త్ కటీఫ్’ కారణంగా అనిపిస్తోంది. కానీ అదేమీ కాదనీ- ఈనెల 25 తరువాత అంటే ‘మొహర్రం’ అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి మద్దతు ఉపసంహరణకు కారణాలు ప్రజలలో వ్యాప్తి చేస్తాననీ, 2014 నాటికి కాంగ్రెస్‌కు ఒక్క ముస్లిం ఓటు కూడా పడదనీ, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక ప్రభుత్వంగా మారిందన్నట్లుగా ఆగ్రహించి అసదుద్దీన్ వేలెత్తి చూపుతున్నారు. చర్చల ద్వారానూ, సామరస్య పూర్వకంగానూ పరిష్కరించుకోలేనంత సమస్య ఏమి ఉత్పన్నం అయ్యిందో, ఇరుపార్టీల మధ్య పూడ్చుకోలేనంత అగాథం ఏమి ఏర్పడిందో మాత్రం అర్థం కావడంలేదు! కానీ- అసదుద్దీన్ మద్దతు ఉపసంహరణవల్ల ప్రకంపనలు కలగడం సహజం’’ అన్నాడు శంకరం.

‘‘హైదరాబాద్ భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన పాదు. నిజాం పాలన నాటి పునాదుల మీద నేటి అంతర్జాతీయ సదస్సులకెన్నింటికో వేదికగా ప్రపంచం దృష్టికి ఎదిగిన హైదరాబాద్ నగరం, ఒకప్పటి రోజుల్లో మతకల్లోలాల చిచ్చులతో అల్లల్లాడిన సందర్భాలున్నాయి. కానీ హైదరాబాద్- ఆర్థికంగానూ, అధునాతనంగానూ ఇవాళ విశిష్ట స్థాయికి చేరుకుంది. నగర సామరస్య జీవనానికి మళ్లీ పాత కల్లోల చరిత్ర పునరావృతం కాకూడదు.

మతభావనలను రెచ్చగొట్టడం, ఆవేశాలు, ఉద్రిక్తతలు పురిగొల్పడం-ఏ రాజకీయ పక్షాలుగానీ, సంస్థలు కానీ చేయకూడదు. ముస్లింలు అంతా ఎం.ఐ.ఎం పార్టీలోనే వున్నారనలేం! కాంగ్రెస్, తెలుగుదేశం, భాజపా టి.ఆర్.ఎస్ అన్ని పార్టీల్లోనూ ముస్లింలున్న మాట నిజం. కానీ ‘ఎం.ఐ.ఎం’ ప్రధానంగా ముస్లిం మైనారిటీ సంక్షేమానికి కట్టుబడ్డ పార్టీ.

ఇప్పుడు మతం రంగు పులుముకోవడం అసలు ఏ రాజకీయ పార్టీకి ఇష్టంగా ఉందనలేం! బి.జె.పి హిందూత్వ పార్టీ అనే ముద్ర చెరిపేసుకోవాలనే చూస్తున్నట్టుందిగా! బి.జె.పిలోని పెద్దలే ఇటీవల హిందూ దేవుళ్ళకూ, పురాణాలకూ, వాటిల్లోని విషయాలకూ వ్యతిరేకంగా గళం ఎత్తడం కనిపిస్తోంది! అందుకు బహుశా తాము ‘సెక్యులర్’ అనీ, ‘మోడరన్’ అనీ చాటుకోవడం ఉద్దేశం కావచ్చు! మనలో చాలామందికి మునుపటి విలువలను విధ్వంసం చేయడమే ‘అధునాతనం’గానూ, ‘అభివృద్ధి దిశా పయనం’గానూ, గొప్ప భావనగానూ వుండే పరిస్థితులొచ్చాయి.

హిందూ దేవుళ్లనూ, పురాణాలను కించపరచడం, సనాతన ధర్మ విషయాలను కాలం చెల్లినవిగా, అభివృద్ధి నిరోధకమైనవిగా విశే్లషించడం జరుగుతోందివాళ. రాముడు, కృష్ణుడు కాక రావణుడు, నరకాసురుడు ఆరాధ్యులుగా- వారే నిజమైన ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఆరాధించే ధోరణి అంకురిస్తోంది. బ్రాహ్మణుల మీద ద్వేషం, వర్ణసంకరం, మద్యం, మాంసం ఇవన్నీ సరికొత్త విలువలుగా ప్రపంచీకరణ ప్రభావంతో ప్రబలుతున్నాయి.

ఆఖరికి స్వచ్ఛదంగా, స్పష్టంగా తెలుగు భాష మాట్లాడడం, రాయడం కూడా- అగ్రవర్ణ ఆధిక్యం అంగీకరించడంగా భావించే వైఖరి ప్రబలుతోంది! భాషా సాహిత్యాల పరంగా, సాంస్కృతిక పరంగా, ఆచార వ్యవహారాల రీతుల్లో, ఒకప్పటి ప్రమాణాలనూ, విలువలనూ ధ్వంసం చేయడమే గొప్పగా భావించే వైఖరి విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం పెచ్చరిల్లుతూ, నిజంగానే ‘డబ్బు ముడ్లో దేవుడున్నాడు’ అన్న చందాన- కాలం రూపొందుతోంది.

పదవీ, అధికారం, డబ్బు రాజ్యాంగపరంగా ఇవాళ తరలివెళ్లి మేటవేస్తున్న వర్గం ఆలోచనా సరళియే- రాచబాటలుగా మారుతూ, అనుల్లంఘనీయ, అనుసరణీయ వైఖరి కావడం ఆశ్చర్యకరమేమీ కాదు! ‘రామరాజ్యం’ ఇవాళ ఎవరికీ అక్కర్లేదనీ, రావణ పాలన, నరకాసుర నియమాలే ప్రజాభ్యుదయకారకాలనీ, ప్రచులితం చేసేవిగా పార్టీలు నేడు క్రమంగా మారినా, కొత్తగా పుట్టుకువచ్చినా ఇవాళ విడ్డూరమేమీ లేదు! అశాంతి సూచనలు, అధర్మవర్తనలు అనుకుంటున్నవే- అసలుకు ఆహ్వానించదగిన అభ్యుదయ పరిణామాలు అనేవారూ, వాటితో వీరంగం వేసేవారూ ఇక తారట్లాడుతారు!

‘యథా యథాహి ధర్మస్యగ్లానిర్భవతి’ అనేదే నవావతార హేతువు కదా! ‘కల్కి’ ఇంకా రాలేదు కదా! వాడు వస్తాడో రాడో గానీ, ఆ రాకకు కావలసిన ధరణీ పరిణామం అయితే రావాలికదా! ‘్దోస్త్ కటీఫ్’ అని- నచ్చని పార్టీలతోనే కాదు; అనుసరించడం నచ్చని కర్తవ్యాలతోనూ, ఇచ్చగించని బాధ్యతలతోనూ, మాటిమాటికీ మానవీయ విలువలంటూ ఊదరగొట్టే మనుషులతోనూ కూడా- విడగొట్టుకుని, పడగొట్టుకుని, తొడగొట్టుకుని, తమను తాము నిలబెట్టుకునే కొత్త నేతలకూ, కొత్త దేవుళ్ళకూ స్వాగతం’’ అంటూ ఆవేశపడి, గ్లాసెడు మంచినీళ్లు గటగటా త్రాగాడు సుందరయ్య.

0 comments: