ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 30, 2012

గణితశాస్త్రం


 
"ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్లకుంటాయ్ బాబూ! తమ తూనికలు, తమ కొలతలే ఎవరికి వారికి సరియైనవి. అవతలివాడు మోసం చేస్తున్నాడనీ, తమదే నిఖార్సయిన నిజాయితీ అనీ- చాటుకోవడమే వాళ్ళవాళ్ళ ధ్యేయం.’’ అన్నాడు ప్రసాదు.

‘‘నిజానికి ఇది వ్యాపార సూత్రం! ఒకే ‘ప్రోడక్ట్’ను తయారుచేసే ‘ఉత్పత్తి’ సంస్థల మధ్య- ఈ తీరు సహజమైతే కావచ్చు! ఒక బట్టల సబ్బు కంపెనీవాడు, మరో బట్టల సబ్బు కంపెనీవాడి తయారీకన్నా, తనదే నిఖార్సయినదీ, నాణ్యమైనదీ అని చాటించుకోవడం, నమ్మబలకడం, అందుకోసం ప్రచారం చేసుకోవడం సహజం! కానీ రాజకీయాలను కూడా ‘వ్యాపారం’చేసి కూర్చోబెడుతున్నారే! పార్టీల మధ్యా, పార్టీ అధినేతల మధ్యా కూడా ఈ స్వీయ కొలతలూ, తూనికలూ మొదలయ్యియి. అది చిత్రంగా లేదూ’’ అన్నాడు రాంబాబు.

‘‘ఇందులో చిత్రం ఏముందర్రా? ఎవరికయినా ప్రజను తమవైపు తిప్పుకోవడమే కదా కావల్సింది! వ్యాపారస్తులకు ప్రజలు ‘వినియోగదారుల’యినట్లు, రాజకీయ పార్టీలకు కూడా ప్రజలు తాము సేవ చేయవలసిన ‘పౌరు లు’లాగా కాకుండా, తమకు అధికారం కట్టబెట్టగలిగిన ‘ఓటర్లు’లాగా మాత్రమే కనిపిస్తున్నారాయె! తన సరుకును ఎలాంటి మాయచేసి అమ్ముకోవడమనేది వ్యాపారస్తుడి లక్షణం అయినట్లు, ఏం మాయచేసయినా- ఎన్నికలప్పుడు ప్రజల ‘ఓట్ల’ను దండుకోవడం ఒక్కటే పార్టీల లక్ష్యమూను! పైగా రాజకీయ వ్యాపారానికి సులువైన సూత్రం ఏమిటంటే- అయిదేళ్లకోసారి ఎన్నికల సమయం వేళకు, తమకు అనుకూలంగా ప్రజను ఏమార్చి సిద్ధంచేసుకోగలిగితే చాలు! ఒకసారి ఓటుపడితే, ఇకదానివల్ల అధికారం సంక్రమిస్తే, మళ్లీ ఎన్నికల వరకూ ప్రజతో నేరుగా పెద్ద పనీ వుండదు, పేచీ వుండదు. మధ్యలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా, అధికార పార్టీగా- ఎంత ప్రతిపక్షాలు ఎంత దుమ్మెత్తిపోసినా, వ్యతిరేక ప్రచారాలు చేసినా, తాము చేసేది తాము చేయచ్చు. మళ్లీ వేళకు- ఓటర్లుకు తమ మీద నమ్మకం సడలి, ఏ ప్రతిపక్ష కూటమికో మళ్లీ అధికారం కట్టబెట్టకుండా, తాము ఏం చేయాలన్న లెక్కలు వాళ్లకు వుంటాయి.'అన్నాడు శంకరం

‘‘చెప్పాను కదుటోయ్! ఒక ‘ఉత్పత్తి’ నాణ్యత, మన్నిక నచ్చకపోతే వినియోగదారుడే - ఎంత వ్యాపార ప్రకటనలతో ఊదరగొట్టినా, నిర్ద్వంద్వంగా తిరస్కరించేయగలడు. కానీ ఈ రాజకీయ వ్యాపారం వుంది చూసారూ! ఇది మరీ కనాకష్టంగా తయారైంది. ఒక పార్టీ మరో పార్టీని దుమ్మెత్తిపోస్తూ, తమకుతాము ‘క్లీన్‌చిట్’ ఇచ్చేసుకునే ఈ పార్టీలూ, అధినాయకులూ అందరూ కలిసి మళ్లీ మోసంచేసేది ప్రజలనే! ఈ రాజకీయ వ్యాపారంలో నష్టపోయేది పార్టీలు, నేతలూ కాదు- చివరికి ఓటర్లయిన ప్రజలే! నిజానికి రాజకీయాలను మించిన అక్రమ వ్యాపారం, నానారొచ్చు, పచ్చి వ్యభిచారం మరొకటి లేదు’’ అన్నాడు ఆవేశంగా రాంబాబు.

‘‘వీళ్ళ వీళ్ళ కొలతలు, లెక్కల ధోరణి చూస్తూంటే- చాలా చాలా చిత్రంగానో తోస్తుంది!’’ ఆనాడు మంత్రిని చేసివుంటే కెసీఆర్ ఇవాళ నా వ్యాన్‌లో వుండేవాడు. నాడు నాకన్నా బాగా ‘దేశం’ గురించి మాట్లాడే వాడు. వైఎస్ తెలంగాణాను దోస్తున్నా పట్టించుకోలేదు. పల్లెటూరు లాంటి హైద్రాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టింది నేనే’’ అంటాడు చంద్రబాబు. ‘‘తెలంగాణ మార్చ్ సమయంలో కె.సి.ఆర్ ఢిల్లీ యాత్ర- సీఎం సీటు కోసమే! కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు ఆశపెట్టింది’’ అని వరవరరావు అన్నాడు. ‘‘గనుల్లో వాటాలు లేవని నిరూపిస్తే- మా కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతారా’’అని కేసీఆర్‌కు వైఎస్సార్‌సీ ‘షర్మిల’ సవాలు విసురుతోంది. ‘‘విలీనం ఆఫర్ కేసీఆర్‌దే. ఇప్పుడు కాంగ్రెస్‌పై బురద చల్లుతున్నారు’’ అంటున్నారు పాల్వాయి. తెలంగాణ ఇవ్వాలని ప్రధానిని కోరితే చంద్రబాబు- హరీష్‌తోబాటు శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానంటున్నాడు కెటీఆర్. ఒక్క పూట పేపర్లలోని ఈ మాటల కొలతలూ, లెక్కలూ రాజకీయమైనవి గమనిస్తూంటే... 2014 ఎన్నికలకు ఇప్పటినుంచే ఎంత ‘కాక’ మొదలయ్యిందో, ప్రకటనల జోరు తయారవుతోందో, తెలుస్తోంది! 2014 రాష్ట్ర ఎన్నికల్లో - ఏ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందో తెలీదు గానీ, ‘తెలంగాణ’ అంశమూ, దానికి అనుబంధంగా ‘హైదరాబాద్’ అంశమూ, కీలకంగా లెక్కలో ‘చిక్కు’గా ముడిపడి వున్నాయన్నది స్పష్టం! ఆ చిక్కును అధిగమించి, అధికారమనే ఫలితాన్ని దక్కించుకోవడం ఎవరికి, ఎలా సాధ్యమో, ఇప్పుడు చెప్పలేం! ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో, ఎవరిని ఏమేరకు విశ్వసిస్తున్నారో, అసలు సమయానికి తమదైన తీర్పు ఎలా ఇస్తారో, ఆ తీర్పుకోసం తీరుతీరుల వ్యవహరించే పార్టీలూ, అధినాయకులూ ఏ ఎత్తుగడలు ఎత్తుతారో, ఏఏ చర్యలకు పాల్పడతారో, తీర్పులను ఎలా ప్రభావితం చేస్తారో, తీర్పు ఏ మార్పు పరిణామాలతో వుంటుందో, ఇప్పుడు ఏమీ చెప్పలేం! అంతదాకా ఎవరు పాదయాత్రలు చేసినా జనం ఆ పాదాల వెన్నంటి వున్నట్లే అనిపిస్తూంటుంది. అందరి లెక్కలూ వారి వారి అంచనాల్లోంచి సరిగా లెక్కచేస్తున్నట్లే వుంటుంది. గణితశాస్త్రం గొప్పదే! గణనా గొప్పదే! కానీ అసలు ‘జనగణం’ ఏది ‘లెక్కిస్తుందో’ చివరకు దానికే విలువ! ఒక్క లెక్కల్లోనే నూటికి నూరు శాతం మార్కులు రాగలవు. సున్నా మార్కులు వచ్చేదీ అందులోనే! ఆల్‌జీబ్రా గుండె గాభరాలూ అందులోనివే! కూడికలు, తీసివేతలు, గుణింతాలూ, భాగాహారాలు, అప్పుతెచ్చుకోవడాలూ, కుండలీకరణలూ, శేషాలూ అన్నీ గణితశాస్త్రంలో లాగా కనబడేది కేవలం ఇవాళ మన ‘రాజకీయాల్లోనే’! నేతలంతా లెక్కల మాస్టార్లమేనంటారు. ‘జనగణిత శాస్త్ర కోవిదు’లెవరో ఎన్నికల ప్రభంజనం అయ్యాకే బయల్పడేది.’’ అని లేచాడు ప్రసాదు.

0 comments: