ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 22, 2012

ఇతరేతర శక్తులు లేస్తే...


‘ఎటుపోతున్నాం మనం? అని భయమూ, బాధా కలగడం లేదూ! ఒక సి.బి.ఐ ప్రత్యేక కోర్టు జడ్జియే జైలుపాలవడం, ఒక డి.జి.పి. స్థాయి నియామకంలో అక్రమం జరిగిందనడం, నూట పాతికేళ్ళ పైగా చరిత్ర కలిగిన ఓ కాంగ్రెస్ పార్టీ ఇంకా బొడ్డూడని వై.సి.పి చేతిలో పరాజయం పాలుకావడం, దేశ అత్యున్నత ప్రథమ పౌరుడి ఎన్నికలోనూ రాజకీయమే మూలమై, తాను పోటీచేసే ప్రసక్తేలేదని ‘కలామ్’గారు సృష్టీకరించడం, ఇవన్నీ చూస్తూంటే- ఏమైపోతోంది, ఏం జరుగుతోంది అని గొప్ప వేదన కలగడం లేదూ!’’ అన్నాడు రాంబాబు నుదురు కొట్టుకుంటూ.


‘‘మరే! చూస్తూంటే ‘జాతీయత’కే మునుపెన్నడూ లేని విఘాతం కానవస్తోంది. జగన్ గెలుపును కేవలం రాజకీయ కోణంలో కాక ఇంకొకాయన అది సనాతన ధర్మానికీ, హిందూ మతానికీ పొంచుకు వస్తున్న మరో ప్రమాదంగా వ్యాఖ్యానించాడు! కేంద్రంలో సోనియా, రాష్ట్రంలో జగన్ కూడా అందుకు ఏకత్రిత హేతువులంటున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవడం పేర, తమ పార్టీలోకే కాక, తమదైన మతంలోకీ ఆకర్షించడం జరుగుతోందనీ, భారతదేశానికి ‘హిందుస్థాన్’ అన్న పేరు పోగొట్టడమే ధ్యేయంగా, ఇతరేతర శక్తులు లేవడమే ఇప్పటి పరిణామాలకు హేతువనీ అన్నాడాయన’’ అన్నాడు శంకరం.

‘‘మోకాలికీ బోడిగుండుకీ ముడిపెట్టడం అంటే ఇదే! ‘ఆడలేక మద్దెల ఓడు’ అనీ, ‘తలపాగ చుట్టుకోవడం చేతకాక తలే వంకరన్నాట్ట’ అనీ, సామెతలు ఊరకే పుట్టలేదు. జరుగుతున్న పరిణామాలను సహేతుకంగావిశ్లేషించిలోపభూయిష్ట వ్యవస్థకు మూలకారణాలు
అన్వేషించి సంస్కరించుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప, తమ పతనానికీ, ఓటములకూ ఉక్రోషంతో- అర్థంపర్థంలేని, సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం విజ్ఞతకాదు! ఉప ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలాంటి పార్టీలవారందరూ- ఓటమికి కారణాలువిశ్లేషించుకోవడంలో కూడా, ఎవరికివారు తమనుతాము సమర్థించుకోవడమూ, గెలుపునకు సజావైన పద్ధతులుకాక ఇతరేతర శక్తులు లేచి దోహదపడినాయనడమూ, అవే తమను పడగొట్టాయనడమూ, విచక్షణతో కూడిన మాటలుగా కానరావడం లేదు! రాజకీయాలకూ, మతానికీ ముడిపెట్టడం మతాతీత రాజకీయాలను మరింత భ్రష్టుపట్టించడమే! ఇంతకీ ఇప్పుడు- భయమూ, బాధ కేవలం రాజకీయాల స్థితి గురించి కాక, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏవయితే పట్టుకొమ్మలనుకుంటున్నామో... ఆ ‘న్యాయవ్యవస్థ’, ఫోర్త్ ఎస్టేట్ అనిపించుకున్న ‘మీడియా వ్యవస్థ’ కూడా పతనోన్ముఖం కావడమే- పరితపించే విషయం.’’ అన్నాడు సుందరయ్య.


‘‘ఔను! మంత్రులు వస్తూంటారు, పోతూంటారు. కానీ ప్రభుత్వ పాలనావ్యవస్థలో అధికారులు ఓ యాభై ఎనిమిదో, అరవై ఏళ్లో సర్వీసులో వుంటారు. న్యాయ వ్యవస్థలో జడ్జి అనేది ఒక ఉన్నత స్థానం. నిజానికి రాజకీయాలను ప్రభుత్వ పాలనావ్యవస్థ ‘గైడ్’ చేయగలగాలి. అధికారులు- ఓ అయిదేళ్ల పదవీకాలపు మంత్రుల చెప్పుచేతల్లోకి ఒదిగిపోవాల్సిన అగత్యం ఏమీలేదు! అలాగే ధర్మపీఠం మీద తీర్పులు ఇచ్చే వ్యక్తి, తానే అధర్మానికి లొంగిపోవడం పరమ విషాదం! దీనినిబట్టి రాజకీయాలు, రాజకీయ నేతల ప్రభావమే- అన్ని రంగాలనూ కలుషితం చేస్తూ భ్రష్టుపట్టిస్తోందంటే, అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని బోరవిరుచుకు తిరగడం ‘షో’తప్ప, నిజానికి చదరంగంలో- ‘షో’లాగా విలువల వ్యవస్థకే ‘ఆటకట్ట’వుతోంది. దీనికి అడ్డుకట్ట వేయగలగాలి’’ అన్నాడు శంకరం మళ్ళీ సాలోచనగా.

‘‘అంతోఇంతో పవిత్రంగా వుందని జనం నమ్ముతున్న ఏ రంగమైనా- నోట్లకట్టల ముందు నిస్సిగ్గుగా బట్టవిప్పి తైతక్కలాడే స్థితి దాపురిస్తోంది. ‘ఓటు’ అనేది పవిత్ర ఆయుధం అనే విశ్వాసం కూడా సన్నగిల్లుతోంది. ఎందుకంటే ఓటర్లను ప్రలోభపెట్టడం మరీ సులువైపోయింది. న్యాయవ్యవస్థనూ, మీడియా రం
గాన్నేకొనేయగల శక్తులు బలపడుతూండగా, ఆ శక్తులముందు దృఢంగా నిజాయితీతో, చిత్తశుద్ధితో, ధర్మబద్ధంగా, ప్రజాపక్షంగా నిలవవలసిన వ్యవస్థలే నీరుకారిపోయి లోబడిపోతూంటే, భయమూ, నిర్వేదమూకాక కలిగేదేమిటి చెప్పండి! ఆర్థిక సంబంధాలు తప్ప- మానవ సంబంధాలూ, ఉదాత్త విలువలు అన్నీ ఒట్టి ‘ట్రాష్’అనే సంకేతాలే యువతరానికీ, రాబోయే తరానికీ కూడా అందుతున్నాయి ఇవాళ. ‘కో అంటే కోటి... దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి’ అన్నట్లు డబ్బుముందు ఏదయినా ‘కోతులాట’ కాగలిగిన నేటి పరిణామాల వెనుక పొడచూపుతున్న- మన ధర్మమూ, మన సంప్రదాయమూ, మన బ్రతుకు విలువలూ కాని ఇతరేతర శక్తుల విజృంభణను, మనమే పసిగట్టలేని స్థితిలోకి నెట్టివేయబడుతున్నామన్న గ్రహింపు కలగాలి. ఆ ‘గ్రహింపు’ తమతమ వర్తనతో తేగలిగిన అబ్దుల్‌కలామ్‌లు, అన్నాహజారేలు, ఆఖరికి జయప్రకాశ్ నారాయణ్‌లు కూడా ‘కందెన’లేని ఇరుసులుగా మారుతూంటే బండి ఏం ఏడుస్తుంది? పరమేశుని బండి అయినా- ఇవాళ లాగబడుతున్న ‘తాళ్ళు’ న్యాయం, ధర్మంతో పేనుకున్నవి కావడంలేదు. పవిత్ర దేవాలయ వ్యవస్థలు కూడా - డబ్బు‘గబ్బు’ కొట్టేవవుతున్నాయి. వరమిచ్చే దేవుడు కూడా- వక్రపథగాములైన పూజారుల పరమవుతూంటే, భక్తులకు అభయం, ఉభయం కాక, ఆ ‘భయం’, ఊ అంటే ‘భయమే’ పెరుగుతూంటుంది! మతం కూడా రాజకీయ అభిమతం బట్టి రూపుదిద్దుకుంటోంది. అంచేత లేస్తున్న ఇతరేతర దుష్టశక్తులను కూడా, లేచే ఇతరేతర ధర్మశక్తులేవో జన్మించి హతమారిస్తే తప్ప బ్రతుకు నిలవదు’ అన్నాడు రాంబాబు.

1 comments:

Voleti Srinivasa Bhanu said...

ee tagalabadatam chaaladu sir..inkaa tagaladipovaali..appatikigaani dharma sakthulu digi raavu..