ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Saturday, June 16, 2012

వర్తమాన సమాజానికి కవితాత్మక రికార్డ్




'సన్ ఫ్లవర్ 'వారపత్రిక 
6, జూన్ '12 సంచికలో
నా 'కవికాలమ్ 'కవితా సంకలనం పై 
వచ్చిన సమీక్ష








బహుముఖ ప్రజ్ఞాశాలి,సాహితీరంగంలో పలు ప్రక్రియల్లో విశిష్ట ప్రయోగాలు చేస్తూ పాఠకలోకానికి సుపరిచితులు,..వయస్సులోను,అనుభవంలోనూ పెద్దవారయిన శ్రీ సుధామ గారి 'కవికాలమ్ ' కవితా సంకలనం సుధామ గారి అంతరంగపు ఆంతర్యాలను క్షుణ్ణంగా ప్రదర్శిస్తుంది. మూడు సంవత్సరాలు ఆంధ్రప్రభ లో సమకాలిక సంఘటనల స్పందనలకు వెలువడిన కవితా సంకలనం ఈ పుస్తకం. అప్పుడు ప్రచురితమైన కవితలలోంచి ఎంపిక చేసిన 50 కవితలు ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఈ కవితలు చదువుతుంటే సమకాలీన సమాజం కళ్ళముందు ప్రత్యక్షమయ్యేలా ,సులభరీతిలో,సముచిత పదాల్లో, భావ సముదాయాల్ని బంధించి.పాఠకుల్ని ..ఆలోచనల్లోకి  చెయ్యుచ్చు కు నడిపించి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళారు. కవితల్లోని.. కాదేదీ కవితకనర్హ మన్నట్లు ..సుధామ గారెంచుకున్న శీర్షికలు సాంద్రతని తెలియచేస్తున్నాయి. ఏభై దీర్ఘ కవితలు..చదువుతుంటే ..చదివినవారికి అప్పుడే "అయిపోయిందా!" అనే భావన కలగడం ఖాయం.

"భూమికోసం,భుక్తికోసం ..పోరాటం ఎక్కడైనా సామాన్యుడి ఆరాటం ఒక్కటేగా!" అని ఒకచోట అంటే,
"మానవ దేహమూ సాటి మనిషికి ధన సదృశకోశమేనా?" అంటూ 'వైద్యానికి నైవేద్యం 'లో నిలదీశారు.

అల్లగే 'ప్రేమే జీవన శ్వాస ' కవితలో ..'ప్రేమ లోకం తోటిది,ప్రేమలేని బ్రతుకు ఓటిది ' అని ప్రేమను ప్రేమించేలా రెండు మాటల్లో చెప్పారు .సుధామ గారు పనిచేసిన ఆకాశవాణి గురించి..."విద్యుక్త ధర్మంలో ఒదిగి,మాటల ముత్యాలు పొదిగి,బ్రతుకు సమరాన్ని కూడా స్వరసమీరంగా మార్చుకుని, ఉదయ తరంగిణుల నుండి ,అపరాత్రుల సంగీత విభావరుల దాకా కంఠం వీప్పి కోట్లాది గుండేల్లో పాగావేసి స్వర పతాకాలు ఎగరవేసిన స్వరజ్యోత్స్నను గురించే సలాం చేస్తున్నాను అంటూనే..
"సమ్ డాగ్ కలియనీరు " లో- దేశ ఆనందానికి మేధావితనం పేరిట చిత్రించిన భారతదేశ నగ్నచిత్రం అని ఆవేదన చెందారు.

మరోచోట ...'భూములు అమ్ముకోవడానికి గానీ నమ్ముకోవడానికి కాదు,చదువులు సరికొత్త సాఫ్ట్ వేర్ బానిసత్వం ' అంటూ నేటి చదువులకు భాష్యం చెప్పారు. ఇలా రాసుకుంటూ పోతే ..ఈ కవితలన్నీ సెటైర్లతో ,నేటి సమకాలీన సమాజం అనే కాన్వాస్ పై సుధామ గారు ..ఆవిష్కరించిన మాడ్రన్ ఆర్ట్ చూడగానే అర్ఠం కాదు ..లోతులకు వెళ్ళగానే భావం బోధపడి 'ఔరా ' అనిపించే అద్భుతమైన కవితా సంకలనం .ఈ కవితలు చదవటం మొదలుపెడితే ఎక్కడా ఆగకుండా నాన్ స్టాప్ లా ..హాయిగా చిన్న పదాల్లో,అనంత భావాల్ని పొందు పరిచారు.

'తెలుసుకోవడానికి భయపడితే ..నీలో నువ్వే బద్దలవుతావ్..విస్ఫోటనం జరిగాక గానీ విశ్వరహస్యం తెలియదు ' చక్కని చురక .శీర్షికల్లో, పదాల్లో ..మారు తారులు ఉదా:- శ్రీమద్ 'మారాయణం ' ,'సమ్ డాగ్ కలియనీరు ',' ఆ'లయ 'మేలా 'వంటి పద విరుపులు ఎన్నో ఈ పుస్తకంలో వున్నాయి.

'రంగు పడుద్ది ' లో.."పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పుడెల్లా విలువల సంగతేమో
గానీ ..వలువల రంగులు మారుతున్నాయి..నేటి నగ్న సత్యాన్ని..భావుకత మీద,భాష మీద,ఆధునికత మీద, జీవితం మీద, దేశం మీద,సమాజం మీద..ఒకటేమిటి ..సుధామ గారు స్పృశించని ..అంశం లేదేమో అనిపించక మానదు ఇది చదివిన వాళ్ళకు.

ముందుమాటలో గుడిపాటి గారు అన్నట్లు కవిత్వమంటే కొందరికి మాత్రమే అర్ఠమయ్యే ప్రక్రియ అన్న అపప్రథ నుండి చిన్నచిన్న వాక్యాల్లో అనంతమైన భావాల్ని స్పష్టంగా..సరళంగా, సులభంగా అర్థమయ్యే ఉదాహరణలతో వ్యక్తీకరించడం కవిగా,కాలమిస్ట్ గా,కార్టూనిస్ట్,రేడియో ఉద్యోగి,బహుప్రక్రిఅనుభవశాలి అయిన శ్రీ సుధామ గారి 'కవికాలమ్ ' అందరూ చదవటం,చదివించటం..సముచితం.

-ఎం.వెంకటేశ్వర రావు



0 comments: