ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, June 1, 2012

తల్లీ నిన్ను తల(వం)చి...






‘‘ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా... ఎవరికైనను తప్పదన్నా!’’ అంటూ సన్యాసి తత్త్వం ఎత్తుకున్నాడు.

‘‘ఖర్మ! ఖర్మ! ‘తత్త్వాలు’ కొన్ని తత్వాలకు పడవు సన్యాసీ! తమ ‘సత్త్వాల’ముందు, ఎలాంటి ‘కొత్వాలు దాష్ఠీకాల’యినా- దిగ దుడుపేననీ బోర విరుచుకునేవారున్నారు! పైగా చూసావూ! తమ ‘బంధనం’లోనే- విజయాల ‘ఇంధనం’దాగుందని, వారి ప్రగాఢ విశ్వాసం! తాను చూపిన సానుభూతి, తనకు ఓట్లరూపంలో రసానుభూతిగానయినా ప్రకటితమవుతుందని ఆశ... అంచేత- ‘సీలింగ్ ఫ్యాన్’వచ్చినా, ఉరేసుకునేందుకు ఆత్మహత్యకు పనికి వస్తుందనుకోక, ఆ ‘్ఫ్యనుగాలి’ తీవ్రతకు- తన అక్రమాస్తుల కేసులన్నీ కొట్టుకుపోయి, అధిష్ఠానం దిమ్మతిరిగేలా తన నాయకత్వ పటిమ, ఉప ఎన్నికల ఫలితంగా ఘటియిస్తుందని కాంక్షే!’’ అన్నాడు శంకరం.


‘‘చూడు శంకరం! సన్యాసి అన్న ‘తత్త్వం’యొక్క ‘తత్త్వం’, నీవనుకుంటున్న జగన్‌కు వర్తిస్తుందని నేనూ అననోయ్! ఎవరు చేసిన ఖర్మ వారుకాక, వేరేవారు అనుభవించే కాలం వచ్చిపడింది! జగన్ పుణ్యమా అని- తమ కర్మానుసరణంలో ప్రవర్తిల్లక తప్పని పరిస్థితులవల్లే, ఇవాళ మరో పదకొండు మందికి పైగా, సి.బి.ఐ బంధనాల్లో పడుతున్నారా లేదా?... ‘అధికారాంతమున చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారుగానీ- అధికారంలో వున్నప్పుడు ఆ ‘అయ్య’కారణంగా ఎదిగిన కొడుకు ‘సౌభాగ్యగరిమే’, ఇప్పుడు చిక్కుల్లోపడింది. పోయిన మా రాజు పోనే పోయాడు. ఆ ‘రాజరికం’ అడ్డంపెట్టుకుని, చెలరేగిన యువరాజే- ఇవాళ ‘చెరసాల’పాలయ్యాడు. యువరాజావారికి ‘తందాన తాన’అన్నందుకే- ‘రాచపీనుగ ఒక్కటే పోదు’ అన్న చందాన, ‘పాపమొకరిది ఫలితమొకరిది’ అన్నట్లుగా, తీగెలాగితే డొంకంతా కదిలినట్లు- ‘‘ఎవ్వారలుపేక్ష చేసిన అది వారల చేటగు...’’ అన్నట్లుగా, అక్రమాలు జరుగుతున్న కాలంలో ఉపేక్ష వహించినందుకే, ‘‘ఎవరో జ్వాలను రగిలించారు. వేరెవరో దానికి బలియైనారు’’అన్నట్లు... పాపం! నేరుగా సంబంధంలేనివారూ, ‘మెక్కుతూ’పోయిన వారిని కేవలం ‘మొక్కుతూ’పోయినవారూ, ఇవాళ ‘ముక్కుతూ మూల్గుతూ’ ఆపదల పాలవుతున్నారు’’ అన్నాడు ప్రసాదునిక్కచ్చిగా.


‘‘ ‘పుత్రాధిచ్ఛేత్ పరాజయం’అని కొడుకు చేసిన పనులవల్ల పోయిన వైఎస్సార్ పరువు, చచ్చాక కూడా మరింత మంటగలసిపోతోంది కాదూ ఇవాళ! కొడుకు అక్రమాలు విరాడ్రూపం దాలుస్తూండగా, అసలు అధికారంలో వున్న తండ్రి- అప్పుడు చేసిన అక్రమాలింకేమిటి? అన్న విచికిత్స పెరగదా? దుర్యోధనుడి ఆగడాలకు అంధుడైన ధృతరాష్ట్రుడు వత్తాసు పలికినట్లుగా, ఇప్పుడు వై.ఎస్సార్- జనం దృష్టిలో ‘దేవుడు’ భావన నుంచి, ‘దిగజారుడు’తనంలో పడడం ఒక కోణం అయితే, జగన్ తల్లి విజయమ్మ- కొడుకు అక్రమాలను వెనకేసుకు వచ్చి, అతని అరెస్టు కుట్ర అనీ, అన్యాయం అనీ గాంధారితనానే్న పుత్ర వ్యామోహంతో ప్రకటిస్తోందని, ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌదరి ఉవాచ కదా!’’అన్నాడు సన్యాసి.


‘‘భర్తనూ, కొడుకునూ ఏ స్ర్తి వెనకేసుకు రాదు చెప్పండి? అసలు భారత స్ర్తి నైజమే అది అని కదా ప్రసిద్ధం! భర్త తప్పుచేస్తున్నా నోరెత్తలేని స్ర్తి అయినా, నిజానికి కొడుకును సక్రమ మార్గంలో పెంచాలని చూస్తుంది. కొడుకు ప్రయోజకత్వానికి మురిసే తండ్రి- కొడుకులోని తనకు నచ్చని నెగిటివ్ పాయింట్లకు తల్లినే బాధ్యత చేస్తాడు. ‘నీ పెంపకం వాడినలాచేసింది’అని- తల్లిగా ఆమె కొడుకుని సక్రమంగా పెంచలేదని ఆమెనే దూషిస్తాడు! నిజానికి భర్త అధికారంలో వుండగా- ఆ తండ్రి చాటు బిడ్డగా జగన్ అకృత్యాలను చేస్తుంటే, తల్లిగా విజయమ్మ ఆనాడే అడ్డుకుని వుంటే- పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? తండ్రీ కొడుకుల వైభవ ప్రాభవాలకు మురిసిపోయిందే కానీ, ఇలా ఇప్పుడు ‘ముసురు’పడుతుందని పాపం ఊహించలేదుకదా! ఓకే! భర్త మరణిస్తే ఆ రాజకీయ వారసత్వం భార్యకు సంక్రమింపచేయడం మన రాజకీయాల్లో కొత్తేమీకాదు. కానీ జగన్-తల్లిని ఆ పీఠం ఎక్కించడానికి సిద్ధపడి వుండి వుండినా, పరిణామం మరోలా వుండేదేమో! ‘తల్లీ నిన్ను తలంచి’అంటూనే... ఆమెను తన మార్గానికి ‘తలవంచి’ అనుసరించే దానిగా చేసి, తల్లి ఎం.ఎల్.ఏ, తాను ఎం.పిగా ముందు కాంగ్రెస్ పార్టీలో వుంటూనే సాధించి, ‘ముఖ్యమంత్రి పీఠం’అనే అధికారలాలస అతలాకుతలం చేయడంతోనే- సొంత కుంపటి పెట్టి, తన పత్రిక, తన ఛానెల్ అనే ‘కోడీ’, తన కుంపటీ, లేకపోతే తెల్లవారదన్నట్లుగా...నిక్కి నీల్గి, జాతీయ మీడియాను తప్ప తెలుగు మీడియానూ, తనది తప్ప మరోదాన్నీ ఏమాత్రం లక్ష్యపెట్టక విర్రవీగి, బిర్ర బిగిసి, కుర్రవాడు ఇప్పుడు ‘చిర్రుబుర్రు’లాడుతున్నాడు! తన చుట్టూ బిగిసిన ఉచ్చులోకి- మరి కొందరినీ లాగి, బిగుసుకునేలా చేస్తున్నాడు. అసలు ఆర్థిక నేరాల కుట్ర అతగాడిది. ‘నెంబర్ వన్’తర్వాతే, మరెవరి స్థానమైనా అని క్రమక్రమంగా తేటతెల్లం అవుతూన్నాక కూడా, ఇప్పటికయినా ‘తల్లిమాట’అంటూ ఒకటి లేక, తనకు ‘వంతపాట’గానే- ఆమెనూ దుస్థితి లోకి నెట్టాడు కదా! ‘జగనంత కుటుంబంనాది’అనుకున్న వారొక్కొక్కరికీ ‘ఏకాకి జీవితం నాది’అనే, అనుకునే దుస్థితి, ఖర్మ సంక్రమిస్తోంది కదా!...బుగ్గలూ, గడ్డాలూ పుణికి సానుభూతి యాత్రలతో, ప్రజాహృదయ పీఠం వసించాననుకున్న కుర్రాడు, ఆర్థిక నేరాల మొనగాడుగా, తల్లికీ తలవంపులు తెచ్చిన దారితప్పిన కొడుకుగా, తండ్రి పేరు నిలబెట్టడంపోయి పడగొట్టిన ‘సాక్షి’గా తేలుతూండడం... విషాదంకాక మరేమిటి? ఆర్థిక నేరాలకు చెందిన తన నిర్దోషిత్వాన్ని అతను నిరూపించుకోగలిగితేనే హార్దిక జన నయగారం. లేకుంటే మరి తప్పదు కారాగారం’’అంటూ లేచాడు శంకరం.

0 comments: