ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, May 13, 2012

రెండు 'అక్షర 'సమీక్షలు


సౌభాగ్య ఉత్పాదకశక్తి గొప్పది. నిరంతర సాహిత్య రచనా కర్మాగారం తనది. పైగా అది ఒకే రకంగా మూసపోసిన వైఖరి కాదు. జీవితంలాగా బహుముఖీనం. అనేక విషయాల పట్ల నిత్యగవేషణ తనది. తనకు నచ్చిన కవుల మీద గ్రంథాలు రాస్తాడు. రజని, ఓషో, జెన్.. ఒకరేమిటి? ఒకటేమిటి తన అధ్యయన శిబిరం అతి విశాలం. చదివినదీ, జీర్ణించుకున్నదీ ఏదీ వృధాపోనీయడు. తాను గ్రహించింది నలుగురికీ తెలపాలన్న తపన తనను నిరంతరం తరుముతూ వుంటుంది.


సౌభాగ్యది అద్దంలాంటి హృదయం అందుకే అందులో ఏదయినా ప్రతిబింబిస్తుంది. యాభై దాటిన యవ్వనం పేరిట సౌభాగ్య వెలువరించిన కవిత్వం ఆ విషయాన్నేఋజువుచేస్తోంది. అంతేకాదుమౌలికంగా సౌభాగ్య ‘కవి’. ‘‘ఆవిష్కరించలేని దానిలో ఆకర్షణ వుంది- రహస్యంగా మొదలై రహస్యంకేసి సాగుతున్న రహస్యం జీవితం’అని ‘అవ్యక్తం’లో వ్యక్తీకరిస్తాడు.


‘పిల్లలు’, ‘విభేదించకు’ వంటి కవితా ఖండికలు పరికించినప్పుడు ఖలీల్ జిబ్రాన్ ‘ది ప్రాఫెట్’లోని అభివ్యక్తీకరణ తలంపునకు వస్తుంది.
పచ్చదనం మనతో వున్నప్పుడు బాహిరమైన కాంక్రీట్ నగరం అవరోధం ఏమీకాదని ‘‘నివాసయోగ్యం కాని భూగోళాన్ని వదిలి కొత్త గ్రహాన్ని వెతుకుతూ వెళతాను. నాకు సంబంధించిన అన్నిట్నీ నాతో తీసుకుని వలసపోతాను’’అని ఆశ్వాసన కలిగిస్తాడు. ‘‘దుఃఖాలతో నిమిత్తం లేకుండా దృశ్యాలు మారుతూ వున్నాయి’’ అంటాడు.

వయోధికం అనేది శరీరానికే గానీ మనసుకు కాదు. అందుకే పుస్తకం పేరే ‘యాభై దాటిన యవ్వనం’ అనగలిగాడు. ‘పెద్దాయనా!’అనే కవితలో ‘‘తలకు రంగేసుకున్నా ఫలితముండదు నీ వయసుకు నిఖిల ప్రపంచమూ సాక్షిగా వుంటుంది. నిజాలెప్పుడూ నిప్పులు చల్లినట్లే వుంటాయి. మధ్య వయసులోవున్న మనిషి ఒకడు ‘ఏం పెద్దాయనా!’అంటాడు. తాతను కూడా తలదన్ని
న పదముందని తెలిసి తలకిందులవుతావు’’ అంటూనే చివరగా సందేశిస్తాడు ఏమని అంటే- ‘‘లోకమే నీ కుటుంబమనుకుంటే- పలకరింతల్ని చూసి కలత పడవు- దిక్కులు చూడవు, దిగాలుపడవు’’ అని.ఉదాత్త విలువల గురించిన ఒక స్పృహ కవిని ఎన్నడూ వెన్నంటే వుంటుంది. ‘పశ్చాత్తాపంలో ప్రపంచ రహస్యముంది- ప్రవాహంగా సాగడముంది’ అని క్షమాపణలు అనే కవితలో నిర్ధారిస్తూ-

‘‘తప్పు తెలుసుకోవడంతో తన్మయముంది
పునరాలోచనలో పులకింత వుంది
....
మనం మనుషులం, తప్పులుచేస్తాం
తప్పు చెయ్యను అన్నవాడు తప్పు చేస్తున్నవాడే
తప్పు చేశాను అన్నవాడు తప్పు చేయనివాడే
మనం దారితప్పితే మనసు గుర్తుచేస్తుంది
మనం బాధపెట్టినా మనసుకా సంగతి తెలుస్తుంది
గుర్తించనంతవరకూ ముల్లు గుచ్చుకుంటూనే వుంటుంది
తెలుసుకున్న తరువాత తేలికదనమేర్పడుతుంది’’
అంటాడు సౌభాగ్య.సుఖంవేరు. ఆనందం వేరు. ఆదాయ వ్యయాలు సుఖహేతువులు కావచ్చు ఆనంద హేతువులు కేవల బాహిరాలు కాదు.


కవిని నిజమైన హీరోగా సంభావిస్తాడు సౌభాగ్య.‘‘ఎందుకంటే హీరో నటిస్తాడు. కవి జీవిస్తాడు. లోకం నటననే నమ్ముతుంది. వివేకం నిండిన కవికి విలువకట్టలేం. నిజమైన కవి దగ్గర జనాకర్షక పథకాలుండవు... జీవితాంతం ఎవడూ హీరోగా వుండలేడు. కవి ఒక్కడే ఎప్పుడూ హీరో కావాలనుకోడు. కవి ఒక్కడే మనిషిగా జీవిస్తాడు. కవి ఒక్కడే మనిషిగా మరణిస్తాడు’’ అని గుండె లోతుల భావనను ఆవిష్కరిస్తాడు. 


ఫ్లోరెన్స్, ఇటలీ గీతం, వెనీస్, ఆల్ఫ్స్ పర్వతాలు స్విట్జర్లాండ్, పారిస్-ప్రేమ తాళాలు, హాలెండ్- టులిప్ గార్డెన్స్ లండన్ నగరం, బెల్జియం, మినియేచర్ వరల్డ్ వంటి కవితలన్నీ తన విదేశీ పర్యటనానుభవాలనుంచి అభివ్యక్తమయిన కవితలు. నిజానికి ఆ కవితలతో కాకుండా ఈ సంకలనం చివరి కవితగా ‘తెలుగులోనే మాట్లాడతా’ అనే మరో కవితనేదయినా వుంచితే బాగుండేది.


‘‘దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకుని భాషలకు స్వాతంత్య్రాన్ని కోల్పోయాం, భావాలకు స్వాతంత్య్రాన్ని కోల్పోయాం’’ అంటాడు.
‘‘అయినా నేను తెలుగు మాట్లాడతాను
తెలుగు మాట్లాడుతూ జీవిస్తాను
తెలుగు మాట్లాడుతూ మరణిస్తాను’’
అంటున్న కవి తెలుగుతో సదా వెలుగుతూ వుండాలనీ, కవిగా పూర్ణ మానవునిగా నిత్య యవ్వనంతో పరిఢవిల్లాలని ఆకాంక్షిద్దాం.-సుధామ


యాభై దాటిన యవ్వనం (కవిత్వం)
- సౌభాగ్య-
క్రియేటివ్ లింక్స్
పబ్లికేషన్స్,
నల్లకుంట,
హైదరాబాద్- 44. వెల: రూ.90/-
ఆనాటి నుంచి ఈనాటి వరకు అభ్యుదయ

ఒకనాటి సామాజిక పరిస్థితులను, ఉద్యమాలను ప్రతిబింబిస్తూ ఆయా కాలాల్లో కవుల కలాలనుండి వెలువడిన కొన్ని ప్రసిద్ధ కవితలను కందిమళ్ళ ప్రతాపరెడ్డి ‘నీ కవిని బతికించుకోవాలిరా..’ పేరిట సంకలనం చేశారు.


ఇందులో ప్రముఖ కవుల రచనలు చాలా మందివి లేవు. కొందరివి ఒకటికి మించి కూడా వున్నాయి. కవితల ఎంపిక రచయితల దృష్టితో కాకుండా రచనల దృష్టితో ఎంచుకోవడమే దానికి కారణం అని చెబుతున్నారు సంకలనకర్త.

అభ్యుదయ దృక్పథంతో అభివ్యక్తమయ్యే గీతాలనే గీటురాయిగా పెట్టుకుని సంకలించిన నూట అరవై నాలుగు కవితలు ఇందులో వున్నాయి. గురజాడ- ‘దేశమును ప్రేమించుమన్న’, శ్రీశ్రీ- ‘దేశ చరిత్రలు’,. రాయప్రోలు- ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’, త్రిపురనేని వారి ‘వీరగంధము తెచ్చినారము’, శంకరంబాడి సుందరాచారి- ‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ’, వేములపల్లి శ్రీకృష్ణ- ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గరిమెళ్ళ- ‘మాకొద్దీ తెల్లదొరతనము’, దేవులపల్లి - ‘నారాయణ నారాయణ అల్లాఅల్లా’, దాశరథి - ‘కానరాని భాస్కరులెందరో’, పురిపండా- ‘అనలపతాకం’, బసవరాజు- ‘గుత్తొంకాయ్ కూరోయ్ బావా’ కరుణశ్రీ- ‘మా కండలు పిండిన నెత్తురు’, ‘సోమసుందర్- ‘ఎంత చక్కని కన్నులమ్మా’, ఏటుకూరి ప్రసాద్- ‘ఎర్రజెండేరా మనది ఎర్రజెండేరో’ అనిశెట్టి- ‘ప్రగతి సంగీతం’, గజ్జెల మల్లారెడ్డి- ‘ఎత్తరా మన ఎర్రజెండా’ వంటి కవితలు ఇందులో వున్నాయి.


జె.బాపురెడ్డి ‘కర్తవ్యం’ వంటి కవిత చేర్చిన ఈ సంపుటిలో ‘కీలుగుర్రం మీద బాలీసు నానుకుని ప్రాణాలు లేనట్టి భగవంతుడొచ్చాడు- కూలి మాటడగండిరా అన్నాలు చాలవని చెప్పండిరా’ అన్న తెన్నేటి సూరి కవితగానీ, విప్లవ కవులు చెఱబండరాజు, శివసాగర్ వంటి వారి కవితలు గానీ చేర్చకపోవడం ఒక విధంగా అసంపూర్ణతే.


జనం గుండెల కద్దుకునే మరిందరి స్ఫూర్తిదాయక కవితలతో మున్ముందు మరింత సమగ్రంగా చేయగలరని ఆకాంక్షిద్దాం.


-అల్లంరాజునీ కవిని బతికించుకోవాలిరా...
(కవితా సంకలనం)
సంకలనకర్త: కందిమళ్ళ ప్రతాపరెడ్డి
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైద్రాబాద్; వెల: రూ.110 /-)

2 comments:

మాగంటి వంశీ మోహన్ said...

యాభై దాటిన యవ్వనం - మీర్రాసిన మొదటి రెండు పేరాల్లోనే అర్థమైపోయింది, ఈ పుస్తకం బాగుంటుందని....సాధారణంగా కవితల పుస్తకాల జోలికి పోను, ఎందుకంటే కవితలు నేనూ ఆయస్కాంత ధృవాలం , భిన్న ధృవాలం...

ఈ కవితలతో నాకున్న గొడవేమిటంటే ఊపు, లయ, ఛందస్సు లాటివి లేకపోతే అసలు చదవాలనిపించదు ఎంత సరుకున్నా....అలా బోల్డు ముత్యాలు పోగొట్టుకున్నానేమో తెలియదు కానీ, నా ప్రాప్తం ఇంతేనని సరిపెట్టేసుకోటమే...:)

ఈ పుస్తకమ్మీద మీర్రాసిన రెండో పేరాలో - "ఆవిష్కరించలేని దానిలో ఆకర్షణ వుంది- రహస్యంగా మొదలై రహస్యంకేసి సాగుతున్న రహస్యం జీవితం’అని ‘అవ్యక్తం’లో వ్యక్తీకరిస్తాడు." ఈ లైను బ్రహ్మాండమైన ఆసక్తిని రేకెత్తించింది సార్!

ఈ పుస్తకం ఆన్ లైను ఎక్కడైనా ఆర్డరు చెయ్యొచ్చా, తెలిస్తే చెప్పండి...

సుధామ said...

పుస్తకం ఆన్ లైన్ లో వున్నట్టు లేదు వంశీ గారూ! సౌభాగ్య ప్రస్తుతం అమెరికాలోనే వున్నారనుకుంటా.ఫేస్బుక్ లో పలకరించి చూడండి.