ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, May 11, 2012

టెక్కు-నా లేజీ!










‘‘టెక్నాలజీ, టెక్నాలజీ అని ‘టెక్కు’లు పోతున్నాం గానీ, ‘టెక్కు’ నా ‘లేజీ’ అని, ఈ సాంకేతికమనిషి ‘సోమరితనానికి’ దారి తీస్తోందని మనం గ్రహించడం లేదు! సాంకేతిక శాస్త్ర అభివృద్ధి ఎంతగానో ఉపకరిస్తోంది అన్న మాట నిజమేగానీ, మనిషిలో మునుపటి చురుకుదనాన్నీ పటుత్వాన్నీ, ధారణనూ నిలపడం లేదు. మునుపు ‘పదమూడో ఎక్కం’ అప్పచెప్పడం గొప్పగా వుండేది. ఇవాళ ఆ శ్రమ ఎవడు పడతాడని, కాలిక్యులేటర్లో చూసేస్తున్నాం! మునుపు ఓ వర్తమానం సాటివారికి అందించడానికి- స్వయంగా నడిచివెళ్లి, ముఖతః కలుసుకుని చెప్పేవారు, లేదా- ఓ ఉత్తరంముక్క రాసేవారు. మాయదారి సెల్‌ఫోన్లూ, ఈమెయిల్స్ వచ్చాక- కాలుకదపకుండా ఇంటినుండే విదేశాలకయినా క్షణాల్లో వర్తమానం పంపుతున్నాం! అందుకు సంతోషిస్తున్నాంగానీ, మన శరీర సహజ కదలికలు ఎంతగా కుదింపుకు లోనవుతున్నాయో గ్రహించడంలేదు.’’ అన్నాడు సన్యాసి.


‘‘నువ్వన్నది నిజం అన్నా! ఒకప్పుడు పొలం పనుల్లో, కార్ఖానాల్లో, ఆఖరికి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా- చేతికీ, బుద్ధికీ పని ఎక్కువగా వుండేది. ఇవాళ ‘కంప్యూటర్లు’ ఆ పని ఎక్కువ చేస్తున్నాయి. వాటికి మీటలు నొక్కడమే మనం చేస్తున్నాం. సరే! పొలం సంగతి కాదనుకో!- ఇంకా విత్తనాలు చల్లడానికీ, నాట్లు నాటడానికీ, పంట కోయడానికీ కంప్యూటర్లు వాడడం లేదుగానీ, వాటికీ యంత్రాలయితే రానే వచ్చేసాయి కదా! మన శరీరమూ, బుద్ధీ మునుపటి చురుకులో లేవు కనుకనే, రకరకాల కొత్తకొత్త రోగాలూ పుట్టుకొస్తున్నాయని నా డౌటు!’’ అన్నాడు శంకరం.


‘‘కానీ సాంకేతికాభివృద్ధి వల్ల- ఎంత శ్రమా, సమయమూ ఆదా అవుతున్నాయో మీరు గ్రహించడంలేదు; దంచుకుంటూ, చెరుగుకుంటూ, పిండి రుబ్బుకుంటూ, కట్టెల పొయ్యిల మీద వండుకుంటూ, మన ఆడవాళ్లు మునుపు ఎంత శ్రమపడేవారు... ‘సాంకేతికత’వారి పనులను ఎంత సులువు చేసేసింది.’’ అన్నాడు రాంబాబు.


‘కరెక్టేనయ్యా! కానీ అందువల్ల మిగిలిన శ్రమనూ, సమయాన్నీ మనం ఏ రకంగా సద్వినియోగం చేస్తున్నాం అది చెప్పు? ఏవయినా మంచి అదనపు పనులకు వినియోగిస్తూంటే- బానే వుండేది. కానీ ఒక రకంగా, ఓ తరహా ‘లేజీ’అంటే ‘సోమరితనం’ పెరుగుతోంది! వ్యాయామానికి కూడా ఇంట్లో ‘ట్రెడ్‌మిల్’ వుందని, సహజమైన నడకనో, ‘జాగింగ్’నో కూడా మానేస్తున్నారాయె! సినిమా చూడటానికి సినిమా టాకీసులకు వెళ్లనవసరమూ పోయి, ఇంట్లో టీవీలు, ఎల్.ఇ.డిలు, హోమ్ థియేటర్లు వచ్చి పడ్డాయాయె! ఎండాకాలం మునుపు ఆవకాయ పెట్టుకోవడం అనేదే యజ్ఞంలా వుండేది. ఇంటిల్లిపాదీ ఇన్వాల్వ్ అయ్యేవారు. మామిడికాయలు కడిగీ, తుడిచీ, పెద్ద కత్తిపీటతో ముక్కలు తరిగీ, జీళ్లు తీసీ... ఆవ పొడి, ఉప్పు, కారం అన్నీ దంచుకుని, తగు పాళ్ళల్లో కలుపుకుని, కాయలకు ఆల్చిప్పతో చెక్కులుతీయడం, మాగాయకు ముక్కలు తరిగి ఎండబెట్టుకోవడం... ఇలా బోలెడు పనులుండేవి! శుచిగా, శుభ్రంగా, మడిగా చేసుకుని- జాడీలకు ఎత్తిపెట్టుకుని, వాసెన గుడ్డలుకట్టి, అటకల కెక్కించి, ఏటి పొడుగునా వాడుకునేందుకు భద్రపరుచుకునేవారు. ఆ పప్పునూనెలు ఆడించుకోవడం, కారాలు దంచుకోవడం అవీ వుండేది. రోళ్లు, రోకళ్లు, కత్తిపీటలు పోయాయి. ఆ పనీ యంత్రాలే చేసేస్తున్నాయి. అసలు నన్నడిగితే- మునుపటి ఆ రుచులు కూడా పోయాయనిపిస్తోందిస్మీ!’’ అన్నాడు శంకరం.


‘‘అబ్బే! అలాగని ‘సాంకేతికత’కూడా అన్నిటా అభివృద్ధి చెందిందనలేమోయ్ శంకరం! మొన్న అమెరికాలోవున్న మా అబ్బాయితో స్కైప్‌లో మాట్లాడుతూ వాళ్ల అమ్మమ్మ- ‘‘ఒరే మనవడా! కాళ్లు తెగ లాగేస్తున్నాయిరా! మీ తాతగారి కాళ్లు నే పడితే, ఆయన ఆ రోజుల్లో నా కాళ్లనొప్పులు పోవడానికీ, తనూ స్వయంగా నా కాళ్లు పిసికేవారు. ఆ సుఖమే వేరు! ఆయన పోనే పోయారు. అమెరికాలో కాళ్లు వొత్తే మిషన్ ఏదయినా దొరికితే, వచ్చేప్పుడు పట్రారా మనమడా’’అంది. ‘‘అలాంటివేం దొరకవు అమ్మమ్మా!’’ అని నవ్వేసాడు వాడు. అంచేత వండడానికి యంత్రాలు వచ్చాయేమోగానీ, ఇంకా వడ్డించడానికి రాలేదు. కాళ్లు పట్టడానికీ, వీపు గోకడానికీ, తల దువ్వి జడవేయడానికీ, తినిపించడానికీ ఇంకా మిషన్లు వచ్చినట్లు లేవు’’ అన్నాడు సన్యాసి నవ్వుతూ.


‘‘వద్దులే నాయనా! శరీర సహజ కదలికలు నువ్వన్నట్లు ఆ మాత్రమైనా మిగలనీ! కానీ చూసావ్!- ఆడామగా సమానంగా అలసిపోయాక, అందునా ఈ ఎండాకాలం కాళ్లు విపరీతంగా లాగేస్తుంటే, ఎవరికీ అవతలివారి కాళ్లు ఆప్యాయంగా వొత్తే- సమయమూ, ఓపికా, ఉద్దేశమూ కూడా అంతరించిపోతున్నప్పుడు, కాళ్లొత్తడానికి కూడా ఏదయినా యంత్రం వుంటే బాగుణ్ణనిపించేస్తుంది! మే పదకొండు అంటే ఇవాళ ప్రపంచ టెక్నాలజీ దినోత్సవంట! టెక్నాలజీతో నువ్వన్నట్లు ‘టెక్కు’లతోబాటు కనబడని ఓ ‘లేజీ’కూడా ఏర్పడుతోండోయ్! పైగా సాంకేతికాభివృద్ధిని కూడా మంచికికాక, చెడుకు వినియోగించే వైఖరీ ప్రబలుతూ, సైబర్ నేరాలూ, దొంగతనాలూ, హాకింగ్‌లూ, వైరస్‌లూ ఇబ్బడిముబ్బడిగా సృజింపబడుతున్నాయి! మనిషి ‘మర’మీద ఆధారపడక తప్పనిస్థితి వచ్చేసింది! అనుక్షణం ఏదో ఒక సాంకేతిక యంత్రంపై బ్రతుకు ఆధారపడుతూ- మరా, మరా అని అఘోరిస్తున్నాడే కానీ, ‘రామ’ నామస్మరణ చేయడమూ, రామకోటి రాయడమూ కూడా వెగటై, ఒక బార్బేరియస్ పనిగా తలపోస్తున్నాడు. హృదయంలో ‘పేస్ మేకర్’ పెట్టగలం కానీ, ‘పీస్ మేకర్’ అనగా శాంతినీ, ఆనందాన్నీ అమర్చగల సాంకేతికత రాదు! మనిషి ‘మనిషి’గా మనగలగడం ముఖ్యం!‘మర’లున్నా- ఏమరక, మానవీయతను ఏడుగడలోకి తెచ్చుకు జీవించడం ముఖ్యం’’ అంటూ లేచాడు శంకరం.


 

5 comments:

మాగంటి వంశీ మోహన్ said...

just awesome! as usual sir

శ్యామలీయం said...

> ఇవాళ ‘కంప్యూటర్లు’ ఆ పని ఎక్కువ చేస్తున్నాయి. వాటికి మీటలు నొక్కడమే మనం చేస్తున్నాం.

కొన్నాళ్ళాగండి. మన చూపులతోటే కంప్యూటరుని నియంత్రించవచ్చును. మీటలు నొక్కనక్కరలేదు.

మరికొన్నాళ్ళాగండి. మన ఆలోచనలు పసిగట్టి తమంతతామే పనిచేస్తాయి కంప్యూటరులు. కదిలే పనికూడా ఉండదు. రామ రామ. అందరూ గుండ్రంగా అయిపోతూ మందులు మింగుతూ మరింత గుండ్రంగా అయిపోతూ మరిన్ని మందులు మింగుతూ ..... ఇంకా యేం చెప్పాలీ!

Sai Bharadwaj said...

చాలా బాగా రాసారు అండి.....

ఇక పొయ్యే కొద్ది కాళ్ళు పట్టడానికి, వాటికీ కూడా మిషన్లు తయారు చేస్తారేమో.........

మరువం ఉష said...

దాదాపుగా 25 ఏళ్లగా వచ్చేస్తోందీ యంత్ర జీవన బానిసత్వం. A Day Made of Glass 2, is Corning's version of the Future of Glass Technologies అంటూ వచ్చిన http://www.youtube.com/watch?v=VF2mKavngHE చూసి నిజానికి చాలా బాధ వచ్చింది. దాదాపుగా 20సం. క్రితం చదివిన కథ ఇలా సాగుతుంది - ఒక శాస్త్రీయ అభివృద్ది సమావేశం/సదస్సు ముగిసాక ఆ శాస్త్రవేత్త జననాడి తెలుసుకోవాలని ఆ సమీపాల్లో తిరుగుతున్న ఒక బిచ్చగాడిని అడుగుతాడు "ఇంత కొత్త విషయాలు వచ్చాయి, మీకు బాగుండాలి. నీకేమనిపిస్తుంది" అని. "నా చిన్నప్పుడు వేడి గంజి పోసేవారు బావూ, దయగల అమ్మలు. కుక్కర్లు వచ్చాయి, సద్దికూటి గతి పట్టినాది అదీ ఆయమ్మ రెండో పూట కూడా తినేసినాకా మిగిలితేనే. ఇగో సద్దికూటి పెట్టెలు(ఫ్రిజ్ లు) వచ్చినాయి, మర్నాటికి దాసుకుంటున్నారు. మా బతుకులు ఎంగిలి ఇస్తరాకులకి జారినాయి. ఏమి ముందుకు వెళ్ళినాది చెప్పు?" అంటాడు. మనిషికి కావాల్సిన లక్షణాలు హరించివేస్తున్నదీ టెక్నాలజీ - ఇరుగు పొరుగుల అవసరం, బీదసాదల పట్ల దయ ఇవన్నీ నెట్టివేయబడ్డాయి, అన్నిటికీ యంత్రాలే. ఈ పోస్ట్ కి నా స్పందన పెద్దదే!

సుధామ said...

థాంక్యూ! వంశీ మోహన్ గారు!
శ్యామలీయం,సాయి గారలు అన్నట్లు మున్ముందు ఏ మార్పులు వస్తాయో ఏం చెప్పగలం.
వావ్! ఉష గారూ! నా రచనకన్నా మీ స్పందనే ఎంతో బాగుంది.చాలా చక్కగా చెప్పారు.
మీకెల్లరకూ కృతజ్ఞతలు.