(12)
భాష నిరంతరం ప్రవాహశీలం. అందులో కాలమాన పరిస్థితులకనుగుణంగా కొత్త పదాలు వచ్చి చేరుతుంటాయి.
ఇంతకీ భాష ప్రధానంగా భావవినిమయ సాధనమేకదూ! అంటే కమ్యూనికేషన్ అని దేన్నంటున్నామో అదే భాషకు ప్రధానం. అయితే భాషకు ప్రామాణికత అనే మాట ఒకటి వినబడుతూంటుంది. జనం మాట్లాడుకునే భాష వ్యవహార భాష. అయితే భాషలో సహజంగా లేని లక్షణాలను కవులు, రచయితలు, లాక్షణికులు కల్పించినంత మాత్రాన వాటికి ప్రామాణ్యం రాదు. రైల్వేసిగ్నల్ అంటే అర్థమైనట్లుగా ధూమశకట ఆగమన నిర్గమన సూచిక అంటే అర్థం కాదు- అది దానికి సరియైన పదమే అయినా. అంచేత ఎక్కువమందికి అర్థం కావాలనే ఉద్దేశ్యంతో భాష పెరగాలి, పెంచుకోవాలి. ఇవాళ గ్లాసు, రోడ్డు, రైలు వంటి పదాలన్నీ జనసామాన్యానికందరికీ అర్థమయ్యేవే.
కవులు గుర్తింపబడని శాసనకర్తలు. అనుశాసన కర్తృత్వాన్ని కవికి మనం కట్టబెట్టినా లోకం ఒప్పదు. అంచేత కావ్య ప్రయోగాలన్నీ ప్రమాణం కాదు.
పామరులకన్నా పండితులు పట్టుబట్టే విషయం భాషా పరిశుద్ధత అనేది. ఆదానప్రదానాలు లేకుండా ఏ భాషా మడిగట్టుకు కూర్చోలేదు. తెలుగు అని మనం ఇవాళ అంటున్నదానిలో సంస్కృతం నుంచి తెచ్చుకున్న పదాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ‘తెలుగునకున్న వ్యాకరణ దీపము చిన్నది’ అని తిరుపతి వేంకట కవులు ఊరకే అనలేదు.
మన లాక్షణికులు సంస్కృత శబ్దాలు తెలుగులో ప్రవేశించడాన్ని చర్చించినంత విపులంగా అన్యదేశ్యాలు- హిందీ, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ వంటి వాటినుంచి వచ్చి చేరిన అనేకానేక పదాల విషయంలోమౌనంవహించారు. మాండలికాల విషయమూ అంతే!
నిజానికి జన జీవనంలో వాడుకలో వున్న అనేక పదాలకు కావ్య గౌరవం దక్కలేదు. ప్రాచీన నాటకాలు సంస్కృతాన్ని ప్రధాన పాత్రలకు పెట్టిస్త్రీపాత్రలకు ప్రాకృతం పెట్టడమూ కనిపిస్తుంది. సినిమాలలో కూడా కొన్ని ప్రాంతాల భాషను అయితే ప్రతి నాయకులకూ, లేకపోతే హాస్యపాత్రలకు నిర్థారించేసి వాడటం వల్లనే ,ఒక భాషలోనే ఎక్కువ తక్కువలు గౌరవ న్యూనతలు చోటుచేసుకున్నట్లయింది. ఈ పరిస్థితి అన్ని భాషల విషయంలోనూ తరతమ భేదంతో వుండనే వుంది.
అన్య దేశ్య నిషేధంవల్ల భాషకు పరిశుద్ధత, పవిత్రత లభిస్తాయనుకోవడం అశాస్త్రీయం అనాలి.భాషను శాసించాలన్న సంకల్పంగానీ, భాషలోని తప్పొప్పులను సామాజికేతర కారణాల ద్వారా ముఖ్యంగా అభిరుచి ప్రధాన బుద్ధితోనో,తార్కిక దృష్టితోనో నిరూపించాలనే ప్రయత్నం ప్రామాణికతా నిరూపకుల లక్షణం అనేవారు బూదరాజు రాధాకృష్ణగారు.
భాషలోని పరిణామాలకూ, భేదాలకూ ముఖ్య హేతువులు సామాజిక స్థితిగతులే. ఆర్థిక రాజకీయ భౌగోళిక సాంస్కృతిక కారణాలవల్ల, దేశ కాల పాత్రల స్వభావ పరిణామంవల్ల, భాషలో వచ్చే రూపభేదాలకూ ఆయా కాలాల్లో ఆయా సమాజాల్లో ఉండే గౌరవాగౌరవాలకూ పరస్పర సంబంధం వుంటుందనేది విస్మరించలేని విషయమే.
భాషలో ఈ పదాలే ఒప్పు ఈ పదాలే తప్పు అని ముఖ్యంగా వినిమయ భాషలో అస్సలు నిర్దేశించడం, శాసించడం సాధ్యంకాదు. అలా అన్నా వ్యవహారికం తదనుగుణంగా వుండదు. జనం తమ మాండలికంలోనే తమ కనుకూల వినిమయ వైఖరిలోనే అభివ్యక్తి కావించుకుంటారు.
నేడు మాండలిక రచనలు విరివిగా రావడానికి కారణం సజీవమైన భాష అంతరించిపోకూడదనే. పాత్రోచిత సంభాషణలు మాండలికంలో వుండడం అనివార్యమైన సంగతే. అలా లేకపోతే రచన జీవద్భాషలో వున్నట్లే తోచదు.
అయితే రచయిత మొత్తం మాండలికంలోనే ఒక నవలనో, కథనో రాయడంవల్ల ఆ మాండలికభాష తెలిసిన ప్రాంతానికే అది పరిసీమితమైపోతుందని వ్యాఖ్యానించేవారున్నారు. కానీ జీవద్భాషలో వివిధ మాండలికాల్లో వస్తున్న రచనలు గ్రంథస్థం కావడంవల్ల మిగతా ప్రాంతాలవారికి కూడా ఇతర ప్రాంతాల భాషా వ్యవహారంతో పరిచయం, అవగాహన ఏర్పడతాయి. సన్నిహిత సాంఘికాది సంబంధాలవల్ల భాషలో వచ్చే ఏకరూపత ఒకటి ఎలాగూ వుంటుంది. ఆ సామ్యాన్నేప్రామాణికం అనుకోవచ్చు. అయితే ఇలా ప్రామాణీకరింపబడానికి అన్ని ప్రాంతాల భాషా రూపాలు, సౌందర్యం, భావ వినిమయంలో ఆయా మాండలిక ప్రభావం దోహదమవుతాయి. కావాలి కూడాను.
పండితులను పామరులనుకరించటం జరుగుతూనే వుంటుంది. అలాగే జన మమేకమయ్యే పండితుడు ఆ పామర భాషనూ ఔచితీమంతంగా భావవినిమయానుకూలంగా అభివ్యక్తీకరించడమూ జరుగుతుంది.
జన సముదాయం యొక్క సామూహిక జీవనానికి ఉపకరించగలిగేది భాషయే. మానవ హృదయాలను ఏకీకరించటానికీ, విభేదాలు రేకెత్తించడానికీ రెండువైపులా పదునుగల కత్తిలాంటిదే భాష. కరవాలచాలనం తెలిస్తే కరచాలనం సులువవుతుంది.
జన్మజాతమైన భాషలో అధ్యయనం జరగడం ప్రధానం. తెలుగు మాధ్యమానికి దూరమయ్యే విద్యార్థి భాషా ప్రేమికుడు, భాషా సంపన్నుడు ఎలా కాగలుగుతాడు. అందువల్ల తెలుగును పరిరక్షించుకోవడం అంటే మాండలికాలతో సహా నేల నాలుగు చెరగులావున్న మన మాతృభాషను గౌరవించి సమాదరించి మాటలో, లిపిలో, మదిలో సుస్థిరపరచి భావ వినిమయం కావించాలి.
తెలుగు వెలుగు జిలుగులకు మాండలికాలు మట్టిదీపాలే కాదు మణిదీపాలు కూడాను.
2 comments:
"కరవాలచాలనం తెలిస్తే కరచాలనం సులువవుతుంది"
చాలా బాగా చెప్పారు సార్
మాగంటి వంటి వారికి నచ్చితే మాకెటువంటి సంతోషమో వేరే చెప్పాలా!కృతజ్ఞతలు.
Post a Comment