ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Monday, January 16, 2012

సామాజికత, తాత్త్వికతల కలగలుపుఆంధ్రభూమి దినపత్రిక
సంక్రాంతి ఆదివారం 'అక్షర 'పేజీలో
నా 'చిత్రగ్రంథి ' కవితాసంకలనం పై
ప్రచురితమైన సమీక్ష.‘సుధామ’.
కార్టూనిస్టుగా, రచయితగా, సమీక్షకునిగా, విమర్శకునిగా, కాలమిస్ట్‌గా, పజిల్స్ నిర్మాతగా- సుధామ ఎంత సుపరిచితులో, కవిగా అంతకంత ప్రసిద్ధుడైనవారు.

ఆయన 60 వసంతాల వయస్సుకి చిహ్నంగా ఇప్పుడు 60 కవితలతో ‘చిత్రగ్రంథి’ సంపుటిని తెచ్చారు. సాహిత్య సంప్రదాయాల విజ్ఞతని అధ్యయన శీలంతో, అభ్యాస చైతన్యంతో సాధించుకున్న కవిగా సుధామ కవిత్వమంతా చిక్కగా, పదునుదేరి వుంది.


‘ఒక్కొక్క వాక్యమూ
ఒక్కో ఈనెలాగా
నా నిటారుతనమే ఒక గడకర్రలాగా
ఎవరికోసమో ఎదురుచూడటం కాదు
నా గదిని నేనే శుభ్రపరచుకుంటా
తప్పదు
తరాల అంతరాల తరతరాల బూజు దులపడానికి
నేనో బూజుకర్రనవుతా
నా గదికే కాదు
వ్యవస్థాగత
పర్యావరణ పరిశుభ్రతకే పనిముట్టుగా మారతా’

అని చిత్తశుద్ధితో వ్యక్తినిష్ఠని సమాజపరం చేస్తూ ప్రకటననిచ్చారు.

సమకాలీన సామాజిక దౌర్భాగ్యాన్నీ, అస్తవ్యస్తతనీ నిరసిస్తూ అధిక్షేపిస్తూ, శక్తివంతమైన అభివ్యక్తినిస్తూ కవితా నిర్మాణం సాగిస్తారు సుధామ.

‘‘ఏడో క్లాసు పిల్లాడు మూడో క్లాసు పిల్లను రేప్ చేస్తాడు
ఆనక అంచెలంచెలుగా దాదర్ ఎక్స్‌ప్రెస్‌లా ఎదుగుతాడు
రేపు వాడికి లాగులో
ఓ కొత్త అవయవంలా కత్తి కూడా వుంటుంది’... అని
‘బూతు మా జీవితం
రక్తపాతం మా ఊపిరి
సినిమా మా వేదాంతం’ అని,

‘ఇవాళ మనిషికి నవగ్రంథులు కాదు
మరో కొత్త గ్రంథి
చిత్రగ్రంథి’

అని తన సంవేదనని కవితాత్మకం చేస్తారు.

కవితా వస్తువులో అనంతమైన వైవిధ్యం చూపారు సుధామ. పర్యావరణ పరిరక్షణ, (ప్లాస్టిక్ బ్యాగ్‌ల దురాక్రమణ జీవన వ్యర్థాలనే ప్రోదిచేయటాన్ని ‘ఉన్నంతలో ఉడతలవ్వండి’అనే సందేశంతో ఎదుర్కొన్నారు); శరణార్థి శిబిరాల్లో నడుస్తున్న శవాల దైన్యం, ఫ్రీజ్ అయిపోతున్న ఆధునిక కాలం, ‘కుళ్లిన కోడిగుడ్డులోంచీ కారే అధికారం సొనగా’ మారిన రాజకీయ కల్మషం, ‘‘భూ బకాసురుల ఏకచ్ఛత్రగతి, రియల్ ఎస్టేట్ వ్యాపారి గ్రహస్థితి; ‘‘చేరెడు నేల కొనుకున్నా, ఇల్లుకట్టలేని మధ్యతరగతి గతి... ఈజిప్ట్ కైరోలా ఈనాటికీ సాగుతున్న క్లెటోరిస్ తొలగింపు కిరాతక చట్టం గురించీ... క్రికెట్ క్రేజ్ గురించీ... ఇలా సంకీర్ణమైపోయిన సమస్యాగత సంఘం గురించి నిఖార్సయిన కవిత్వాన్ని వెలార్చారు సుధామ.

కవితా వస్తు స్వీకరణంలో సుధామ చూపునీ, లో చూపునీ- కొన్ని తాత్త్విక స్పృహని పంచుతున్న కవితల్లో చూస్తాం. ఇలాంటి కవితలకి మకుటాయమానంగా నిలిచే ఖండిక ‘కవిత్వం నా రావణకాష్ఠం’అనేది.

‘దారికిరుపక్కలా నువ్వెన్ని పజ్యాల మొక్కలూ, చెట్లూ
నాటుకుపోయినా గుర్తింపు రాదు’,


'భవిష్యత్ చిత్రపటంలో కవితా హృదయంకన్నా
అర్థవిప్లవమే మిగిలింది,’

‘అక్షరం నేల
శబ్దాల హేల
అభివ్యక్తి వాహనం వున్న కవివయితే నువ్వు
అనామకునిగానే కనుమరుగవటానికి కావాలి సిద్ధం’ అంటారు.

మార్కెట్ ప్రపంచపు మాయాజాలాన్ని ఆవిష్కరిస్తూ, చివరికి


‘నిన్నటిదాకా
మెట్లు అలానే నిలిచేవి
మనిషే జారిపోయేవాడు
నేడు
మనిషి అలానే వుంటున్నాడు
మెట్లే జారిపోతున్నాయి’

అంటూ కవితకి ముక్తాయింపునిస్తారు.

పఠితకి ఆలోచనీయమూ, ఆవేదనాత్మకమూ అయిన భావాన్నిస్తారు. కవిత్వంలో వెంటాడే వాక్యాలు రావాలంటే, కవికి కవితా సామగ్రి అందుబాటులో వుండాలి; రసవిద్య తెలిసి వుండాలి. ‘చిత్రగ్రంథి’లోని ప్రతి ఖండికలోనూ ఈ వెంటాడే వాక్యాలు కొల్లలుగా వున్నై.

‘ఒకడి శ్రమ మరొకడి పరిశ్రమ అయినపుడు...
ఒకడు ఒఖ్ఖడేగా వుండడు.
అలాంటి ఒకళ్లు వాళ్లు కాకుండా పోరు
అనివార్యంగా పోరు చేయకపోరు’,

‘తరలివెళ్లే భక్తజన సందోహపు జీవనాకాంక్ష
దేవులాటే
దేవుడు దేవుడే!’’,


‘ఉమ్మనీటినుండి
చితిపై చిల్లికుండ ధారవరకూ
మనిషికి- ఒక జలావరణం
కన్నుల్లో, గుండెల్లో జలధారణం
ఆర్ద్రత ఒక జలాభరణం
జీవితమే ఒక జల ప్రయాణం’...

ఇలా ఎన్నో ఉదాహరణలు యివ్వవచ్చు.

కాగా, ‘చిత్రగ్రంథి’ సంపుటిలోని మంచి కవితల్లో ఒక మరీ మంచి గొప్ప కవిత వుంది. అది ‘చేతులు కురిసిన చేతన’ శీర్షిక దాల్చింది.

‘కురిసే చేతులుంటే
మొలిచే భూమి వుంటుంది
మొలిచే భూమిలోంచి
మొక్క పరీమళిస్తుంది’

అనే ఎత్తుగడతో సాగుతుంది.

ఆ వెంటనే

‘ఆకాశానిదేముంది
అది వట్టి వేదిక
సముద్రం ఆవిరవందే
మేఘం ఆసీనం కాలేదిక’

అనే చరణం వస్తుంది.

దాన్ని తరుముతూ
‘మేఘానిదేముంది... అంటూ నాలుగుపాదాల చరణం, ఆ తర్వాత ‘కరుణదేముంది...’ అనే చరణం వస్తూ... చివరికి కొంచెం మార్పుతో మొదటి చరణం పునరుద్ఘాటనతో కవిత ముగుస్తుంది.

నిర్మాణంలోనూ, పదబంధాల కూర్పులోనూ, అర్థవ్యుత్పత్తితోనూ- ఎంతో గుణ నైశిత్యాన్ని చూపుతూ సాగింది మొత్తం ఖండిక. ముక్తపదగ్రస్తం అలంకారం స్ఫురిస్తుంది.

- విహారి

(చిత్రగ్రంథి .. కవిత్వం - సుధామ
వెల: రూ.100
ప్రతులకు: సఖి కుమారి ప్రచురణలు
శ్రీమతి ఎ.ఉషారాణి,
జి-12,సాదత్ టవర్స్,
పద్మావతి అపార్ట్‌మెంట్స్,
సలీంనగర్ కాలనీ,
మలక్‌పేట, హైదరాబాద్- 500 036.
040-24545780..
9848276929)

2 comments:

Unknown said...

Sudhama garu,
Congrats for analytic review by Vihari garu on your book 'ChitraGandhi'. I attended its release function.
-Janardhan Amballa

సుధామ said...

Thank you jamardhan Garu your presence added glory to the meeting