ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 20, 2012

అవరోధవ్రాతము










 

‘‘ బ్రేక్ కల్చర్’’ అన్నాడు సన్యాసి.


‘‘ఇప్పుడు జరుగుతోంది అదే కదా! మన ‘కల్చర్’, అనగా ‘సంస్కృతి’ ముక్కలవుతూనే వుంది! అసలు- ‘హిందూ దేశం’అన్న పేరే మరుగునపడి, హైందవానికే ముప్పు పరిస్థితులు దాపురిస్తున్నాయి. ‘సెక్యులర్’ పేరుతో- మన కల్చర్‌ని మనమే ‘బ్రేక్’ చేసుకుంటున్నాం’’ అన్నాడు రాంబాబు.


‘‘నేనన్నది ‘బ్రేక్ ది కల్చర్’ అన్న సంగతి కాదు. ‘బ్రేక్ కల్చర్’ అనగా ‘అవరోధ సంస్కృతి’. సాఫీగా సాగిపోకుండా అడ్డుకట్ట వేసే సంవిధానం గురించి. ఒకరి ఎదుగుదలకు అడ్డం పడిపోవడం, చేతనైనంతవరకూ అవరోధం కావడం- అనే నైజం గురించి!’’ అన్నాడు సన్యాసి.


సర్లే! ‘బ్రేక్ ది కల్చర్’అనే ధోరణి కూడా, ‘బ్రేక్ ది రూల్స్’అని ,నియమ నిబంధనలనూ, పద్ధతులనూ తుంగలోకి తొక్కి చెలరేగడం కూడా ‘బ్రేక్ కల్చర్’ అనే నీవనే ‘అవరోధ సంస్కృతి’లోకే ఎలాగూ వస్తుందోయ్! హిందూ మతం నిజానికి ఇవాళ వికాసవంతం కాకుండా జరుగుతున్న చర్యలు కూడా - ‘అవరోధ సంస్కృతి’లో భాగాలే! నువ్వు రాజకీయం అను, సాహిత్యం అను, మరో రంగం అను! - ఏ రంగంలోనైనా, ఇదే తీరు కనబడుతోంది కదా! ఎందుకు మొన్న పెద్దాయన- డి.జి.పిగా చేసిన ప్రభాకరరావుగారే అంటూంటే విన్నాను- రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వెలువరించిన డైరీలో మసీదు, చర్చి ఫొటోలు ప్రముఖంగా కనిపిస్తున్నాయట గానీ, ఒక్క దేవాలయం చిత్రం గుర్తింపుకు నోచుకోలేదట! ఓ ‘బతుకమ్మ’ బొమ్మతో సరిపెట్టినట్లుందిట! చూడడానికి అత్యల్ప విషయంగా తోచ వచ్చునేమో కానీ, ఆయన ‘ఆర్తి’లో ఎంతో అర్థం వుంది! ఇది ‘సంస్కృతీ విఘాతం’కాదా! ఏ పుర్రెకు పుట్టిన బుద్ధి అయినా ఇది ‘అవరోధ సంస్కృతే’ కదా!’’ అన్నాడు రాంబాబు.


‘‘అసలు మానవ స్వభావమే ఇవాళ వెర్రి గంతులు వేయడం ఎక్కువైందర్రా! స్వార్థ చింతన, అధికార దాహం వంటివి పెరిగిపోతూ, తన ఎదుగుదల కంటే- ఎదుటివాడి పతనం పట్ల సంతోషించడమూ, వారి ఎదుగుదలకు అడ్డంపడి ఆనందించడమూ ఎక్కువైంది. మంత్రివర్గ విస్తరణలో కి‘రన్’కు- బొత్స ‘బ్రేక్’వేసారనీ, అందువల్లనే ‘చిరు’మార్పుతో సర్దుకోక తప్పలేదనీ ప్రస్తుతానికి అంటున్నారా లేదా? ఇప్పుడు గ్రూపిజాలు, కూటములూ ఎక్కువైపోయాయి. ‘తనమాటే చెల్లాలి’, ఇతరుల అభిప్రాయాలు ఎంత ఔచితీమంతాలైనా ‘చెల్లుచీటీ రాయాలి’ అనే- పోటీ ఎక్కువయ్యింది.’’అన్నాడు శంకరం జోక్యం చేసుకుంటూ.


‘‘ ‘ఇప్పుడొక బ్రేక్’ అని ఛానెల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమంలో ‘స్వల్పవిరామం’ అంటూ వ్యాపార ప్రకటనలు వేసుకోవడం కోసం- మధ్యేమధ్యే విరామాలు వస్తూంటాయి గానీ, 'అసలు ప్రోగ్రాం'కంటే ‘బ్రేక్’లే ఎక్కువైపోయే వైఖరులూ వున్నాయి! ఓ మంచి సినిమా ఇంట్లో టీవీలో చూద్దామంటే- ఆ సినిమాలో లీనమయ్యేలా, ఒక మూడ్‌ని కొనసాగనివ్వకుండా, ఈ ‘బ్రేక్ కల్చరే’ అవరోధమవుతూ వుంటుంది! మధ్యలో ప్రకటనలు లేకుండా అందుకే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడడంలోనే నిజానికి ‘థ్రిల్’ వుంది. కానీ అక్కడా ‘పైరసీ’లూ అవీ చెలరేగుతూ, ‘బ్రేక్ కల్చరే’ కనబడుతోంది! శంకరం! - నేను ‘అవరోధ సంస్కృతి’ అన్నదాన్ని, నువ్వు రాజకీయంగా సరిగ్గానే గ్రహించావు సుమా!’’ అన్నాడు సన్యాసి. ‘‘ ‘అవరోధవ్రాతము’ అనగా అడ్డగించే గుంపులే ఇంపునింపేవిగా పెరిగిపోతున్నాయి సుమా!’’అని కూడా అన్నాడు.


‘‘ ‘బ్రేక్’ అంటే అవరోధమే అనడానికి కుదరదు సుమా! ‘బ్రేక్’ అన్నదానికి ‘పగలగొట్టడము’అనే అర్థమూ వుంది! ‘రికార్డ్ బ్రేక్’ అంటూంటారు కదా!- అంచేత నువ్వన్న ‘బ్రేక్ కల్చర్’ని- నెగెటివ్‌గా కాక, ‘పాజిటివ్ సైడ్’లో చూస్తే- రికార్డులు అధిగమించే సంస్కృతి అనీ అన్వయించుకోవచ్చుకదా!’’ అన్నాడు శంకరం నవ్వుతూ.


‘‘ ‘బ్రేక్ ది కల్చర్’కూ, ‘రికార్డ్ బ్రేక్ కల్చర్’కూ, ‘బ్రేక్ కల్చర్’కూ తేడావుందర్రా! అన్నీ ‘కలగాపులగం’ చేసేయనక్కర్లేదు! మంచిని మంచిగానూ, చెడునూ చెడుగానూ, ఉన్నది ఉన్నట్లుగానూ చూడనీయకపోవడమనేదీ- ‘అవరోధ సంస్కృతే’ అవుతుంది! ఇందాక రాంబాబు అన్నట్లు- ఒక గవర్నమెంట్ ‘డైరీ’లోనే సెక్యులర్ పేర చూపిన వివక్ష, నిజానికి యధాలాపంగా తీసుకోదగింది కాదు! కానీ ఎవ్వరూ దాని ఊసెత్తరు. ఎందుకంటే- ‘పోనె్లద్దూ! మనకెందుకొచ్చింది’అన్న ఉదాసీనతే! వచ్చిన చిక్కేమిటంటే- ‘సహనం’, ‘ఓర్పు’అంటూ- మనమే ఒక్కోసారి పౌరుష హీనులుగా, తలవంచి ఊరుకోవడంవల్లే, పరిస్థితులు మన సమగ్ర వికాసానికి అవరోధంగా నిలుస్తున్నాయనిపిస్తుంది’’ అన్నాడు సన్యాసి.


‘‘అవరోధం వేరు, విరగ్గొట్టడం వేరు, విరగదీయడం వేరు. తమాషాగా మూడూ కూడా -ఒక ప్రత్యేక సంస్కృతి పట్ల కేంద్రీకరించడం, ఓ వ్యక్తినో, అభివృద్ధికరమైన ఒక అంశాన్నో టార్గెట్ చేసి - ఆ ప్రగతిదాయక సంవిధానాన్ని దెబ్బతీయడం- అనే కుత్సిత మతులు పెరుగుతున్నారు! ఒకడు పైకి వస్తున్నాడు అంటే, ఒక సంవిధానం అభివృద్ధి చెంది పదుగురికీ ప్రయోజనదాయకమవుతోందంటే, దానివల్ల మరెవరికో లాభం కలుగుతోంది, ప్రశస్తి వస్తోందని ‘బ్రేక్’వేయడానికి సిద్ధపడిపోయే వారెక్కువవుతున్నారు! పీతల సీసాలో ఒక పీతకాలు మరొకటి లాగుతూ, ఏదీ పైకిపోకుండా మూతలేకపోయినా ఇబ్బంది లేని ‘తెలుగు పీతల సీసా’ రవాణాయే ప్రస్తుత వ్యవస్థగా వుంది! ‘నో లాస్ నో ఫ్రాఫిట్’ అని యధాతథ వ్యాపారాన్ని వట్టినే సాగదీయడం జరిగినా, సంతోషించే స్థితిలో పడ్డాం ఆఖరికి! తెలంగాణా విషయం అలానే వుందిగా’’ అన్నాడు రాంబాబు నిట్టూర్చి లేస్తూ.

0 comments: