ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, January 13, 2012

ముసుగులు
‘‘పర్‌దేమే రహ్‌నేదో - పరదా నా ఉఠావో’’ అని కూనిరాగం తీస్తూ ప్రవేశించాడు సన్యాసి.


అసలే మొన్నటి ‘బట్ట’బయలు వ్యవహారం మీద హాట్‌హాట్‌గా వున్నాడేమో రాంబాబుకు చిర్రెత్తుకొచ్చింది- ‘‘అసలు దుస్తుల గురించే సంచలన వ్యాఖ్యలకు మండిపోతుంటే, నువ్వు ముసుగేసుకోమనీ, పరదాలు తీయద్దనీ అంటూ ‘బురఖా’ కల్చర్‌ని ‘సపోర్ట్’చేస్తే, చితగ్గొట్టేస్తారు జాగ్రత్తరొరేయ్!...’’ అన్నాడు.


‘‘అదేమరి... నాకూ మండుద్ది! ఓ విషయం పట్టుకుంటే ఇంక కుడితిలో ఈగలాగా దానిలో కొట్టుకుంటూండడమేనా? ఎప్పుడూ గతానుగతిక విషయం మీదే గింగరాలు తిరుగుతూ, గానుగెద్దులా సంచరించడం కాదు. బయటికొచ్చి వేరే లోకం పోకడలూ ఆలోచించాలి!... సంసారాలులో - ‘రా’మెటీరియల్ రాజకీయం కూడా ఉంది అది మర్చిపోకు’’ అన్నాడు సన్యాసి.


‘‘దీపాలు వెలిగె... పరదాలు తొలిగె అని స్ర్తిల దుస్తుల విషయంలో పూర్తి స్వేచ్ఛ వారిదేననీ, ఎవరూ ఎవరికీ ‘డ్రెస్‌కోడ్’లు శాసించడం కుదరదనీ, సరి చేసుకోవాల్సింది సంస్కారాన్ని కానీ-ఒట్టి ‘సరిగంచు’లను కాదనీ, అంటుంటే -మరి పరదాలూ, ముసుగులూ విషయం- పాటగా ఎందుకు ఎత్తినట్లో తమరు?’’ అన్నాడు శంకరం రెట్టిస్తూ.


‘మేలిముసుగు’ సౌందర్యం గురించీ, ‘గూంఘట్’లో దాగిన ముఖారవిందాల గురించీ కాదోయ్ నేనంటున్నది!... ఇప్పుడీ ‘ముసుగు’ సంగతి వేరు! అయిదు రాష్ట్రాల ఎన్నికలొచ్చేసాయి కదా! ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలయ్యేంతవరకు మాయావతి విగ్రహాలమీద ముసుగులు వేసి ఉంచాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిందిట! ఒక్క ‘మాయావతి’ విగ్రహాల మీదే కాదు, ఆమె పార్టీ గుర్తయిన ‘ఏనుగు’ విగ్రహాల మీద కూడా పరదాలు వేసి, కప్పి వుంచాలని శాసించిందట. ‘పర్‌దేమే రహ్‌నేదో - పరదా నా ఉఠావో’ అంటున్నది దాన్ని గురించే’’ అన్నాడు సన్యాసి.


‘‘ఓ! అదా... సంగతి’’ అంటూ నవ్వేసారు రాంబాబు శంకరం కూడాను.


‘‘మాయావతి విగ్రహాల మీద ముసుగులన్నారుగానీ, మాయావతే ముసుగులో వుండాలని అనలేదు... నయం కదా! నిజానికి ‘విగ్రహాలు’ అనేవి దివంగత మహానేతలకూ, దేవతామూర్తులకూ ఔచిత్యమేమోగానీ, బ్రతికుండగానే తన విగ్రహాలు తానే పెట్టించుకోవడం ఏమిటి? తాను చేసే పాలనలో ‘నిగ్రహం’లేని మనిషి - ‘విగ్రహం’గా మటుకు ఏం రాణించగలదు? పైగా తీరికూర్చుని ఈవిడే కదూ... ఉత్తరప్రదేశ్‌ని ‘నాలుగు ముక్కలు’ చేయాలని అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది! మనిషిలో ‘ద్వంద్వ ప్రవృత్తి’, ‘రెండు నాల్కల ధోరణి’ రాజకీయాల్లో మామూలే కానీ, ఈవిడ ‘ఒక్కటిగా’ నిలవలేక లక్నోతో సహా ఉత్తరప్రదేశ్ అంతటా తన గురువు ‘కాన్షీరాం’ విగ్రహాలతోబాటు తన విగ్రహాలూ అనేకంగా నెలకొల్పుకుని, దండలు వేయించుకుని మురిసిపోవడం ఏమిటో!... అది చాలదన్నట్లు - ఏదో సుందరమైన భవన ద్వారాలకు ఇరువైపులానో, ఆలయస్తంభాలనో వుంటే బాగుండగల ‘ఏనుగు’ విగ్రహాలను - తమ పార్టీ గుర్తుకదా అని కూడళ్లలో కుప్ప తెప్పలుగా నెలకొల్పడమేమిటో... ఇప్పుడు వాటిని ముసుగులతో కప్పి వుంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించటమేమిటో... అంతా మాయ...గా లేదూ!’’ అన్నాడు శంకరం.


‘‘ఏనుగు విగ్రహాలనే కాదు, ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ ఏనుగులున్నా వాటికీ మొత్తం ముసుగులు కప్పేయాలని అనలేదు నయం! ఆసాంతం ముసుగు తొడగాలంటే చచ్చే చావవుతుంది! అసలు - ‘ఎన్నికలకోడ్’లోనే - ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు - అధికారాల్లోకి వచ్చినా, రాకపోయినా ఓటర్లను ప్రభావితం చేసే తమ, తమ పార్టీల తాలూకు ముద్రలను శాశ్వత ప్రాతిపదికన నెలకొల్పరాదని నిబంధించి వుంచితే పోయేదిగా! అలాంటి ‘చట్టం’ ఒకటి చేసి పారేస్తే పోలా!’’ అన్నాడు రాంబాబు నవ్వుతూ.‘‘అదేమంత ఈజీ వ్యవహారం కాదు! అసలు ‘ఉవిదలకు బుద్ధులు పెడతల నుండు కాదే’ అని ఓ కవి అన్నట్లు, రాజకీయ నేతల్లో స్ర్తి నాయకురాళ్ల వ్యవహార సరళి భిన్నంగానే కానవస్తూంటుంది! వారు మరొకరి మాట అస్సలు వినరు! తమకు తోచిందే చేస్తారు. రబ్రీదేవి ‘లాలూ’మాట వినే ‘లాలూచీ’తో పాలించింది కదా గతంలో... అనుకోకండి! అక్కడా ‘మతలబులు’ జరిగాయి. సరే-జయలలిత సంగతి తెలిసిందే కదా! తన ఇష్టసఖి అయినా శశికళని పార్టీలోంచి తన్ని తగలేసిందని ఇవాళ ముక్కున వేలేసుకుంటున్నాం. మమతా బెనర్జీ ఏమాత్రం ‘సమత’ చూపింది? వీరిలో ‘మాయావతి’ మరీ భిన్నం! తన మీద తనకే ఆవిడకు వల్లమాలిన ప్రేమ, గౌరవం. అంచేతే - స్వీయ ‘విగ్రహారాధన’లో పడింది. తనూ, తన పదవీ శాశ్వతం కాదనీ, అంచేత ‘ఉక్కు’లానో, ‘సిమెంట్’లానో గట్టిగా తన విగ్రహాలయినా శాశ్వతంగా నెలకొల్పేస్తే - ‘‘మాయామేయ జగంబె నిత్యమని’’ ప్రజలు సంభవిస్తారనీ, అది తన పార్టీకి బోలెడు మేలనీ, అష్టదిక్కుల్లో ఏనుగులున్నట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి - ఆ ఏనుగులను ఉత్తరప్రదేశ్‌లో దిక్కుదిక్కులా కూడళ్లలో కూడా నెలకొల్పడం ఔచిత్యమేననీ, ఉత్తర దిశగా వున్న ‘ఏనుగుతలే’ ‘గణాధ్యక్షునికి’ సహాయకారి కనుక, తను చేసేది ఉత్తమోత్తమ కార్యక్రమం అనీ ఆవిడ తలపోసిందన్నమాట!!... ఇవాళ ఎలక్షన్ కమిషన్ తల వాచేలా చివాట్లు పెట్టి, ఆవిడా, ఆవిడ ఏనుగు విగ్రహాలకూ తలమునకలుగా ‘ముసుగులు’ వేయాల్సిందేననీ, అప్పుడే ఆవిడ ‘లొసుగులు’ జనం గ్రహిస్తారనీ అనుకోవడం తమషాయే మరి!’’ అన్నాడు సన్యాసి.‘‘అసలు ప్రజాసంక్షేమం పేరిట పార్టీలన్నీ ప్రజలకు రాజకీయాల రంగురంగుల ‘ముసుగులు’ కప్పుతూ ‘‘పర్‌దేమే రహ్‌నేదో - పరదానా ఉఠావో’’ అనే అంటున్నారు. అసలు ముసుగుదొంగలు వాళ్లు! ఓటర్లు చైతన్యవంతులై చెంగలిస్తేనే, ‘దీపాలు వెలిగి - పరదాలు తొలగేది’’ అని కదిలాడు శంకరం.

(బొమ్మ:కార్టూనిస్ట్ శ్రీ సురేంద్ర గారి సౌజన్యం తో...)

0 comments: