ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, November 13, 2011

స్వీయ దృష్టం.బరువు దిగుతున్న స్పృహ
అహమహిమికల ఊదేసిన వేళ
మనసు కాసారంలో నిశ్చలత్వం
తొలగిపోయిన ఒక జడత్వం

అవతలివారిపై అరిచిన ప్రతి సారీ
లోలోపల ఆగ్రహపులి స్వారీ
రక్తకాసారంలో విసిరిన రాయి
అల జడి కావడం ఏమి హాయి

ఇంతకీ ఇష్టపడిన కష్టం
స్వయంకృతమైన నష్టం
అంతరాంతర స్వీయ దృష్టం
పవిత్రత గో పృష్టం

సనాతనమని సరదాపడడమో
అధునికమని ఆత్రపడడమో
కాలవాచి కలకలం ఏదైనా
కాలరాచి పోగలమా

ఒక్కొడొక్కడుగా శతృవు డొక్కశుద్ది వున్నవాడే
తలవంచకపోయినా తలవూచక తప్పదు
ప్రతిభామతి కి ప్రణమిల్లక తప్పదు
సర్దుకుంటే అంతా సద్దుమణుగుతుంది

ఎగిరెగిరిపడి ఏం ప్రయోజనం
నీతో నాతో వుండాల్సింది ఈ జనం
ఎవరిని దూరం చేసుకున్నా నష్టం మనకే
చిందరవందరవుతుంది మనికే

వెనక్కి అనుకోకు వెనువెంటకు మటుకే
విజయలక్ష్మి ఎప్పుడూ ముందే వుండదు
తగ్గడంలో ఎగ్గు తెగడమూ వుంది
సిగ్గు బొగ్గైపోయినా నిగ్గు జ్వలించడమూ వుంది

ఒకసారి నిశ్చలంగా కనులు మూసి
ధ్యానమగ్నం కా
బిగబట్టిన నిగ్రహంలో జిగిబిగి గమనించు
వెలుతురు వెలుపలనుండి కాదు
లోనుండి చిమ్ముకొస్తుంది
కోపం అణచిన క్షణమే కొమ్ముకాస్తుంది
సదమల హృదయమే సౌజన్యపు సొమ్ము దాస్తుంది
సుఖానంద జీవనం తెస్తుంది
తెగిన సంకెలలతో తరలిస్తుంది
బ్రతుకు తరిస్తుంది.

**

4 comments:

Vijayagopal said...

భలే!

Snehith said...

Super !

Sailajamithra said...

కవిత్వం లో మీ కలానికో ప్రత్యేకత ఉంది. ఏ కవి కైనా రాసిన ప్రతి కవిత బావుండాలని లేదు. కాని మీది . ఓలేటి పార్వతీశం గారిది ప్రతి కవిత ఒక అద్భుతమే ! అభినందనలు

సుధామ said...


మీ సహృదయ వ్యాఖ్యకు సంతోషాంతరంగుడినయ్యాను.
కృతజ్ఞతలు శైలజామిత్ర గారూ!
కవయిత్రిగా మీ ప్రత్యేకత హర్షణియం.అభీనందనలు.