ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, November 18, 2011

తాను (లో) ముక్కలు''ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడూ వస్తాడని సామెత! మాయావతి ‘మాయాజాలం’ ఇక్కడా- మహదానందం కలిగిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి’’ అన్నాడు ప్రసాదు పేపర్ మడిచి టేబుల్‌మీద వేస్తూ.‘‘మీరొక్క దానికై చేయలేని పని మేం నాలుగింటికి చేసి చూపిస్తున్నాం’’ చూడమన్నట్లు, వాళ్ల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తీర్మానంకూడా ప్రవేశపెడతారటోయ్! ఉత్తరప్రదేశ్‌ని నాలుగు ముక్కలుగా ఉత్తరించడానికి, మాయావతి సమాయత్తపరుస్తోంది. దేశంలోకెల్లా అతి పెద్ద, అతి ఎక్కువ జనాభాగల రాష్ట్రంగా వున్న ఉత్తరప్రదేశ్‌ను- పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్‌గా విభజించాలనీ, వాటికి వేటికి వాటికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలనీ- ఆవిడ అభిమతంట’’ అన్నాడు రాంబాబు.


‘‘ఎవరయినా ‘ఏక ఛత్రాధిపత్యం’ కోరుకుంటారు. అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండడం గొప్పగానీ, రేపు విభజన జరిగితే ఆవిడకేంటి లాభమో, ఆవిడ ఏదో ఒక భాగానికే ముఖ్యమంత్రి కాగలదు కానీ, ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజనమేమిటో తెలీడం లేదు’’ అన్నాడు ప్రసాదు.


‘అమ్మమ్మా! అలా అనకు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల లాగా, బహుజన సమాజ్ పార్టీ పాలిత ప్రాంతాలు అనిపించుకోవడం గొప్పకదూ! ఒక్కటిగా వున్నదాన్ని నాలుగు ముక్కలు చేసి ‘‘నా దగ్గర నాలుగున్నాయహో!’’ అని చెప్పుకునే పిల్లల మనస్తత్వం లాగా- రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి లభిస్తుందనే, ఈ ‘ఎత్తుగడ’ అంటున్నారు!


పైగా ఒకటిగా తినడానికీ, నాలుగు ముక్కలు చేసి తినడానికీ తేడా వుంటుందా లేదా? ‘పండు’ పండు పళంగా మింగలేం కనుక, ముక్కలు చేసుకు తింటే సుళువు! ముక్కలు చేసినప్పుడు నాలుగూ తనే తింటుందో, ఎదుటి వారికి పంచిపెడుతుందో ఎలాగూ చెప్పలేం.
ఒకటిగా వున్నప్పుడు మళ్లీ బహుశా తనకు దక్కనిది, ముక్కలుచేస్తే ఓ ‘ముక్క’యినా దక్కుతుందన్న ఆశా కావచ్చు! ఏ.పి. విభజన అయినా, యు.పి. విభజన అయినా- నిర్ణయం తీసుకోవలసింది కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ కూటమియే! కేంద్రం సానుకూల ప్రకటన చేయడానికి వీలుగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపుతామంటోంది. ఇది కాంగ్రెస్‌ను ఇరుకున పడవేయడానికే.


మన రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్- తెలంగాణ విభజనకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడానికి, తెలంగాణ మంత్రులూ, ఎం.ఎల్.ఏలూ ఎందరో వున్నా క్రింది మీదులవుతోంది కదా! ఇప్పుడు చిన్న రాష్ట్రాల అవసరం ఎంతగానో వుందని మాయావతి అంటూ, బి.జె.పి.యే కాదు బహుజన్ సమాజ్ పార్టీ కూడా చిన్న రాష్ట్రాలకు అనుకూలం అనడం ద్వారా, బి.జె.పి.ని కూడా కొంత ఇరుకున పెట్టడమే మరి!’’ అన్నాడు రాంబాబు.


‘‘అక్కడ కేంద్రంలోనూ, ఇక్కడ రాష్ట్రంలోనూ కూడా ‘స్పీకర్లు’ తెలంగాణకోసంచేసిన వారి రాజీనామాలను- ఒకరిద్దరివి మినహా, పూర్తిగా తిరస్కరించారు. వారి రాజీనామాలలో కూడా వ్యక్తిగత కారణాలనీ, ప్రజల అభీష్టానికి అనుగుణమనీ ‘మూస’పలుకులున్నాయిట తప్పితే, ‘నిర్ణీత ఫార్మాట్’లో లేక, స్వచ్చందం కావనిపిస్తున్నాయనే తిరస్కరించడం జరిగిందట.


ఓ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాలను ముక్కలుచేయడం సహేతుక చర్య కాదు. నిజంగా దేశ ప్రయోజనాలకోసమూ, ప్రజల అభ్యున్నతికోసమూ అయితే- విభజనను అంగీకరించవచ్చుననే ‘‘రెండో ఎస్సార్సీ’’ అనే మాట ముందుకు వస్తోంది. ‘స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిటీ’’ అనేది ఏర్పడి, దేశ బహుళ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని భాషల ప్రాతిపదికనో, కేవలం ప్రాంతీయతలూ, కులమతాల ప్రాతిపదికనో, కాకుండా- నిజంగా పాలనా సౌలభ్యంకోసం, సమగ్ర జాతి పటిష్ఠతకోసం- ఎన్ని రాష్ట్రాలుగా దేశాన్ని పునర్వ్యవస్థీకరించాలన్న నిర్ణయాలు తీసుకోగలిగితే బాగానే వుంటుంది.


ఒక ‘తాను’ని ముక్కలు చేసేయడం సులభమే! కానీ అందువల్ల ఉపయోగం ఎక్కువగా వుండాలి. సాధ్యమైనంత ఎక్కువ మందికి పనికి వచ్చేలా ‘దుస్తులు’ అమరాలి ‘తాను’ని చింపినప్పుడు. ఆ చింపడంలో ఒక క్రమత లేకపోతే- ‘వృధా’ అయ్యే భాగమే ఎక్కువుంటుంది. ఓ చొక్కా కుడతావో, జాకెట్టు కుడతావో, సోఫా కవరు అమరుస్తావో.. ఏం చేస్తావో గానీ, ‘తాను’ని ముక్కలుచేసే ముందు మాత్రం, సరియైన ఆశయంతో, సరియైన ప్రమాణాలతో, సరియైన కొలతలతో ‘కత్తిరించాలి’. అందునా నాణ్యమైన వస్త్రాన్ని, మన్నికగల బట్టను వట్టినే ముక్కలు చేసి బోలెడు ‘రుమాళ్లు’ కుడదామనుకోవడం కూడా - సరియైన ఆలోచనా విధానం అనిపించుకోదు. ఒక ‘తాను’ విలువ, దానితో రూపొందిన ముక్కల రూపాలతో- విలువనూ, ప్రతిష్ఠనూ పెంచుకోగలగాలి. పీలికలు చేసిన అతుకులతో అద్భుతమైన మన్నిక, నాణ్యత గల వస్త్రం రూపొందుతుందనుకోలేం! చూడడానికి అందంగా, పైకి డాబుగా కనిపించే దాని వెనుక, అతుకుల బొంత వ్యవహారం అయితే కుట్లు ఊడిపోవడమే కాదు, రంగు వెలసిపోవడమూ, ఉపయుక్తం కాలేకపోవడమూ జరుగుతుంది.


‘దేశం’ అంటే - ‘భిన్నత్వంలో ఏకత్వం’గా భాసించాలి తప్ప, ఏకత్వంలోంచి భిన్నత్వంలోకీ, ‘ఛిన్నత్వం’లోకీ దిగజారకూడదు. అంచేత- అమీతుమీ అంటూ, ‘అర్రీబుర్రీగా తేల్చే వ్యవహారం’గా దీన్ని భావించలేం! హడావుడి నిర్ణయాలు చేస్తే- ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’ అవుతుంది. అందువల్ల దేశ సమగ్రతకూ, జాతీయ భావస్ఫూర్తికి విఘాతం కలుగకుండా, భారతీయత భాసించేలా, ప్రపంచంలో ఏ మూలకెళ్లినా ‘మేరా భారత్ మహాన్’ అనుకునేలా, అనిపించుకునేలా... మన బహుముఖీనత్వం ‘ఏకత్రితంగా’ వెలుగొందగలగాలి. మెతుకులు కాదు అన్నం - ‘ముద్ద’గానే తిని, జీర్ణించుకు, శక్తిమంతులవుతాం. మోపుగా వున్న కట్టెల బలం గొప్పది. ఎన్ని కట్టెలున్నా- కట్టెలో ప్రాణం వున్నంతవరకూ, మనిషి సంఘజీవిగానే రాణిస్తాడు’’ అన్నాడు శంకరం.


0 comments: