ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Sunday, July 24, 2011

ఒక ప్రయోగమే!




చారిత్రక నేపథ్యంతో దొరవేటి రాసిన పదహారు కథల సంపుటి ‘చరితార్థులు’, జాతీయ భావస్ఫూర్తితో చరిత్రలో చెప్పుకోదగిన సంఘటనలను తీసుకుని ఆ ఉదాత్త పాత్రలతో కథలుగా మలిచారు.

బౌద్ధయుగం నాటి తిష్యకుణాలులకు సంబంధించిన ప్రేమకథతో మొదలు పెట్టి ఆర్య సమాజనాయకుడైన 1920ల నాటి స్వామి శ్రద్ధానందుల జీవన సంఘటనతో కూడిన కథతో పూర్తయ్యే ఈ సంపుటిలోని ప్రతి కథా భక్తికీ, దేశ భక్తికీ ప్రోద్బలకరంగానే భాసిస్తున్నాయి.

ఈ సంగ్రహ చారిత్రక కథలు ముఖ్యంగా నేటి యువత పఠించ దగినవి. ఒక ప్రేమికుడు, ఒక నిర్ణయం, ఒక మహారాణి, ఒక త్యాగం అంటూ ప్రతి కథా శీర్షికలోనూ ‘ఒక’ అని చేర్చడం, ‘ఒక’ విశేషం.

‘ఒక’సారి చదివినా చాలని బహుశాః ఈ ‘ఒక’ ప్రయోగమేమో! గురుతేజ్ బహదూర్ బలిదానమైన చాందినీ చౌక్ ‘గురుద్వార’మయి, ఆ మహనీయుని శిరస్సు తెగిన స్థలం, ‘శిరీష్ గంజ్’గా ఎలా ప్రసిద్ధమైందో వివరించే కథ ‘‘ఒక ‘గురు’ ద్వారా’’. ఖాల్సావీరులు జూరావర్, ఫతే అన్నదమ్ముల వీర గాధ. ‘ఒక త్యాగం’.

రంగారెడ్డి జిల్లాలోని ధారూ రు పూర్వనామం. ‘దొరవేటి’ని కలం పేరు చేసుకుని వి. చెన్నయ్య రాసిన ఈ కథలు రచయిత కథన చాతురికి, దేశ భక్తికి దాఖలాగా వున్నాయి.

కథా రచయితగా ప్రసిద్ధులైన ‘దొరవేటి’ వైవిధ్య రచనా శేముషికి ‘చరితార్థులు’ ఒక అభినందనీయ కథా సంపుటిగా నిలుస్తుంది.


చరితార్థులు
(చారిత్రక నేపథ్య కథలు)
రచన: దొరవేటి
వెల: రూ. 60/-
జ్యోత్స్న పబ్లికేషన్స్
గాంధీ నగర్
హైదరాబాద్

(ఆంధ్రభూమి దినపత్రిక 'అక్షర ' లో..)

0 comments: