ఒరులేయవి యొనరించిన నరవర యప్రియము తన మనంబునకగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మపథములకెల్లన్

Friday, July 15, 2011

పటాటోప కార్యాలయాలుద్రవ్య లోటుకు కారణం ఏమిటంటే ‘తృప్తి’, ‘నిరాడంబరం’, అనేవి ‘లోటు’ కావడమే! ‘ఎంత చెట్టుకు అంతగాలి’, ‘పిండికొద్దీ రొట్టె’ అనే మాటలు కరెక్టే గానీ, అసలు ‘గాలి’ అయినా, ‘రొట్టె’ అయినా, అందరికీ అందాలనీ, అది ఏ కొందరి హక్కులో మాత్రమే కాదనీ, అందరికీ తెలియాలి! అందుకనుగుణమైన వివేకం ఉండాలి’’ అన్నాడు సన్యాసి పేపర్ మడిచి బల్లమీద పెడుతూ.

‘‘వచ్చిన చిక్కేమిటంటే-ఉన్నవాడు ఖర్చుపెట్టకపోతే ‘పిసినారి’ అంటాడు. ఉన్నవాడిని చూసి పోటీపడి, లేనివాడు సైతం ఉన్నవాడిలా కనపడడానికి, స్తోమతని మించి, ఆడంబరంగా ఖర్చులు చేయడం చేస్తున్నాడు. నిజానికి భేషజాల కారణంగానే-బోలెడు వృథా ఖర్చు జరుగుతోంది. మరి!’’ అన్నాడు ప్రసాదు.

‘ ‘కార్పొరేట్ కల్చర్’ అనేది ఒకటి వచ్చాక, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ‘కార్పొరేట్’ వసతులకై వెంపర్లాటలు ఎక్కువయ్యాయి! ఓ చెక్క కుర్చీ, టేబుల్‌తో పనిచేసే వ్యవస్థ పోయింది. అందరికీ సెపరేట్ ఛాంబర్లు, కంప్యూటర్లు, ఏసీ రూములు ఇవన్నీ పెరిగాయి కానీ, నిజానికి వాళ్ల ‘పని చేసే సంస్కృతి’ మాత్రం పెరగడంలేదు సరికదా, ‘నానాటికీ తీసికట్టు‘ వ్యవహారంగా తయారవుతోంది. నిజానికి సౌకర్యాల పరికల్పన బాగున్నప్పుడు పని తీరు కూడ మెరుగుపడాలి కదా! ఇవాళ ఎవరూ ‘చెమటోడ్చి పనిచేస్తున్నాం’ అని ప్రభుత్వ కార్యాలయాల్లో అనగలిగేలా లేరు! ఎంచేతంటే-ఎసీలు లేక పోయినా కూలర్లు, ఫ్యాన్‌లు అయినా విస్తారంగానే ఉంటున్నాయి కదా! నిజమే! పని చేయడానికి తగిన మంచి వ సతులు, వాతావరణం ఉండడం అవసరమే. కాదని ఎవరూ అనరు. కానీ వాటిని అమర్చుకోవడానికి పనిచేసినంతగా, తాము చేయవలసిన విద్యుక్త్ధర్మాన్ని మాత్రం నెరవేర్చడం కనపడదు! ఆఫీసుకి రావడానికి జీతంగాని, పనిచేయడానికి జీతంమీద ‘గీతం’ ఏమిటన్న ధోరణియే ప్రబలుతోంది! ప్రభుత్వ కార్యాలయాల్లో-కరెంట్, టెలిఫోన్, రవాణాకు అవుతున్న ఖర్చులు చూస్తుంటే-ఆ ఖర్చులతో దారిద్య్ర రేఖకు దిగువన వున్న వందలాది కుటుంబాలను సంక్షేమ పథంలోకి మళ్లించగలం...అంటే అతిశయోక్తి కాదు’’ అన్నాడు రాంబాబు.

‘‘కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఆ మాటే అంటున్నారయ్యా! వృధా ఖర్చులను ఏవిధంగా తగ్గించుకోవాలన్న విషయమై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు’’ అన్నాడు సన్యాసి.

ఆ మాటకు ప్రసాదు నవ్వాడు.

‘నవ్వుతావేంటి’ అన్నాడు సన్యాసి.

‘‘ ఆ ప్రణాళికలు రూపొందించడానికై ఎంత ఖర్చు జరుగుతోందో కదా అని నవ్వొచ్చిందయ్యా!’’ అన్నాడు ప్రసాదు.

‘‘తనకు తెలిసినంత వరకూ వృధా ఖర్చుల వ్యయాన్ని ఏ విధంగా అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చో ప్రధానికి తెలియజేసాననీ, ఈ దిశగా తాను పంపిన నోట్‌కు ప్రధాని ఆమోదం తెలిపారనీ ప్రణబ్ అన్నారు’’ అన్నాడు సన్యాసి.

‘‘అనడానికీ, అమలు పరచడానికీ మధ్య బోలెడు తేడా ఉంది! ఆహారం, ఎరువులు, ఇంధనం వంటివి అందరికీ అందించే దిశగా కేంద్రం సబ్సిడీ భారాన్ని మోస్తోంది. కాదనడంలేదు. కానీ ఆ భారం-దానికీ, తడిసి మోపెడవుతోంది! నిజానికి మంత్రిత్వ శాఖలు ఖర్చు చేస్తున్న అనేక వృధా ఖర్చులు తగ్గిస్తే-ప్రజోపయోగకరమైన పనులెన్నో చేయచ్చు. వాళ్లంత విలాసవంతమైన ఖర్చులు-ప్రభుత్వ పద్దుల్లో కావిస్తూ మళ్లీ వ్యక్తిగతంగా ఆస్తులు పోగేసుకుంటుండడం, ‘అవినీతి’ కాక మరేమిటి? అన్నాహజారేలు, రాందేవ్‌బాబాలు-నేతల అవినీతి గురించి, నల్లధనం వెలికితీత గురించి ఊరికే ఉద్యమించడంలేదు!...ప్రయాణాలంటూ, ఐదు నక్షత్రాల హోటళ్లలో సమావేశాలంటూ, వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఖర్చులపై నియంత్రణ లేకుండా పోతోంది. ఎంపిల లాడ్స్ అంటూ వారి నియోజకవర్గాల అభివృద్ధికి ఒక్కో ఎంపీకి అయిదుకోట్ల రూపాయలు ఇప్పుడు కేటాయిస్తున్నారు. కానీ అదెలా ఖర్చుపెడుతున్నారో పారదర్శకత, ఔచిత్య విచార చర్చ ఉందా? తమ స్వార్ధానికి ఉపయోగపడే వ్యక్తులకూ, సంస్థలకు వాటిని లోపాయికారిగా ఖర్చుపెడుతున్నారు. ఓ ఎంపి ఉండేది హైదరాబాద్‌లోనే అయినా, ఢిల్లీలో ఓ నివాసం ఉంటుంది. అది ప్రభుత్వం కేటాయించిందే! దాన్ని అద్దెలకు ఇచ్చుకునే మహానుభావులూ ఉన్నారు! ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు,మంత్రులు వీరందరిపై చేస్తున్న ఖర్చులు చూస్తుంటే అది ప్రజాసేవ కాదు, ప్రజా ‘షేవ్’ అనే అనిపిస్తుంది. ఆ డబ్బంతా ప్రజలు పన్నుల రూపంలో మరో రూపంలో చెల్లిస్తున్నవే కదా! కొత్త ఫర్నిచర్, కొత్త వాహనాల కొనుగోళ్లంటూ ఏటేటా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే తంతుచూస్తుంటే, అధికారుల ఆడంబరత్వం, వారి ‘కమీషన్లకోసం’ కక్కుర్తులూ...బహిర్గతమవుతూంటాయి’ అన్నాడు రాంబాబు.


‘‘నిజమే రాంబాబూ! వసూళ్లకన్నా కొనుగోళ్లు ఎక్కువున్న సంస్థలూ, బడ్జెట్‌ను మించి వృధా ఖర్చులు చేస్తున్న కార్యాలయాలు ఉన్నాయి. ‘దుప్పటి మేరకు కాళ్లు చాపుకోవడం’ అనేదిపోయి, పెద్ద పెద్ద దుప్పట్లు కొని, మా కాళ్లు అంత పొడుగైనవి అని చూపించుకోవాలనే ఆర్భాటాలు ఎక్కువయ్యాయి! నిజానికి ఇన్ని సౌకర్యాలు, సాంకేతికాభివృద్ధి లభిస్తున్నా అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో జరగవలసిన ‘ప్రజల పనులు’ మాత్రం త్వరితంగా కావడంలేదు. ఇదివరకు స్వయంగా ఉద్యోగులు చేసే పనులు, ఇవాళ యంత్రాల సహాయంతో-సులభతరం అయినా, ఉద్యోగుల్లో ‘పనివేగం’ పెరగలేదు సరికదా, తప్పు ఏదయినా యంత్రాలకు మీద నెట్టివేసే అవకాశం ఒకటి దొరకడంతో, ఇష్టారాజ్యంగా వ్యవహారాలు జరగడం పెరిగింది. ‘లోటు’ మనలో పెట్టుకుని ‘పోటు’ ఇంకొకరికి తగిలించే ‘తరీఖా’ పెరిగింది! మరి కార్పొరేట్ సౌకర్యాలున్నా, ‘కోపరేట్’ వర్క్‌కల్చర్ పెరగకపోవడమే విషాదం’’ అంటూ లేచాడు సన్యాసి.
(15.7.2011* Friday)

0 comments: